(విశ్వ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న ఆశయంతో దశాబ్దం క్రితం ఏర్పడిన అరుదైన పుస్తక ప్రచురణ సంస్థ 'పీకాక్ క్లాసిక్స్' గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అపూర్వ పరిచయం చేసిన తెరేష్‌బాబు రచన ఇది. 'పుస్తకాల్లో నెమలీకలు దాచుకోవడం -గతం.. నెమలీకలు పుస్తకాలై పురివిప్పడం -ప్రస్తుతం..' అనే ఏక వాక్య ప్రకటనతో... తెలుగు ప్రచురణారంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించిన పీకాక్ క్లాసిక్స్ పై ఇంత మంచి పరిచయం చేసిన తెరేష్ బాబు ఈ మధ్యే మననుంచి వెళ్లిపోయారు...
2011 మే 2 సోమవారం నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య పేజీ 'వివిధ'లో అచ్చయిన ఈ పరిచయ కథనం లింక్ ఇప్పుడు ఆ పత్రిక వెబ్‌సైట్‌లోనూ లింక్ రూపంలో అందుబాటులో లేదు. ఆన్‌లైన్‌లో ప్రముఖ పత్రికలలో వచ్చిన అద్భుత రచనలు, కథనాలను కూడా స్పేస్ సమస్య ఒక కాలబిలంలా మింగేస్తున్న పాడుకాలంలో తెరేష్ బాబు రచనను మళ్లీ ఆన్‌లైన్ పాఠకులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో యధాతథంగా ఇక్కడ పోస్ట్ చేయడమైనది. పీకాక్ క్లాసిక్స్ బ్లాగ్ నిర్వాహకులు ఈ కథనం పీడీఎఫ్ కాపీని భద్రపర్చడం వల్ల మనకు ఈ రూపంలో అందుబాటులో ఉంది. అందుకు వారికి ధన్యవాదాలు.)
ఎంతయినా నెమలి గ్లామరు వేరు.
కారుమబ్బులు కమ్మినప్పుడు, గాలి పాడే ప్రేమగీతానికి ఒళ్లు పులకరించి పురివిప్పి నాట్యం చేస్తుందట. ప్రకృతి పరవశిస్తుందట. ఆ అందం అడవికే సొంతమట! వినడమే గాని ఎప్పుడూ చూళ్లేదు. అయితే ఇప్పుడో కొత్తరకం నెమలి వచ్చింది. అది సర్వకాల సర్వావస్థల్లో పురి విప్పుతుంది. నట్టింట్లో నాట్యమాడుతుంది. మనసు పులకించిపోతుంది. ఆ అందం అనుభవైకవేద్యం. అది పురివిప్పినప్పుడల్లా ప్లేటో, బుద్ధుడు, పోతన, గోర్కీ, గొగోల్, ఆస్కార్ వైల్డ్, ప్రేమ్‌చంద్, సామినేని ముద్దు నరసింహంనాయుడు, జాక్ లండన్ ఒకరేమిటి మీకు చాలామంది కనిపిస్తారు.
పుస్తకాల్లో నెమలీకలు దాచుకోవడం -గతం
నెమలీకలు పుస్తకాలై పురివిప్పడం -ప్రస్తుతం
నెమలీకలు పుస్తకాలై పురివిప్పడం -ప్రస్తుతం
***
మా ఆఫీసు (హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం) ఆవరణలో ఓ పొగడ చెట్టుంది. అక్కడ కాస్సేపు నిలబడితే చాలామంది కలుస్తుంటారు. చాలా విషయాలు తెలుస్తుంటాయి. కవులు కళాకారులు, కార్యకర్తలు, అప్పులోళ్లు... ఎవరొచ్చినా అదే మీటింగ్ పాయింట్. ఓ ఏడేళ్ల క్రితం పొద్దుటి పూట సహోద్యోగి వలేటి గోపీచంద్ కలిశారు. ఎప్పట్లా సమకాలీన రాజకీయాల మీద ఛలోక్తులు విసురుతారేమోననుకున్నా. వస్తూనే పీకాక్ క్లాసిక్స్ అనే కొత్త ప్రచురణ సంస్థ గురించి చెప్పారు. వరల్డ్ క్లాసిక్స్‌లో కొన్నింటిని, ఇప్పటి వరకు తెలుగులో రానివి, ముఖ్యంగా నాన్‌ఫిక్షన్, తెలుగులోకి తెస్తున్నట్టు అందులో ఫెడరలిస్టు పత్రాలు, ప్లేటో వంటి అరుదైన పుస్తకాలున్నాయనేది ఆయన మాటల సారాంశం.
'కళ్లు' పులిసిపోయాయి. ఎందుకంటే ఉప్మా పెడుతున్నారని తెలిసి బడికెళ్లిన బాపతు మనం. అమ్మా ఆవుల దగ్గర్నించి ఎమ్మేవరకు తెలుగు మీడియం లోనే వెలగబెట్టాం. పైగా ఇంగ్లీషు పంతుళ్లని ఆట పట్టించి క్లాసులెగ్గొట్టి అత్తెసరు మార్కులతో ముక్కి మూలిగిన నేపథ్యం. ఇంగ్లీషు రమ్మంటే ఎలా వస్తుంది. కాబట్టి ఇంగ్లీషు సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలే శరణం. 'నాకా పుస్తకాలు కావాలి గురూ' అన్నాను. 'మొదట ఇరవై అయిదు పుస్తకాలు త్వరలో వస్తున్నాయి. ఇప్పుడు పదిహేనొందలు కడితే ఇరవై అయిదు పుస్తకాల సెట్టు ఇస్తారు' అన్నారాయన. వెంటనే కట్టేశాను.
ఆ తర్వాత కొన్నేళ్లకు మా ఇంట్లో ప్లేటో హోమిల్టన్, మాడిసన్, జే, జాన్ మిల్టన్, థామస్ పెయినీ, జాన్ స్టువర్ట్ మిల్, కార్ల్‌మార్క్స్, జార్జ్ ఆర్వెల్, స్టీఫెన్ హాకింగ్.. ఓరినాయనో.. వీళ్లంతా తెలుగులో మాట్లాడుతున్నారు. నాకు అర్థం అవుతున్నారు. కొత్తవాకిళ్లు తెరుచుకుంటున్నాయి.
పుస్తకాల బండిల్ చూసి మా ఆవిడ యధాప్రకారం మొహం చిట్లించింది. ఆ ఎక్స్‌ప్రెషన్ చాలు ఆవేళంతా బాధ పడ్డానికి. 'ఇంటి నిండా పుస్తకాలు పేర్చడమే పనిగా పెట్టుకున్నట్లున్నావు. మళ్లీ ఎంత తగలేశావు బంగారు తండ్రీ' అంది. నేనేం మాట్లాళ్లేదు. ఎందుకంటే నిజానికి ఆమె పుస్తక వ్యతిరేకి ఏం కాదు. నేను 'పైడిశ్రీ' అనే కలం పేరుతో- 'పోస్ట్' అనే కేకతో ఉలికిపడి, పరంధామయ్య గేటు వైపు చూశాడు.. లాంటి కథలు పుంఖానుపుంఖాలుగా రాస్తున్నప్పుడు, నాకు అభిమానిగా మారి పొరపాట్న పెళ్లి చేసుకుని నన్ను భరిస్తున్న ఉత్తమ ఇల్లాలు.
మొట్టమొదట ఐదు సుప్రసిద్ధ ప్లేటో రచనలు (ది అపాలజీ ఆఫ్ సోక్రటీస్, క్రిటో, ఫేడో, అయోన్, మెనో- అన్నీ ఒకే పుస్తకంలో అనువాదం: ఎ. గాంధీ) చదివా. 'ఏథెన్స్ వాసులారా..' అంటూ సోక్రటీస్ న్యాయస్థానంలో అన్యాయాన్ని నిలదీసిన వైనం. 'మనం విడిపోయే సమయం ఆసన్నమయింది. మనం ఎవరి దారిన వారు పోబోతున్నాం. నేను చావడానికి. మీరు బతకడానికి. ఏది మేలో ఆ దేవుడికే తెలుసు' అంటున్నప్పుడు రాత్రెందుకు బరువెక్కిందో నా కళ్లెందుకు చెమ్మగిల్లాయో నాకింకా అర్థం కాలేదు.
మర్నాడు నా టేబుల్ మీంచి కొన్ని పుస్తకాలు మిస్సింగ్! ముల్లా నస్రుద్దీన్ కథలు (అను: కె.బి.గోపాలం), జంగిల్ బుక్ (అను: సుబ్బు) ఈసప్ కథలు (అను: శాంతారాం, పియస్సార్), జర్మన్ జానపద కథలు (అను: శాంతారాం, పియస్సార్) జర్మన్ జానపత కథలు (అను: పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నెస్ హరనాథ్, ఎ.గాంధీ), పంచతంత్రం రెండు భాగాలు (అను: సహవాసి) మా పాప దగ్గరున్నాయి. అప్పుడే వాటిమీద ఆమె పేరు, తన క్లాస్, సెక్షన్, రోల్ నెంబర్ కూడా రాసేసుకుంది. 'అయితే ఇది కూడా బాగుంటుంది చదువు' అని 'అడవి పిలిచింది' (జాక్ లండన్, సంక్షిప్తానువాదం: ఎ. గాంధీ) ఇచ్చాను.
మామూలుగా అయితే మా అబ్బాయికి ఫేస్‌బుక్కుల్లాంటివి తప్ప ఇలాంటి బుక్కులు పెద్దగా గిట్టవ్. అలాంటిది 'వాటే సర్‌ప్రైజ్ డాడ్.. స్టీఫెన్ హాకింగ్ తెలుగులో ఎవైలబులా?' అంటూ తను తీసుకున్న కాలం కథ (అను: ఎ.గాంధీ) 'కాల బిలాలూ, పిల్ల విశ్వాలు' (అను: యం. విజయకుమార్, ఎ.గాంధీ) చూపించాడు.
'మిగతావి నువ్వు గాని తీశావా' అని మా ఆవిణ్ణి అడిగితే- అమ్మ (గోర్కీ, అను: సహవాసి) పోతన భాగవతం రెండు భాగాలు (వచనం: ముసునూరు శివరామకృష్ణారావు) తన దగ్గరే ఉన్నాయంది. నా అంచనా కరెక్టే. ఆవిడ పుస్తక వ్యతిరేకి కాదు. ఎక్కడంటే అక్కడ పుస్తకాలు పరిచి దుమ్మును పోగేయడానికి వ్యతిరేకి.
అప్పట్నుంచి ఇప్పటిదాక అంటే సుమారు డెబ్బై పుస్తకాలు (కేవలం పీకాక్ క్లాసిక్స్ వాళ్లవే) ఇంటికి చేరాయి. వాటిని సమీక్షించగల శక్తి నాకు లేదు గాని, అవి చూపిన ప్రభావం గురించి కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుంటా.
నిద్రపోయే ముందు పిల్లలు కథలు చెప్పమని అడగడం, కథ వింటూ నిద్రపోవడం సర్వసాధారణంగా జరిగేదే! పైగా నేను ఇంట్లో బాగా ఇష్టపడేది నిద్రాపూర్వ కథాసమయం. నేను చెప్పే కథలకు నిద్ర రాదు సరికదా వచ్చే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోయింది అనే అపవాదు ఒకటుంది మా ఇంట్లో. అందుకే కథల విషయంలో వాళ్లమ్మ మీదనే ఎక్కువగా ఆధారపడ్తారు పిల్లలు. మా పాపకు కథలు చదవడం అలవాటయ్యాక తనే మాకు కథలు చెప్పడం మొదలెట్టింది.
ఆమె లేటెస్టుగా మాకు చెప్పిన కథ 'సీగల్' (రిచర్డ్ బాక్. తెలుగు: ముక్తవరం పార్థసారధి), ఎందరు వారిస్తున్నా ఎంతో ఎత్తుకు ఎగరాలని తపించే సముద్ర పక్షి కథను తను స్వంతం చేసుకుని, హావభావాలు జోడించి చెప్పే కథన శైలికి ఆశ్చర్యమేసింది. కథ చెబుతూ చెబుతూ ఆవులించి నెమ్మదిగా నిద్రలోకి జారుకునే టెక్నిక్ కూడా ఆమెకు తెలుసు.
ఇంకో రాత్రి మావాడు ఆస్కార్ వైల్డ్ 'కోకిల- ఎర్ర గులాబీ' కథ చెప్పాడు. చెప్పాక అందరం ఫీలయ్యాం. కోకిల తన గుండెను ముల్లుకు ఆనించి తన రక్తంతో తెల్లగులాబీని ఎర్రగులాబీగా మార్చి ప్రేమికుడికి కానుకగా ఇస్తే, ప్రేమికుడు ప్రేయసికిస్తే, ప్రేయసి ఆ ఎర్ర గులాబీని నిర్లక్ష్యంగా అవతల పడెయ్యడం కథాంశం. వాడు చెప్పింతర్వాత ఆ కథ చదివాన్నేను.
ఒక రోజు హింస అహింసల గురించి ఇంట్లో చర్చ. ఏదో గుర్తొచ్చినట్లు మధ్యలో మా ఆవిడ పక్కకెళ్లి వాల్మీకి రామాయణం మొదటిభాగం (వచనం: ముసునూరు శివరామ కృష్ణారావు) పుస్తకం తెచ్చింది. 111వ పేజీ చూపించింది. 'అహింసను బోధించిన సీత' అనే చాప్టర్ చూపించింది. 'కోరికల వల్ల కలిగే వ్యసనాల గురించి ముఖ్యంగా వైరం లేని క్రూరత్వం ప్రమాదకరమైనదని, తాపసుల రక్షణకోసం రాక్షసులను చంపడం సమంజసం కాదేమో! ఆలోచించండి' అంటూ రాముడికి సీత నచ్చచెప్పే అధ్యాయం అది. 'రాముడికి సీత క్లాస్ పీకిందా, ఆసమ్' అంటూ పిల్లలు ఆశ్చర్యపోయారు. అది యట్లుండనిమ్ము.
వైరం లేని క్రూరత్వం. ఉద్యోగంలో భాగంగా కాల్చి చంపడాలు, ఉరి తీయడాలు..! వైరం లేని క్రూరత్వం హింసకు దారి తీస్తుందన్న హెచ్చరిక ఎంత ప్రాచీనమో అంత అత్యాధునికం!
***
2007వ సంవత్సరం ఆకాశవాణి జాతీయకవి సమ్మేళనానికి తెలుగు కవిగా నన్ను ఎంపిక చేశారు. ఉజ్జయిని నగరంలో కవి సమ్మేళనం. లాంగ్ జర్నీ. వారం రోజుల పాటు ఉద్యోగానికి ఆఫిషియల్ డుమ్మా! పండగే పండగ! బట్టలకన్నా ముందు పుస్తకాలు సర్దుకున్నా. అందులో స్వేచ్ఛ ఉంది. (జాన్ మిల్టన్ 'అరియోపగిటికా' అను: సహవాసి, థామస్ పెయినీ, 'మానవ హక్కులు' అను: నాగరాజ్, జె.ఎస్.మిల్ 'స్వేచ్ఛ' అను: ఎ.గాంధీ, కార్ల్‌మార్క్స్ 'సెన్సార్‌షిప్' అను: ఎ.గాంధీ; జార్జ్ ఆర్వెల్ 'సాహిత్యానికి సంకెళ్లు' అను: సనామ)
'స్వేచ్ఛ'. ఎంత మంచి పుస్తకం! కొత్త ఆలోచనలు పైకి రానివ్వకుండా పాత మనుషులు చేసే ధాష్టీకం! దాన్ని ఎదిరిస్తూ అయిదుగురు మేధావులు శతాబ్దాల తరబడి చేసిన తర్కబద్ధమైన మేధోపోరాటం! నా పరిసరాలు, నా సహచరులు ఇవ్వలేని అవగాహనా శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి... సరికొత్త ధిక్కార పతాకాన్ని నా చేతికిచ్చింది. అంబేద్కర్ రచనల తర్వాత అంత స్ఫూర్తినిచ్చిన పుస్తకం. మొత్తం చదివేశాక వదలబుద్ధి కాలేదు. వేరే పుస్తకాల మీదకు మనసు పోలేదు. వారం రోజుల పాటు అదే చదువుకుంటూ ఉండిపోయా!
దాంతర్వాత నాలుగేళ్లకి సర్వేపల్లి రాధాకృష్ణన్ 'భారతీయ తత్వశాస్త్రం' నాలుగు సంపుటాలై నా చేతుల్లో వాలింది (అను: ముసునూరు రామకృష్ణారావు). వేద వాజ్మయం నుంచి ఇటీవలి తత్వశాస్త్ర ధోరణులు, పెడదారుల వరకు సుదీర్ఘ విశ్లేషణాత్మక యాత్ర. బౌద్ధం గురించి ఆయనతో అక్కడక్కడ చిన్న చిన్న పేజీలున్న సాంఖ్యం, శైవ శాక్తేయాది మతాల గురించిన చర్చ కొత్తవాకిళ్లు తెరుస్తాయి.
ఇలాంటి క్లాసిక్స్.. ఒకటా రెండా.. డెబ్బై! అనువాద రీతులు అక్కడక్కడ నన్ను ఇబ్బంది పెట్టాయి. మూలాలు చదివిన వాళ్లమాట చెప్పలేను గానీ, అనువాదాల మీద ఎక్కువ ఆధారపడే నాలాంటి వాళ్లకు అపురూపమైన పుస్తకాలే! అరల్లో ఒదిగే పుస్తకాలు కొన్నైతే, మస్తిష్కపు పొరల్లో మిగిలిపోయే పుస్తకాలు మరికొన్ని! బహుశా ఇలాంటి వాటినేనేమో 'బుక్స్ ఆఫ్ పర్మనెన్స్' అన్నాడు బెర్నార్డ్‌షా.
పీకాక్ క్లాసిక్స్... అదుగో అలాంటివే!
****
మొన్నామధ్య క్యాంటీన్లో కలిసినపుడు వలేటి గోపీచంద్ గారిని అడిగా- 'పుస్తకాల మొత్తం సెట్టు తీసుకుంటానంటున్నాడు మా ఫ్రెండొకాయన. పుస్తకాల మీద రే్ట్లు గాక టోకున ఏదో ఒక బేరం చేసి ఇప్పించకూడదూ!'
'అదెంత భాగ్యం. మిగతా వాళ్లలాగ మాకు షాపులు లైబ్రరీ శాఖ వారి ఆదరణ లేవు. అలాంటి పుస్తక ప్రియులే మాకు దిక్కు. మొత్తం సెట్టు తీసుకుంటానంటే మూడొంతుల్లో ఓ వంతు ధర తగ్గించి ఇవ్వడానికైనా మేం రెడీ' అన్నారాయన. గోపీచంద్ అనే పెద్దమనిషి ఫోన్నంబరిదీ: 94412 76770.
చిరునామా:
పీకాక్ క్లాసిక్స్, G2, బ్లాక్ నం.6, పంచవటి ప్రగతి నగర్, opp. JNTU కుకట్‌పల్లి, హైదరాబాద్-90
ఎడిటర్: ఎ. గాంధీ.
ఎడిటర్: ఎ. గాంధీ.
మొబైల్: 90102 04633
ల్యాండ్ లైన్: 040-23894648
email: agaandhi@gmail.com
email: agaandhi@gmail.com
'పీకాక్ క్లాసిక్స్' ఎడిటర్ ఎ. గాంధీతో నాలుగు మాటలు
* ఇలాంటి క్లాసిక్స్ తెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎప్పుడొచ్చింది?
గాంధీ: 1980లో రెండేళ్లపాటు మాస్కోలో ఉన్నాను. మా ఇన్‌స్టిట్యూట్‌లో అరవై దేశాల వాళ్లు ఉండే వాళ్లు. ఒక నార్వేజియన్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల భాషలో మన భారత, రామాయణాలున్నాయని, షేక్‌స్పియర్, బెరోల్ట్ బ్రెక్ట్ లాంటి వారి రచనల అనువాదాలు ఉన్నాయని చెప్పాడు. ఆశ్చర్యమేసింది. వాళ్ల క్లాసిక్స్ మనకు లేవని బాధేసింది. అదే ఈ ప్రయత్నానికి ప్రేరణ.
* వరల్డ్ క్లాసిక్స్ అనువాదాలు యూరప్‌లో మాదిరిగా తెలుగులోకి అంతగా ఎందుకని రాలేదు?
గాంధీ: యూరప్‌లో సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ఇది బాగా జరిగింది. ఎక్కడ ఏ కొత్త ఆలోచన వచ్చిందని తెలిసినా అది తమ భాషలోకి తెచ్చుకోవాలని తహతహలాడేవారు. వలస పాలన ఉన్న దేశాలలో ఆ ప్రక్రియ అంతగా జరగలేదు. వరల్డ్ క్లాసిక్స్ తెలుగులో రావాల్సిన అవసరం ఉందని చాలా మంది అంటుంటారు గాని, అలా తేవాలన్న ఆదుర్దా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది.
* పుస్తక ప్రచురణలో మీరనుసరించిన ప్రణాళికేమిటి?
గాంధీ: ప్రధానంగా నాన్‌ఫిక్షన్! అందులోనూ సైన్సెస్, ఫిలాసఫీకి ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాం. తర్వాత అనుభవం కొన్ని పాఠాలు నేర్పింది. దాంతో అన్ని రకాల క్లాసిక్స్ రెండు మూడు చొప్పున తీసుకురావాలనుకున్నాం. బాలల సాహిత్యం మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాం.* మిగతా ప్రచురణలకు, పీకాక్ క్లాసిక్స్‌కు తేడా ఏమిటి?
గాంధీ: ఇది ఎడిటర్ ఓరియెంటెడ్ సంస్థ. ప్లేటో రచనలు, ఫెడరలిస్టు పత్రాలు, స్టీఫెన్ హాకింగ్ రచనలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ తత్వశాస్త్రం, స్వేచ్ఛ వంటి చాలా పుస్తకాలు మొదటిసారి తెలుగులోకి తీసుకువచ్చిన సంస్థ.* ప్రభుత్వం నుంచి సహకారం?
గాంధీ: జీరో! ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే లైబ్రరీ శాఖ వారి వద్ద పుస్తకాల ఎంపిక విషయమై చిత్ర విచిత్రమైన ప్రమాణాలున్నాయి. మా పుస్తకాలు చాలా మటుకు వాళ్ల ప్రమాణాలకు ఒదిగిలేవట. (నవ్వు). అయినా సరే.. పుస్తక ప్రియుల మీద మాకు నమ్మకం ఉంది. వారి తోడ్పాటు స్థాయి మరికొంచెం పెరిగితే మరిన్ని క్లాసిక్స్ తెలుగులో తీసుకురాగలమన్న విశ్వాసమూ ఉంది.- పైడి తెరేష్ బాబు 9948491523
*************************
కొసమెరుపు
ఈ నెమలీకలను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఎందుకో నెట్‌లోకి వెళితే ఆశ్చర్యంగా నా చందమామ చరిత్ర బ్లాగులో 2011 మే 11న నేనే దీని ప్రస్తావన చేసిన వైనం బయటపడింది.అలనాటి చందమామ రాయితీ…
దాని యధాతథ పాఠం ఇక్కడ ఇస్తున్నాను
పాఠాలు మాత్రమే కాకుండా, పాఠ్యేతర పుస్తకాలు ఎందుకు చదవాలో, ఆంధ్రజ్యోతి మే నెల 2, 2011 నాటి వివిధ సాహిత్య వేదిక పేజీలో వచ్చిన “నేనూ.. మా ఇల్లూ.. కాసిని నెమలీకలూ…” పేరిట పి. తెరేష్ బాబుగారు రాసిన ఆ సాహితీ నెమలీకలను విప్పి చూడండి. ఆన్‌లైన్ ఆంధ్రజ్యోతి హోమ్‌పేజీలో వివిధ ఆర్కైవ్స్ విభాగంలో “2-5-11″ పేరిట ఇది ఉంది కూడా.
వైరం లేని క్రూరత్వ ప్రదర్శన -ఉద్యోగంలో భాగంగా కాల్చిచంపడాలు, ఉరి తీయడాలు- హింసకు దారితీసి సమాజానికే ప్రమాదకరమవుతుందంటూ రాముడికే అహింసను బోధించిన సీత ఎంత ప్రాచీనురాలో, ఎంత అర్వాచీనురాలో ఈ కాసిని నెమలీకలను చూస్తే తెలుస్తుంది.
ఈ ఒక్క వాక్యాన్ని ఈ నెమలీకలలో చదివిన తర్వాత పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించిన వాల్మీకి రామాయణం -వచనం: ముసునూరు శివరామ కృష్ణారావు- తప్పకుండా కొని చదవాలనిపిస్తోంది.
ఈ నెమలీకలను చదవాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
బాధాకమైన విషయం ఏమిటంటే పైని ఆంధ్రజ్యోతి వివిధ లింకు ఇప్పుడు ఓపెన్ కావడం లేదు.
చివరగా... పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన అమూల్య గ్రంథాలను ఆధునిక, ప్రాచీన సాహిత్యంపై అభిరుచి ఉన్న తెలుగు పాఠకులు తప్పకుండా తమ పిల్లలకోసం కొనిపెట్టాలని కోరుతున్నాం. మొత్తం సెట్ కావాలన్నా, కొన్ని పుస్తకాలు కావాలన్నా తగు రాయితీతో కనీస లాభాపేక్ష లేకుండా అందించడానికి పీకాక్ క్లాసిక్స్ నిర్వాహకులు సిధ్ధంగా ఉన్నారు.
కింది చిరునామాలో సంప్రదించండి
ఎడిటర్: ఎ. గాంధీ.
మొబైల్ 90102 04633,
ల్యాండ్ ఫోన్ 040-23894648
email: agaandhi@gmail.com
http://peacockclassics.blogspot.in/
ముక్తాయింపు
ఇంత మంచి కథనం గతంలో ప్రచురించిన ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటానుఅలాగే ఈ కథనానికి పై మెరుగులుగా పీకాక్ క్లాసిక్స్ వారి పుస్తకాల ముఖచిత్రాలను ఉపయోగించడమైనది. తెలుగు జాతికి ఇంత మంచి పుస్తకాలను, ఇంత క్లాసిక్‌గా గోధుమ వర్ణపు నిసర్గ సౌందర్య పత్రంతో అందించిన ఈ సంస్థ నిర్వాహకులకు మాత్రం నిండు కృతజ్ఞతలు.
0 comments:
Post a Comment