Pages

Tuesday, March 17, 2015

యోగా సంగతి సరే, ప్రాచీన కళల మాటేమిటి?


(ఇది జీవవేద విజ్ఞాన రుషిపీఠంకి చెందిన ఆచార్య గల్లా ప్రకాశ్‌రావు గారు 'సాక్షి'కి పంపిన వ్యాసం. యోగాకు మత దృష్టితో విపరీత ప్రాధాన్యం, ప్రాచుర్యం కల్పిస్తూ యోగాకంటే అతి ప్రాచీనమైన భారతీయ యుద్ధవిద్యలను -మార్షల్ ఆర్ట్స్- పూర్తిగా విస్మరిస్తూ ప్రభుత్వాలు, రాజకీయ నేతలూ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర నిరసన తెలుపుతూ ఆయన రాసిన ఈ కథనాన్ని స్పేస్ సమస్య రీత్యా బాగా కుదించి, మార్చి 11న సాక్షి దినపత్రిక సంపాదకీయం పేజీలో ప్రచురించారు. ఇది వివాదాస్పదం కానందుకు సంతోషిస్తూనే... ఈ వ్యాసం పూర్తి పాఠం కావాలని అనేకమంది మిత్రులు కోరటంతో ఆ పూర్తి పాఠాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది. యోగాను, క్రికెట్‌ను ఈ దేశంలో వేలం వెర్రిగా మార్చి మనవైన ప్రాచీన కళలను, ప్రత్యేకించి ప్రపంచమంతటా వ్యాపించిన మన యుద్ధ విద్యలను మన నేతలు, ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయి అనే ఆవేదనను రచయిత వ్యక్తపరుస్తున్నారు. ఆయన ఆవేదన ఆలోచనాత్మకంగా ఉందని భావించి మిత్రుల కోరికపై పూర్తి పాఠాన్ని ఇక్కడ అందించడమైనది. ఈ కథనం రచయితతో ఏకీభవించేవారూ, విభేదించేవారు కూడా ఆయనతో నేరుగా మొబైల్ ద్వారా సంభాషించవచ్చు.)

కేంద్ర బడ్జెట్‌లో తొలిసారి యోగా ప్రస్తావన వచ్చింది. యోగాను ప్రచారం చేసే సంస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యోగా ప్రచార కార్యక్రమాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బల్లను చరుస్తూ ఆనందం వ్యక్తం చేయటం లోకమంతా చూసింది. నరేంద్రమోదీ గెలవటానికీ, అధికారంలోకి రావటానికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా యోగా గురువులు, యోగా ప్రచార సంస్థలు పనిచేశాయన్నది నిజం. ఆ కృతజ్ఞతతో ఈ పన్ను మినహాయింపు ప్రతిపాదన చేశారన్నది కూడా నిజమే.

ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ‘ప్రపంచ యోగాదినం’గా గుర్తించింది. ఐరాసలో భారతదేశం తరఫున పనిచేస్తున్న అధికారుల కృషివల్లే ఇది సాధ్యమైంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేయగల నెట్ వర్క్ యోగా సంస్థలకు, వాటి అధిపతులకు ఉందని అర్థం అవుతుంది. ‘ప్రపంచానికి మనదేశం అందించిన కానుక యోగా’ అని అరుణ్ జైట్లీ సంబరపడ్డారు. ఇలా యోగాను ఆకాశానికెత్తడంలోని ఆంతర్యమే మిటి? యోగాను నేర్పిస్తామనే పేరుతో పేరు మోసిన కొంతమంది గురువులు, స్వామీజీలు, మాతాజీలు పెద్ద పెద్ద పీఠాలను, మఠాలను తయారు చేశారు. అంతేకాదు యోగాను హిందూమత ప్రచారానికి వాడుకుంటున్నారు. యోగా, ధ్యానం పేరుతో ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే, ఇదే యోగా గురువులు ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మొత్తంగా యోగా, ధ్యానం, ఆయుర్వేదం వ్యాపార సరుకులైపోయాయి. ఇది అత్యంత బాధాకరం.

ప్రభుత్వాలను శాసించే స్థాయిలో యోగా గురువులు తయారయ్యారు. ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు చేత యోగా గురువు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేయించాడు. జగ్గీవాసుదేవ్ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మికత పేరుతో నిర్మించుకున్నాడు. చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి వివేకవంతుడిగా, బహిరంగ కార్యక్రమాల్లో గౌరవంగా, హుందాగా ప్రవర్తించాలి. కానీ ఒక యోగా గురువు చెప్పా డని డ్యాన్స్ చేయటం సిగ్గుచేటు. అంతేకాదు, జగ్గీవాసుదేవ్ సంస్థకు అక్షరాల రెండుకోట్లను విరాళంగా చంద్రబాబు ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమైన సొమ్ముకాదు. కోట్లాది మంది ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయాన్ని ఒక గురువుకు ధారాదత్తం చేయటం, ఆయన కాళ్లకు నమస్కరించటం ప్రజలను అవమానించటమే.

అసలు ఇంత మంది బాబాలు, స్వామీజీలు, మాతాజీలు, గురువులు బ్రహ్మచారులమని చెప్పుకుంటున్నారు. బ్రహ్మచర్య సన్యాస జీవితం గడిపేవాళ్లకు ఇన్ని వందల, వేల కోట్ల ఆస్తులు, ధనం ఎందుకని ఒక్కరూ ప్రశ్నించరేమీ? అరిషడ్ వర్గాలను జయించిన వారే సన్యాస జీవితానికి అర్హులు. కానీ, అన్ని సుఖాలూ, భోగాలూ అనుభవిస్తూ, ఇంత ధన వ్యామోహంతో జీవించే వారిని బాబాలు, స్వామీజీలు, మాతాజీలు, యోగులు అని పిలవటమేంటి? కనీస నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలూ లేని వ్యక్తుల కాళ్లకు దండం పెట్టడమేంటి?

యోగాను ఒక మత సంస్కృతిగా వ్యాప్తిచేయటం దారుణమైన విషయం. అసలు యోగాను మించిన ఎన్నో అద్భుతమైన విద్యలను మన పూర్వీకులు తయారు చేశారు. అలాంటివాటిలో యోగవిద్య చాలా చిన్నది. యోగాను చాలాకాలంగా చేస్తూ అనారోగ్యం బారినపడిన వారిని ఎంతోమందిని నేను చూశాను. యోగా గురువులే కళ్లు, నోరు సరిచేసుకోలేకపోతున్నారు. యోగా గురువుగా ప్రపంచమంతా తెలిసిన ఒకాయన కిడ్నీలు పాడై, పక్షవాతం వచ్చి ఆ మధ్య చనిపోయాడు. ఇప్పటికీ చాలామంది యోగా గురువులకు అలాంటి అనారోగ్య సమస్యలున్నాయి. మరి, అలాంటి దుస్థితి ఉన్నప్పుడు యోగాను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? పాలకుల రాజకీయ, మత ప్రయోజనాలు ఈ ప్రచారం వెనుక దాగున్నాయి.

మన దేశ ప్రజల ఆరోగ్యం పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఒక విధానమంటూ లేదు. వైద్యం, ఆరోగ్యం అనగానే లక్షల కోట్ల వ్యాపారం చేసే అల్లోపతిని ప్రమోట్ చేయటం, కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ మందుల తయారీ కంపెనీలకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం మినహా మరో ఆలోచనే లేదు. ఇప్పటికీ డయాబెటీస్‌కు సంబంధించిన ఒక జాతీయ విధానం లేదు. అన్ని రకాల మందులు వాడి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్లు ప్రత్యామ్నాయం వెతుకుతుంటే యోగాను సమాధానంగా చూపిస్తున్నారు. ఇది హాస్యం కాక మరేమిటి? మన దేశాన్ని ఇప్పుడు యోగా, క్రికెట్‌లు పీడిస్తున్నాయి.

మన దేశానికి పట్టిన పీడ క్రికెట్. క్రికెట్ ఒక అంతర్జాతీయ వాణిజ్యపరమైన క్రీడ. అసలు క్రికెట్ వల్ల చూసేవారికి ఏమైనా ప్రయోజనం ఉందంటే అదీ లేదు. పూర్వం మన పూర్వీకులు గానీ.. సరే.. ఈ బాబాలు ప్రచారం చేసే దేవుళ్లు కూడా క్రికెట్ ఆడిన సందర్భాలు ఏ గ్రంథంలోనూ కనబడవు. కానీ దేవుళ్లందరూ యుద్ధవిద్యలు ప్రాక్టీస్ చేసేవాళ్లు. క్రికెట్ ఆడే దేవుడు కనిపించనట్లే, యోగా చేసే దేవుడు కూడా కనిపించడు. వరల్డ్ కప్ జరుగుతున్నన్ని రోజులు ప్రజలు, ప్రభుత్వ అధికారులూ అన్ని పనులూ మానేస్తున్నారు. క్రికెట్ వల్ల కొన్ని కోట్ల పనిగంటలు వృధా అవుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా నష్టమే లక్షల కోట్లలో ఉంది. క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భుజాలు, మోకాళ్లు అరిగిపోయి నలభై ఏళ్లకే ముసలివాళ్లయిపోతున్నారు. కానీ చిన్నతనంలోనే పిల్లలను క్రికెట్ లోకి దించుతున్నారు. చిన్నతనంలోనూ, యవ్వనంలోనూ బాగానే ఉంటుంది. కానీ, ముప్పై ఏళ్లు దాటినప్పటి నుంచీ శరీరం కుళ్లిపోతుంది. నలభై ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మన ఆటగాళ్లు ఒళ్లంతా గాయాలతో ప్రతి రోజూ పెయిన్ కిల్లర్స్ వాడుతున్న నిజం అందరికీ తెలుసు.


వంద సంవత్సరాల వయస్సులో కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న మాస్టర్లున్నారు. ఆటలకు, ఆర్ట్‌కు మధ్య ఎంతో తేడా ఉంది. యోగా కూడా క్రికెట్ వంటిదే. చిన్న పిల్లలకు కూడా యోగా పేరుతో జిమ్నాస్టిక్స్ నేర్పుతున్నారు. ముఖ్యంగా వెన్నుపామును ఇష్టమొచ్చిన వంచటం ద్వారా పాతికేళ్లు దాటిన తర్వాత వెన్ను సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. యోగాను చేసే ఎంతోమందికి మోకాళ్ల నొప్పులు, సయాటికా, స్పాండిలోసిస్ మొదలైన సమస్యలున్నాయి. యోగాతో అతి కొద్ది ఉపశమనమే ఉంటుంది. తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు. మరి ఇంత నష్టం జరుగుతున్నా క్రికెట్ పిచ్చినీ ప్రభుత్వమే ఎందుకు పెంచుతోంది? గతంలో జూదం, మట్కా, గుర్రప్పందాలు మొదలై వాటికి ప్రజలను బానిసలను చేసేవారు. ఇప్పుడు మత్తు, మతం, కులం, క్రికెట్టు, యోగా, ధ్యానం మొదలైనవాటికి బానిసలను చేసి ప్రజలు ఏమీ ఆలోచించకుండా తయారు చేస్తున్నారు. స్వతంత్ర్యం వచ్చినప్పటినుంచి పాలకులు మన దేశాన్ని అభివృద్ధి కానీయకుండా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు.

చైనాను చూడండి. అది ప్రపంచానికే కుంగ్‌ఫును, తాయి-చీనీ నేర్పడం ద్వారా వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో అల్లోపతి వంటి వైద్యవిధానాలకు బదులు కుంగ్‌ఫు, తాయి-చీలనే ఆశ్రయిస్తున్నారు. చైనాకు యుద్ధవిద్యలు నేర్పిన దేశం మనది. మాతంగ కాశ్యప్, కొండయ్య, బౌద్ధధర్మ, బౌద్ధరష్మి, పద్మసంభవుడు వంటి ఎంతోమంది చైనా, టిబెట్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మియన్మార్, ఇండోనేషియా, కాంబోడియా వంటి దేశాలకు యుద్ధవిద్యలను నేర్పారు. చైనా మనం నేర్పిన జ్ఞానంతో ప్రపంచాన్ని శాసిస్తున్నది. కుంగ్‌ఫులోనే యోగా, ధ్యానం అంతర్భాగంగా ఉంటాయి. కుంగ్‌ఫు, తాయిచీ, కుంగ్, నీ-కుంగ్ అనే పేర్లతో చైనా చేస్తున్నదంతా మన విద్యలే.

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించిన మావో ఈ విద్యలను గుర్తించి వాటిని ప్రజలపరం చేశాడు. నేడు సుమారు 50 కోట్ల మంది చైనా ప్రజలు ప్రతిరోజూ ఈ  విద్యలను ప్రాక్టీసు చేస్తూ వంద ఏళ్లకు పైగా హాయిగా జీవిస్తున్నారు. అంతే కాదు. చైనా ఆర్మీకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విద్యలను తప్పకుండా నేర్పుతున్నారు. 24 గంటలు పనిచేసినా అలిసిపోకుండా ఉండాలంటే, ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలో షావోలిన్ టెంపుల్ లోని కుంగ్‌ఫు మాస్టర్స్ చేత శిక్షణ ఇప్పిస్తున్నారు.

ఇలాంటి ప్రయత్నమేదీ మన ప్రభుత్వాలు చేయడం లేదు. రైల్వే ఉద్యోగులకు యోగా శిక్షణ ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టాలు మోసే గ్యాంగ్‌మెన్‌లు, లైన్‌మెన్లకు యోగా చేసే వాళ్ల కన్నా ఎక్కువ ఫిట్‌నెస్, ఆరోగ్యం ఉంటుంది. మరి, బాగా తిని బొజ్జలు పెంచిన పైస్థాయి అధికారులకు యోగా నేర్పిస్తారేమో?


మన దేశంలో వేలాది మంది మార్షల్ ఆర్టిస్టులున్నారు. వాళ్లు యోగా గురువులకన్నా ఎక్కువ ఆరోగ్యంగా, శారీరక దృఢత్వంతో, మానసిక ఆరోగ్యంతో ఉన్నారు. మన పూర్వీకులు మనకు బహూకరించిన ఆ విద్యలను నేను గత నలభై ఏళ్లుగా బోధిస్తూ ఉన్నాను. నాలాగా జీవితాన్ని మార్షల్ ఆర్ట్స్‌కు అంకితం చేసిన ఎంతోమంది, పాలకుల విధానాలతో కలత చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న ఎంతోమంది యోగా పిచ్చిని చూసి భాధపడుతున్నారు. యోగవిద్యను మించిన పురాతన కళలను నాశనం చేయడం వల్ల ఈ దేశానికి నష్టం వాటిల్లుతుంది.

ఈ దేశానికీ, ఇతర దేశాలకూ జ్ఞానాన్ని బోధించిన తెలుగునేల పాలకుల అజ్ఞానం వల్ల తన ప్రాచీన విద్యలను కోల్పోతుందనే దుఃఖం కలుగుతుంది. హిందూమతంతో ముడిపెట్టి యోగను బతికిస్తున్నారు తప్ప దానిలోని శక్తివల్ల కాదు. యోగాను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటే, ప్రజలు ఆ యోగా రాజకీయాలను తప్పకుండా తిప్పికొడతారు. మన ప్రాచీన విద్యలను పరిరక్షించుకోవడానికి వివేకవంతులు పూనుకునే సమయం ఆసన్నమైంది.

ఆచార్య గల్లా ప్రకాశ్‌రావు 
జీవవేద విజ్ఞాన రుషిపీఠం, 
విజయవాడ-హైదరాబాద్, 
మొబైల్: 9959282226

ఈ కథనం సంక్షిప్త భాగం మార్చి 11న సాక్షిలో ప్రచురితమైంది.
http://www.sakshi.com/news/opinion/yogas-okay-what-about-the-ancient-art-220488













0 comments:

Post a Comment