Pages

Friday, March 6, 2015

జ్యోతి సింగ్ పాండేను మళ్లీ చంపుతున్నారా?


నిన్న సాయంత్రం -05-03-2015-  యధావిధిగా సాక్షి ఆఫీసుకు వెళ్లింది మొదలుకుని బీబీసీ చానెల్ 'ఇండియా డాటర్స్' అనే పేరున ప్రసారం చేసిన  డాక్యుమెంటరీ గురించిన చర్చను అనుసరిస్తూనే వచ్చాను.  భారత పరువును ప్రపంచ స్థాయిలో మంట గలపడానికి ఓ ఆంగ్ల మహిళ తీసిన డాక్యుమెంటరీగా ఒకవైపు విమర్శలు, దూషణలు, కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్‌లో పూర్తిగా చూడగలిగిన వారు నెమ్మదిగా గొంతు విప్పసాగారు. అభ్యంతరకర దృశ్యాల సాకుతో భారత ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని నిషేధించి ఉండవచ్చు. ఒక సంచలన ఘటనను వాసనపడితే చాలు  గుక్కతిప్పుకోకుండా మొరుగుడు మొదలుపెట్టే ఆర్నాబ్ గోస్వామి ఈ ప్రసారం పట్ల కూడా కుక్కగంతులు వేసి ఉండవచ్చు.

కానీ ఆ వీడియో పూర్తిగా చూసినవారు మా ఆఫీసులో కదిలిపోయి మాట్లాడారు. తీహార్ జైలులో ఉన్న నిర్భయ రేపిస్టు ఖైదీని ఎలా ఇంటర్వ్యూ చేశారు అనే సాంకేతిక విషయంపైనే చర్చ జరుగుతూ, భారత జాతి పరువును నిషేధం రూపంలో కాపాడటానికి అన్నివైపులా జరుగుతున్న ప్రయత్నాలను దాటి ఒకసారి ఆ డాక్యుమెంటరీని చూడండి అంటూ మా సీనియర్లు చెప్పారు.

దీంతో ఎడిట్ పేజీ పని పూర్తి చేసుకుని రాత్రి 1 గంటకు ఇంటికి వచ్చాక ఇంతవరకూ కంప్యూటర్ ముందు కూర్చుని యూట్యూబ్‌లో ఇండియా డాటర్స్ అనే వీడియోని చూస్తుండిపోయాను, పనిలో పనిగా ఆ చిత్రం ఆంగ్ల దర్శకురాలితో, కిరణ్ బేడీ వంటి ఇతర ప్రముఖ మహిళలతో పాటు నిర్భయ తల్లితండ్రులను కూడా కలుపుకుని ఎన్డీటీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని రాత్రి 4 గంటల వరకు చూస్తుండిపోయాను,

ఈ రెండు వీడియోలను చూశాక నాకయితే మాటలు రావడం లేదు. జైలు గోడల మధ్య నిర్భయ రేపిస్టు మాట్లాడిన మాటల కంటే జైలు గోడల బయట ఉన్న ప్రముఖులు నుడివిన మాటల్ని చూసి మరింత అలజడి రేగింది. జాతి అంతశ్చేతనను కదిలించిన నిర్భయ ఘటన తర్వాత కూడా మన జాతి మనస్తత్వం మారుతున్న సూచనలు కనిపించడం లేదని  ఆ డాక్యుమెంటరీ ప్రత్యక్షంగా చూపించింది. దీన్ని అన్ని భాషల్లోనూ అందరికీ అర్థమయ్యేలా ఏర్పాట్లు జరిగితే ఎంత బావుండుననిపించింది.

దారుణమైన పరిస్థితుల్లో మన ప్రపంచం నుండి దాటుకున్న జ్యోతి సింగ్ పాండేను, ఆ నిర్భయను పనికిరాని వివాదాల రూపంలో మరోసారి చంపబోతున్నారా అనే ప్రశ్నలు రేకెత్తాయి. మన న్యాయవ్యవస్థకు నిజంగా హృదయం అనేది ఉంటే గత సంవత్సర కాలంగా నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఒక్క విచారణ కూడా జరపకుండా ఉండేదా అంటూ నిర్భయ తలిదండ్రులు ఈ డాక్యుమెంటరీలో, ఎన్డీటీవీ ప్రత్యేక ప్రసార కార్యక్రమంలో వేసిన ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది.

మనం ఏమీ చేయలేకపోవచ్చు.. 2012 డిసెంబర్ 16 తర్వాత కూడా మన జీవితాల్లో, సామాజిక చలనంలో ఏ మార్పులూ రాకపోవచ్చు. కాని ప్రశ్నించే గొంతులను, నిగ్గదీసే స్వరాలను నిషేధాలతో నులిమివేయడానికి బదులుగా ఆ ఆంగ్ల మహిళ ఏం చూపారు, ఏం చెప్పడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని మన అనుభవంలోకి తెచ్చుకుంటే తర్వాత ఎవరి తీర్పులు వారు చెప్పుకోవచ్చు.

అందుకే ముందుగా ఆ రెండు వీడియోలను కింది వీడియో లింకులలో చూడాలనే కోరుతున్నాను. వీటిని చూడటం ద్వారా మన పరువు ఏ గంగలోనూ కలవదని నాదీ గ్యారంటీ. నిషేధాలతో, కుహనా సంస్కృతీ పరిరక్షణ చర్యలతో జ్యోతి జ్ఞాపకాలను మరోసారి మలినం చేయడానికి బదులుగా ఈ వీడియోలను వీలైనంతమంది చూస్తేనే మంచిది. చూస్తే ఎవ్వరికీ ఏమీ కాదు. మహా అయితే మళ్లీ ఆలోచిస్తారంతే..

Banned Delhi Nirbhaya Documentary full BBC India's Daughter HD
https://www.youtube.com/watch?v=9W6WrShqKGE

Nirbhaya's Parents Talk to NDTV About Documentary on 'India's Daughter
https://www.youtube.com/watch?v=R6_SKpm8RpA

తన పర్సుకొట్టేసిన బాలుడిని పట్టుకుని పోలీసులు కొడుతుంటే అతడిని కొట్టవద్దని, కొట్టడం ఏ రకంగానూ పరిష్కారం కానే కాదని అడ్డుకుని అతడికి ఏం కావాలో అవన్నీ కొనిపెట్టి, మళ్లీ ఈ తప్పు మరోసారి చేయవద్దని హితవు చెప్పిన వినిర్మల మూర్తి.... జ్యోతి సింగ్ పాండేకి ఈ లోకం కాసింత చోటివ్వలేకపోయింది. మనిషి కాటుకు గురై చివరి క్షణాల్లో కన్నతల్లికి సారీ చెబుతూ, మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నానంటూ కన్నుమూసిన నిర్భయకు మరణం తర్వాత కూడా న్యాయం జరగనివ్వని నేలపై నిక్షేపంగా తిరుగాడుతున్నాం. ఆమె హంతకులు చస్తే ఎంత.. చావకపోతే ఎంత. ఇప్పటికే యావత్ ప్రపంచం శాపనార్ధాలతో వాళ్లు జీవచ్ఛవాలైపోయారు. దారి తెన్నూ తెలీనీ జీవితంలో చిక్కుకున్న కొంత మంది అట్టడుగు సంస్కృతీ రహితులు, జీవితానికీ, తన వాళ్లకీ దారి చూపే మార్గంలో నడవాలనుకున్న ఒక పేద యువతి ఆశలను నిలువునా కాలరాచేశారు. రేపు వాళ్లు చావచ్చు లేదా బతికిపోవచ్చు కూడా. కానీ వాళ్లనలా తయారు చేసిన, మృగాల్లా మార్చిన మన సమాజ పునాది మాత్రం చెక్కుచెదరకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఏమి న్యాయమిది? ఏమి జీవితమిది?

పై వీడియోలు చూశాక, నిర్భయ జ్ఞాపకాలను మనం ఎలా తలచుకోవాలో సూచిస్తున్న ఒక సమతూకపు కథనాన్ని ఇక్కడ చూడండి. ఆకాశంలో కాదు నేలపై కూడా నీవు సగం, నేను సగం కావాలి అంటూ ప్రకటించిన గొప్ప కథనమిది.
భయం నిర్భయం నడుమ...?
http://www.sakshi.com/news/opinion/nirbhaya-video-incident-creats-challenging-for-india-218994


కొసమెరుపు:
మిత్రుడు రాం మోహన్ నా ఈ బ్లాగ్ పోస్ట్ చూసి బీబీసీ డాక్యుమెంటరీ ఒరిజనల్ లింక్‌ను అందించారు.
https://www.youtube.com/watch?v=z-TU9JRcozU

దాన్ని ఇప్పుడు మరో సారి చూస్తూ నిర్భయ ఘాతుకుల తరపున వాదించిన లాయర్ మాటలు మరోసారి విన్నాను. ఆయన ఒక మాట అన్నారు. "మన సంస్కృతి చాలా గొప్పది. దాంట్లో మహిళలకు చోటు లేదు."

ఆడది బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు రావచ్చా? రాత్రి 7  లేదా 8 గంటలు దాటాక వీధుల్లోకి రావచ్చా? అంటూ ఈ దేశంలో పదే పదే మగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలకు వెలుపల ఆ లాయర్ మరో వ్యాఖ్య కూడా చేశారు. "మహిళ మన సమాజంలో బంగారు కాదు.. వజ్రం కన్నా విలువైంది. దాన్ని ఆహారంలాగా బయట వేయకూడదు. అలా వీధిలో వేస్తే కుక్క కచ్చితంగా దాన్ని ముడుతుంది. ఆరగిస్తుంది".

జీవితం మొత్తం మీద ఈ దేశానికి సంబంధించిన ఒక గొప్ప సత్యవాక్యం విన్నానీరోజు. మగాడు ఓ కుక్క. ఆడది దాని ఆహారం. ఇంత చేదు నిజాన్ని కొత్తగా ఈ రూపంలో విన్నాక, చూశాక నాలో ఒకే ఒక భావం.

ఈ రోజు నుంచి మన దేశవాసులం.. అందులోనూ మగాళ్లం.. తలదించుకుని సిగ్గులేకుండా బతికేయవచ్చు. మనం ఇంతకుమించి ఏమీ చేయలేం కదా... ఇలాగే బతికేద్దాం మరి.

ఇక్కడ మరో టీవీ చానల్‌లో ఈ డాక్యుమెంటరీపై ఆసక్తికరమైన చర్చ ఉంది చూడండి.

Is government right in banning telecast of Delhi gangrape documentary?

https://www.youtube.com/watch?v=6zjqCS2EJxQ







3 comments:

శరత్ కాలమ్ said...

ఆ డాక్యుమెంటరీ చూసే ధైర్యం ప్రస్థుతానికయితే నాకు లేదండి. ఆ సంఘటన ఊహించుకుంటేనే వళ్ళు జలదరిస్తుంటుంది - ఇంకా ఆ మృగాడిని ఆ వీడియోలో చూడటం - ఆడాళ్ళకు అతగాడి హితబోధలు వినడమూ నావల్ల కాదండీ - మీరన్నట్లే మిగతా భాగం బావుండొచ్చు గాక.

Gundluru Ram Mohan said...

https://www.youtube.com/watch?v=z-TU9JRcozU

kanthisena said...

శరత్ గారూ, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.. మీరు చూడగలనని అనుకున్నప్పుడే వాటిని చూడండి. కాని అతగాడి వ్యాఖ్యల కన్నా ఘోరమైన, నీచాతినీచమైన వ్యాఖ్యలను మన దేశపు ప్రముఖులు నిర్లజ్జగా, నిర్భీతిగా టీవీ కెమెరాల సాక్షిగా చేస్తూ వాగుతున్నప్పుడు ముఖేష్ వాగుడుకు అవి ఏమాత్రం తీసిపోవనే నిజాన్ని మనం అంగీకరించాల్సిందే. కన్నకూతురు అలా రాత్రిపూట వీధుల్లోకి వస్తే బంధువులందరి సమక్షంలోనే పెట్రోలు పోసి తగులబెడతానన్న ప్రభుద్ధుడు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో లాయర్. కొన్ని వేల సంవత్సరాల జాతి పరిణామ వికాస క్రమంలో నేటికీ మనం ఎక్కడ ఉన్నామో తెలిపే నిఖార్సయిన వ్యాఖ్యలివి. ఎవరో తలకు మాసిన ఒకరో ఇద్దరో అనగలిగే మాటలు కావివి. మనలో నూటికి 90 మంది ఆలోచనలూ, వైఖరులూ ఇలాగే ఉంటున్నాయి. అందుకే అద్దంలో మన అసలు ముఖం ఎలా ఉందో తెలుసుకోవటానికయినా ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని చూడాలనుకుంటాను. ఒక భారత పుత్రికి ఈ దేశంలో ఏం జరిగిందో... భవిష్యత్తులో కూడా ఏం జరుగనుందో అర్థం చేసుకోవడానికి మన కళ్లముందు ఒక ససాక్ష్యం ఇప్పుడు దృశ్యరూపంలో అందుబాటులో ఉంది. అసలు డాక్యుమెంటరీ చూడలేకపోతే,,, మరో కోణాన్ని ఆవిష్కరించిన ఆ ఎన్డీటీవీ చర్చనయినా పై లింకులో చూడగలరు. మనందరమూ సామూహికంగా ఏడవడానికి అదొకటే మార్గం ఇపుడు..

Post a Comment