Pages

Friday, August 26, 2016

పాకిస్తాన్ నరకమట... మన బంగారం మాటేమిటి?


క్షయవ్యాధి బారిన పడి ఆసుపత్రిలో కన్నుమూసిన తన భార్య శవాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన నివాసానికి తీసుకుపోవడానికి డబ్బులేక, అంబులెన్స్ దొరకక ఆమెను భుజాలపై పెట్టుకుని పది కిలోమీటర్లు నడిచిన ఒక ఆధునిక బేతాళుడు ఈ బుధవారం మన పౌర సమాజం మొత్తాన్ని చెళ్లున చెరిచాడు. ఆ పది కిలోమీటర్ల దూరం భార్య శవాన్ని మూట గట్టుకుని మోసిన ఆ గిరిజనుడు తన జీవిత కాలానికి సరిపడా నరకాన్ని చూసేశాడు.

కాని అతడు పాకిస్తాన్‌ని సందర్శించలేదు. గర్వించదగిన మన భారత దేశంలో, ఒరిస్సాలోని కలహాండి ప్రాంతంలో దశాబ్దాలుగా బతుకీడుస్తూ వచ్చాడతడు. క్షయ వ్యాధినుంచి భార్యను కాపాడుకోలేకపోయాడు. భార్య దేహాన్ని గౌరవప్రదంగా ఊరికి తీసుకుపోయేందుకు సరిపడా డబ్బులను కూడా మిగిల్చుకోలేకపోయాడు. అంబులెన్స్ లేక కాదు. ఆసుపత్రి వర్గాలు కరుణించక పోవడం, కొత్త అంబులెన్స్ ఆసుపత్రిలోనే ఉన్నా దాన్ని ప్రారంభించేందుకు వీఐపీ లేక అది అక్కడే మూలబడి ఉంది.

పాకిస్తాన్ వెళితే నరకాన్ని చూసినట్లే అని మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ మధ్యనే పేర్కొన్నట్లు గుర్తు. ఆ గిరిజనుడు పాకిస్తాన్లో కాదు.  33 కోట్ల మంది దేవతలు నడయాడే ఈ గడ్డమీదే నరకం చూశాడు. భార్య శవం మోసి మోసి డస్సిపోయాడు. పది కిలోమీటర్లు నడిచివెళుతున్నప్పుడు ఏ ఒక్కరూ అతడిని పలకరించలేదు. పరామర్శించలేదు. మనిషిని దుప్పటి కప్పి భుజాలపై ఎందుకు మోస్తున్నావంటూ కనీస ఇంగితాన్ని కూడా ఎవరూ ప్రదర్శించలేదు. శక్తి ఉడిగిపోయి, ఊగుతూ ఊగుతూ నడుస్తున్న అతడిని, తండ్రిని అనుసరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళుతున్న 12 ఏళ్ల కుమార్తెను  కొందరు కరుణామయులు  ఆదుకున్నారు.

యావద్దేశాన్ని కదిలిస్తున్న ఈ నరకయాతనను ఓటీవీ అనే చానల్  చిత్రీకరించింది.  అది చిత్రించిన ఆ 22 సెకన్ల దృశ్యం రాతి గుండెలను సైతం కదిలిస్తోంది. ఇండియా ఈజ్ షైనింగ్ అంటూ పాలకులు మరోసారి పాట పాడుతున్న నేపథ్యంలో మన కళ్లముందు ఒక అభాగ్య శవానికి పట్టిన గతి ఇది. ఆవిర్భవిస్తున్న గ్లోబల్ సూపర్ పవర్‌గా పాలకవర్గాలు, దాని తైనాతీ మీడియా ఊదర గొడుతున్న భారత దేశంలో వ్యవస్థ తన పౌరులను ఏ స్థాయికి దిగజార్చివేస్తోందో తెలుసుకోవడానికైనా ఆ దృశ్యాన్ని అందరూ చూడాల్సిందే.

నిజంగా ఇవే మంచి రోజులు అయితే (అచ్చే దిన్) భారత్ నేరుగా అంధయుగాల్లోకి వెళుతున్నట్లే. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..  బలూచిస్తాన్ కాస్తా వేచి ఉంటుంది కానీ.. ముందుగా మన కలహండిని సరిదిద్దుకుందాం. కానీ కలహండినో, ఒరిస్సానో, నవీన్ పట్నాయక్‌నో తప్పువట్టనవసరం లేదు. దేశమంతటా ఇదే బతుకే. బీదర్లో రెండు నెలలకాలంలో ఆత్మహత్యల పాలైన 25 మంది రైతులు, వరంగల్‌లో వ్యవసాయ దారు అయిన తండ్రి ఆత్మహత్య చేసుకుంటే కాలేజీ మానుకుని రైతుకూలీగా మారిన స్వప్న అనే అమ్మాయి కానీ, అక్షరాలా నరకాన్ని ఇక్కడే ఈ దేశంలోనే అనుభవించేస్తున్నారు.

గురువారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ మరో అద్భుతమైన ప్రకటన చేసి పడేశారు. తెలంగాణ మరొక కరువు బారిన పడనుందని ఎందుకు భావించాలి మనం? వర్షం కోసం ప్రార్థనలు చేద్దాం రండి అంటూ పిలుపిచ్చేశారీయన. భారత రాజ్యవ్యవస్థే మొత్తంగా మావోయిస్టుల కంటే, జిహాదీల కంటే పెద్ద టెర్రరిస్టుగా మారుతున్నప్పుడు ప్రజలకు ప్రార్థించడం తప్ప మరొక దారి ఏమున్నది కనుక? కనికరించమని వేడుకోవడం తప్ప వారికి వేరే దారి ఏముందీ దేశంలో? జీవితం పట్ల ఎలాంటి ఆశలు మోసులెత్తని రైతుకు పురుగుల మందును చేరుకోవడం, మెడకు తాడు బిగించుకోవడాన్ని మాత్రమే మన వ్యవస్థ ఆఫర్ చేస్తోంది.

మరోవైపు ఆంధ్రా-చత్తీస్‌గడ్ సరిహద్దులో 30వ జాతీయ రహదారి పొడవునా మావోయిస్టు రాజ్యం నడుస్తోంది. భారత్ లోని ఆ భాగంలో నివసిస్తున్న ప్రతి గ్రామస్తుడూ మావోయిస్టు సానుభూతిపరుడిగా ముద్రించబడుతున్నారు. కుంట ప్రాంతంలోని నిరుపేద గిరిజనులు నక్సలైట్ల ప్రభావంలోకి వెళ్లడం తప్ప వారికే మార్గమూ మిగిలిలేదు. అన్నలకు తిండి పెడుతున్నారని రాజ్యం వారిని వేధిస్తున్నప్పుడు విసిగిపోయిన ఆ గిరిజనులు నేరుగా తుపాకీ పడుతున్నారు. రాజ్యం ఇక్కడ ఒక నిషిద్ధ మానవుడిని తయారు చేస్తోంది. అతడిని జాతి మొత్తానికే అతిపెద్ద అంతర్గత శత్రువుగా ముద్ర వేస్తోంది. ఆ తర్వాత అతడిని ఎన్‌కౌంటర్ లెక్కలో వేసుకుని చంపడం చాలా సులువు.

కలహండి, బీదర్, వరంగల్, ఉస్మానాబాద్, కుంట.. ఇలా పలు ప్రాంతాల గాధలన్నీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థ పూర్తిగా పతమైపోయిందనడానికి తిరుగులేని రుజువులుగా కనబడుతున్నాయి. మరోవైపున భారత జాతిపైనే అత్యాచారం సల్పుతూ దురహంకారపు జాతీయవాద నినాదాలు దేశమంతా పెచ్చరిల్లుతున్నాయి. ఈ నినాదాలు చేసే పని ఒక్కటే. డబ్బుల్లేక భార్య శవాన్ని మోసుకెళుతున్న దానా మాజి వంటి విషాదమూర్తుల నరక ప్రాయపు జీవితాలను ప్రపంచం కంట బడకుండా దాచి ఉంచడమే.

రాతిగుండెలను సైతం కరిగిస్తూన్న ఈ వీడియోను ఈ తెల్లవారు జామున చూస్తున్నప్పుడు నాలో రేగుతున్న ప్రశ్న ఒక్కటే..

మనం అన్నం తినే బతుకుతున్నామా?

కొంతమంది సహాయంతో భార్య దేహానికి దానా మాజీ అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఆమెకు ఇకనైనా శాంతి కలుగుతుందన్న ఆశ అతనికి ఉండవచ్చు. నిజంగానే ఆమెకు శాంతి లభించవచ్చు. "భారత ప్రజలమైన మేము" అని మనం ఘనంగా చెప్పుకుంటున్న ఈ భూభాగంలో భాగం కాకుండా ఆమె వీడ్కోలు పలికింది కదా మరి.

మన ఇంటిని చక్కదిద్దుకోవడం తెలీని మనం మాత్రం పాచి పళ్ల దాసరి పాటను పాడుకుంటూనే ఉందాం. భారతదేశం చాలా గొప్ప దేశము. పాకిస్తాన్ అతి పెద్ద నరకము. భూమ్మీద మనవంటి జాతి లేదు అనుకుంటూ.. నినాదాలకు, వివాదాలకు, విద్వేషాలకు, దురహంకారపు దేశభక్తులకు ఇక్కడ కొదవ లేదు కదా.

దిగ్భ్రాంతి కలిగిస్తున్న ఆ వీడియోను, మూల రచన పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి. చదవండి.

For A Man Who Had To Carry His Wife's Dead Body For 10 Kilometres, Is India Not Hell
http://www.huffingtonpost.in/2016/08/25/for-a-man-who-had-to-carry-his-wifes-dead-body-for-10-kilometre

బద్ద శత్రువును హతమార్చిన సందర్భంలో కూడా అతడి శవానికి అంతిమ గౌరవం ఇవ్వాలనే అత్యున్నత సంస్కారం వేలాది సంవత్సరాల మనుగడలో మానవజాతి నేర్చుకున్న అతి గొప్ప పాఠాల్లో ఒకటి. ఈ వీడియోలో మనం చూస్తున్నదేమిటి? కళ్లముందు కన్నుమూసిన సహచరిని ఆ గిరిజనుడు మనిషిగా కాదు బండరాయిలాగా మోసుకుపోతున్నాడు. అమ్మను కోల్పోయిన బాధ, ఆ బాధలోనూ తండ్రితో కలిసి పది కిలోమీటర్ల పైన నడిచినప్పుడు కలిగే శోషతో ఆ చిన్నారి. చనిపోయిన ఆ తల్లికి ఒక వస్తువుకు లేదా పరిభాషలో చెప్పాలంటే ఒక సరకుకు ఉండే కనీస విలువ కూడా లేదు.

ఒక రజతపతకం అతి కష్టంమీద తీసుకొచ్చిన పీవీ సింధుకు నజరానాలు బహుకరించడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత జుగుప్సాకరమైన రాజకీయాలను ప్రదర్శించారో అందరం చూశాం. సింధు, సాక్షి, దీపా కర్మార్కర్ సాధించిన విజయాలను తేలిక చేయకూడదు. నిజమే. ఇక్కడ మనిషిగా జీవించటం అనే భావనకు కూడా దూరంగా ఉంటూ తల్లిని పోగొట్టుకున్న నిస్సహాయ బాలికకు ఈ దేశం ఏమని సమాధానమిస్తుంది? ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎలాంటి హంగామాలు లేవు కాబట్టి ఆమె ఇక అనాథగా అలా పడి ఉండాల్సిందే.  ఆర్థిక పరంగానే కాదు.. విద్యా పరంగా, అవకాశాలు దక్కించుకుంటున్న పరంగా కూడా బలిసినవారిదే భారతదేశం అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ జనజీవిత వాస్తవం ఇంతకంటే భిన్నంగా ఇక్కడ ఏడ్చి చస్తోందా?



11 comments:

Anonymous said...

ee adhunika bharathamlo kuda elantivi chudalsi vasthundi......

Anonymous said...

మాయమై పొతున్నడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మనవత్వం వున్న వాడు.

ఆందె శ్రీ గారు ఎంత బాగా వ్రాశారు.

శ్రీనివాస్ said...

పాకిస్తాన్ ని నరకంలా చిత్రీకరించే ముందు భారత్ ఏవిధంగా స్వర్గమో చూపకపోవడం మన రాజకీయనాయకుల ప్రమాణాన్ని తెలియచేస్తుంది. బాగా వ్రాసారు

Anonymous said...

భారతదేశంలో మారుమూల పల్లెలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు మీరు. అమెరికాలో కూడా మెడికల్ ఇన్సురేన్స్ లేనివాళ్లు, చేయి, కాలు తెగితే ఆసుపత్రికి పోకుండా, ఇంట్లోనే కుట్లువేసుకొంటారు. అది కూడ ఏ మత్తుమందు లేకుండా. ఆసుపత్రికి వేలితేనే అనస్థియా ఇచ్చి ఆపరేషన్ చేసేది. నంబర్ 1 దేశంలో నే పరిస్థితి అలా ఉంది.మరి దానికేమంటారు?

ఇండియాలో ప్రభుత్వం అన్ని ఫెసిసిలిటిస్ ఇస్తే పరిస్థితి మారిపోతుందనుకొంటావేమో. ఎమి మారదు. భారతదేశ ప్రజలలో 90% మందీ బాధ్యతే లేదు. ప్రభుత్వోద్యోగూకు అసలికి ఉండదు. ప్రైవేట్ కూడా ఎమి తక్కువ తినలేదు. ఒకసారి కార్పోరేట్ ఆసుపత్రులకి పోయి చూడు లక్షలు తీసుకొని ఏ భాధ్యత తీసుకోరు.రోగిని వీల్ చైర్ లో తిసుకుపోయేవారు ఎంత మోటుగా హాండిల్ చేస్తారంటె, రోగి బ్రతికి బట్టకట్టటం వాడి అదృష్టం అనిపిస్తుంది.

మీకు పాకిస్థాన్ స్వర్గమైతే వెళ్ళవచ్చుకదా! ఇక్కడ తిష్టవేసి భారతదేశం పై రోజు విషం కక్కటమెందుకు? దేశ విభజన అప్పూడు పాకిస్థాన్ కు వెళతామంటే, మీరు లేకపోతే, మేము ఉండలేము,మమ్మల్ని విడిచిపోకండి అని, మిమ్మల్ని ఎవరైనా ఉండమని బ్రతిమలారా?

Anonymous said...

@పై అజ్ఞాత :

అసలు మీకు మనదేశం గురించే తెలీదులా ఉంది ఇక పాకిస్తాన్ నరకమో, స్వర్గమో మీరు చెబుతే ఎవరైనా ఎందుకు నమ్మాలి? మీరు మనదేశం గురించీ (మరియు పాకిస్తాన్ గురించి) stereotype భావనలను కలిగున్నారు. అదిగాక "పాకిస్తాన్ ఫో" అనగలిగిన నిఖార్సైన దేశభక్తి కూడా మీలో కనబడుతోంది. చాలా సంతోషం.

రచయిత టపాలో చెప్పినదేంటంటే. ఇంకొకర్ని తిట్టిపోసేముందు మనల్ని మనం సరిచేసుకుందామని. "భారతదేశంలో మారుమూల పల్లెలో జరిగిన సంఘటన"లోని ఆ వ్యక్తి అనుభవించింది నరకప్రాయమేకదా అని. అలాంటి ఎన్నో నరకాల్ని ఎంతో మంది రోజూ అనుభవిస్తున్నప్పుడు, దాన్ని సరిచేయకుండా, పాకిస్తాన్నరకంగురించిన స్టేట్మెంట్లవల్ల మనక్కలిగే ప్రయోజనం ఏమిటని.

నాకు తెలియకడుగుతాను. డాలరుద్యోగానికి అమెరికా పోవాలి, నిజం చెబితే పాకిస్తానుపోవాలి, కొన్ని చదువులు చదవడానికి యూరపు పోవాలి. ఇక ఇండియాలో ఎవరుంటారు సార్! మీలాంటివాళ్ళా?

kanthisena said...

నా కొత్త టపాను సమర్థిస్తూ, కాస్త వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు పంపిన జ్ఞాత, అజ్ఞాత మిత్రులకు ధన్యవాదాలు. ఏ కారణం వల్ల అయినా కావచ్చు మనుషులు చనిపోయాక వారి అంతిమ పయనాన్నయినా కాస్త గౌరవప్రదంగా సాగించే పరిస్థితులు మన దేశంలో చాలా మందికి కష్ట సాధ్యంగా ఉన్నాయంటే మనందరం ఏకీభవిస్తామనే అనుకుంటున్నాను. బాధితులకు మనమేమీ చేయలేకపోయినా అయ్యో అనే సహానుభూతి ప్రకటించటానికి మన భావజాలాలు, భిన్నాభిప్రాయాలు మరేవీ అడ్డురావనీ, రాకూడదనీ నేననుకుంటున్నా.. ఇదే ఒడిషాలో మరోక వార్త ఇలాంటిదే వచ్చింది చూసేవుంటారు చనిపోయిన వ్యక్తి శవాన్ని మోసుకుపోవడానికి వీలుగా లేదనే కారణంతో ఆ శవం కాళ్లు విరగ్గొడుతున్న రైల్వే పోలీసు ఫొటోను నిన్న మరోసారి మీడియా చూపించింది. పాలకులు చెబుతున్న మంచి రోజులు మన సమాజంలోని అధోజగత్ సహోదరులకు కలగవని ఇంత నగ్నంగా స్పష్టంమవుతున్న తర్వాత పాకిస్తాన్ నరకం గురించి మనకెందుకు యాష్ట? పాకిస్తాన్ స్వర్గమా నరకమా అనే చర్చ కన్నా మన స్వర్గ భూమిలో నరకాల గురించి ఆలోచిస్తే చాలు కదా. ఇంతకు మించి దీంట్లో వివాదం కానీ, భేదించే విషయం కానీ ఏదీ లేదు.
ఇకపోతే, రోగి సంరక్షణ కంటే ధన సంపాదనే ఆసుపత్రుల లక్ష్యంగా మారిపోయిన పరిస్థితుల్లో రోగుల పట్ల ఆసుపత్రుల మొరటుదనం భారత్ లోనూ, అమెరికాలోనూ కూడా ఒకేలా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇన్సూరెన్సులు కట్టే ఆర్థిక స్థితి లేనివారు ప్రపంచంలో ఎక్కడయినా సరే గాలికి బతికేస్తుంటారు. జనాభాలో చాలామంది అలా బతుకుతున్నవారే కదా.. ఈ విషయంలో అజ్ఞాత మిత్రుడి అబిప్రాయం కరెక్టే.

UG SriRam said...

పది కిలోమీటర్లు నడిచివెళుతున్నప్పుడు ఏ ఒక్కరూ అతడిని పలకరించలేదు. పరామర్శించలేదు

రాజశేఖర్ రాజు గారు, చాలా కాలం తరువాత మీ బ్లాగులో రాస్తున్నాను. Hope you are doing well. మీ సంగతి తెలిసిందే,మీరు ఆవేశం తో ప్రతిస్పందిస్తారు. నా అనుభవం రాస్తాను చదవండి. మా ఇంటి ఎదురింటాయన బెంగాలి,75ఏళ్ళు. మిలటరిలో పనిచేసి భార్య చనిపోయిన తరువాత కొడుకులు,కుతురు ఉన్నా ఒంటరిగా జీవిస్తున్నాడు. కొడుకు విదేశాలలో హోటల్ మేనేజర్గా పనిచేస్తూండేవాడు. కూతురు టీచర్ గా పక్క వీధిలో ఉండేది.ఈయన మనవరాళ్ల చదువు ఖర్చు అంతా భరించేవాడు. ఒకరోజు తెల్లవారు ఝామున 4:30 గంటలకు తలుపుతట్టిలేపి సుమారు రెండుగంటలుగా గుండేల దగ్గర నెప్పిగా ఉందని, హాస్పిటల్ తీసుకుపోతావా? అని అడిగాడు. కారులో ఒక కార్పోరేట్ ఆసుపత్రి తీసుకువెళ్ళి, 20వేలు కట్టి చేర్పించాను. ఉదయం పదిగంటల వరకు అక్కడే ఉన్నాను. ఈ మధ్యలో కూతురికి పోన్ చేసి పరిస్థితి చెప్పాను. ఆమే అలాగా,చూడడానికి వస్తాను అంది. నా ఊహ ఎమిటంటే కూతురు వస్తుంది,డాక్టర్లు ఉన్నారు, ఇంట్లోవాళ్లకి చెప్పాము, ఆఫీసు టైం అయిందని వెళిపోయాను. కాని ఆ తరువాత తెలిసిందేమిటంటే ఆసుపత్రికి దగ్గర గా ఉన్నా కూతురు చూడటానికి రాలేదు. హర్త్ అటాక్ వచ్చిన ఈయన రోజంతా ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నాడు.

ఈమధ్యే ఆయనపోయారట. కోటిరూపాయల పైన విలువ చేసే ఆయన ఇంటిని కూతురు తీసుకొందట.

kanthisena said...

శ్రీరామ్ గారూ,
నమస్తే.
చాలా కాలం తర్వాత మళ్లీ ఇలా కలుస్తున్నాం. నిన్న మీ వ్యాఖ్య చూసినప్పటికీ పత్రికాఫీసులో బిజీగా ఉన్నాను. అర్ధరాత్రి తర్వాత ఇంటికి వస్తే నెట్ కనెక్షన్ లేదు. హైదరాబాదులో రాత్రి 3 గంటల పాటు కురిసిన వర్షానికి కరెంటు ఉంది కానీ ఇంటర్నెట్ లేదు. ఆదివారం కాబట్టి అన్ని పనులూ పూర్తి చేసుకుని సిస్టమ్ వద్దకు రావడానికి ఇప్పటికి కుదిరింది. ఆలస్యంగా స్పందించడానికి ఇదే కారణం.

నేను ఆవేశంతో స్పందిస్తానని మీరన్నారు. నిజమే.. 13 ఏళ్లు అజ్ఞాత ఉద్యమంలో పనిచేయడం, ఈ దేశంలోని మూలవాసుల, నిరుపేదల సమస్యలను, కన్నీళ్లను, కష్టాలను అతి దగ్గరనుంచి చూశాను కాబట్టి, వారికి నిత్యం జరిగే అన్యాయాలు ఎరిగి ఉన్నాను కాబట్టి ఆమాత్రం ఆవేశం ఉండదా చెప్పండి. కానీ నా ఆవేశం వ్యవస్థ వైఫల్యంపైనా, అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పాలనా విధానాల పైనే తప్ప వ్యక్తుల పట్ల కాదనుకుంటాను. ఒక్కోసారి రాతలో, వ్యక్తీకరణలో ఇంత ఆవేశం ఎందుకు అనిపిస్తుంటుంది కానీ నేను చూస్తున్న, తెలుసుకుంటున్న ఘటనలను అక్షర రూపంలో పెడుతున్న సమయానికి కాస్త ఆవేశం కూడా తన్నుకొస్తుంటుంది. ఆ ఆవేశం, ఆగ్రహం ధర్మాగ్రహంలో భాగం అయి ఉన్నంతవరకు ఎవరికీ నష్టం లేదు కదా.. కానీ ఏ సంధర్భంలో అయినా వ్యక్తిని గాయపర్చే విధంగా నా వ్యక్తీకరణ ఉందని అనిపించినప్పుడు, మీ వంటి పెద్దలు దాన్ని సూచించినప్పుడు వెంటనే వెనక్కు తిరిగి చూసుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో పశ్చాత్తాపం ప్రకటించాను కూడా. కానీ అదే సమయంలో అన్యాయం పట్ల నా స్పందనలో వేడి, వాడి తగ్గించుకోనవసరం లేదనే నా భావన. ఒకరకంగా మీవంటి వారు ఆయా సందర్భాల్లో నన్ను చెక్ చేస్తున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినే నండీ.

ఈ వ్యక్తిగతాన్ని పక్కన బెడితే... మీరు ప్రతి చర్చా సందర్భంలోనూ ఆలోచనను రేకెత్తించే ఏదో ఒక మానవ సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. అది ఎంత మంచి చర్చకు, పరస్పర అవగాహనకు దారి తీస్తుంటుందో నాకు తెలుసు. ఇప్పుడు కూడా మీ వ్యాఖ్యలో మంచి విషయం ప్రస్తావించారు.

గుండె నొప్పి వచ్చి ఇబ్బంది పడుతున్న ఆ పొరుగింటి బెంగాలీ సీనియర్ సిటిజన్ పట్ల మీరు చూపించిన స్పందన అందరికీ ఆదర్శనీయమే. గుండె నొప్పి వచ్చిన గంటలోపు వైద్యం అందకపోతే ఆ మనిషి ఆయుర్దాయం సగంపైగా పడిపోతుందని చదివాను. ఆయన సహాయం అడగగానే మనిషిగా మీ బాధ్యతను నిర్వర్తించారు. సమాజంలో ఆర్థిక పరంగా, సంస్కారం పరంగా చాలా కింది స్థాయిలో ఉన్న వారే ఆపత్సమయాల్లో అద్భుతంగా స్పందించి సహాయానికి ముందుకు వస్తున్న ఘటనలను చాలానే చూశాను. చెన్నయ్‌లో నేను ఉన్నప్పుడు ప్రమాదం బారిన, అనారోగ్యం బారిన పడిన వ్యక్తులను చేతుల మీద మోసుకుంటూ పక్కనే ఉన్న ఆసుపత్రులకు పరుగు తీసిన ఆటో డ్రైవర్లను చాలామందిని చూశాను. ఆ తర్వాత పోలీసుల ప్రశ్నలను, వేధింపులను ఎదుర్కోవడానికి కూడా వారు సిద్ధమయ్యేటట్టుగా మధ్యతరగతి ప్రజల్లో ఏ స్థాయి వారూ సిద్ధపడలేరని నా అనుభవం.

శ్రీరామ్ గారూ ఈ వ్యాఖ్య నిడివి పెద్దది కావడంతో మిగతా భాగాన్ని మరో వ్యాఖ్యగా కింద ఉంచుతున్నాను.

kanthisena said...

ఆ బెంగాలీ మిలటరీ వ్యక్తి గుండె నొప్పితో ఆసుపత్రిలో ఉంటే సమీపంలోనే ఉండి కూడా రాని ఆయన కుమార్తె గురించి మీరు రాశారు. పేదలకు, ధనికులకూ మధ్య ఉన్న తేడా ఇదే అనుకుంటాను. బంధువులు ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యానికి గురైతే, దారిఖర్చులకు ఇబ్బంది పడే స్థితిలో ఉండి కూడా అప్పులు చేసైనా సరే వెంటనే వెళ్లి పలకరించడం ఈ దేశంలో పేదవాళ్లలో మాత్రమే ఉన్న సంస్కృతి అనుకుంటాను. రోజూ పేపర్లలో డజన్ల కొద్దీ వార్తల్లో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బరువని తలిచి కుమారులు, కుమార్తెలూ పట్టించుకోకుండా వెళ్లిన సందర్భాలు, చివరకు స్మశానాల్లో వారిని వదిలి వెళ్లిపోతున్న సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. ఉమ్మడి కుటుంబం అనే పరస్పర సంబంధ బాంధవ్యాల వ్యవస్థ మన దేశంలో అంతరించిపోయిన నేపథ్యమే ఇలాంటి అమానవీయ సంస్తృతికి కారణమనుకుంటాను. దానికి తోడు ప్రజారోగ్యం పట్ల మన పాలనా వ్యవస్థ ప్రదర్శిస్తున్న ద్రోహపూర్వక వైఖరి కూడా కుటుంబాలను వైద్యఖర్చులంటేనే హడలిపోయే స్థితికి నెడుతోంది. దానికి తోడు జీవిత మంతా ఉత్పత్తి కార్యకలాపాల్లో మునిగి కుటుంబాన్ని తమ తమ శక్తిమేరకు ఎదిగించి శక్తి ఉండిగి విశ్రాంతి అవసరమైన దశలో నిస్సహాయంగా, కుటుంబ ఆదరణకు దూరంగా గడపాల్సి రావడం మన దేశానికే సంబంధించిన వికృత పరిణామమేమో అనిపిస్తుంది.

ఉమ్మడి కుటుంబం విడి (న్యూక్లియర్) కుటుంబంగా పరిణమించాక తల్లిదండ్రులు వారి పిల్లల బాగోగులు పట్టించుకోవడంతోనే సరిపోతోంది. వ్యక్తి స్వార్థానికి కూడా సమాజ నేపధ్యం తోడవుతుంది కదా.. అందుకే సీనియర్ సిటిజన్ అంటే మనసమాజం దృష్టిలో ఎందుకూ పనికిరానివాడే అనే అర్థం. ఎంత దారుణమంటే వారి జీవితానుభవం పట్ల కొత్త తరానికి ఏమాత్రం పట్టింపు ఉండదు. వారికి తమ పంచన కాస్త చోటు ఇవ్వడమే గొప్ప అనుకునే వాతావరణంలో వారితో రోజులో కొన్ని క్షణాలయినా అప్యాయంగా పలకరించేవారు లేకుండా పోయారు. వాళ్లు కొడుకులే కావచ్చు, కూతుళ్లే కావచ్చు. మరెవరైనా కావచ్చు. వీళ్ల పట్టింపు, అభిమానం తమకు కావాలనే కనీస ఆకాంక్షకు కూడా మన సీనియర్ పౌరులు ఇప్పుడు అర్హులు కాకుండా పోయారు.

శ్రీరామ్ గారూ, క్షమించాలి. మీ వ్యాఖ్యకు మోతాదుకు మించే స్పందించాననుకుంటాను. కారణం కూడా మీరే. 30 ఏళ్ల క్రితం పల్లెటూల్లో అన్నదమ్ముల బిడ్డలం ఒకేచోట కలిసి మెలసి ఉన్న వాతావరణం, అనేక సమస్యల సుడిగుండాల మధ్యనే ఉంటూ కష్ట సుఖాలను కలిసి పంచుకునే ఆ ఉమ్మడి తనపు స్వర్గ సౌఖ్యపు అనుభూతికి ఇప్పుడు పూర్తిగా దూరమైపోయాం. ఈ ముఫ్పై ఏళ్లలో మా రక్తసంబంధీకుల జీవన ప్రయాణం రాష్ట్రాంతరం నుంచి, దేశాంతరం నుంచి ఖండాంతరం వరకు సాగిపోయింది కానీ వ్యక్తులుగా మాత్రం మామధ్య సప్త సముద్రాల దూరం అడ్డుగా తయారైపోయింది. కుటుంబ వ్యవస్థ పరిణామ క్రమంలో నూతనమైన విడి కుటుంబ జీవితంలోకి మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రవేశించాక దానిలోని లాభనష్టాలను అనుభవించక తప్పదు కదా. ఈ సరికొత్త జీవితంలో లాభమూ, నష్టమూ కూడా సరిసమాన స్థాయిలో ఉండటమే విచారహేతువుగా ఉంటోంది.

మీ వ్యాఖ్యతో పూర్వ జీవితంలోనికి మళ్లీ తొంగి చూసినట్లయింది. మనం ఇప్పుడు పొందుతున్న అవకాశాల కంటే మనం కోల్పోయిన గత అనుభవాలే విలువైనవిగా కనిపిస్తుంటాయి గదా..

మంచి స్పందనను పంపించిందుకు.. ధన్యవాదాలండీ

UG SriRam said...
This comment has been removed by the author.
UG SriRam said...
This comment has been removed by the author.

Post a Comment