Pages

Saturday, October 8, 2016

తత్వశాస్త్రాన్ని జనరంజకం చేసిన త్రిపురనేని


"వ్యక్తిగా, సాహిత్య విమర్శకుడిగా, విప్లవ సాహిత్యోద్యమ నాయకుడిగా ఆయన ప్రయాణంలోని ప్రతి చలనాన్ని, భావాన్ని, ప్రభావాన్ని, పార్శ్వాన్ని, అందులోని మహాద్భుతమైన శక్తిని, బలహీనతలను, వెలుగునీడలను, సృజనాత్మక-యాంత్రికతలను, భిన్న ప్రకటనలను, బాధించే వైఖరులను, తనకూ-తన ప్రాణప్రదమైన ఉద్యమానికీ ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలను మహత్తరమైన క్రమశిక్షణలోనే దాగి ఉన్న క్రమశిక్షణా రాహిత్యాన్ని, అత్యున్నత తాత్విక మేధోజీవిలోనే నేలపై కించిత్ అరాచకత్వాన్ని... ఎప్పటికైనా నిశితంగా, గతితార్కికంగా అంచనా వేసినప్పుడే నక్సల్బరీ శ్రీకాకుళాల ఉద్వేగపూరితమైన తరంలో ఒకరిగా, ఆయన నుంచి ఇవ్వాల్టికీ, రేపటికీ ప్రవహించగల విప్లవాంశను స్వీకరించినట్లవుతుంది. ఆయన నిస్సందేహంగా మూడు తరాలను ప్రకంపనాలకు గురిచేసి విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాలకు తిరుగులేని జీవశక్తిని అందించారు. నిర్మాణాలకు దూరమైనా ఎర్రజెండాను గుండెలో పదిలంగా దాచుకుని, విప్లవంలో అరుదైన జీవన సంస్కృతిని ప్రకటించారు. వాద వివాదాలతో విప్లవంలోకి వచ్చి, ఒక లక్ష్యం కోసం జీవిత పర్యంతం వాద వివాదాలను సాగించారు. ఇప్పుడు మధుసూదనరావు గురించి మాట్లాడ్డం, అంచనా వేయడం కూడా ఒక అద్భుతమైన అవసరమైన వాదోపవాదమే"

ఆయన కన్నుమూసిన తర్వాతి నెలలో అంటే 2004 నవంబర్లో త్రిపురనేని మధుసూదనరావుపై తీసుకొచ్చిన 'అరుణతార' ప్రత్యేక సంచిక సంపాదకీయంలో విరసం ఆయనను ఎలా అర్థం చేసుకోవాలని వేసిన అంచనా నేటికీ ప్రాసంగికమైనదనే చెప్పాలి.

త్రిపురనేని జీవిత వివరాలు: 
త్రిపురనేని మధుసూదన రావు జీవితం గురించి క్లుప్తంగా చెప్పవలసి వస్తే ఆయన వ్యక్తిగత జీవితం చాలా చిన్నది. సాహిత్య, తాత్విక జీవితం చాలా పెద్దది అని చెప్పాలి.  విప్లవ రచయితల సంఘం నాయకుడు, వక్త, సాహిత్య విమర్శకుడు. 1970ల నుంచి 90ల మొదటి దాకా వక్తగా ఆంద్రప్రదేశ్‌లో కొన్ని వేల చోట్ల బహిరంగ సభల్లో, సెమినార్లలో, ప్రజాసంఘాల వేదికల్లో మాట్లాడి, విప్లవ, సాహిత్యోద్యమాలను ప్రచారం చేయడంలో విద్యార్థి యువజనులను విప్లవంవైపు ఆకర్షించడంలో అద్వితీయ పాత్ర నిర్వహించారు. తత్వ శాస్త్ర బోధకుడిగా, ప్రత్యేకించి మావో ఆలోచనా విధానం ప్రచారకుడిగా ఆయన నిర్వహించిన పాత్ర  అపారమైనది. సన్నిహితులకు మధు, విద్యార్థులకు మాస్టారు, ప్రత్యర్థులకు తిరుపతి మావో, త్రిమరా, త్రిమరాసురుడు, సాహిత్య గూండా అనే బోలెడు పేర్లతో చలామణి అయిన త్రిపురనేని సికింద్రాబాదు కుట్రకేసులో, తిరుపతి కుట్రకేసులో నిందితుడు మాత్రమే కాకుండా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో 19 నెలలపాటు నిర్బంధం పాలయ్యారు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా వృత్తి జీవితం గడిపారు. ప్రవృత్తి రీత్యా జీవితాంతం మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్ర ఉపాధ్యాయుడిగా,  నిత్య, నిరంతర అధ్యయన శీలిగా నిలిచారు. 1992 నుంచి అనారోగ్యంతో, వ్యక్తిగత కారణాలతో క్రియాశీల ఆచరణలో పెద్దగా పాలుపంచుకోకపోయినా స్థానికంగా విద్యార్థులకు రాజకీయ, సాహిత్య, తాత్విక బోధను కొనసాగించారు. 2004 అక్టోబర్ 8న అనారోగ్యంతో కన్నుమూసిన త్రిపురనేని రెండు దశాబ్దాలు విరసం కార్యవర్గ సభ్యుడిగా విప్లవ సాహిత్యోద్యమ నిర్మాణ నాయకత్వ బాధ్యతలు వహించారు. తెలుగునేల నలుచెరగులా కళాశాలల్లో వేలాది సభల్లో పాల్గొని విద్యార్థులను ఉత్తేజితులను చేసిన ఈ అద్వితీయ ఉపన్యాసకుడిని, తాత్వికుడిని, మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతకర్తను మరోసారి గుర్తు చేసుకోవడంలో భాగమే ఈ వ్యాసం.

సాహితీ విందు భోజనం
బాల్యంలో మా ఊరుకు వచ్చి పలకరించిపోయిన ఆరెస్సెస్ కార్యకర్తలు నేర్పిన సాంప్రదాయిక భావజాలంలో పెరిగి, పీజీ చదువు కోసం తిరుపతి వచ్చాక మార్క్సిజం సిద్ధాంతం పట్ల ఆసక్తి ఏర్పడ్డమే కాకుండా దాదాపు ఆరేళ్లపాటు బహిరంగ జీవితంలోనే నేను ఎంతో కొంత ఆచరణలోనూ పాల్గొన్న క్రమంలో నేనూ నాలాంటి ఎందరో విద్యార్థులం త్రిపురనేనిని ఆయన ఇంట్లోనూ, బయట సాహిత్య సభల్లోనూ, విశాలాంధ్ర బుక్‌షాపులోనో, తిరుపతి చుట్టు పక్కల పల్లెల్లో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్‌యు)తో సహా పలు ప్రజాసంఘాల కార్యక్రమ సభల్లో తరచుగా కలిసేవాళ్లం. గ్రామాలకు తరలండి అంటూ ఉద్యమం పిలుపునిచ్చిన క్రమంలో పల్లెలో విద్యార్థి, యువజనులు నిర్వహించే సభలకు ఒక్కోసారి టీఎమ్ఎస్‌ వచ్చి ఉపన్యసించేవారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బస్సుకోసం కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచిన సమయాల్లో, ఒక్కోరోజు నడి రాత్రి దాటాక, తిరుపతికి తిరిగి రావడానికి బస్సు ఉన్న చోటుకు ప్రయాణించేటప్పుడు, తర్వాత రాత్రంతా బస్సులోనే కూర్చుని చర్చలు జరపడంలో టీఎమ్మెస్‌తో మేం గడిపిన క్షణాలు అపూర్వమైనవనే చెప్పాలి.

అప్పట్లో మదనపల్లె కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు టీఎమ్మెస్‌ను కలవడానికి వచ్చినప్పుడు యాదృచ్ఛికంగా మేమూ అక్కడ ఉండటం తటస్థించినట్లయితే, మాకందరికీ ఒక సాహితీ విందుభోజనమే దక్కేది. విరసం ప్రతినిధిగా చేసే నిబద్ధ ప్రకటనలను, రాతలను పక్కనబెట్టి సాహిత్యాంశాలపై ఇతరులతో చర్చించేటప్పుడు టీఎమ్మెస్ అంత ఓపికగా ఇతరుల అభిప్రాయాలను ఎవరూ వినలేరనిపిస్తుంది. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అధ్యయన ఆసక్తిని వల్లంపాటి ఆకాశానికి ఎత్తిపట్టి కథలు కథలుగా వర్ణిస్తుంటే టీఎమ్మెస్ అలా వింటూండి పోయేవారు. జీవితం చరమ దశలోనూ అవసరం అనుకుంటే కంప్యూటర్ శాస్త్ర లోతులను మధిస్తానని, అవసరం లేకుంటే ఎంత కొత్త శాస్త్ర అంశాన్నైనా పట్టించుకోనని పుట్టవర్తి చెప్పేవారంటూ వల్లంపాటి టీఎమ్మెస్‌తో చెబుతుంటే మేం ఆలాగే వింటూండి పోయేవాళ్లం. విరసం అవతల వ్యక్తులూ, వారి సాహిత్య నేపథ్యం గురించి తెలుసుకోవడానికి, అంచనా వేయడానికి ఎంత విశాల దృక్పథం ఉండాలో ఆలాంటి చర్చా సందర్భాలు మాకు పాఠం నేర్పేవి.

అనితరసాధ్య వాగ్ధాటి
"పాటలో గద్దర్.. వచన సాహిత్యంలో అల్లం రాజయ్య... మార్సిస్టు విమర్శకుల్లో, ఉపన్యాసకుల్లో త్రిపురనేని మధుసూదనరావు.. తెలుగునాట విప్లవోద్యమం వల్ల చరిత్ర ఆవరణలోకి వచ్చిన గొప్ప లెజెండ్స్" అంటూ విరసం సీనియర్ రచయిత్రి నల్లూరి రుక్మిణిగారు వేసిన అంచనా టీఎమ్మెస్‌‌పై పరమ ప్రామాణిక అంచనాగానే చెప్పాలి. అలనాటి కళాకారులు బళ్లారి రాఘవ, వేమూరి గగ్గయ్యల తర్వాత మైకు అవసరం లేకుండానే వందలాదిమంది సభికులను కంచుకంఠంతో మంత్రముగ్ధులను చేసిన ఏకైక తెలుగు ఉపన్యాసకుడు త్రిపురనేని అంటే అక్షరం కూడా అతిశయోక్తి కాదనే చెప్పాలి. తాను గురిపెట్టిన ప్రత్యర్థిని, శత్రువును చీల్చి చెండాడటం, ఎవరి కోసం తాను ఉపన్యసిస్తున్నాడో వారిలో మహోత్తేజం కలిగిస్తూ నేరుగా యుద్ధరంగంలోకి దిగేలా వారిని సమాయత్తం చేయగలగటంలో విప్లవ సాహిత్య శిబిరంలోనే త్రిపురనేని అంత మహోధృత ప్రసంగకారిని ఎన్నడూ చూడలేదనే చెప్పాలి. తన సమకాలీనుల్లో జ్వాలాముఖి ఉన్నప్పటికీ త్రిపురనేనికే ఈ విషయంలో ఆగ్రాసనం లభిస్తుంది.


రాడికల్ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన వరంగల్, కరీనంగర్ వంటి తెలంగాణ జిల్లాల్లోని కశాళాలల్లో త్రిపురనేని అడుగుపెడితే శాంతిభద్రతలను కాపాడలేమని 1980లలో పోలీస్ శాఖ నేరుగా ప్రకటించిందంటే ఆయన ఉపన్యాసం విద్యార్థులను ఆకర్షించే తీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వేలాది తెలంగాణ విద్యార్థులు ఆయన ప్రసంగ ఉధృతి ప్రభావానికి లోనవుతున్న వైనం పోలీసు శాఖను భయాందోళనలకు గురిచేసింది. చివరకు త్రిపురనేని తెలంగాణ కళాశాలల్లో అడుగుపెట్టకుండా చేయడంలో కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్న పోలీసులు గెలుపు సాధించారు కానీ.. ఒక రకంగా చూస్తే తెలుగు ఉపాధ్యాయ ప్రపంచం మొత్తంగా గర్వించదగిన క్షణాలవి. ఒక అధ్యాపకుడి గొంతుకు, దాని దార్ఢ్యతకు రాజ్యవ్యవస్థే ఆందోళనకు గురైన ఘడియ అది.  ప్రపంచ విప్లవాల్లో చాలా వాటికి టీచర్లే నాయకత్వం వహించారన్నది చెరిపేస్తే చెరగని సత్యం. తెలుగునేలపై విప్లవోద్యమం తయారు చేసిన అలాంటి గొప్ప ఉద్యమ ఉపాధ్యాయుడే టీఎమ్ఎస్. ఈరోజు ఫేస్ బుక్‌లు,  వాట్సప్‌లు, యూట్యూబ్‌లు వ్యక్తుల జీవితాల్లోని ప్రతి క్షణాన్ని రికార్డు చేస్తూ వస్తున్నాయి. కానీ టీఎమ్ఎస్ వంటి గతించిన విశిష్ట వ్యక్తుల స్వరాలు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోవడం విచారకరం. పదాల్ని అస్త్రాలుగా మార్చి ప్రత్యర్థిని దునుమాడిన, ప్రజలను ఉత్తేజితులను చేసిన ఆ ఉపన్యాస ఝరి ఇంకా ఎక్కడైనా ఆడియో, వీడియో రూపంలో మిగిలి ఉంటే వాటిని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపర్చవలసిన అవసరం తెలుగు సమాజ బాధ్యత.

నిబద్ధ ఉపన్యాసకుడు
మాట్లాడటం, చదవటం, రాయడం అనే మూడు జ్ఞానదాయిక కళలను సమానంగా కలిగిన వారు ప్రపంచంలో చాలా అరుదు అని చెబుతుంటారు. సభల్లో మాట్లాడినా, ఏదైనా రాసినా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడం ఒకటే తెలిసిన వాడిలా త్రిపురనేని కనిపంచేవారు. ఆయన రూపం శత్రువును ఎదుర్కోవడానికి సర్వదా సన్నద్ధంగా ఉండే విప్లవ సైనికుడిలా కనిపించేది. మాటల్లో, రాతల్లో ఎంతటి సాధికారత ఉండేదంటే ఇదే సిద్ధాంతం, ఇక దీనికి తిరుగులేదన్నట్లుగా ఉంటాయి. నమ్మిన సిద్ధాంతంపై అచంచల విశ్వాసం, ప్రత్యామ్నాయాలతో అవసరం లేని ఆలోచనా విధానం ఉద్యమ మేధావులకు ఎంత సౌకర్యాన్ని ఇస్తుందంటే ఇక భాషకోసం తడుముకోవలిసిన పనిలేదు. మాటలు సూటిగా ఉంటాయి. శ్రోతలను అట్టే ఆకట్టుకుంటాయి. ఈ కోవలోనే 1970ల ప్రథమార్థంలో విరసంకు చేరువైన త్రిపురనేని ఉపన్యాసాన్ని తన జీవితకాలంలో ఒక కళగా అభివృద్ధి చేశారు. 'ఆ లావుపాటాయన మాట్లాడుతుంటే ఎంతో ధైర్యం వస్తుంది, ఆర్నెల్లు బతికేయవచ్చు, ఆయన మీటింగు ఉన్నప్పుడల్లా నన్ను కూడా తీసుకెళ్లరా' అంటూ ఆనాటికి ఉద్యమాల్లో పాల్గొంటున్న యువకుల తల్లులు ఒత్తిడి చేసేవారంటే త్రిపురనేని ఉపన్యాసం ఏ శిఖరాలకు చేరిందో అర్థమవుతుంది.

సాహిత్యంలో చెడు ధోరణుల నిర్మూలన కార్యక్రమం త్రిపురనేనిదయితే, ఆయన నేలను చదును చేసింతర్వాత వరవరరావు నిర్మాణ కార్యక్రమం చేపట్టి ఆ నేలలో విత్తనాలు చల్లుకుంటూ పోయేవాడని అప్పట్లో ప్రతీతి. సీపీఎం తత్వవేత్త నండూరి ప్రసాదరావు 1980ల మొదట్లో తత్వశాస్త్రంపై రాసిన పుస్తకంలో తొలి వాక్యం 'చరాచర ప్రపంచంలో...' అని మొదలవుతుంది. విజయవాడ న్యూ ఇండియా సెంటర్లో  అప్పట్లో జరిగిన ఒక సభలో "చలనమే పదార్థ లక్షణం, ఈ చలనం లేని పదార్థం నీకెక్కడ దొరికింది నండూరి ప్రసాద్" అంటూ "వేదాంతంలో మాత్రమే ఉండాల్సిన అచర పదార్థాన్ని మార్క్సిస్టు చారిత్రక భౌతికవాదంలో కలిపే కల్తీపనులు చేస్తే మాత్రం ఊరుకోం జాగ్రత్త" అంటూ త్రిపురనేని గంటసేపు ఆ ఒక్క అంశంపై చేసిన మహోధృత ఉపన్యాసం చరిత్ర సృష్టించింది. తన ఎదుట ప్రత్యర్థి ఉన్నప్పుడు అతడిపై దాడి చేస్తున్నప్పుడు కనికరానికి పోతే క్యారెక్టర్ చచ్చిపోతుందనే వారాయన.

అలాగే 1980ల మొదట్లో విజయవాడలో ప్రముఖ హేతువాది రావిపూడి వెంకటాద్రి గారితో హేతువాదంపై త్రిపురనేని బహిరంగ సభలో సాగించిన చర్చ చరిత్ర ప్రసిద్ధమైనది.  శత్రువు లేదా ప్రత్యర్థి అంతు చూసేవరకు వదలని ఈ తత్వాన్ని చూసే అప్పట్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ త్రిపురనేనికి తిరుపతి మావో అని కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. ఆ పేరు అలా దశాబ్దంపైగా స్థిరపడిపోయింది కూడా. అయితే రాతలో, మాటలో, ఆకారంలో కటువుగా కనిపించే టీఎంఎస్ చర్చ, ఉపన్యాసం ముగియగానే సున్నితుడైపోయేవాడు. 'ప్రసాదరావు ఎవరో కాదయ్యా ఆ రోజుల్లో మా గురువే' అంటూ నండూరిని వెనకేసుకురావడం చూసినవారికి ఆశ్చర్యం, నవ్వు రెండూ వచ్చేవి. శ్రామికుల పక్షాన జరిపే వర్గపోరాటమే సాహిత్య విమర్శ అని తన భావన. విమర్శ కూడా పోరాటమే అయినప్పుడు ప్రత్యర్థిపై శషభిషలు ఉండకూడదనేవారు.

సాహిత్య దృక్పథం
"సాహిత్యాన్ని సృష్టించడం  సాహిత్యాన్ని వివరించడం కంటే సులభంగా కనిపిస్తోంది" అనే మాటలు టీఎమ్ఎస్ కాక మరెవ్వరనగలరు? 'విమర్శకుడు రచయిత కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి' అన్న కొకు మాటకు పొడిగింపే కదా ఇది. తాను విమర్శించిన రచయితల కంటే వెయ్యాకులు ఎక్కువ చదువుకున్న అపర అధ్యయనశీలికే ఇలాంటి వ్యాఖ్య సాధ్యమవుతుంది. ఏ విషయం మీద రాసినా మొదట ఆ విషయానికి చెందిన భావనల్ని స్పష్టం చెయ్యడం, దానిమీద అంతకు ముందు జరిగిన చర్చను పరిచయం చేసి విశ్లేషించడం,  తర్వాత తన ప్రతిపాదనను చెయ్యడం త్రిపురనేని విమర్శలో మెథడాలజీ. ఒక విషయాన్ని దాని చిట్టచివరిలోతు వరకు వెళ్లి, శోధించి, దాని సారాన్ని పట్టుకుని ఆ తర్వాత దానిపై తనదైన ప్రతిపాదనలను చేయడంలో ఆధునిక సాహిత్యంలో ప్రత్యేకించి మార్కిస్టు సాహిత్యంలో త్రిపురనేని తర్వాతే ఎవరినైనా చెప్పాల్సి ఉంటుంది.  ఆయన జీవిత పర్యంతం ప్రదర్శిస్తూ వచ్చిన ఈ తీవ్ర అధ్యయన అభినివేశమే మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకు ఒక అద్వితీయ తాత్విక భూమికను కల్పించింది. ప్రబంధ సాహిత్యం కేవలం కవుల ఊహల్లోంచి మాత్రమే పుట్టిందని, దాంట్లో సమాజం లేదని పైపై వ్యాఖ్యలు చేయడం చాలామందికి పరిపాటిగా ఉన్న రోజుల్లో 'విశిష్టాద్వైతమే ప్రబంధాల్లో ప్రధాన వస్తువు' అంటూ ఘంటాపథంగా తేల్చిచెప్పినవారు త్రిపురనేని.

సాహిత్యమంటే సంధులూ, సమాసాలూ, అందమైన అలంకారాలూ, ఛందస్సుల వయ్యారాలూ మాత్రమే కాదనీ, అన్నిటికంటే ప్రధానమైంది రచయిత భావజాలమని తెలిసి వచ్చేలోగా చాలా విలువైన కాలం చేజారిపోయిందనీ, తనకూ తనలాంటి ఎందరికో త్రిపురనేని మధుసూదన రావు వంటి ఒక విమర్శకుడు ఆనాడు లభించి ఉంటే ఇంత సమయం వృధా అయ్యేది కాదనీ, అంతే కాకుండా విశ్వనాథను ఎలా చదవాలో తెలిసి ఉండేదని ప్రముఖ రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య చేసిన వ్యాఖ్యానం వెనుక త్రిపురనేని అధ్యయన తీవ్రతకు చెందిన విశిష్టాంశం దాగి ఉంది. తనకు కళాశాల రోజుల్లో పాఠం చెప్పిన గురువుగా, అసంఖ్యాక రచనలు చేసిన అద్వితీయ రచయితగా విశ్వనాధ సత్యనారాయణపై త్రిపురనేనికి వ్యక్తిగతంగా ఎంతో గౌరవభావం ఉండేది. కానీ వ్యక్తిని దాటుకుని దృక్పథం వద్దకు వచ్చేసరికి విశ్వనాధ వేయిపడగల హైందవ నాగరాజు కాటు యావత్ సమాజానికి ఎంత విషపూరితమైనదని ప్రకటన చేయవలసి వచ్చేసరికి త్రిపురనేని విశ్వరూపాన్ని ప్రదర్శించేవారు.

విశ్వనాధ - రెండు ద్వంద్వాలు
ఎస్వీ యూనివర్సిటీలో పీజీ, పరిశోధన చేస్తున్నప్పుడు వారం వారం తన ఇంట్లో ఆయనను కలిసిన ప్రతి సందర్భంలోనూ త్రిపురనేని మాస్టారు విశ్వనాధ సత్యనారాయణను రెండు కోణాలలో చూడమనేవాడు. అనితర సాధ్యమైన వేగంతో అలవోకగా రచనలు చేసుకుంటూ పోయిన విశ్వనాధను ఒకవైపు, వర్ణధర్మాన్ని పరిరక్షించే లక్ష్యంతో తాను మనస్పూర్తిగా నమ్మిన భూస్వామ్య భావజాలాన్ని జీవితం చివరి వరకూ పాటించిన పరమ సాంప్రదాయిక వాది విశ్వనాధను మరోవైపు పెట్టి ఆయన మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో పొరపాటు చేయకూడదన్నది మాస్టారు భావన. వేయిపడగలు శైలి పరంగా, పాఠకాదరణ పరంగా ఎంత ప్రాచుర్యం పొందినప్పటికీ దాన్ని విశ్వనాధ మహా విలాపంగా త్రిపురనేని అభివర్ణించేవారు. ఆ విలాపం వ్యక్తిగతం కాదు. తాను నమ్మిన చాతుర్వర్ణ వ్యవస్థ తన కళ్లముందే కుప్పకూలిపోతున్నప్పుడు, పాత భావాల స్థానంలో కొత్త భావాలు, పాత సమాజం స్థానంలో కొత్త సమాజపు అంకురాలు మెల్లమెల్లగా మొలకెత్తుతున్నప్పుడు ఓటమి తప్పదని అర్థమవుతున్న సంధిదశలో పాతను వదలలేక, కొత్తను అర్థం చేసుకోలేక.. ఆనాటి భూస్వామ్య సమాజం పెట్టిన చిట్ట చివరి ఏడుపే వేయిపడగలు అనేవారు త్రిపురనేని. వేయి సంవత్సరాల వెనుకబాటు ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచిన విశ్వనాధను విమర్శా వైధానిక పరంగా చీల్చి చెండాడుతూనే, అదే సమయంలో.. చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని దాని భావజాలాన్ని చివరిక్షణం వరకు కొనసాగించిన విశ్వనాధ సత్యనారాయణ నిజాయితీని త్రిపురనేని మా సంభాషణల్లో ఎంతగానో ప్రశంసించేవారు.

ఆ ప్రశంసలను దాటుకుని విశ్వనాధ సాహిత్యంపై ఆయన సంధించిన ఉగ్రవిమర్శ త్రిపురనేని జీవితంలో ఒక కొత్త కోణాన్ని వివరిస్తుంది. విశ్వనాథలో విమర్శించవలసిన అంశమేదో గుర్తించకుండా ఇతర కోణాల్లోకి చర్చను మళ్లించినవారిపై త్రిపురనేని నిజంగానే నిప్పులు గక్కారు. "ఒక దశలో తెలుగుజాతి కళా చైతన్యాన్ని సర్వనాశనం చేయగలిగిన జగదేక మహా కిరాతక తిర్యగ్ బుద్ధికి ప్రతినిధి విశ్వనాధ" అంటూ అభ్యుదయ సాహిత్య విమర్శకుడు  రాచమల్లు రామచంద్రారెడ్డి విశ్వనాధపై చేసిన విమర్శను మరింత లోతుల్లోకి తీసుకెళ్లిన క్రమంలో.. 20వ శతాబ్దం పూర్వ, ఉత్తరార్ధాల్లో 50 ఏళ్లపాటు విశ్వనాధ సాహిత్యం నిర్వహించిన పాత్రను మదింపు చేయడానికి త్రిపురనేని పదేళ్ల సుదీర్ఘ సమయం వెచ్చించారు. విరసంతో ప్రత్యక్ష సంబంధాలకు దూరమయ్యాక కూడా అధ్యయనాన్ని వదిలిపెట్టని ఆయన విశ్వనాధ కావ్యాలనూ, నవలలనూ సవివరంగా విశ్లేషించడానికే తాను విమర్శకుడయినట్లుగా, అంత కార్యభారాన్ని తలకెత్తుకుని దాదాపు పది సంవత్సరాల కాలం అందులో మునిగితేలాడు. విరసం అధికారపత్రిక అరుణతార నవంబర్ 2004 సంచికలో వల్లంపాటి రచన ఈ విషయంలో త్రిపురనేని కృషికి అద్దం పట్టింది. విశ్వనాధను నవ్య సంప్రదాయవాదిగా పేర్కొంటూ జీవీ సుబ్రహ్మణ్యం చేసిన ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తూ నవ్య అన్న మాటే విశ్వనాధకు అతకదని, విశ్వనాధ సంప్రదాయం మనువు సంప్రదాయమని కాదంటే ఆరెస్సెస్ గోల్వాల్కర్ సంప్రదాయమని త్రిపురనేని సోదాహరణగా నిరూపించారు.

విశ్వనాధ రచించిన మహాగ్రంథం 'వేయిపడగలు' రాసిలో ఎంత పెద్దదో ఆయన సంప్రదాయ భావజాలాన్ని పర్వత స్థాయిలో వివరించడంలో కూడా అంతే పెద్దదని చెప్పాలి. విశ్వనాధలో లేని నవ్యతను ఆయన గతించిన తర్వాత ఆయన సమర్థకులు ప్రచారం చేయడంపై టీఎమ్మెస్ మండిపడ్డారు. 'నేను అవిచ్ఛిన్న సంప్రదాయార్థిని' అని అనేకసార్లు విశ్వనాధ చెప్పుకున్నా ఆయన శిష్టులు మాత్రం అతనికి 'నవ్య' తగిలించారు. విశ్వనాధ చనిపోయాడు కాబట్టి వీళ్లు బతికిపోయారు' అంటూ త్రిపురనేని చేసిన వ్యాఖ్య విశ్వనాథలో నవ్య సంప్రదాయవాదిని చూడదలిచిన వారికి నిజంగానే చెంపపెట్టు వంటిది.

ఏంటా నవ్య సంప్రదాయం? ఏంటా అవిచ్ఛిన్న సంప్రదాయార్థిత్వం? 1930 ప్రాంతంలో హరిజనోద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు, అంతకు పూర్వమే బ్రహ్మ సమాజోద్యమం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన నేపథ్యంలో వర్ణాంతల వివాహాలూ, మతాంతర వివాహాలు బహిరంగంగా జరగటం ప్రారంభమైనప్పుడు, వామపక్ష భావాలు విస్తరించి, జమీందారీ వ్యతిరేక పోరాటాలు కూడా ప్రారంభమైనప్పుడు.. అంతవరకు కొనసాగుతున్న భూస్వామ్య సమాజ గర్భంలోంచి పొడుచుకువస్తున్న ఈ నూతన సమాజపు పరిణామాలను చూసి జడుసుకున్న సాహిత్య రూప ప్రతిస్పందనే విశ్వనాధ వేయిపడగలు. ఆ వేయిపడగల సారాంశం అభ్యుదయం కాదూ, నవ్య సంప్రదాయమూ కాదు. పదహారణాల పచ్చి భూస్వామ్య సంప్రదాయం. ఈ నవలా రాజంలో బయటపడిన రత్నాలను మచ్చుకు కొన్నింటిని చూద్దాం. 'పరపురుష సంగమము వలన భార్య అపవిత్రమైనట్లు, పంచముని దేవాలయ ప్రవేశము వలన దేవుని పవిత్రత చెడును' (వే.ప. 611వ పేజీ). 'అందరమొక్కటి యను సిద్ధాంతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటింది' (612). 'ఎవరి పూర్వ జన్మ కృత కర్మ ప్రకారము వారు బ్రతుకుదురు' (812). 1930వ దశకంలో కూడా అంటరానితనాన్ని ఇంత బహిరంగంగా సమర్థించిన తెలుగు మేధావి విశ్వనాథ ఒక్కడే. 'ప్రేమయనునది శరీరములో బుట్టు ప్రకృతి దోషము' (చెలియలి కట్ట 177) అన్నది ప్రేమను గురించి విశ్వనాధ తీర్పు. ప్రేమను నమ్మేవారు వదినల్ని లేవదీసుకుపోతారని ఈ నవలలో జుగుప్సాకరమైన కల్పన చేశాడు విశ్వనాథ. ప్రేమ పట్ల ఇంత అసహ్యతను రెచ్చగొడితే తప్ప వర్ణధర్మాలు నిలవవు. విశ్వనాథ రాసిన 'వీరవల్లడు' (ఆనాటికే తెలుగు నేలపై జరుగుతున్న రైతాంగ పోరాటాలను వ్యతిరేకిస్తూ నూజివీడు జమీందారును ఆకాశానికి ఎత్తిపట్టిన నవల), భూపోరాటాలకు వ్యతిరేకంగా వినోబా బావే తలపెట్టిన భూదాన యజ్ఞానికి వత్తాసుగా రాసిన రచన 'శ్రీ కుమారాభ్యుదయం'

విశ్వనాథ రాసిన ప్రతి సామాజిక నవలకూ ఇలాంటి సమకాలీన భూమిక ఉండగా వాటిని కప్పిపెట్టి విశ్వనాథ ఆధునికుడని, కమ్యూనిస్టు సమానత్వాన్ని ప్రబోధించాడని జి.వి. సుబ్రహ్మణ్యం, వల్లబాచారి వంటి సమర్థకులు చేసిన వాదనలను టీఎమ్మెస్ ఏకిపడేశాడు. విశ్వనాధకు వర్తించని, విశ్వనాధది కాని లక్షణాలను ఆయనకు వర్తింపజేస్తూ నవ్యసంప్రదాయ ముసుగులో వక్రీకరణకు దిగిన జీవీ సుబ్రహ్మణ్యం, వల్లభాచార్యుల వ్యాసాలకు త్రిపురనేని ఇచ్చిన సమాధానం తెలుగు సాహిత్య విమర్శలో ఒక మైలురాయని, సాహిత్యాన్ని, సమాజాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రతి జిజ్ఞాసువూ అక్కడ ఆగి తాను ఎంత దూరం నడిచివచ్చాడో ఆలోచించుకోక తప్పదన్న వల్లంపాటి అభిప్రాయం అక్షర సత్యం. అలా ఆగి ఆలోచించుకున్న కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేతవరపు రామకోటి శాస్తి గారి వంటి విశ్వనాథ వీర శిష్యులు విశ్వనాధ ప్రభావం నుంచి బయటకు వచ్చి చాలా దూరం నడిస్తే, జీవీఎస్, వల్లభాచార్యుల వంటి వారు విశ్వనాధపై వక్రీకరణల వద్దే ఆగిపోయారు. జీవీఎస్ ప్రతిపాదించిన విశ్వనాధ నవ్య సాంప్రదాయంపై త్రిపురనేని విమర్శ, దీనిపై వల్లభాచార్య విమర్శ, దానిపై త్రిపురనేని ప్రతి విమర్శ అనేది తెలుగు సాహిత్యంలో రెండు ప్రధాన ధోరణుల మధ్య జరిగిన భీకర పోరాటంగా అప్పట్లో పరిణమించింది. త్రిపురనేని ఈ సందర్భంగా చేసిన విమర్శా వ్యాసాలన్నీ 'విశ్వనాధ తిరోగమన సాహిత్యం' పేరిట సంకలనంగా వచ్చాయి.



తత్వశాస్త్ర అధ్యయన తపస్వి
కొన్ని పదాలు, భావనలు ఆధునికతకు సరిపడనివిగా కనిపిస్తాయి కానీ వ్యక్తుల విశిష్ట లక్షణాలను పేర్కొన వలసి వచ్చినప్పుడు అలాంటి పదాలను వాడక తప్పని పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపిస్తుంటుంది. తత్వశాస్త్ర అధ్యయనాన్ని ఒక తపస్సులాగా త్రిపురనేని సాగించారంటే ఫ్యూడల్ వాసన తగులుతుందేమో కానీ.. ఆయన ఆధ్యయన తీవ్రతను వర్ణించడానికి తపస్సు అనే పదానికి మించిన పదం దొరకటం లేదు. ఆపోసన పట్టటం అంటే కూడా ఇదే అర్థమే వస్తుంది కానీ అది కూడా పాత పదభావజాలమే. విషయానికి వస్తే మార్క్సిజం గురించి చర్చ వచ్చినప్పుడు మార్క్స్ ఎంగెల్స్ లాంటి వాళ్లు రాసిన క్లాసిక్స్ గురించి త్రిపురనేని చెప్పడమే కాదు ఏదైనా సందేహం వస్తే వాటినుంచి తీసి చూపించి చెప్పేవాడు. ఏ రచనలో ఏ అంశం ఉందో చెప్పేవాడు. ఆయన వద్ద ఉన్న అతిపెద్ద లైబ్రరీలో మార్క్సిస్టు క్లాసిక్స్ ఎక్కువగా ఉండేవి. మార్క్స్, ఎంగెల్స్ మూల గ్రంధాలను ఎంత మక్కువగా చదివారో, అంతకుమించి మావో రచనలను చదివాడు. విరసం రచయితల్లో మావోను అంత సాధికారికంగా చదివిన, ప్రచారం చేసిన ఏకైక రచయిత త్రిపురనేని. సాహిత్య విమర్శలో భాగంగా తత్వశాస్త్ర చర్చను విస్తృతంగా సాగించాడు.

సమస్యలమీద ఉద్యమాల్లో చర్చలు బయల్దేరి ఏది సరైందో, కాదో తెలుసుకోలేక సందిగ్ధంలో పడిపోయినప్పుడు అలాంటి వాటిపై మార్క్సిస్టు తాత్విక వైఖరి ఏమిటి అనే ప్రశ్న ఎదురైనప్పుడు సమాధానం చెప్పగలిగిన సాధికారిక స్వరం ఆయనదే. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అధ్యయన తరగతులు జరిగినా తత్వశాస్త్రంపై క్లాస్ చెప్పాలంటే త్రిపురనేని మాస్టారే పెద్ద దిక్కుగా నిలిచేవారు. ఆయన ముందు, తర్వాత ఫిలాసఫీ చెప్పడానికి, ప్రామాణికంగా బోధించడానికి మరొకరు తయారు కాలేదని ప్రొఫెసర్ శేషయ్య అన్నమాట నిజం. కానీ తత్వశాస్త్ర విమర్శకుడినని గంభీరంగా, గుంభనంగా ఉండటం ఆయనకు సాధ్యం కానిపని. కార్యకర్తకూ మేధావికీ తేడా లేనట్లే అందరితో ప్రవర్తించేవాడు. మార్క్సిజంపై అడ్డగోలు విమర్శలు చేసినవారిని, సైద్ధాంతిక వక్రీకరణకు పాల్పడినవారిని కత్తివాదరతో ఎదుర్కోవడమే తన పని అన్నట్లు సరికొత్త విమర్శా యుద్ధానికి సిద్ధపడిపోయేవారు. అతిశయోక్తి కాదనుకుంటే తెలుగు సాహిత్య చరిత్రలో తాత్విక అధ్యయనానికి, తాత్విక విమర్శకు తనదైన భూమికను ఇచ్చిన త్రిపురనేని గతించిన తర్వాత విమర్శకు తత్వ విశ్లేషణను అందించే ప్రక్రియ దాదాపు ఆగిపోయిందా అని ప్రశ్నించుకోవలసి వస్తోంది.

సాహిత్య చరిత్రకు కొత్త భాష్యం
సాహిత్యం కుట్రకాదు. రచయితలు కుట్రదారులు కాదు అనే సిద్ధాంతపత్రం తనపై రాజ్యవ్యవస్థ మోపిన తిరుపతి కుట్రకేసులో ముద్దాయిగా బోనులో నిలబడి త్రిపురనేని చేసిన కోర్టు ప్రసంగం. మొత్తం వెయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని వర్గ దృక్పథంతో ఈ వ్యాసంలో విశ్లేషించారు. సంస్కత సాహిత్యమంతా పీడిత ప్రజలకు వ్యతిరేకమైన పాలకవర్గ సాహిత్యమే, తెలుగులో అపారంగా ఉన్న అనువాద సాహిత్యం అంతా భూస్వామ్య వర్గ ప్రయోజనాలకి అనుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి అనువదించిందే వంటి సూత్రీకరణలతో ఈ ప్రసంగం తెలుగు సాహిత్య చరిత్రకు కొత్త దృష్టి కోణాన్ని అందించింది. అలాగే 'సాహిత్యంలో వస్తుశిల్పాలు' అనే పదకొండు వ్యాసాల సంపుటి  త్రిపురనేని తెలుగు సాహిత్య ధోరణులపై నిరంతర బహుముఖీన అధ్యయన ఫలితం. సాహిత్యం కోసం సాహిత్యం అనేది సంప్రదాయ దృక్పథమని, సౌందర్యం కోసం సాహిత్యం అనేది ఆధునికత ముసుగులోని సంప్రదాయ దృక్పథమని ఈ వ్యాసాలు సూచిస్తాయి. 'తెలుగు కవితా విప్లవాల స్వరూపం' అనే వ్యాసం వెల్చేరు నారాయణ రావు గారి సిద్ధాంత గ్రంథంమీద విశ్లేషణాత్మక సమీక్ష. ఆధునిక సాహిత్య విమర్శకులుగా పేరుపడ్డ రారా, ఆర్ఎస్ సుదర్శనంల మీద త్రిపురనేని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తదనంతర కాలంలో రాచమల్లు రామచంద్రారెడ్డి అభిప్రాయాలపై తాను చేసిన పూర్వ విమర్శను త్రిపురనేని సవరించుకున్నారు.

మార్కిస్టు ఫిలాసపీని ప్రచారం చేసిన అద్వితీయ వ్యక్తులలో అగ్రగణ్యుడు త్రిపురనేని. విద్యావంతులకు సైతం ఒక పట్టాన అర్థం కాని, గాఢమైన తాత్విక అంశాలను వీధుల్లోకి తెచ్చి జనంలో ప్రచారం చేసిన ఘనత టీఎంస్‌దే. తెలుగు సాహిత్యంలోనే కాదు సామాన్య జనం ముందు కూడా తత్వశాస్త్రాన్ని జనరంజకంగా మలిచిన ఘనత తన సొంతం. 'తత్వశాస్త్రాన్ని విశ్వవిద్యాలయాల చీకటి గదుల్లోంచి బయటకి లాక్కురండి' అనే మావో నినాదాన్ని టీఎంఎస్ కొన్ని వందల సార్లు సభల్లో ప్రస్తావించేవారు. జీవితం చివరి పది, పన్నెండేళ్ల కాలంపాటు ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం లేక, స్తబ్దుగా ఉన్న దశలోనూ కమ్యూనిస్టేతర భావజాలాన్ని ఆయన ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదంటే మార్క్సిస్ట్ తాత్విక పునాది ఆయనపై వేసిన ప్రగాఢ ప్రభావమే కారణం.  త్రిపురనేని అస్తమయం తెలుగునేలపై తాత్విక విమర్శా పరంపరకు జరిగిన అతి పెద్ద నష్టం.
--------------------------------------

సౌందర్య అభాస
1986-87 ప్రాంతంలో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన పెద్ద సాహిత్య సెమినార్‌లో త్రిపురనేని ప్రసంగించారు. సాహిత్యంలో సౌందర్య వర్ణన ఎలా ఉండాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ తన శరీరాన్నే పోల్చుకుంటూ టీఎమ్మెస్ చేసిన ప్రసంగం సెమినార్లో పాల్గొన్న వారిని నవ్వుల్లో ముంచెత్తిది. 'ఈ స్పోటక ముచ్చల ముఖాన్ని పట్టుకుని ఆహా ఎంత జగదేక సౌందర్య ప్రదర్శన అంటే అది సౌందర్య ఆరాధన కాదు సౌందర్య అభాస అవుతుంద'ని త్రిపురనేని తన ముఖాన్ని కబాలి ఫోజులో చేయెత్తి చూపిస్తూ చేసిన ప్రసంగంతో యూనివర్శిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులతో నిండిన ఆనాటి సభ మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది. (సౌందర్యాన్ని విరసం క్రమశిక్షణను కూడా అధిగమించి ఆరాధించిన త్రిపురనేని ముఖం మాత్రం స్పోటకపు మచ్చలతో నిండి ఉండేది.)

పోలీసు అధికారికి అరుదైన సహాయం
ఇతరులకు సహాయం అవసరం అనిపించినప్పుడు ఆయన అందించిన తోడ్పాటు దాదాపు ఎవరికీ తెలీదనే చెప్పాలి. 1986-87 ప్రాంతంలో అనుకుంటాను.. తిరుపతిలో ఆనాడు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఒక ..రెడ్డి ఐపీఎస్ లేదా తత్సమాన పరీక్షకు సన్నద్ధమవుతూ తెలుగు సాహిత్యాన్ని సబ్జెక్టుగా తీసుకుని దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ఎస్వీయూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్‌ ఒకరిని కలిశారు. తిరుపతి మొత్తంమీద నీకు లోతైన సమాచారం ఇవ్వగలిగేది త్రిపురనేని మధుసూదనరావేనని, పోయి అయన్ని కలవమని ఆ ప్రొఫెసర్ చెప్పారట. ఇంకేముంది ఆ రెడ్డి క్యాండిడేట్ నేరుగా టీఎంఎస్ ఇంటికెళ్లిపోయారు. విషయం చెప్పారు. రాడికల్ విద్యార్థులను, అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కార్యకర్తలను రాజ్యయంత్రాంగం తీవ్రంగా అణిచివేస్తున్న రోజులవి. తిరుపతిలో కూడా అనేకమంది రాడికల్ విద్యార్థులను వర్శిటీ హాస్టల్స్ నుంచి తీసుకెళ్లిపోయి అరెస్టు చేసి నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన రోజులవి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌కౌంటర్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న రోజులవి.

అలాంటి సమయంలో టీఎమ్మెస్‌‌ను కలవడానికి ఒక పోలీసు అధికారి వెళ్లడమే ఒక వింత. కానీ ఆ అధికారి వెళ్లిన వెంటనే అభ్యర్థించారట. పోలీసు అధికారిగా మీ ఇంటికి రాలేదని, తెలుగు సాహిత్య చరిత్రపై సమగ్ర సమాచారం మధుసూదనరావు వద్ద తప్ప మరెవ్వరి వద్దా ఉండదని, ఉన్నా ఎవరూ మీకోసం రాసి ఇవ్వలేరని యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పడంతో మీవద్దకు వచ్చానని, ఈ దృష్టితో తనకు సహాయం చేయగలరని ఆయన టీఎమ్మెస్‌ను కోరుకున్నారట. దానికి అంగీకరించిన టీఎమ్మెస్ ఫలాని రోజు తనకు సమాచారం కావాలని ఒత్తిడి పెట్టద్దని, తన ఇతర పనులు చూసుకుంటూనే వీలు కుదిరినప్పుడు రాసి ఇస్తానని చెప్పారు. అలాగే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన 24 పైగా వ్యాసాలు ఆయన రాసి ఇవ్వడం.. వాటి లోతు గ్రహించిన ఆ అధికారి వాటి ప్రాతిపదికనే తెలుగు సబ్జెక్టును చదువుకుని పరీక్షల్లో రాసి పాసై అదే తిరుపతిలో డీఎస్పీ పోస్టును సంపాదించడం జరిగింది. ఆ సంబంధం అంతటితో ముగియలేదు. తర్వాత కొంత కాలానికి 'తిరుపతి కుట్ర కేసు'ను టీఎమ్మెస్‌పై మోపి బస్సులు తగులబెట్టాల్సిందిగా రాడికల్ విద్యార్థులను రెచ్చగొట్టాడని, ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర చేశారని ఆరోపిస్తూ పట్టణ పోలీసు విభాగం కేసు పెట్టింది, ఆ కేసు విషయంలో తానేమీ చేయలేనని, కానీ ముందస్తుగా బెయిల్ పెట్టుకుంటే మీరు జైలుకు వెళ్లకుండా లీగల్‌ రక్షణ పొందవచ్చని ముందస్తు సమాచారం ఇచ్చి టీఎమ్మెస్‌కు ఆ అధికారి కాసింత మేలు చేసాడని తెలిసింది. ఇది టీఎమ్మెస్ స్వయంగా మాతో సంభాషణలో చెప్పిన విషయం. ఇది ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చిన క్విడ్ ప్రో కో లాంటిది కాదు. జీవితంలో ఉన్నతి కోసం వచ్చిన అధికారికి సాహిత్యపరమైన తోడ్పాటు అందించడం ఆయన వంతైతే, తర్పాత ఎప్పుడో టీఎమ్మెస్‌కు పోలీసు శాఖ నుంచి ఇబ్బంది కలుగనున్నదని తెలిసినప్పుడు కనీస రక్షణ చర్యలో భాగంగా బెయిల్ తీసుకోమని ఆ అధికారి సలహా ఇవ్వడమే ఇక్కడ ప్రధానం. ఈ రెండింటినీ సిద్ధాంతాలకు అతీతమైన మానవీయ స్పందనగానే చూడాల్సి ఉంటుందనుకుంటాను.

దళితుల రక్షణ గోడ త్రిపురనేని
కారంచేడు మారణ కాండ తర్వాత రాష్ట్రం మొత్తం దళిత ఉద్యమాలతో ప్రకంపించిపోయింది. ఆనాటివరకు దళిత, బలహీన వర్గాలకు నిజమైన అండదండగా నిలబడి వారికి రక్షణ గోడగా నిలిచిన పీపుల్స్ వార్ పార్టీని, రాడికల్ విద్యార్థులను దళిత ఉద్యమంలోకి రానివ్వకుండా శాయశక్తులా ఆనాటి దళిత నాయకత్వం పనిగట్టుకుని మరీ వ్యతిరేక ప్రచారాన్ని సాగించిన నేపధ్యంలోనూ టీఎమ్మెస్ దళితుల ఆకాంక్షను సమున్నతంగా నిలిపారు. దళిత విద్యార్థుల హాస్టళ్లకు వెళ్లి వారి సభల్లో పాల్గొని దళితుల ఆత్మగౌరవం రిజర్వేషన్లను సాధించడానికే పరిమితం కారాదని, భూమిపై, సమాజ సంవదలపై దళితులకు అధికారం అందివ్వకుండా వందేళ్లు రిజర్వేషన్లను కొనసాగించినా అది వర్గ అసమానతలను మరింత స్థిరీకరిస్తుంది తప్ప కుల సమస్యను, దానిలోని వివక్షను నిర్మూలించలేదని టీఎమ్మెస్ దళిత విద్యార్థులకు ప్రబోధించేవాడు. తిరుపతిలో ఒక అంబేద్కర్ జయంతినాడో, వర్థంతి నాడో దళిత విద్యార్థులు సభ పెట్టి దళిత టీచర్లను, దళిత విద్యాధికారులను వక్తలుగా పిలిపించినప్పుడు చివరలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు (త్రిపురనేనిని ఎన్నడూ సభల్లో మొదట మాట్లాడించేవారు కారని అర్థం చేసుకోవాలి. కంచుకంఠంతో మోగే ఆయన ప్రసంగం విన్న తర్వాత మరెవరి ఉపన్యాసాలను వినడానికి ఆసక్తి ఉండేది కాదన్నది వాస్తవం.) దళిత సమస్యకు అసలు పరిష్కారం ఇదీ అని ప్రకటించడంలో టీఎమ్మెస్ అంతకుముందు మాట్లాడిన వక్తల అభిప్రాయాలను మొత్తంగా పూర్వ పక్షం చేస్తూ మహోదృత ఉపన్యాసం ఇచ్చేవారు.

'నేను వేసుకున్న బట్టలు అంబేద్కర్ ఇచ్చాడు. నేను జేబులో పెట్టుకున్న పెన్ను అంబేద్కర్ ఇచ్చాడు, చేస్తున్న ఉద్యోగం, గడుపుతున్న జీవితం మొత్తంగా అంబేద్కర్‌ ప్రసాదించాడు..' అంటూ దళిత టీచర్లు అంతవరకు చేసిన కృతజ్ఞతాపూర్వక ఉపన్యాసాలను మందలిస్తూనే.. అంబేద్కర్‌ను జపించడం ద్వారా ఏ సమస్యలూ పరిష్కారం కావని తేల్చి చెప్పారు మాస్టారు. దళితులకు అత్యవసరమైన భూమి భుక్తి విముక్తి కోసం సాగాల్సిన పోరాటానికి భగత్ సింగ్ ప్రాణార్పణల బాటే మార్గమంటూ ఆరోజు రాత్రి తిరుపతిలో దళిత విద్యార్థులు, ఉపాధ్యాయుల ముందు టీఎమ్మెస్ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం 30 సంవత్సరాల తర్వాత కూడా నా స్మరణలో మిగిలే ఉంది. 'అంబేద్కర్ పెన్నిచ్చాడు, చొక్కా ఇచ్చాడు, అన్నీ ప్రసాదించాడు' అంటూ ఆయనపై భక్తిని ప్రదర్శించడం వరకే దళితులు పరిమితం కారాదని, దేశ స్వాతంత్ర్యం కోసం, ఆత్మాభిమాన పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై, రక్తం పొంగే దివ్య స్మృతులతో ఈ దేశ యువతరాన్ని ఉద్దీప్తం చేసిన వీరకిశోరం భగత్ సింగ్ మార్గం మీ మార్గం కావాలని, రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం విసిరేస్తున్న బిక్షను తీసుకోవడానికే మీరు పరిమితం కావద్దని, సకల సామాజిక సంపదల్లో వాటాకోసం మీరు చేయవలసింది పోరాటమే తప్ప యాచన కాదని మాస్టారు చెప్పిన మాటలు ఇంకా నాలో గింగురుమంటూనే ఉన్నాయి.

అరాచకం కాని అరాచకం
త్రిపునేని జీవితం మొత్తం సానుకూల అర్థంలో ఒక అరాచక ధోరణితో నడిచిపోయిందని చెప్పడానికి సాహసిస్తున్నాను. అరాచకం అంటేనే నియమబద్ధ జీవితానికి దూరంగా ఉండేదని అర్థం ఉంటోంది. 'పెద్దపులి అలాంటిది పళ్లు తోమదే మనమెందుకు తోమాలి? జంతువులేవీ దువ్వెన తల దువ్వుకోవే, మనకెందుకు దువ్వెన? అసలు నీట్‌గా తయారై వీధిలోకి, ఆఫీసులకు టింగురంగా అంటూ రావాల్సిన పని ఏంటి? వీటన్నిటికీ దూరంగా ఉండటమే అసలైన విప్లవం' అని ప్రతిపాదించి నిజంగా దాన్ని పాటించిన వారు కూడా తెలుగు కవి జర్నలిస్టు జీవుల్లో 1980ల మధ్యలో ఉండినట్లు నాకు గుర్తు. కానీ ఈ తరహా అరాచకం  మరొక రకమైంది. త్రిపురనేని జీవితాన్ని, ఆయన పని శైలిని ఈ పరిమితార్థంలో కుదించలేను కానీ ఆయనకు మాత్రమే సాద్యమైన అరాచకం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక తాత్విక విమర్శకుడిని అందించింది. ఆ అరాచకం కుటుంబానికి, పిల్లలకు అతీతంగా అధ్యయనం, విశ్లేషణ తప్ప ప్రపంచంలో మరేవీ లేవన్న తీవ్రధోరణిలోకి ఆయనను నెట్టివేసింది. ఆ అరాచకం కుటుంబం నుంచి తనను రద్దు -నెగేట్-  చేసిపారేసింది. ఆయన తర్వాత ఆయన కుటుంబం దిక్కులేనిదైపోయిందన్న భయానక వాస్తవమే దీనికి రుజువు.

ఆ అరాచకమే తాను ప్రాణప్రదంగా భావించిన విరసం నుంచి తనను దూరం చేసింది. (దీనికి ఆయన వ్యక్తిగత లోపమే కారణం కాకపోవచ్చు. రాజకీయ పంధాకు వ్యతిరేకంగా మరొక వైఖరి అవలంబిస్తే.. అతడితో/ఆమెతో చివరివరకు కొనసాగుతూనే ఘర్షించడం, చర్చించడం అనే సంస్కృతికి దూరమై, వ్యక్తినే దూరంగా నెట్టేసేలా ప్రారంభం నుంచి సాగుతున్న  ఈ దేశ సమస్త కమ్యూనిస్టు, విప్లవోద్యమాల జాడ్యం కూడా దీనికి కారణం కావచ్చు. కమ్యూనిస్టు, విప్లవ పార్టీల్లో మెజారిటీ పంథాకు, వైఖరికి భిన్న దృక్పథం ప్రకటించిన వ్యక్తి లేదా గ్రూపులు తర్వాత ఎక్కువ కాలం ఉద్యమంలో ఇమడలేకపోతున్న చరిత్రే దీనికి మూలం కావచ్చు). 1980లలో వందలాది యువతీయువకుల ప్రాణతర్పణలతో తెలుగునేలపై విప్లవోద్యమ నిర్మాణం క్రక్కదిలిపోతున్నప్పుడు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ వార్ పార్టీలోని మెజారిటీ పంథా వైపు నిలబడకపోవడమే ఆయన చేసిన తప్పటడుగు. దానికాయన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తప్పనిసరి ఫలితం అనుభవించారనే చెప్పాలి. కొన్నేళ్లలోపే ఆయనకు మాట్లాడటానికి వేదిక మిగులకుండా పోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా, ఇటు తెలంగాణ ఉద్యమ కేంద్రాల దాకా మాటలతో మంటలు పుట్టించి యువతను విద్యుత్తేజంలో ముంచెత్తిన గొప్ప స్వరం, వాగ్ధాటి దాదాపు పదిహేనేళ్లపాటు మూగపోయిందనే చెప్పాలి. ఆ అరాచకమే తనను చివరికి జీవితానికి కూడా దూరం చేసేసింది.

విరసం వైపు కన్నెత్తి చూడటానికి కూడా ధైర్యం లేని వారెందరో తర్వాతి కాలంలో ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా నిశితమైన, నిర్దిష్టమైన ఎదురు విమర్శ చేయడానికి విరసాన్ని సపోర్టు చేస్తూ మాట్లాడే గళం లేనప్పుడు మధుసూదనరావు లేని లోటు ఆంధ్ర దేశంలో ఎంతగా కనబడిందో చాలామందికి తెలుసు. త్రిపురనేనిఉద్యమానికి దూరం కావటం వ్యక్తిగా తనకు నష్టం కలిగించిందేమో కానీ సంస్థకు, ఉద్యమానికి కలిగిన నష్టం ఊహించలేనంత పెద్దది.



ముగింపు
పన్నెండేళ్ల క్రితం అనారోగ్యంతో ఇదే రోజు (2004 అక్టోబర్ 8) జీవితం నుంచి తప్పుకున్న త్రిపురనేని మధుసూదన రావు మాస్టారు కథ ఇంతటితో అగిపోలేదు. రచయిత భౌతికంగా కన్నుమూసిన వెంటనే సాహిత్య సర్వస్వాలను సంకలనాలుగా తీసుకువస్తున్న ఉద్యమ సాహిత్య చరిత్రకు త్రిపురనేని రచనలను కనీసం ఒక్కసారైనా పూర్తి సంకలనాలుగా తీసుకురావాలన్న స్పృహ లేకపోవడానికి కారణాలు ఎన్నయినా కావచ్చు కానీ దానివల్ల తత్వశాస్త్రాన్ని, తాత్విక విశ్లేషణను అధ్యయనాంశంగా చేసుకునే చరిత్రకు తదనంతర తరాలు దూరమైపోయాయి. ఇదే కమ్యూనిస్టు శిబిరానికి కలిగిన మహా విషాదం. అటు రాజ్యానికి, ఇటు విప్లవోద్యమాలకు రెంటికీ చెందనివాడిగా ఒంటరిగా మిగిలిపోయిన బాలగోపాల్ రచనలు దాదాపుగా అన్నీ అటు ప్రింటులోనూ, ఇటు ఆన్‌లైన్ లోనూ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి కానీ త్రిపురనేని సాహిత్యం మాత్రం ఏ చీకటి గుహల్లోనో దాగి ఉండిపోయింది. హేతువాదంపై, కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికపై, తెలుగు సాహిత్య యుగవిభజనపై, మార్క్సిస్టు గ్రంధాల అధ్యయన క్రమంపై నేటికీ ప్రామాణికమైనటువంటి (సృజన, అరుణతార సంచికలో) అద్వితీయ రచనలు చేసిన త్రిపురనేని మాస్టారు మేధోకృషిని ఆయన కలిసి పనిచేసిన సంస్థలు తదనంతరం ఎందుకు వదిలేశాయో ఏనాటికైనా జవాబు చెప్పాల్సే ఉంది. ఆయన రచనలను, భావధారను సేకరించే పని కాస్త ఆలస్యంగా మొదలవుతున్నా.. అది త్వరగా ఫలిస్తే చాలు.. ఒక్కటి మాత్రం నిజం. వ్యక్తుల, రచయితల, నిర్మాణాల లోపాలు మాత్రమే ముందుపీఠిలో నిలబడితే, వాటినే ముందుకు తీసుకువస్తే చరిత్రకు ఎవరూ మిగలరు. కానీ త్రిపురనేని మధుసూదనరావు మాత్రమే ఇలాంటి శిక్షకు గురై  విస్మృత మానవుడు ఎందుకయ్యాడనేది ఇప్పటికైనా తర్కించాల్సిన విషయం. అదే ఆయనకు అర్పించాల్సిన  అసలు నివాళి.

ఈ పెద్ద వ్యాసానికి మూలం 2004 నవంబర్ నాటి విరసం అధికార పత్రిక అరుణతార.. త్రిపురనేనిపై తీసుకొచ్చిన ప్రత్యేక సంచికలో పొందుపర్చిన పలు అంశాలు. వాటితో పాటు ఆయనతో మా పరిచయానికి సంబంధించి నేటికీ మాలాంటివారిలో మిగిలి ఉన్న అమూల్య జ్ఞాపకాలు.. దీనిలో ప్రతి అక్షరం నా సొంతం అని చెప్పుకుంటే అదే పెద్ద అపరాధం అవుతుంది. నా ఆస్తి, నా ఇల్లు, నా బ్యాంకు బేలన్సు, నా బండి చందంగా ఆలోచనలు, రచనలు కూడా మనిషి స్వంతం అవుతాయా అని బాలగోపాల్ ఒక మెరుపు వాక్యం ఎక్కడో సంధించినట్లు గుర్తు.

(అక్టోబర్ 8 త్రిపురనేని మాస్టారు కన్నుమూసిన దినం)

గమనిక: ఈ వ్యాసంలోని తొలి భాగం తెలుగు భాషా, సాహిత్య మాస పత్రిక 'అమ్మనుడి' (గతంలో నడుస్తున్న చరిత్ర)లో ఈ అక్టోబర్ సంచికలో (41-44 పేజీల్లో) ప్రచురితమైంది. తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో తమదైన మార్గంలో అనితరసాధ్యమైన రీతిలో రెండు దశాబ్దాలుగా దక్షిణ భారత దేశ వ్యాప్తంగా నిత్య కృషిచేస్తున్న ఈ పత్రిక సంపాదకులు సామల రమేష్ బాబు గారికి త్రిపురనేని మాస్టారు జ్ఞాపకాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

ఈ వ్యాసం బ్లాగు పాఠకుల నెత్తిన రుద్దడానికి సంబంధించిన టపా కాదు. త్రిపురనేని జ్ఞాపకాలను మళ్లీ మననం చేసుకునే  ప్రయత్నం మాత్రమే. 20, 30 ఏళ్ల క్రితం తెలుగు సమాజంలో ఒక నిరంతర అధ్యయన శీలి భావ పరంపర ఎలా సాగిందనే క్రమాన్ని కొద్దిగా అక్షరాల్లో పెట్టిన వ్యాసమిది. ఆసక్తి, సమయం కలిగిన వారు మాత్రమే దీన్ని చూడాలని నా అభిలాష.

5 comments:

వేణు said...

త్రిపురనేని మధుసూదనరావు గారి గురించీ, ఆయన కృషి గురించీ తెలుసుకోవాలన్న నా కోరిక మీ వ్యాసం ద్వారా ఎంతో బాగా నెరవేరింది. వివరంగా, శ్రద్ధగా రాశారు. ఆయన రచనలు పాఠకులకు అందుబాటులోకి రాకపోవటం అదే కారణమైనా విషాదకరమే!

kanthisena said...

వేణుగారూ,
మళ్లీ చాలా కాలానికి మీ నుంచి స్పందన వచ్చినందుకు సంతోషం. చాలా తక్కువ సమయం ఇచ్చి రాయమనడంతో అదరాబాదరాగా రాసిన వ్యాసం మాత్రమే ఇది. అమ్మనుడి సామల రమేష్ బాబుగారు ప్రోత్సహించి ఉండకపోతే సకాలంలో రాసి ఉండేవాడినే కాదు. దానికి కొంతమంది భావసారూప్యత కల మిత్రుల ప్రోత్సాహం కూడా తోడయిందనుకోండి. మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు

kalyani sj said...

"... ఏ విషయం మీద రాసినా మొదట ఆ విషయానికి చెందిన భావనల్ని స్పష్టం చెయ్యడం, దానిమీద అంతకు ముందు జరిగిన చర్చను పరిచయం చేసి విశ్లేషించడం, తర్వాత తన ప్రతిపాదనను చెయ్యడం త్రిపురనేని విమర్శలో మెథడాలజీ" అని తెలుసుకున్నాక ఎంతో ఉత్తేజం కలిగింది. టిఎంఎస్ గురించీ, ఆయన సాహిత్య సృష్టి గురించీ మరింత చదవాలన్న తపన కలుగుతోంది. ధన్యవాదాలు sir ...

Chaitanya said...

త్రిపురనేని మధుసూదనరావు గారి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది మీ వ్యాసం, ధన్యవాదాలు.

"అటు రాజ్యానికి, ఇటు విప్లవోద్యమాలకు రెంటికీ చెందనివాడిగా ఒంటరిగా మిగిలిపోయిన బాలగోపాల్ రచనలు దాదాపుగా అన్నీ అటు ప్రింటులోనూ, ఇటు ఆన్‌లైన్ లోనూ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి కానీ త్రిపురనేని సాహిత్యం మాత్రం ఏ చీకటి గుహల్లోనో దాగి ఉండిపోయింది." - బాలగోపాల్ వంటరిగా మిగిలిపోయాడా? పీడిత జనాలకి హక్కులు సాధించి పెట్టడంలో ఆయన ఏ విప్లవోద్యమాల కంటే తక్కువ పనిచేయలేదని అనిపిస్తోంది నాకు ఆయన గురించి తెలుసుకునే కొద్దీ. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి అణిచివేత చర్య దగ్గర, బాలగోపాల్ బ్రతికి ఉండి ఉంటే ఎలా విశ్లేషించి ఉండేవాడో, ఎంత స్పష్టంగా సూటిగా విమర్శించేవాడో, ఏ కొత్త కోణాన్ని చూపించేవాడో కదా అనే మాట పదేపదే వినపడుతోంది.

మీ వ్యాఖ్యలో బాలగోపాల్ రెండిటీకి చెడ్డాడన్నట్టు ధ్వనిస్తోంది. దాని గురించే నా స్పందన. బాలగోపాల్ రాజ్యానికి, విప్లవోద్యమానికి మధ్య, తనదైన స్టాండ్ తీస్కుని నిలబడ్డాడని, ఆ స్టాండ్ ఎంతోమందికి ఉపయోగపడిందని, ఆయన వాదనలోని బ్యాలెన్స్‌ ఎంతోమందిలో విప్లవోద్యమం పట్ల సానుకూలత కలిగించిందని నా అభిప్రాయం. బాలగోపాల్ పట్ల మీ అభిప్రాయం వివరంగా తెలుసుకోవాలనుంది.

Unknown said...

గ్రేట్ ఆర్టికల్.త్రిపురనేని గారిని మా తరానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్👍

Post a Comment