Pages

Sunday, October 30, 2016

త్యాగాలు వృథా కావు, కాని మన కర్తవ్యమో?


"ఇది యుద్ధమే కనుక చంపుతం అంటారు. ఇది బలిమెలకు ప్రతీకారం అంటారు. మీరు పాటించనప్పుడు మాకెందుకు రాజ్యాంగం, చట్టాలు అంటారు. మరి మీరు చంపినప్పుడో అంటారు. కాని దీన్ని ప్రజాస్వామ్యం అనుకోమంటారు. ఈ ఎన్నికల జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు పార్టీని కూడా రమ్మంటారు. ఒకే ఒక్కరుగా ప్రజల శిబిరంలో నిలిచిన విప్లవకారులను మీరు కూడా మా దళారీ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఈ హంతక విధ్వంస వ్యవస్థలో భాగం కమ్మంటారు. ఈ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం భావజాలంలో భాగం కమ్మంటారు. అందుకు రాజీ పడకపోతే 14 కాదు, 18 కాదు, 24 కాదు, 28 కాదు, 30, 32 తప్పకుండా లెక్కపెట్టు, ఎన్ని ప్రాణాలనైనా మనుషులుగా కాదు, అంకెలుగా కాదు, సంఖ్యగా, సమూహంగా నరసంహారం చేస్తామంటారు. ఇది నరమేధం.

అప్పుడది అడవిలో కాచిన వెన్నెల అనిపిస్తుంది. కాని, ఈ భూమి పుట్టి మనిషి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద ఆదిమ మానవుల నుంచి ఆదివాసీ సమాజాలు ఈ అడవిని తమ కోసం కాక, మన కోసం అప్పటి నుంచీ ఇప్పటి దాకా భావితరాల కోసం ఇట్లా తమ త్యాగాలతో, పోరాటాలతో కాపాడి ఉండకపోతే మనం ఇట్లా ఉండగలిగే వాళ్లమేనా? ఇట్లా రాయగలిగే వాళ్లమేనా? వాళ్లు మన మూలాలు. అది గ్రహించిన ఆ మూలాలు చెట్లు పూసిన పువ్వులుగా విప్లవకారులు వాళ్ల మధ్యకు వెళ్లారు. తెలతెలవారగానే తెలిరేకల వలె రాలిపోతున్న ఆ విప్లవకారులు వెదజల్లిన వెన్నెలలను అనుభవిస్తూ కూడా వృథా అనుకుందామా? నైరాశ్యానికి గురవుదామా? ఇది మన ప్రజాస్వామ్య విలువలకు, చెైతన్యానికి పరీక్ష అని ఏమైనా స్పందిద్దామా?"

అంటున్నారు విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు (వీవీ) గారు. ఏఓబీ ఎన్‌కౌంటర్లో నేలరాలిన 30మందికి పైగా మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, మిలిటెంట్లతో పాటు ఆర్‌కే, గాజర్ల రవి తదితర నేతలు మిస్సింగ్ మరణాల లెక్క కింద అదృశ్యమైపోయిన నేపథ్యంలో, అన్నల అమరత్వాలు అడవి గాచిన వెన్నెలేనా అంటూ ప్రముఖ కథకులు శ్రీరమణ గారు నిన్న సాక్షి దినపత్రికలో వ్యక్తీకరించిన ఆవేదనకు వీవీ ప్రకటించిన ఆశావాద సమాధానమిది.

ప్రజావీరుల రక్తత్యాగాలపై శ్రీరమణగారి ఆర్ద్రతతో కూడిన ఆవేదనను, నిరాశను అర్థం చేసుకుంటూనే, ఈ త్యాగాలు, తీవ్రాతితీవ్రమైన ఎదురుదెబ్బలు అడవిలో కాచిన వెన్నెల కాదని, భూబకాసుర జలగల నుంచి భూమిని కాపాడుకుంటూ భావితరాల కోసం తమ త్యాగాలతో, పోరాటాలతో కాపాడుతూ వస్తున్న ఆదివాసీ మూలాలను గ్రహించిన అన్నలు ఆ మూలాల చెట్లు పూసిన పువ్వులుగా వాళ్లమధ్యకు వెళ్లారని, తెలతెలవారగానే తెలిరేకల వలె రాలిపోతున్న ఆ విప్లవకారులు వెదజల్లిన వెన్నెలలను అనుభవిస్తూ కూడా వృథా అనుకుందామా? నైరాశ్యానికి గురవుదామా? ఇది మన ప్రజాస్వామ్య విలువలకు, చెైతన్యానికి పరీక్ష అని ఏమైనా స్పందిద్దామా? అని వీవీ ప్రశ్నిస్తున్నారు.

గత 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమ చరిత్ర పరిణామాలను పూసగుచ్చినట్లు విప్పి చెబుతూ ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసా’న్ని వివరించిన మార్క్సిజం నుంచి, పరస్పరం సంఘర్షించిన శక్తుల నుంచి నిర్మాణమైన శాస్త్రీయ అవగాహనతో ప్రపంచాన్ని మార్చిన, మార్చగల తాత్విక సిద్ధాంతం వెలుగులో పోరాడుతున్న ప్రజల బిడ్డలను, వాళ్ల గుండెచప్పుళ్లను, రక్తం పొంగిస్తున్న వారి దివ్య స్మృతులను అక్షరాల్లో పెడుతూ ఆలోచించమంటున్న కథనం ఇది.

ఆంద్రప్రదేశ్ లోని అడుగుడుగునూ కబళింపజూస్తున్న భూబకాసుర పాలనకు ఆటంకంగా మారుతున్నారనే ఏకైక వాస్తవమే ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు కారణమంటున్న  కథనమిది. దీన్ని ఎవరెవరి దృక్పథాలకు, అభిప్రాయాలకు అనుగుణంగానే చదువుదాం. ఒకటి మాత్రం నిజం. ఇది కేవల కథనం కాదు. ప్రజలపై పాలకులు సాగిస్తున్న యుద్ధానికి నిలువెత్తు నిరసన. ఇది యుద్ధారావం మాత్రమే కాదు.. యుద్ధం మాత్రమే పరిష్కరించగలిగిన.. సాగే రైతుల పోరాటం.. అనంత జీవన సంగ్రామం.
----------------------------------------


సాక్షి దినపత్రిక దీపావళి సంచికలో (30-10-2016) అంటే ఇవ్వాళ సాక్షిలో వచ్చిన వరవరరావు గారి కథనానికి ఇది ఎడిటింగ్ చేయని పూర్తి పాఠం. స్థలాభావం రీత్యా నాలుగింట మూడొంతుల కథనాన్ని పత్రికలో కుదించాల్సి వచ్చింది.

త్యాగాలు వృథా కావు, కాని మన కర్తవ్యమో?
"శ్రీరమణ గారి ‘అక్షర తూణీరం’ (అన్నలు మరణింపబడ్డారు? సాక్షి, 29–10–16) చాలా ఆర్ద్రంగా ఉంది. ఆదివాసుల విల్లంబుల పట్ల అక్షర ఆవేదనగా ఉంది. ఈ సందర్భంలో మహత్తర శ్రీకాకుళ ఉద్యమాన్ని, సత్యం, కైలాసాల అపూర్వ త్యాగనిరతిని గుర్తు చేసుకోవడం బుద్ధిజీవులకు ఆదివాసుల మధ్య పనిచేసేవాళ్లపై ఉండవలసిన బాధ్యతాయుతమైన గౌరవాన్ని గుర్తు చేస్తున్నది. ‘నరుడో భాస్కరుడా’తో పది పన్నెండు అడుగుల నడకతోటే ఆయన సౌజన్యానికి ముగ్ధుడైన తీరు భాస్కరరావు వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చింది. ‘మీరు అట్టే దూరం మాతో నడవరు’ అని భాస్కరరావు అన్నాడని చదివినప్పుడు కాళోజీతో 1968–69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో చక్కిళ్ల ఐలయ్య (శ్రీకాకుళ ఉద్యమ కాలపు తెలంగాణ ఎంఎల్‌ పార్టీ నాయకుడు) ‘మీరు ఇక్కడితో ఆగిపోతారు. మేం ఇంకా చాలా ముందుకు పోతాం’ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. కాళోజీ కూడ ఎప్పుడూ ఈ మాట అపురూపంగా గుర్తు చేసుకునేవాడు.

అయితే విప్లవోద్యమం దేవుణ్ని నమ్మడం వంటి మూఢవిశ్వాసం కాదు. ఆస్తిపర వర్గాల దేవ, దేశభక్తి లాంటి స్వార్థ, మూఢ విశ్వాసమూ కాదు. అది ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసా’న్ని వివరించిన మార్క్సిజం నుంచి, పరస్పరం సంఘర్షించిన శక్తుల నుంచి నిర్మాణమైన శాస్త్రీయ అవగాహనతో ప్రపంచాన్ని మార్చిన, మార్చగల తాత్విక సిద్ధాంతం.

అయితే ఇది అడవి కాచిన వెన్నెల అయిందా? యాభై ఏళ్ల తరువాత బేరీజు వేస్తే ఫలితాలు నెైరాశ్యాన్నే నింపుతున్నాయా? యాభై ఏళ్ల క్రితం నక్సల్బరీ ఉద్యమమే కావచ్చు, ఇప్పుడు ప్రచలితంగా చెప్పుకుంటున్న మావోయిస్టు ఉద్యమమే కావచ్చు ఎన్నెన్నో త్యాగాల, అమరత్వాల పునాదులపై నిర్మాణమైనవే.

కాసేపటి కోసం ఈ రాజ్యాంగంలో, ఈ శాసనసభల్లో, చట్టాల్లో విశ్వాసం ఉన్న వాళ్ల దృష్టితోటే బేరీజు వేసుకుందాం. శ్రీకాకుళ రైతాంగ పోరాటం 1971 నాటికే దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. 1970 జూలై 10న సత్యం, కెైలాసాలు కూడా అమరులయ్యారు. కాని ఆ ఉద్యమ ఫలితమే 1/70 చట్టం. ఆదివాసులకు అడవి భూమి మీద అధికారాన్ని ఇచ్చే చట్టం. ఇవాళ అది కాగితాల మీదకే పరిమితమై అమలు కాకపోవడానికి కారణాలు కూడా రమణ గారు ఈ వ్యవస్థలో చూస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి బిడి శర్మ కృషి వల్ల వచ్చిన బూరియా కమిటీ రిపోర్ట్, బిడి శర్మ, శంకరన్‌ వంటి వాళ్ల కృషి వల్ల వచ్చిన పెసా చట్టం (పంచాయితీ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్డ్‌ ఆక్ట్‌) వంటివన్నీ తూర్పు, మధ్య భారతాల్లో విప్లవోద్యమ పోరాట, త్యాగాల వల్ల వచ్చినవే. గ్రామ సభ నిర్ణయం లేకుండా అడవిలోని జల్, జంగల్, జమీన్‌ల మీద ప్రభుత్వం ఏ జోక్యం చేసుకోకూడదని ఈ చట్టం చెబుతుంది.

నేను ఒక విప్లవోద్యమం గురించే మాట్లాడడం లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి అడవిని ఆక్రమించుకోవడానికి బ్రిటిష్‌ వాళ్లు చట్టాలు చేసిన దగ్గరి నుంచి ఆదివాసులు విల్లంబులు, సంప్రదాయ ఆయుధాలతో చేసిన పోరాటమే, త్యాగమే రాజ్యాంగంలో ఇంకే సామాజిక శక్తులకు కూడా లభించనన్ని హక్కులను సాధించి పెట్టినవి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్‌ జల్, జంగల్, జమీన్‌ల మీద మాత్రమే కాదు, ప్రాదేశిక అధికారాన్ని మాత్రమే కాదు, స్వయం ప్రతిపత్తి దాకా కూడా ఆదివాసులకు హామీ పడింది. అయితే ఇండియన్‌ రిపబ్లిక్‌ ఆదివాసులకు చేసిన హామీలన్ని ఆచరణలో విఘ్నమయ్యాయని, రాజ్యాంగమే ఆదివాసులకు ఒక సంకెలగా మారిందని బిడి శర్మ ఒక పుస్తకమే రాశాడు.

మరొక పార్శ్వం చూద్దాం. ఏ నక్సల్బరీ ప్రస్తావనైతే రమణగారు తెచ్చారో ఆ నక్సల్బరీ తిరిగి పీపుల్స్‌వార్‌ రూపంలో బెంగాల్‌లో తెలంగాణ నుంచి ప్రవేశించిన తరువాత రాష్ట్ర ఉద్యమంగా ఉవ్వెత్తున ఎగిరింది. బుద్ధదేవ్‌ కాలానికి భూమిలేని, సన్నకారు రైతులకు భూములు పంచడానికి నక్సల్బరీ నేపథ్యంలో అమలు చేస్తూ వచ్చిన ‘ఆపరేషన్‌ బర్గా’ కూడా విఫలమై 2009 నాటికి అది ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’గా మారింది. నందిగ్రామ్, సింగూర్‌ ఉదాహరణలు ఇప్పుడు ఎందుకు గాని, జంగల్‌మహలే తీసుకుందాం. ఆపరేషన్‌ బర్గా కింద ఆదివాసుల కోసం కేటాయించిన 4,500 ఎకరాల అడవిని మరో ఐదు వందల ఎకరాలు కలిపి బుద్ధదేవ్‌ ప్రభుత్వం జిందాల్‌ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ఇచ్చేసింది. కిషన్‌జీ నాయకత్వంలో మావోయిస్టు పార్టీ చర్య గురించి ఇప్పుడెవరైనా, ఏమైనా చెప్పవచ్చు కాని ఇప్పటిదాకా జంగల్‌ మహల్‌లో జిందాల్‌కు అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యం కాకపోవడానికి మాత్రం మావోయిస్టు ఉద్యమమే కారణం.

బెైలదిల్లా ఇనుపరజను తవ్వకాల (ఒకసారి అక్కడి మహిళల బాధల గురించి బిడి శర్మ రాసిన పుస్తకాన్ని గుర్తు చేసుకుందాం.) తరువాత అప్పుడు అక్కడ ప్రవేశించిన  ఎస్ఆర్‌ కంపెనీ వాళ్లు తప్ప మరే బహుళజాతి కంపెనీ గాని, బడా కంపెనీ గాని అక్కడ ప్రవేశించలేకపోతున్నాయంటే 1980లో అక్కడ పీపుల్స్‌వార్‌గా ప్రవేశించి, 1995లో గ్రామ రాజ్యాలతో ప్రారంభించి ఆదివాసీ, దళిత మొదలైన విప్లవకర వర్గాల ఐక్య సంఘటనతో, కార్మికవర్గ నాయకత్వంలో ఇప్పటికి పదేళ్ల క్రితమే ఏర్పడిన అక్కడి జనతన సర్కారే కారణం. 1967 నాటికే కాలం చెల్లిన పార్లమెంటరీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నక్సల్బరీలో రూపొందిన పంథా గుణాత్మక పరిణామం ఇది.

ఆనాడు నూతన మానవ ఆవిష్కరణ కొరకు స్వప్నించిన ప్రజా రాజ్యం ప్యారిస్ కమ్యూన్‌ను, రష్యాలోని సోవియట్‌లను, చైనాలోని కమ్యూన్‌లను తలపించే జనతన రాజ్యం ఒక కోటి ప్రజలు నివసించే దండకారణ్యంలో ఇవాళ ఆచరణలో ఉంది. ఇందుకు ఇప్పటికి కనీసం ఆరు వేల మంది ప్రజలు, విప్లవకారులు బలిదానాలు ఇచ్చారు. వందలాది మహిళలు లైంగిక అత్యాచారానికి గురయ్యారు. గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. అభియాన్‌లు, సాల్వాజుడుం మొదలు 2009 మొదలైన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ నుంచి మూడు దశలు దాటి ఇప్పుడు మిషన్‌ 2016 పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజలపై యుద్ధాన్ని ప్రజాయుద్ధంతో ప్రతిఘటిస్తున్నారు.

శ్రీకాకుళ ఉద్యమం ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు విప్లవోద్యమంగా మారింది. అపూర్వమైన నారాయణపట్నా ఉద్యమం అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో నిర్వహించబడింది. ప్రభుత్వానికి 1956 ఒడిశా ల్యాండ్‌ రెగ్యులేషన్‌ ఆక్ట్‌ను గుర్తు చేయడానికి కూడా సాయుధ పోరాటమే చేయక తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధమైన నియాంగిరి పోరాటం కాని, పోస్కో వ్యతిరేక పోరాటం కాని మావోయిస్టుల నాయకత్వమే కాదు గాని వాటిల్లో మావోయిస్టుల క్రియాశీల భూమిక వహించింది. ఆ కక్షతోనే నియాంగిరిలో గొప్ప ప్రజా నాయకుడుగా పేరు తెచ్చుకున్న మావోయిస్టు పార్టీ దళ నాయకుడు శ్రీనివాసరావును ఆంధ్ర గ్రేహౌండ్స్‌ ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. ఆయన రాజమండ్రిలో ఆర్‌టిసీ వర్కర్‌గా పనిచేసి, విప్లవోద్యమంలోకి వెళ్లి నియాంగిరి ఆదివాసుల మధ్యన పనిచేయడానికి వెళ్లిన విప్లవకారుడు. ఆయన సహచరి తాను కూడా ఆర్‌టిసీలో పనిచేసిన కామేశ్వరి ఇప్పుడు ఏఓబీ ఉద్యమంలో ఒక స్థాయి నాయకత్వంలో ఉన్నది.

మల్కన్‌గిరి అక్టోబర్‌ 24 మారణకాండ మృతుల్లో ఆమె మతదేహం కూడా ఉన్నదేమోనని మేం అక్కడ పదకొండు మంది స్త్రీల శవాలున్న చెక్కపెట్టెలు తెరిపించి చూశాం. అందులో చిత్రహింసలకు గురై, ఒక తల కూడా వేరు చేయబడిన ఒక స్త్రీ శవాన్ని కూడా చూశాం. ఒడిశాలో కందమాల్‌ పోరాటం కాని, గోపాలపట్నం పోరాటం కాని మావోయిస్టు పార్టీ ఇతర ప్రజాస్వామ్య శక్తులతో కలిసి నిర్వహించినవే. మొత్తం 22 శాతం ఆదివాసులున్న, ఎంతో విలువైన అడవి సంపద ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఎంతో బలమైన నిర్మాణం, ఉద్యమాలు ఉన్నాయి. అటువంటి ఉద్యమాలు నిర్మాణం చేయడానికి ఎందరో ఆదివాసులు, విప్లవకారులు ప్రాణాలర్పించారు. అర్పిస్తూ ఉన్నారు. ప్రజలు అజేయులనే గతితార్కిక చారిత్రక విశ్వాసంతో పురోగమిస్తున్నారు.

ఇప్పుడింక ఏఓబీలోని ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి చెప్పుకుందాం. నిర్దిష్టంగా ఇరవె ఏళ్ల విప్లవోద్యమం అడవిలో వెన్నెల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కాలమంతా ఒక ఐదున్నరేళ్ల వ్యవధితో చంద్రబాబు పరిపాలన కాలం. 1995 ఆగస్టులో వైస్రాయ్‌ హోటల్‌ కుట్రతో ఆయన అధికారానికి రాగానే ఎంతో అహంకారంతో తాను ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌నని ప్రకటించుకున్నాడు. విధ్వంసకర అభివద్ధి నమూనాను అమలు చేయడం ప్రారంభించి, సీపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ మీద తిరిగి నిషేధం విధించి, సారా నిషేధం ఎత్తివేసి, సబ్సిడీలు రద్దుచేసి తెలుగు నేల మీద నెత్తురు పారించాడు. ఒక రాజ్య విధానంగా కోవర్టు హత్యలు ప్రారంభించాడు.

ఉత్తరాంధ్రకే, అడవికే పరిమితమై మాట్లాడుకుందాం. 2000లో విశాఖపట్నం చింతపల్లి అడవుల్లో దుబాయ్‌కి చెందిన బాక్సైట్‌ కంపెనీతో ఎంఒయు చేసుకుని ఇవ్వచూపాడు. అప్పుడు మొదలెైంది ఈ పాలక బాక్సర్‌తో ప్రజల బాక్సైట్‌ సంరక్షణ యుద్ధం. సుప్రీంకోర్టు సమతా తీర్పులో రాజ్యమంటే కూడా ప్రైవేట్‌ వ్యక్తి అని స్పష్టం చేయడంతో రాజ్యం ఆదివాసుల అనుమతి లేకుండా అడవి భూమి తీసుకోవడానికి సాధ్యం కాదని తెలిసి రాజ్యాంగాన్నే సవరించడానికి ప్రయత్నం చేశాడు. సమకాలీన ఏడుగురు ముఖ్యమంత్రులను కలుపుకొని సుప్రీంకోర్టు సొలిసిటర్‌ జనరల్‌ను సంప్రదించాడు. అది సాధ్యం కాదని ఆయన సూచించడంతో ఆయన మొదటి పరిపాలన కాలం ముగిసింది.

మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాడు. మూడు లక్షల మంది ఆదివాసులను ముంచే పోలవరం ప్రాజెక్టు, మత్స్యకారుల నిర్వాసిత్వానికి, జీవన విధ్వంసానికి కారణమైన కోస్టల్‌ కారిడార్, భయంకర పర్యావరణ విధ్వంసకారకమైన పవర్‌ ప్లాంట్‌లు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టాడు. శ్రీకాకుళంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్, కొవ్వాడలో వజ్రాల తవ్వకాలు, ఒక్కటేమిటి అమరావతి కోసం భూముల ఆక్రమణతో సహా రెండున్నర సంవత్సరాల పరిపాలన అంతా హింసా విధ్వంసాలే. ఇది ప్రారంభం కావడమే శేషాచలం అడవుల్లో ఇరవై ఒక్క మంది పొట్టకూటి కోసం ఎర్రచందనం స్మగ్లర్‌లకు కూలీలైన ఆదివాసులను, దళితులను చంపడంతో ప్రారంభమైంది. నల్లమలలో ఏ నిర్మాణమూ లేని మావోయిస్టు పార్టీ నీడకు భయపడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆరంభమైన తొలిరోజే జాన్‌ బాబురావును, ఆయన సహచరి తెలంగాణకే చెందిన మరొక మహిళను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపడంతో మొదలైంది. బొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌ దాకా ఈ ఎన్‌కౌంటర్‌ల పరంపర కొనసాగింది.

ఈ పదహారేళ్లలో ఆదివాసులు బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఎన్నడూ ఆపింది లేదు. పాడేరు కేంద్రంగా ఆదివాసులు, మహిళలు ఎంత మిలిటెంట్‌ మహత్తర ఉద్యమం చేశారంటే అందుకోసం వాకపల్లి మహిళలు, భల్లగూడ మహిళలు గ్రేహౌండ్స్‌ల చేతుల్లో లైంగిక అత్యాచారాలకు గురికావాల్సి వచ్చింది. ఎన్నోరకాల మూఢవిశ్వాసాలు ఉండే ఆదివాసీ సమాజాల నుంచి వచ్చిన వీళ్లు వాటన్నిటినీ అధిగమించి, పితృస్వామ్యాన్ని ఎదిరించి సభ్య సమాజం మానభంగం అని చెప్పుకునే మాటను ఒక రాజకీయ అస్త్రంగా, శరీరమూ రాజకీయమే, ఈ శరీరంతోటే పోరాడుతాం అని ప్రతిఘటించారు. తిరిగి అధికారానికి వచ్చిన తరువాత మళ్లీ ఎంతో ప్రాధామ్యంతో చంద్రబాబు ఈ ఎంఒయును అమలు చేయబోతే ఉద్యమం అక్కడి నుంచి వచ్చిన మంత్రుల మీద, పంచాయితీ సర్పంచ్‌లు మొదలు శాసనసభ్యుల దాకా ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించింది. చంద్రబాబు తాత్కాలికంగా ఒక ఉత్తర్వు తీయాల్సి వచ్చింది. కాని ఆయన కుయుక్తులు, దురుద్దేశ్యాలు తెలియంది ఎవరికి?

అందుకే ఇది ఆపరేషన్‌ ఆర్‌కె కాదు. ఇది మైనింగ్‌ మాఫియా ఆపరేషన్‌. ఇది గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ మూడవ దశ దాటి మోడీ – చంద్రబాబుల పథకంగా ఇవాళ ఉత్తరాంధ్రలో అమలవుతున్న మిషన్‌ 2016.

ఇప్పుడింక ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఆలోచించి స్పందించవలసిన విషయం. ఈ రెండు దశాబ్దాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల పతనం. కుళ్లి కంపుగొడుతున్న రాజకీయ స్వార్థం, దళారీతనం. దేశాన్ని అమ్ముకునే నిస్సిగ్గైన పేరాశ, దురాశ.

1995లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన ఏడాది రెండేళ్లకే తెలుగు నేల మీద గ్రామ గ్రామాన పోలీసు క్యాంపు వల్ల లక్షలాది ఎకరాల భూములు పోడు భూములుగా మారిన స్థితిలో కన్‌సర్న్ సిటిజన్స్  కమిటీ ఏర్పడింది. దాని ఏకైక ఎజెండా ప్రభుత్వంతో విప్లవ పార్టీలు, ముఖ్యంగా ఆనాడు ప్రబలంగా ఉన్న పీపుల్స్‌వార్‌ చర్చలు జరపాలి అని. ఇప్పటికి అందులో అమరులైన ఎస్ఆర్.ఆర్‌. శంకరన్, కె.జి కన్నబిరాన్, బియ్యాల జనార్దనరావు, జయశంకర్‌ వంటి వాళ్లను మనం తప్పక స్మరించుకోవాలి. బాలగోపాల్, నరేంద్రనాథ్, బుర్ర రాములును స్మరించుకోవాలి.

ఇదే సమయంలో శాఖమూరి అప్పారావు జైలు నుంచి వేసిన ఒక పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎన్‌. రావు ఒక ఆసక్తికరమైన పరిశీలన చేశాడు. ‘‘ఇంతకాలమూ మనం నక్సలైట్లను ఒక సమస్యగా చూస్తున్నాం. ప్రజలు మాత్రం ఒక పరిష్కార మార్గంగా చూస్తున్నట్లున్నారు. మనం కూడా గాంధీయిజం లాగ, అంబేడ్కరిజం లాగ మావోయిజాన్ని కూడా ప్రజల ముందున్న ఒక పరిష్కార మార్గంగా ఆమోదించగలిగినప్పుడు మాత్రమే అందుకు పరిష్కారాన్ని కూడా వెతుకగలుగుతాం’’ అనే అర్థంలో ఆ తీర్పు వెలువడింది. అది సిసిసికి ఎంతో కలిసి వచ్చింది. నక్సలైట్లను సమస్యగా మాత్రమే, పైగా శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూసి అణచివేయడమే పరిష్కారం అనుకున్న చంద్రబాబు నాయుడును కూడా సిసిసి చర్చలకు ఒప్పించగలిగింది. పార్టీ కేంద్ర, ఆంధ్ర కమిటీల నాయకత్వం శ్యాం, మహేష్‌లతో మొదటి దఫా, ఆర్‌కె మొదలైన వాళ్లతో రెండో దఫా ఎస్.ఆర్‌. శంకరన్, పొత్తూరి, కన్నబిరాన్, హరగోపాల్, డి. నరసింహారెడ్డిలు మాట్లాడారు. కె. రామచంద్రమూర్తి లాంటి వాళ్లు మీడియా ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు.

పీపుల్స్‌వార్‌తో చర్చలు జరిపితే భూసంస్కరణలు జరిగితే నక్సలైట్ ఉద్యమం ఉండదని ముఖ్యంగా శంకరన్‌ ఆశించాడు. బడుగువర్గాల నుంచి వచ్చిన దేవేందర్‌గౌడ్‌ హోంమంత్రిగా, పేర్వారం రాములు డిజిపిగా ఉండే కాలం తొమ్మిది నెలలే అని, కనుక ఈ తొమ్మిది నెలల్లోనే చర్చలు జరిగి, శాంతి నెలకొనాలని పొత్తూరి గారు ఆర్‌కెతో చెప్పినప్పుడు ‘‘వ్యక్తుల నేపథ్యాలు, మంచి చెడ్డలు కాదు. వ్యవస్థను బట్టి వర్గపోరాట రాజకీయాలుంటాయి. మేం ఆ భ్రమలతో చర్చలకు ఒప్పుకోవడం లేదు. ప్రజలు కోరుతున్నారు, ప్రజాస్వామ్యవాదులుగా మీ పట్ల మాకు గౌరవం ఉంది. అందుకని వస్తాం’’ అని ఆర్‌కె చెప్పాడు. నిషేధం ఎత్తివేయకున్నా, తలల మీద వెలలు కూడా రద్దు చేయకున్నా పార్టీ చర్చలకు రావడానికి అంగీకరించింది. విధి విధానాలు నిర్ణయించడానికి నన్ను, గద్దర్‌ను ప్రతినిధులుగా ప్రకటించింది.

2002 జూన్‌ 5, 9, 20 తేదీలలో మూడు దఫాలుగా విధి విధానాల నిర్ణయం కొరకు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మంత్రులు విజయరామారావు, తమ్మినేని సీతారాంలతో సచివాలయంలోనే చర్చలు జరిగాయి. అప్పుడు ఆర్‌కె పంపిన పార్టీ ప్రతిపాదనలను విజయరామారావు ఆదేశిక సూత్రాల (డైరెక్టివ్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ స్టేట్‌ పాలిసీ)తో పోల్చాడు. కాని ఆచరణలో మాత్రం ఈ మూడు రోజులూ ఎన్‌కౌంటర్లు జరిగాయి. జూలై 2న ఈ చర్చల్లో పాల్గొనడానికే వస్తున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత ఎన్‌కౌంటర్‌ హత్యతో పార్టీ చర్చల్లో పాల్గొనే ప్రతిపాదనను వెనక్కి తీసుకొంటూ జూలై 19న ప్రకటన చేసింది. వాస్తవానికి జూలై 20న పార్టీ నాయకత్వం బహుశా ఆర్‌కె, పటేల్‌ సుధాకర్‌రెడ్డి చర్చలకు రావాల్సి ఉండింది.

ఇక్కడి నుంచి చర్చల ఆకాంక్ష ప్రజాస్వామ్య వాదుల్లోనూ, ప్రజల్లోనూ మరింత తీవ్రమై 2004 ఎన్నికలకు అది ప్రాతిపదిక అయింది. అన్ని రాజకీయ పార్టీలకు అది ఎజెండా అయింది. ముందస్తు ఎన్నికలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికలను రెఫరెండం అన్నాడు. 1) ప్రపంచ బ్యాంక్‌ విధానాలు, 2) నక్సలైట్లతో చర్చలు, 3) ప్రత్యేక తెలంగాణ. మూడు విషయాల్లోనూ తాను మళ్లీ గెలిస్తే ప్రపంచబ్యాంక్ అభివద్ధి నమూనానే మరింత తీవ్రంగా అమలు చేస్తానని, నక్సలైట్లది శాంతి భద్రతల సమస్యగానే చూస్తానని, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకిస్తానని ప్రకటించాడు.వైఎస్ఆర్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌తో సహా మిగతా పార్టీలన్నీ 2001లో ఏర్పడ్డ తెరాస వరకు ఇందుకు భిన్నమైన వెైఖరి తీసుకున్నాయి. కాంగ్రెస్ ఐతే నక్సలైట్లతో బేషరతుగా చర్చలు చేస్తామని ప్రకటించింది.

2004 మే 14న కొత్త ప్రభుత్వం ఏర్పడి జానారెడ్డి హోంమంత్రి అయిన దగ్గర నుంచి 2005 జనవరి 8న చెైతన్య మహిళా సంఘం కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి ఎన్‌కౌంటర్‌ హత్య దాకా ఆ కాలమంతా ఈ చర్చల్లో కీలకమైన వ్యక్తి అప్పటి మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌కె. ఆయనతో పాటు ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున చర్చలకు వచ్చినవాడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ (గణేష్‌ ఇప్పుడు ఉదయ్‌గా ఎఒబి కార్యదర్శి).

ఆర్‌కె గురించి చెప్పనక్కర్లేదు. ఆ చర్చలు ముగిసిన దగ్గర నుంచి గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎఒబి ఉద్యమాన్నంతా నిర్మాణం చేసి నారాయణపట్న పోరాటం స్థాయి వరకు, ప్రజా విప్లవ కౌన్సిల్స్‌ ఏర్పాటు చేసే స్థాయి వరకు పెంచిన నాయకత్వం ఆయనది. ఆయనతో పాటు ఉదయ్‌ది. ఆ ఇద్దరూ ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ పేరిట మారణకాండలో ఏమయ్యారో తెలియదు. ముఖ్యంగా ఆర్‌కె గాయపడి పోలీసుల అదుపులో ఉన్నాడనే దగ్గరి నుంచి, గాయపడి అక్కడికక్కడ మరణించిన ఏడుగురులో ఉన్నారనే దాకా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏమైనా అంతకు ముందురోజే (అక్టోబర్‌ 23) ఆయన తప్పుకొని ఉండకపోతే ఇంక అక్టోబర్‌ 24 నుంచి ఆయన గ్రేహౌండ్స్‌ చక్రబంధంలోనే ఉన్నాడు.

ఇవాళ తెలుగు సమాజమే కాదు, దేశమంతా, చర్చల కాలాన్ని చాలా ఆసక్తిగా గమనించిన ప్రపంచమంతా ఆర్‌కె యోగక్షేమాల గురించి చాలా వ్యగ్రతతో ఉన్నది.

2004 అక్టోబర్‌లో నాలుగు రోజుల చర్చలలో రెండే ప్రధానాంశాలు. 1) ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ, 2) భూసంస్కరణలు. సాకల్యంగా జరిగిన ఈ చర్చలకు మావోయిస్టు పార్టీతో పాటు సీపిఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నాయకులు అమర్, రియాజ్‌లు పాల్గొన్నప్పుడు మొత్తం బృందానికి నాయకుడు ఆర్‌కె. జనశక్తి పార్టీ తరఫున చర్చలలో పాల్గొన్న రియాజ్‌ను 2005 జూలై 2న కాచీగూడ ష్రాఫ్‌ ఆసుపత్రి దగ్గర ముగ్గురు సహచరులతో పాటు అరెస్టు చేసి, తీసుకువెళ్లి కరీంనగర్‌ జిల్లా బదన్‌కల్‌ అడవుల్లో చంపేశారు. చర్చల దౌత్యాన్ని కూడా కాదని ఇటువంటి హత్యాకాండకు పూనుకోవడం ఇది రెండోదవుతుంది.

ఈ పన్నెండేళ్ల పరిణామం ఏమిటంటే, పార్లమెంటరీ రాజకీయ పార్టీల పతనం నిషేధిత పార్టీలతోనైనా సరే చర్చించే రాజకీయ స్థాయి నుంచి ఆ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని, శ్రేణులను, వారు నాయకత్వం వహిస్తున్న ఆదివాసులను ఆపరేషన్‌ హరిభూషణ్‌ పేరుతో, ఆపరేషన్‌ ఆర్‌కె పేరుతో చంపడమే లక్ష్యంగా గాలింపు చర్యలు, దాడులు చేయడంగా ప్రారంభమైంది.

ఇప్పుడు ప్రజా సంక్షేమ ఆపరేషన్‌లు కాదు. ఇప్పుడు ప్రజా సంక్షేమ మిషన్‌లు కాదు. ఇప్పుడంతా మైనింగ్‌ మాఫియా మిషన్‌లు. కంపెనీల ప్రయోజనాలు. సామ్రాజ్యవాద ప్రయోజనాలు. భూస్వామ్య ప్రయోజనాలు. పెట్టుబడి ప్రయోజనాలు. మార్కెట్‌ ప్రయోజనాలు. ఇందుకోసం ప్రజల మీద యుద్ధం. యుద్ధమనే సైనిక శబ్దం వాస్తవంలో మార్కెట్‌ అనే ఆర్థిక ప్రయోజనాల కోసం సృష్టింపబడేది. మార్కెట్‌ అనేది మానవ శ్రమను, ప్రకతి సంపదను అమ్ముకునే, కొనుక్కునే విలువగా చూసేది. ఇక్కడ మానవత్వానికి, మనిషి భాగమైన ప్రకృతితో మమేకత్వానికి చోటు లేదు.

ఇది యుద్ధమే కనుక చంపుతం అంటారు. ఇది బలిమెలకు ప్రతీకారం అంటారు. మీరు పాటించనప్పుడు మాకెందుకు రాజ్యాంగం, చట్టాలు అంటారు. మరి మీరు చంపినప్పుడో అంటారు. కాని దీన్ని ప్రజాస్వామ్యం అనుకోమంటారు. ఈ ఎన్నికల జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు పార్టీని కూడా రమ్మంటారు. ఒకే ఒక్కరుగా ప్రజల శిబిరంలో నిలిచిన విప్లవకారులను మీరు కూడా మా దళారీ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఈ హంతక విధ్వంస వ్యవస్థలో భాగం కమ్మంటారు. ఈ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం భావజాలంలో భాగం కమ్మంటారు. అందుకు రాజీ పడకపోతే 14 కాదు, 18 కాదు, 24 కాదు, 28 కాదు, 30, 32 తప్పకుండా లెక్కపెట్టు, ఎన్ని ప్రాణాలనైనా మనుషులుగా కాదు, అంకెలుగా కాదు, సంఖ్యగా, సమూహంగా నరసంహారం చేస్తామంటారు. ఇది నరమేధం.

అప్పుడది అవును, అడవిలో కాచిన వెన్నెల అనిపిస్తుంది. కాని, ఈ భూమి పుట్టి మనిషి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద ఆదిమ మానవుల నుంచి ఆదివాసీ సమాజాలు ఈ అడవిని తమ కోసం కాక, మన కోసం అప్పటి నుంచీ ఇప్పటి దాకా భావితరాల కోసం ఇట్లా తమ త్యాగాలతో, పోరాటాలతో కాపాడి ఉండకపోతే మనం ఇట్లా ఉండగలిగే వాళ్లమేనా? ఇట్లా రాయగలిగే వాళ్లమేనా? వాళ్లు మన మూలాలు. అది గ్రహించిన ఆ మూలాలు చెట్లు పూసిన పువ్వులుగా విప్లవకారులు వాళ్ల మధ్యకు వెళ్లారు. తెలతెలవారగానే తెలిరేకల వలె రాలిపోతున్న ఆ విప్లవకారులు వెదజల్లిన వెన్నెలలను అనుభవిస్తూ కూడా వృథా అనుకుందామా? నైరాశ్యానికి గురవుదామా? ఇది మన ప్రజాస్వామ్య విలువలకు, చెైతన్యానికి పరీక్ష అని ఏమైనా స్పందిద్దామా?


వరవరరావు
29 అక్టోబర్‌ 2016


సాక్షిలో ఎడిట్ చేసిన వీవీ కథనాన్ని కింది లింకులో చూడవచ్చు.

అడవికాచిన వెన్నెలేనా?!
http://www.sakshi.com/news/vedika/opinion-on-aob-encounter-by-virasam-leader-varavara-rao-417166


శ్రీరమణ గారు అక్షర తూణీరం కాలమ్‌లో రాసిన ఆర్ద్ర కథనాన్ని కింది లింకులో చూడవచ్చు
అన్నలు మరణింపబడ్డారు
Sakshi  Updated October 29, 2016 0117 (IST)
http://www.sakshi.com/news/vedika/opinion-on-aob-encounter-by-sri-ramana-416845

0 comments:

Post a Comment