Pages

Saturday, October 29, 2016

అన్నలు మరణింపబడ్డారు


అడవి నైజం మారి అర్థశతాబ్ది దాటింది. ప్రతి పిట్టా భయంగా కూస్తోంది. ప్రతి పక్షీ అలజడిగా కనిపిస్తోంది. ఆకుల కదలికల్లో ఏదో సంకేత భాష నడుస్తోంది. నీటి చెలమలు నెత్తురోడుతున్నాయి. అనుక్షణం అడవి భయంతో, బాధతో చలించిపోతోంది. ఎక్కడో కలకత్తా అవతల పుట్టి మనకు పాకింది నక్సల్‌బరీ ఉద్యమం. దండోపాయంతోనే ఈ వ్యవస్థని దారిలో పెడతామని రంగంలోకి దిగారు నక్సలైట్లు. అక్రమాల్ని, అన్యాయాల్ని చూసి సహించలేకపోయారు. జరుగుతున్న దారుణాలకు ఆక్రోశించారు. విప్లవపంథా తప్ప మరేదీ ఈ కుళ్లిన వ్యవస్థని సంస్క రించలేదని తీర్మానించుకున్నారు. వారంతా మానవతావాదులు. జాలిగుండెల వాళ్లు. చీకట్లను తిట్టుకుంటూ కూచోకుండా చిరుదీపాన్నైనా వెలిగించ సంకల్పించినవాళ్లు.

అప్పటికింకా దేశానికి స్వతంత్రం వచ్చి గట్టిగా ఇరవై ఏళ్లు కూడా కాలేదు. తెల్లదొరలను మరి పించే మన నల్లదొరల దోపిడీలను సహించలేని కొందరు నడుం బిగించారు. తుపాకీని భుజం మీద ధరించారు.

తొలినాళ్లలో నాకు సుపరిచయమైన పేర్లు ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం. ఉద్యమ నేత లుగా వాళ్ల వీరగాథలు విన్నాను. వాళ్లను కీర్తిస్తూ సామాన్య జనం పాడుకున్న పాటలూ విన్నాను. కొంచెం ఆ తర్వాత మరో విప్లవ మూర్తిని దగ్గరగా చూశాను. అతను డాక్టర్‌ చాగంటి భాస్కర రావు. కొద్దిసార్లు పదిపన్నెండడుగులు అతనితో కలసి నడిచాను. ఆ నిరాడంబరత, సౌజన్యం, విప్లవదీక్ష అతని ప్రతి కదలికలోనూ ప్రస్ఫుటమయ్యేది. ‘‘ఉద్యమించడం మంచిదేగాని చంపడం అవసరమంటారా’’ అన్నప్పుడు,  ‘‘మీరు ఆట్టే దూరం మాతో నడవరు’’ అని జవాబుగా అనేసి వెళ్లిపోయాడు భాస్కరరావు.

‘‘దేవుణ్ణి పూజించినా, ఇలాగ ఉద్యమించాలన్నా వాటికి పునాది నమ్మకం. అది లేనివాళ్లు ఇందులోకి రాకూడద’’ని ఒక విప్లవనేత స్పష్టం చేశాడు. కావచ్చు కానీ, అసమాన ప్రతిభ, దీక్షాపరత్వం, త్యాగనిరతి అడవి కాచిన వెన్నెల కాలేదా అని సందేహం కలుగుతుంది. నడకదారి కూడా ఆగిపోయిన చోట ఉద్యమకారుల స్థావ రాలు మొదలవుతాయని చెప్పుకుంటారు. యాభై ఏళ్ల తరువాత బేరీజు వేస్తే ఉద్యమ ఫలితాలు నైరాశ్యాన్నే నింపుతాయి.

ఇంతకీ పోరు ఎవరి మధ్య నడుస్తోంది పొట్టకూటికి తుపాకీ పట్టిన పోలీసులకీ, చెడబారిన వ్యవస్థని సంస్కరిస్తామని ప్రాణాలు పణంగా పెట్టిన ఉద్యమకారులకీ నడుమ యుద్ధం. ఎప్పుడూ పౌర హక్కుల నేతలు, బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఆరోపిస్తారు. అసలు ఎన్‌కౌంటర్‌ మాటే పెద్ద బూటకం. ఎన్‌కౌంటర్‌ అంటే మరణింపబడ్డాడని అర్థం. ట్రిగ్గర్‌ మీద వేలేశాక జాలీ దయ, నీతీ నియమం గుర్తు రావు. రెండు వైపుల నుంచీ విచక్షణా రహితంగానే బుల్లెట్లు దూసుకువస్తాయ్‌.

ఇక్కడి రణ రంగంలో ఎవరు దేశభక్తులో, ఎవరు కాదో తేల్చడం కష్టం. ఈ నేలలో కారుణ్యం ఇంకిపోయింది. ‘‘ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ మావోయిస్టులు దొరికితే మాంఛి వైద్యం చేయించేవాళ్లం’’ అంటూ ఉన్నత పోలీసు అధికారి ఉదారమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇలాంటివి అపహాస్యాస్పదంగా ధ్వనిస్తాయి. ఈ నేల మీద జీసస్‌ ఎవరో జూడాస్‌ ఎవరో గుర్తించడం కష్టంగా ఉంది. అతిరథ మహారథులంతా కలసి పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి జయించిన తీరు అనుక్షణం గుర్తొస్తోంది.

వ్యాసకర్త  శ్రీరమణ, ప్రముఖ కథకుడు
అక్షర తూణీరం


అన్నలు మరణింపబడ్డారు
Sakshi  Updated October 29, 2016 0117 (IST)

http://www.sakshi.com/news/vedika/opinion-on-aob-encounter-by-sri-ramana-416845

(సాక్షి సౌజన్యంతో)

కఠోర విప్లవ జీవితంలోనూ సౌజన్యతను వీడని ఈ వినమ్రమూర్తి ఇప్పుడు కలడో.. లేడో..!



0 comments:

Post a Comment