Pages

Sunday, February 21, 2016

ఇలాంటి 'పరివారం'తో మోదీకే ప్రమాదమట!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, లాయర్ల ముసుగులోని వీధి రౌడీలు, వీరితోపాటు ఢిల్లీ పోలీస్ చీఫ్ ఇంతవరకు అనుసరించిన వైఖరిని దేశం మొత్తం మీద ఒక్క పత్రిక కానీ, ఇతర మీడియా కానీ మద్దతు పలుకుతున్న చిహ్నాలు కనిపించటం లేదు. (హిందూత్వ అనుకూల చానెళ్లూ, గార్దభ గోస్వామి వంటి  వాటి వందిమాగధ యాంకరాగ్రేసరులు తప్ప)

అమెరికాలో నివసిస్తున్న నోమ్ చామ్‌స్కీ వంటి ప్రపంచ స్థాయి మేధావులు వందలాదిమంది జేఎన్‌యూ వ్యవహారంపై తీవ్ర నిరసన తెలుపుతున్నా,  ప్రపంచంలోని అన్ని పత్రికలూ కన్హయ్యా అరెస్టుకు వ్యతిరేకంగా  సంపాదకీయాలు రాసినా కానీ మన ప్రధాని మాత్రం నోరుమెదపకపోవటం ఆలోచనాపరులను దిగ్భ్రాంతిపరుస్తోంది. జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను బలిగొన్న ఘటన కానీ, ఒక చైతన్య శీలి అయిన యువకుడి భవిష్యత్తుతో చెలగాటమాడి జేఎన్‌యూ పరువునే కాకుండా దేశం పరువును కూడా నడిబజారులో నిలబెట్టిన తాజా ఘటన కానీ చెదురుమదురు ఘటనలు మాత్రం కావు. వాటి వెనుక స్పష్టమైన ఎజెండా ఏదో ఉన్నట్లు సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి.

దైవభక్తికి దేశభక్తిని జోడించి ప్రాబల్యం పెంచుకోవాలన్నది బీజేపీ తాజా ప్రయత్నమైతే దాంట్లో భాగంగా చేస్తున్న ఇంత రాద్ధాంతం ఈ ఎత్తుగడను ఫలింపచేస్తుందో కూడా తెలియదు. కానీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనపైన కేంద్ర హోంమంత్రి, హెచ్‌ఆర్‌డీ మంత్రి, పోలీసు బలగం జోక్యం చేసుకొని గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చిన ఫలితం మాత్రం మోదీ ప్రభుత్వాన్ని ఊరికే వదలదంటున్నారు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి గారు.

యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు మోదీని ఆపద్బాంధవుడుగా పరిగణించి ఓట్లు వేసి గెలిపించారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలాగానే మోదీ నేతృత్వంలోని సర్కార్ అన్ని వర్గాలనూ కలుపుకొని పోతుందనీ, సొంత ఎజెండాను పక్కన పెడుతుందనీ ఆశించినవారికి ఇంత త్వరగా భంగపాటు కలుగుతుండటం గుర్తించదగ్గ విషయం.

అప్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన కశ్మీర్ యువత స్మారక సభలు జరుపుకోవడం కొత్త కాదు, కశ్మీర్ స్వాతంత్ర్యం, పాకిస్తాన్ అనుకూల వైఖరి పట్ల వారు నినాదాలు చేయడం కూడా ఈ దేశానికి కొత్త కాదు. ఈసారి జేఎన్‌యూలో అది కాస్త శ్రుతి మించి ఉండవచ్చు. కానీ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఢిల్లీ నడి బొడ్డున నినాదాలు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉండొచ్చు కానీ ఏ పని చేసినా చట్టబద్ధంగా, హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నట్టు కనిపించాల్సిన సున్నిత వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు, దేశభక్తి పూనకం నిండా ఆవహించిన లాయర్లు వ్యవహరించిన తీరు బీజేపీకే అంతిమంగా నష్టదాయకం అంటున్నారీయన..

వాస్తవానికి అప్జల్ గురు ఉరిని నాటినుంచి నేటిదాకా బహిరంగంగా వ్యతిరేకిస్తూ వస్తున్న కశ్మీర్ పీడీపీ అధినేత్రి మొహబూబా ముఫ్తీని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఆమె మంత్రివర్గంలో చేరడానికి నానా తిప్పలు పడుతున్న పాలకపార్టీకి.. వేళ్లమీద లెక్కబెట్టదగిన సంఖ్యలోని విద్యార్థులు -ఉడ్డా ముగ్గురు- అప్జల్ ఉరికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ఇంత రాద్ధాంతం చేయడం అవసరమేనా? అయిదు లక్షల మంది భారత సైనిక బలగాలు నిత్య పహారా కాస్తున్నప్పటికీ కశ్మీరులో వేలాది మంది బహిరంగంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తుండగా, ఆకుపచ్చ జెండా ఎగురవేస్తుండగా అక్కడ ఎవరిపైనా రాజద్రోహ కేసులు పెట్టిన పాపాన పోలేదు.

పైగా దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మూడురంగుల జెండాను ఎగురవేయడం ద్వారా దేశభక్తిని కొత్తగా వర్శిటీ విద్యార్థులకు నేర్పాలనుకుంటున్న రాజకీయ నాయకత్వం చట్టసభల్లోపలా, బయటా ఎంత నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. దేశ ప్రజలపై ఒకే భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నించినా, తాము మాత్రమే దేశ భక్తులమనీ, తక్కినవారంతా దేశద్రోహులనీ అడ్డంగా వాదించినా ఈ దేశ ప్రజలు సహించరు. ఒకే భావజాలాన్ని అందరూ అంగీకరించాలనీ, తమ అభి మాతాన్నే అందరూ శిరసావహించాలని భావించేవారికి భారత సమాజం అర్థం కాలేదని అనుకోవాలి.

సోషల్ మీడియాలో పోస్టింగులను చూసీ, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న అర్ణబ్ గోస్వామి వంటి జర్నలిస్టులను చూసీ అదే సకల జనాభిప్రాయం అని భావిస్తే పొరబాటనీ, పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావజాలం లేని యువత  అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగిందనీ మూర్తిగారంటున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం, జెఎన్‌యూ పరిణామాలు బీజేపీకి ఏమాత్రం మేలు చేయవనీ, కశ్మీర్ ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పడానికీ దోహదం చేయవనీ, పైగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ కంటే, కమ్యూనిస్టులకంటే సొంత పరివారం ద్వారానే ముప్పు తప్పదనీ ఆయన హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి ఆవేశకావేశాలకు తావీయకుండా, సమతుల్యతతో ఆయన ఇవ్వాళ సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో 'త్రికాలమ్‌'లో రాసిన బృహత్ కథనాన్ని కింది లింకులో చదువగలరు.

ఎజెండా వందనం
http://www.sakshi.com/news/opinion/narendra-modi-leading-nda-government-315901

13 comments:

నీహారిక said...

రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని ఎవరైనా క్రొత్త రాజకీయ నాయకులు క్రొత్త రాజకీయం తో వచ్చేదాకా కేసీఆర్ కి గానీ మోడీ కి గానీ ఎటువంటి ప్రమాదమూ రాదు.మీరు బాధపడకండి.

Saahitya Abhimaani said...

"... పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావజాలం లేని యువత అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగిందనీ మూర్తిగారంటున్నారు...."

అంటే మీ పార్టీకి అదే "కామీలకు" నోటా పాటి ఓట్లు రాకపోవటానికి కారణం ప్రజాస్వామ్యమనేనా "మూర్తి గారి" వ్యధ! పాపం. కమ్యూనిస్టులు ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ, Holier than thou యాటిట్యూడ్ తీసుకుంటారో మంరి. ఈ యాటిట్యూడ్ నుంచి బయటపడనంతవరకూ మీరు నోటా కంటే ఓట్లు ఎప్పటికీ రావు. ఒక్కటే తెలుసుకోండి రాజశేఖర రాజుగారూ, (మీకు తెలుసు కానీ ఒప్పుకోలేరు), మీ పిడివాదాలు, వితండవాదాలు, పడికట్టు మాటలూ,ద్వంద్వ ప్రమాణాలూ ప్రజలకు చీకాకు పుట్టించి చాలా కాలం అయ్యింది. దయచేసి బ్లాగుల్లో ఉన్న ఒక "ప్రచార" బ్లాగు పంధాలో పోస్టులు వ్రాయటం మానండి, ఎవ్వరూ నమ్మరు.

Anonymous said...

SIVARAMAPRASAD KAPPAGANTU ji,

commies will never come to power in INDIA, they know it pretty well. They are trying to fool people as before. They wont get votes more than NOTA.

kanthisena said...

శివరామ్ ప్రసాద్ గారూ,
మీ వ్యాఖ్యల పట్ల నేను కాస్త వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నా గత రెండు టపాలలో ప్రస్తావించిన విషయం పూర్తిగా, ప్రధానంగా కన్హయ్య అరెస్టు, తదనంతర పరిణామాల పట్ల చర్చకు సంబంధించిందే కానీ కమ్యూనిజం పట్లో, మతోన్మాదం పట్లో, నోటా పట్లో, సైద్ధాంతిక అంశాల పట్లో చర్చకు సంబంధించింది కాదండి. పైగా రామచంద్రమూర్తిగారి బ్యాలెన్సెడ్ వ్యాసాన్ని కూడా మీరు వివాదాస్పదం చేస్తున్నారు. ఆయన వ్యాసం మొత్తంలో కూడా కమ్యూనిస్టుల ఓట్ల గురించి, ఆ ఓట్లకోసం వారి నానా పాట్ల గురించి కనీస ప్రస్తావన చేయలేదు.

మీరు కన్హయ్య లేదా రోహిత్ వేముల ఉదంతంపై చర్చకు, అభిప్రాయాల షేరింగ్ కు పరిమితమై వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని సలహా. మీరంటున్న కమ్యూనిస్టులతో, వారి ఓట్ల వ్యవహారంతో, వారి పార్లమెంటరీ రాజకీయాలతో నాకెలాంటి సంబంధం లేదు. ఇకపై ఉండదు కూడా. నన్ను ఆ ముగ్గులోకి దింపొద్దు. కన్పయ్యపై చర్చకు, కమ్యూనిస్టులపై ఆరోపణలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని మీరు, వ్యాఖ్యాతలు గ్రహిస్తే ఈ సందర్భంలో ఔచిత్యంగా ఉంటుందనుకుంటున్నాను.

పైగా, "మీ పిడివాదాలు, వితండవాదాలు, పడికట్టు మాటలూ,ద్వంద్వ ప్రమాణాలూ ప్రజలకు చీకాకు పుట్టించి చాలా కాలం అయ్యింది. దయచేసి బ్లాగుల్లో ఉన్న ఒక "ప్రచార" బ్లాగు పంధాలో పోస్టులు వ్రాయటం మానండి, ఎవ్వరూ నమ్మరు." అని నా బ్లాగులో నాకు నచ్చిన వ్యాసం రాసుకునే స్వేచ్చపై కూడా మీకు మీరుగా తీర్పు ఇచ్చేస్తున్నారు. మీ వ్యాఖ్య తర్వాత కూడా.. నాది ప్రచార బ్లాగు కాదనే అనుకుంటున్నాను. ఇకమీదట కూడా కన్హయ్య వ్యవహారం పరిష్కారమయ్యేంత వరకు నా పరిశీలనలోకి వచ్చిన అంశాలపై నా అభిప్రాయాన్ని తప్పకుండా నమోదు చేస్తాను. ఆ విషయంలో మీరెంత చర్చ చేసినా స్వాగతం.

కమ్యూనిజంపై, దాని బాగోగులపై, దాని వైఫల్యాలపై చర్చను తప్పకుండా షేర్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఇది సందర్భం కాదని నేను అనుకుంటున్నాను.

ఒక విద్యార్థి నాయకుడి భవిష్యత్తును అన్యాయంగా, చట్టవిరుద్ధంగా ధ్వసం చేయడానికి గత పది రోజులుగా జరుగుతూ వస్తున్న పరిణామాలపై నా స్పందనను, ఇతరుల స్పందనను మాత్రమే నా బ్లాగులో పొందుపరుస్తున్నాను. మీకు దీనిపై విభేదముంటే తప్పక చర్చిద్దాం. ఈ కోణంలోనే రామచంద్రమూర్తిగారి పూర్తి వ్యాసాన్ని మరోసారి నేను ఈ టపాలో పొందుపర్చిన లింకులో చదవాలని అభ్యర్థన.

దేశ ప్రజలు తనపై పెట్టుకున్న అపార నమ్మకాన్ని మోదీ తన మౌనం ద్వారా తనకు తానే దెబ్బతీసుకుంటున్నారని, మోదీ పరివారమే తనకు ప్రమాదం కలిగిస్తోందని చాలా పాజిటివ్‌గా మూర్తి గారు రాశారు. పైగా అత్యంత సీనియర్ జర్నలిస్టుగా ఆయన ఏ పార్టీకీ వ్యతిరేకీ కాదు, అనుకూలుడూ కాదు. ఆయన ప్రస్తావించని దానిని ఆయనకు ఆపాదించకపోతే బాగుంటుంది. పరిశీలించండి.

మన మధ్య భావజాలపరంగా తీవ్ర విభేదం ఉంది. కాదనను. దాన్ని పక్కన బెట్టి.. చందమామ పత్రికతో పరిచయమైన మన వ్యక్తిగత స్నేహం ఇలాంటి చర్చల ద్వారా దెబ్బతినకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగని మనమధ్య చర్చలే ఉండకూడదని, అభిప్రాయ భేదాలు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. కాని ఆ చర్చ సంబంధిత విషయం పట్ల మాత్రమే జరిగితే బాగుంటుందన్నదే నా అభిప్రాయం. మన పూర్వ పరిచయానికి సంబంధించిన ఈ విషయం ఇక్కడ ప్రస్తావించకపోతేనే బాగుంటుంది కాని, ఇతర అంశాలలో మన అభిప్రాయాలకు నష్టం జరగకూడదనే మీతో ఇక్కడే పంచుకుంటున్నాను. అన్యధా భావించరని తలుస్తున్నా.

వెలివేతలు, మడి దడులు, అంటు, బహిష్కారాలు వంటి వాటికి ఇంతవరకు నేను దూరంగానే ఉన్నాను. పైగా అవంటే నాకు అసహ్యం కూడా. మీరు కూడా ఇదే పంథాను అనుసరిస్తారని ఆశిస్తూ..

మీ స్పందనకు ఇదే నా ఆహ్వానమండీ.

kanthisena said...

నీహారిక గారూ,
రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తాన్ని ప్రక్షాళన చేయడంపై మీ చిన్న వ్యాఖ్య నాకు అర్థం కాలేదు. మీరన్నట్లు కొత్త రాజకీయ నేతలు కొత్త రాజకీయంతో వచ్చినా సరే మరో వందేళ్లదాకా రిజర్వేషన్లు అవెంత లోపభూయిష్టంగా ఉన్నా సరే.. కొనసాగుతాయని నేననుకుంటున్నాను.

ఇక పోతే, కేసీఆర్, మోదీకి ప్రమాదం రావడం, రాకపోవడంపై నాకే బాధా లేదండీ. వీరికి ఉన్న ప్రజాకర్షణ.. ప్రజలు తిరగబడితే దూదిపింజల్లా ఎగిరిపోతుంది. ఒక చరిత్ర మలుపులో వీరు అధికారంలోకి వచ్చారు.. దాని అవసరం తీరగానే వారు అంతే సహజంగా నిష్క్రమిస్తారు. మనకంటే వారికే ఆ విషయం బాగా తెలుసనుకుంటాను.

వ్యాఖ్యకు ధన్యవాదాలు

Saahitya Abhimaani said...

నేనింతవరకూ నా వ్యాఖ్యల్లో మన స్నేహం గురించి ప్రస్తావన చెయ్యలేదు. మీరెందుకు చేస్తున్నారు! ఆశ్చర్యంగా ఉన్నది. మీరు, నేను ఇప్పటికే మనకున్న కామన్ అభిరుచి (Chamdamama Magazine)వల్ల స్నేహితులం. కామన్ కాని విషయాల్లో ఎవరి భావాలు వాళ్ళవి.

ఒక్క విషయం చెప్పండి, ఈ కన్హయ్ కుమార్ AISF మనిషి కాకుండా ఉండి ఉంటే మీరు ఇంతంత పొడుగాటి వ్యాసాలు ప్రచురించి వెనకేసుకు వచ్చేవారా చెప్పండి. ఉదాహరణకి కమ్యూనిస్టులు చేస్తున్న అరాచకాల గురించి మీరు ఎప్పుడన్న ఒక్క వ్యాసం వ్రాసి ఎండగట్టే ప్రయత్నం చేశారా. నేను ఒక లింకు ఇచ్చాను. చూడండి ఒకసారి.

Thjen see the following quoted by you:
"... పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావజాలం లేని యువత అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగిందనీ మూర్తిగారంటున్నారు...."

This is the comment which prompted me to respond. I do not find the comment in any manner dispassionate and impartial. Does Mr Murty mean that a common Citizen cannot vote without having some ideological affiliation!? That is what you think is democracy?

నీహారిక said...

>>పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావజాలం లేని యువత అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే .....<<<

అలాగయితే మంచిదే కదా ? మా పిల్లలను కులం పేరు చెప్పుకోకుండా ఇంటర్ వరకూ పెంచాం. ఇంటర్ కొచ్చాక మన కులం ఏమిటని మా అబ్బాయి అడిగాడు. కన్హయ్,సుశీల్ కుమార్ లాంటివాళ్ళ వల్లే కులం ప్రస్థావన వస్తున్నది. ఎవరైనా సరే కులం ప్రస్థావన తేకపోతేనే అందరికీ మంచిది. కాలేజీల్లో రాజకీయాలేమిటండీ ?

>>మరో వందేళ్లదాకా రిజర్వేషన్లు అవెంత లోపభూయిష్టంగా ఉన్నా సరే.. కొనసాగుతాయని నేననుకుంటున్నాను.<<<
ఇప్పటికే వెనకబడి ఉన్నాం. వందేళ్ళ వరకూ ఇంకా కులాలు పోకూడదని అనుకుంటున్నారా ?

kanthisena said...

శివరాం గారూ,
మీరు ఒక విషయంలో పొరపాటు పడ్డారు.
"ఈ కన్హయ్ కుమార్ AISF మనిషి కాకుండా ఉండి ఉంటే మీరు ఇంతంత పొడుగాటి వ్యాసాలు ప్రచురించి వెనకేసుకు వచ్చేవారా చెప్పండి. ఉదాహరణకి కమ్యూనిస్టులు చేస్తున్న అరాచకాల గురించి మీరు ఎప్పుడన్న ఒక్క వ్యాసం వ్రాసి ఎండగట్టే ప్రయత్నం చేశారా."

కమ్యూనిస్టు సిద్ధాంతం కంటే భారత కమ్యూనిస్టుల ఆచరణపై వారి పార్లమెంటరీ రాజకీయ పంథాపై, పాలకపార్టీలతో పొత్తుల కోసం అవి పడుతున్న పాట్లపై మీరంటున్నదానికింటే ఎక్కువమోతాదులోనే నాకు తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను చాలా కాలం క్రితమే అంటే నాలుగయిదేళ్ల క్రితమే ఈ బ్లాగులోనే పొలిట్ బ్యూరో కమ్యూనిజం గురించి ఒక పెద్ద వ్యాసమే రాశాను. ఇది ప్రధానంగా రాజకీయ ప్రచార బ్లాగు కాదు కాబట్టి ఏ రాజకీయాల గురించి కూడా ఇంతవరకు ఇక్కడ విమర్శనాత్మకంగా చర్చించిది లేదన్నది వాస్తవం. అంతే కానీ కమ్యూనిస్టులు పట్ల నాకేదో వీరారాధన ఉండటం, వారి వ్యతిరేక సిద్ధాంతుల పట్ల వీర వ్యతిరేకత ఉండటం ఇక్కడ చర్చనీయాంశం కాదు.

అంతకుమించి నా మూలం బాల్యంలో జనసంఘ్ కార్యకలాపాలతో మొదలై తదనంతరం కమ్యూనిస్టు ఆచరణ వరకు ప్రయాణించిన విషయం మీకు గతంలోనే చెప్పాననుకుంటాను. కమ్యూనిస్టు సిద్ధాంత స్ఫూర్తితో ప్రపంచాన్ని పరిశీలించడం, దానిి ఆచరణలో జరుగుతున్న తీవ్ర పొరపాట్లకు ఖేదపడటం నేనెప్పటికీ దాచుకోలేదు.

కన్హయ్య కుమార్ ఏఐఎస్ఎఫ్ కాబట్టి నేను ఇంత చర్చ మొదలెట్టలేదండీ.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసి ఏం సాధించదలిచారనే కోణంపైనే నా దృష్టి ఉంది. అసలు కన్హయ్య కుమార్ వెలిబుచ్చిన కొన్ని అంశాలపై కూడా నాకు సూత్రబద్ధంగా విభేదం ఉంది. కాని అవి ఇక్కడ చర్చనీయాంశం కాదు.

కామన్ అభిప్రాయాలు, అభిరుచుల పట్ల మీ వ్యాఖ్య పట్ల నాకు పూర్తి ఏకీభావమే.

ధన్యవాదాలు

Saahitya Abhimaani said...

నేను పొరబాటు పడలేదు రాజుగారూ. మీరు సవ్యంగా అర్ధం చేసుకోలేదు. మీరు చిన్నప్పుడు జనసంఘలో ఉండి ఉండవచ్చు, ఆ తరువాత మీ దృష్టిలో "ఉద్యమ" పార్తీలోకీ వెళ్ళి అక్కడ మీకు ఇవ్వబడ్డ పనులు చేసి ఉండవచ్చు. ఒక్కటే ఒక్క విషయం, ఒక వ్యక్తిని తెలియకుండా తప్పు చేశాడని ఆరోపించి, ఆ తప్పు చేశాడా లేదా విచారించకుండా శిక్షించటం ఎంతటి తప్పు అని మీరు, ఒక విషయాన్ని సవ్యంగా చెప్పలేని ప్రజాశక్తి పొగరుబోతు హెడ్డింగ్ పెట్టిన వాళ్లకి కూడా చెప్పవలసిన విషయం ఏమంటే (వీళ్ళ దృష్టిలో వీళ్ళ దృక్పధంలో లేనివాళ్ళు హిట్లర్లు వాళ్ళని నోరుముయ్యమని అనేయ్యటం గొప్పగా భావించుకునే సంకుచితులు) తప్పు చేశాడో లేదో తెలియకుండా వెనకేసుకు రావటం, నిర్దోషి అని డప్పులు కొట్టటం అది కూడా మీ పార్టీ వాడైతే మరీ ఎగబడి ఈ డప్పులు కొట్టటం కూడా తప్పే. తప్పు చేసాడని ఆరోపణ మాత్రమేగా చెయ్యబడింది! నిరూపించబడితే అప్పుడు శిక్ష పడుతుంది. అప్పటివరకూ చట్టం దృష్టిలో నిర్దోషి అని ప్రేజ్యూం చేస్తారు. మీరు మళ్ళీ అరిచి అల్లరిచేసి, అనువాదాలు చేసి చెప్పక్కర్లేదు. దేశానికి ఒక చట్టం ఉన్నది, ఒక పోలీసు వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ తన పని చేస్తున్నప్పుడు, కాళ్ళా చేతులా అడ్డం పడటం పైగా ఆ పనికి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకోవటం (హ్యూమన్ రైట్స్ వంటి మాటలు చెడవాడి ఆ మాటకు అర్ధం నక్సలైట్ రైట్స్, లేదా నేరస్తుల రైట్సుగా మార్చినది ఎవరో మరొక్కసారి నేను చెప్పాల్సిన పని లేదు కదా) అలవాటుగా చేస్తున్న తప్పు పని. కన్హాయా కుమార్ తప్పుచేయ్యలేదు అని నిరూపించుకుంటే హాయిగా తల పైకేట్టుకు బయటకు వస్తాడు. భయమేమీ లేదు. మన న్యాయవ్యవస్థ మీరు చూపిద్దామనుకున్నంత చెడ్డగా లేదు రాజు గారూ.

Anonymous said...

Raja Sekhar Garu
మన దేశ కమ్యూనిస్ట్లకు అసలో సూత్రబద్ధమైన సిద్ధాంతం ఏమైనా ఉందని మీరనుకుంటున్నారా? లేకపోతే ఆచరణ సాధ్యం కానంతగా ఉండటంతో ఈ విధమైన పరిస్థితి ఉందనుకుంటున్నారా? వీడు తంతే వాడి దగ్గరా, వాడు తంతే వీడి దగ్గరా జేరి రెండు మూడు ముష్టి సీట్ల కోసం వెంపర్లాడటం తప్ప వీళ్ళు చేసింది గానీ, చేయ గలిగింది గానీ ఏమన్నా ఉందా? వీళ్ళే విధంగా ఆ రెండు ముదనష్టపు పార్టీల కన్నా మెరుగైన వాళ్ళో చెప్పగలరా? వాళ్ళలో ఒక్కడైనా నిజాయితీ, నిబద్దత కలిగిన పురుషోత్తముడున్నాడా? రాజకీయ వ్యాపారుల్లో, వ్యభిచారుల్లో వాళ్ళదో ముఠా. అంతే. కాదంటారా?

నీహారిక said...

దేశానికి ఒక చట్టం ఉన్నది, ఒక పోలీసు వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ తన పని చేస్తున్నప్పుడు, కాళ్ళా చేతులా అడ్డం పడటం పైగా ఆ పనికి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకోవటం (హ్యూమన్ రైట్స్ వంటి మాటలు చెడవాడి ఆ మాటకు అర్ధం నక్సలైట్ రైట్స్, లేదా నేరస్తుల రైట్సుగా మార్చినది ఎవరో మరొక్కసారి నేను చెప్పాల్సిన పని లేదు కదా) అలవాటుగా చేస్తున్న తప్పు పని. కన్హాయా కుమార్ తప్పుచేయ్యలేదు అని నిరూపించుకుంటే హాయిగా తల పైకేట్టుకు బయటకు వస్తాడు. భయమేమీ లేదు. మన న్యాయవ్యవస్థ మీరు చూపిద్దామనుకున్నంత చెడ్డగా లేదు రాజు గారూ."

అబ్బ ఛా... అద్వానీ కేసులోనూ,జయలలిత కేసులోనూ,జగన్ కేసులోనూ,చంద్రబాబు ఓటుకు నోటు కేసులోనూ,చట్టం ఎంతబాగా పనిచేస్తున్నదీ మర్చిపోలేం...ఎంత రొమాంటిక్ గా చెప్పారో ?

Anonymous said...

నిహారిక, మన న్యాయవ్యవస్థ లోపాలున్నాయని చెపుతున్నారు కదా! మరి దానిని తీసి ఖఫ్ పంచాయితి లు ఏర్పాటు చేసుకొంటే బాగుంటుందా?

నీహారిక said...

ఎవరి పని వారు సక్రమంగా చేస్తే ఏ పంచాయితీ అవసరం ఉండదు.ఇదివరకు న్యాయ విధ్య చదివితే చాలా గొప్పగా ఫీలయ్యేవారు.ఇప్పటికీ న్యాయ స్థానాల్లో న్యాయం అందించడానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుందో అర్ధం కాదు.న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే అప్జల్ గురు,కసబ్ లాంటివాళ్ళు తయారు కారు.వ్యవస్థలో లోపం పెట్టుకుని వ్యక్తులను శిక్షించాలనడం రొమాంటిక్‌గా లేదూ ?

Post a Comment