Pages

Monday, February 22, 2016

దేశభక్తికి కొత్త నిర్వచనమిచ్చిన కన్హయ్య ప్రసంగం

దాదాపు 20 ఏళ్ల ఉద్యమ జీవితం నుంచి బయటకు వచ్చి వృత్తి జీవితంలో స్థిరపడిన తర్వాత గత 13 సంవత్సరాల నా బహిరంగ జీవితంలోనే అత్యంత శక్తివంతమైన, భావస్ఫోరకమైన. తాత్విక స్థాయి కలిగిన ఒక గొప్ప కథనాన్ని (ప్రసంగపాఠం) నేటి తెల్లవారుజామున తెలుగులో చదివాను. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ రాజద్రోహం ఆరోపణలపై అరెస్టు కావడానికి ముందు జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన హిందీ పాఠానికి తెలుగు సేత. అగ్నిసదృశమైన పదాలతో మాటల మంత్రజాలంతో ఈ దేశ వాస్తవ పరిస్థితిపై అత్యద్భుతమైన శైలితో కన్హయ్య మాట్లాడిన మాటలివి.

"దేశభక్తి గురించి ఎవరితోనో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం.. మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం.... మా దృష్టిలో దేశభక్తి అంటే ఇదే. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్‌ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్‌ విషయంలో జరిగినట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అని కోరే వాళ్లం మేం. ప్రపంచ మానవత వర్ధిల్లాలి. భారత మానవత వర్ధిల్లాలి అని మేమంటాం. మానవత్వానికి వ్యతిరేకంగా నిలబడిందెవరో మేం గుర్తించాం....  మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనుషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం."

సమాజాన్ని కులంతోనూ, మతంతోనూ చీలుస్తున్నవారు అత్యున్నత విద్యాసంస్థలైన యూనివర్శిటీల్లో కూడా కుల, మత, మనువాద తత్వాలను పెంచి పోషించాలని సర్వశక్తులు ప్రయోగిస్తున్న తరుణంలో, కన్హయ్య చేసిన మెరుపు ప్రసంగం ఈ దేశ ప్రజల నిజమైన వాణికి అచ్చమైన ప్రతిబింబం. జేఎన్‌యూ విశ్వవిద్యాలయ భావ, తాత్విక సంవేదనను మహత్తరమైన రీతిలో వ్యక్తీకరించిన కన్హయ్య కుమార్ ప్రసంగ పాఠంలోని విషయంతో మనం ఏకీభవించవచ్చు లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు. కానీ వ్యవస్థీకృతమైన అధికార అహంకారానికి బలైన ఒక చైతన్య యువకుడి ఆత్మ నివేదనను ఈ ప్రసంగ పాఠం కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కుహనా దేశభక్తి, నిర్బంధ జాతీయవాద సులోచనాల్లోంచి కాకుండా సరిగ్గా దానికి వ్యతిరేక కోణంలోంచి ఈ దేశాన్ని చూస్తే ఎలా ఉంటుందో చూపడానికి ఈ ప్రసంగ పాఠం ఓ ప్రత్యక్ష నిదర్శనం.

తెలుగులో ఏ ప్రధాన మీడియా కూడా ఇంత భావస్ఫోరకమైన ప్రసంగాన్ని ప్రచురించలేకపోవడం నిజంగా బాధాకరం. గత నాలుగు రోజులుగా దీన్ని అనువదించి సాక్షి పత్రిక సంపాదక పేజీలో ప్రచురించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. గత వారం రోజులుగా సాక్షిలో జేఎన్‌యూ ఘటనల పరంపరపై సాక్షిలో పలువురు కాలమిస్టులు వరుసగా తమ అభిప్రాయాలను ప్రచురిస్తుండటమే దీనికి కారణం. కాలమిస్టుల స్పందనలకు అదనంగా ఇంత పెద్ద ప్రసంగ పాఠం ప్రచురించడానికి తగిన స్పేస్ సాక్షి సంపాదక పేజీలో లేకపోయింది.

తెలుగులో ప్రధాన మీడియా దాదాపుగా విస్మరించిన  ఈ నేపథ్యంలో ప్రజాశక్తి పత్రిక కన్హయ్య ప్రసంగ పాఠాన్ని బాధ్యతగా భావించి "మనువులూ, హిట్లర్‌లూ, గోబెల్స్‌లూ! కాస్త నోళ్లు మూసుకుంటారా" అనే శీర్షికతో అచ్చు వేయడం అభినందనీయం.

ప్రజాశక్తి పత్రికలో జి.వి.కె ప్రసాద్ చేసిన తెలుగుసేత మూలంలోని భావ గాఢతకు తీసిపోనివిధంగా కుదిరింది. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న ఇంత మంచి ప్రసంగాన్ని సారాంశం చెక్కుచెదరకుండా అనువదించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాశక్తిలో వచ్చిన వ్యాసాన్ని యధాతథంగా (కొన్ని అచ్చుతప్పులను సవరించడం మినహా) ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను. ఇది బ్లాగర్ల కోసం మాత్రమే కాకుండా... నాకోసం, భవిష్యత్తులో కూడా పదే పదే నేను మననం చేసుకోవడానికి వీలిచ్చే అపురూప జ్ఞాపికగా దీన్ని నేను సొంతం చేసుకుంటున్నాను.

మీరూ చదవండి. చదివి ఇష్టమున్నా లేకున్నా కన్హయ్య ప్రసంగపాఠాన్ని వీలైనంతమందికి షేర్ చేయండి. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే వేద పాఠం కూడా 'చీకట్లను తొలగించుకుని కాంతి ఉద్భవించుగాక' అనే చెబుతోంది. ఇది జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం కూడా. చివరగా..  "వందపుష్పాలను వికసింపనివ్వండి. వేయి భావాలను వెదజల్లనివ్వండి.."

గమనిక: కన్హయ్య కుమార్ జేఎన్ యూలో విద్యార్థుల ముందు చేసిన ఈ ప్రసంగంలో రాజద్రోహ జాడలు ఉన్నాయని కనిపెట్టిన కేంద్రప్రభుత్వం వెంటనే ఆయనపై రాజద్రోహ ఆరోపణలు మోపి జైలుకు పంపింది. తదనంతర పరిణామాలు మనకందరికీ తెలిసినవే. సెడిషన్ అనే ఆంగ్లపదానికి రాజద్రోహం సరైన అనువాదం కాగా పనిగట్టుకుని మరీ దాన్ని దేశద్రోహం అని మార్చివేసి అటు పాలకులూ ఇటు దాని మీడియా తొత్తులూ చేసిన భావోద్వేగ ప్రేరిత దుష్ప్రచారం కారణంగా ఒక విద్యార్థి నేడు మనందరిముందూ దేశద్రోహిగా నిలిచాడు. ఇదీ నేటి భారతం. మౌన బాబా మోదీగారూ, మీ పాలన ఎంత ధర్మబద్ధంగా కొనసాగుతోందో వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా?
................................


('రాజద్రోహం' ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడానికి కొద్ది ముందు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటర్నెట్‌పై యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం. ప్రేక్షకుల చప్పట్ల మూలంగా అక్కడక్కడ వినబడని భాగాలు మినహాయిస్తే, ఇది ఆయన హిందీలో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం. జేఎన్‌యూ విద్యార్థుల 'దేశభక్తి' విషయంలో మతతత్వ శక్తులు సాగిస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో కన్నయ్య కుమార్‌ ప్రసంగమే అనేక ప్రశ్నలకు జవాబు చెబుతుందని భావించి దాన్ని యదాతథంగా ప్రచురిస్తున్నాం - ప్రజాశక్తి సంపాదకులు)

"...వాళ్లు త్రివర్ణ పతాకాన్ని కాలబెట్టే వాళ్లు. బ్రిటిష్‌ వాళ్లను క్షమాభిక్ష వేడుకున్న సావర్కర్‌కు శిష్యులు వాళ్లు. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్‌ ప్రభుత్వం వాళ్లదే. ఈ ప్రభుత్వం షహీద్‌ భగత్‌సింగ్‌ పేరుతో ఉన్న విమానాశ్రయానికి ఒక 'సంఘీయుడి' పేరు పెట్టింది. వీళ్లా మాకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పేది? దేశం గురించి, దేశభక్తి గురించి ఆర్‌ఎస్‌ఎస్‌తో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం.... మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం. మా దృష్టిలో దేశభక్తి అంటే ఇదే. మాకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే వాళ్లను మేం సహించబోమని కూడా స్పష్టం చేస్తున్నాం. 'సంఘీయులే' కానివ్వండి, లేదా మరెవరైనా సరే...

అయితే, 'ఝండేవాలా' (ఆర్‌ఎస్‌ఎస్‌ ఢిల్లీ కార్యాలయం)లో, 'నాగపూర్‌' (ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం)లో నిర్వచించే రాజ్యాంగంపై మాత్రం మాకెలాంటి విశ్వాసం లేదు! మాకు మనుస్మతిపై ఎలాంటి విశ్వాసం లేదు. ఈ దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థపై మాకు విశ్వాసం లేదు! అట్లాగే, ఇదే రాజ్యాంగంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 'రాజ్యాంగ పరిహారం' గురించి కూడా చెప్పారన్న విషయం మరచిపోవద్దు. మరణశిక్షను రద్దు చేయాలని కూడా అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారన్న విషయం మర్చిపోవద్దు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆయన సర్వోన్నత స్థానం ఇచ్చారన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నింటితో సహా, మన మౌలిక హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను నిలబెట్టుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.

కానీ ఈరోజు ఏబీవీపీ తనకున్న మీడియా అండతో ఈ విషయాన్ని పూర్తిగానే తారుమారు చేయడం చాలా సిగ్గుచేటు.. బాధాకరం కూడా. విషయాన్ని అది పూర్తిగా నీరు గారుస్తోంది. నిన్న ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ, 'మేం ఫెలోషిప్‌ కోసం పోరాడుతామ'ని చెప్పాడు. ఎంత హాస్యాస్పదం ఇది! ఇప్పటికే వీళ్ల ప్రభుత్వం, మేడం 'మను'స్మతి ఇరానీ ఫెలోషిప్‌లు లేకుండా చేసేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్లో వీళ్ల ప్రభుత్వం 17 శాతం కోత విధించింది. దాంతో మన హాస్టళ్లు గత నాలుగేండ్లుగా అఘోరిస్తున్నాయి. మనకు వై-ఫై లభ్యం కాలేదు. బీహెచ్‌ఈఎల్‌ ఒక బస్సునివ్వగా, దాంట్లో చమురు పోయడానికి అధికారుల వద్ద డబ్బు లేదు! ఏబీవీపీ వాళ్లు మాత్రం మేం హాస్టళ్లు నిర్మింపజేస్తామని, వై-ఫై తెప్పిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

మిత్రులారా! ఈ దేశంలో మౌలిక ప్రశ్నలపై చర్చ ప్రారంభిస్తే వీళ్ల ముసుగు తొలగిపోతుంది. మేం మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకు గర్విస్తున్నాం. వాటిపై చర్చ చాలా అవసరం...జేఎన్‌యూలో జెహాదీలున్నారని సుబ్రమణ్యస్వామి అన్నాడు. జేఎన్‌యూ వాళ్లు హింసను వ్యాపింప జేస్తున్నారని అంటున్నారు. నేనీ జేఎన్‌యూ గడ్డ మీది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలను సవాల్‌ చేస్తున్నాను. రండి, మాతో వాదించండి! మేమసలు 'హింస'కు సంబంధించిన మౌలిక అవగాహనపైనే చర్చ చేయాలనుకుంటున్నాం. 'ఖూన్‌ సే తిలక్‌ కరేంగే, గోలియోంసే ఆరతీ' (నెత్తుటితో తిలకం దిద్దుకుంటాం, తుపాకీ గుళ్లతో హారతి) అని ఏబీవీపీ వాళ్లు చేస్తున్న నినాదాల గురించి కూడా మాట్లాడుకుందాం రండి. ఈ దేశంలో మీరెవరెవరి రక్తం పారించాలను కుంటున్నారో చెప్పండి. ఎవరిపై తూటాలు పేల్చాలనుకుంటున్నారో చెప్పండి. అవును, మీరు తుపాకీ గుళ్లు కురిపించారు... బ్రిటిష్‌ వాళ్లతో చేయి కలిపి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే వాళ్లపై గుళ్లు కురిపించారు. దేశంలో పేదరికంతో, ఆకలితో పీడితులైన వాళ్లపై మీరు గుళ్లు కురిపించారు. మీరు ముస్లింలపై గుళ్లు కురిపించారు.

మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తే, 'ఐదు వేళ్లు సమానమవుతాయా' అని మీరంటారు. మహిళలు 'సీత' లాగా ఉండాలని, అగ్నిపరీక్షకు దిగాలని మీరంటారు. ఈ దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం కదా! ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కుండాలి కదా! విద్యార్థులైనా, ఉద్యోగులైనా, పేదలైనా, కార్మికులైనా, రైతులైనా... అంబానీ అయినా, అదానీలైనా అందరికీ హక్కులు సమానమే కదా! కానీ మహిళల సమాన హక్కుల గురించి మాట్లాడితే, భారతీయ సంస్క తిని నాశనం చేయాలనుకుంటున్నారని మీరు గొంతు చించుకుంటారు.

నిజమే, మేం మీ దోపిడీ సంస్కతిని నిజంగానే నాశనం చేయాలనుకుం టున్నాం! మీ కులతత్వ సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం. మీ మనువాద సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం. అసలు సంస్కృతికి నిర్వచనాన్నే మార్చాలని మేమంటున్నాం. అసలు వీళ్లకు సమస్య ఎక్కడొస్తోంది? మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీరికి కడుపుమంటగా ఉంది. 'లాల్‌ సలాం'తో పాటు 'నీలా సలాం' అని మనం నినదిస్తే, మార్క్స్‌తో పాటు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గురించి మనం మాట్లాడితే వీరికి మింగుడు పడకుండా ఉంది.... కుట్ర వీళ్లదే. వీళ్లసలు బ్రిటిష్‌ వాళ్ల తొత్తులు! కావాలంటే నాపై పరువు నష్టం కేసు పెట్టుకోండి. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రే బ్రిటిష్‌ వాళ్లతో కుమ్మక్కయిన చరిత్రని మళ్లీ మళ్లీ అంటాను! ఈ దేశద్రోహులు మనల్ని దేశభక్తి సర్టిఫికేట్‌ చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నా మొబైల్‌ను పరిశీలించండి మిత్రులారా! మా తల్లిని నానా రకాల బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. వీళ్లేనా భారతమాత గురించి మాట్లాడేది ఒకవేళ మీరు చెప్పే 'భారతమాత'లో నా తల్లి భాగం కాకపోతే నేను 'భారతమాత' అనే మీ అవగాహనను నేనంగీకరించను. నా తల్లి ఆంగన్‌వాడీ సేవకురాలిగా పని చేస్తోంది. రూ. 3,000లతో మా కుటుంబం బతుకుతోంది. ఆమెను వీళ్లు బూతులు తిడుతున్నారు. వీళ్ల 'భారతమాత' నినాదానికి నేను సిగ్గు పడుతున్నాను. ఈ దేశంలో ఉన్న నిరుపేద, దళిత, రైతుకూలీల తల్లులెవరూ వీళ్ల 'భారతమాత' పరిధిలోకి రారు. నేనంటాను 'జై'! దేశంలోని మాతలందరికీ జై! తండ్రులందరికీ జై! అక్కాచెల్లెండ్లకు జై! రైతుకూలీలకు, కార్మికులకు, ఆదివాసీలకు, దళితులకు జై! వాళ్లకు ఇలా అనే దమ్ముందా ఉంటే అనమనండి. 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని అనమనండి వీళ్లను. 'భగత్‌సింగ్‌ జిందాబాద్‌' అనమనండి. 'సుఖ్‌దేవ్‌ జిందాబాద్‌' అనమనండి. 'అష్ఫాఖుల్లా ఖాన్‌ జిందాబాద్‌' అనమని అనండి. 'బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జిందాబాద్‌' అనమనండి.

బాబా సాహెబ్‌ 125వ జయంతి పేరుతో మీరాడిందంతా నాటకం! మీకు ధైర్యముంటే, బాబాసాహెబ్‌ చెప్పినట్టుగా ఈ దేశంలో కులవాదమే అతి పెద్ద సమస్య అని ఒప్పుకోండి. కులతత్వం గురించి మాట్లాడండి. రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ అమలు చేయండి.... అప్పుడు నమ్ముతాం మీకు ఈ దేశంపై విశ్వాసం ఉందని. అసలు దేశమంటే ఏమిటి? దేశమంటే మనుషులు! దేశం గురించిన మీ అవగాహనలో పేదలకు, నిస్సహాయులకు, రైతుకూలీలకు, ఆదివాసులకు, దళితులకు చోటే లేదు. నేను నిన్నొక టీవీ డిబేట్‌లో మాట్లాడాను. దీపక్‌ చౌరాసియాతో చెప్పాను. ఇది చాలా సీరియస్‌ సమయం అనే విషయం గుర్తుంచుకోండని అన్నాను. దేశంలో పడగ విప్పుతున్న ఫాసిజంతో మీ మీడియాకు కూడా ముప్పేనని చెప్పాను. ఇకపై మీక్కూడా సంఘ్ కార్యాలయం నుంచే స్క్రిప్టులు వస్తాయని అన్నాను. సరిగ్గా ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి వచ్చినట్టుగానే.

కొంత మంది మీడియా వాళ్లు అంటున్నారు. మా పన్నులతో, సబ్సిడీ డబ్బులతో జేఎన్‌యూ నడుస్తుంది అని. అవును నిజమే! అనుమానమేమీ లేదు. కానీ అసలు విశ్వ విద్యాలయాలు ఉన్నది దేని కోసం అని మేమడుగుతున్నాం. విశ్వవిద్యాలయాలుండేది సమాజంలోని 'కామన్‌ కాన్సెన్స్‌' (సామూహిక చేతన)ను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికే. అవి ఆ పని చేయకపోతే దేశమే సరిగా నడవదు. అలాంటి దేశం కేవలం పెట్టుబడిదారులకు నెలవుగా మాత్రమే మిగిలిపోతుంది. దోపిడీ, పీడనలకు మాత్రమే ఆలవాలంగా మారిపోతుంది. దేశ ప్రజల సంస్కృతి, విశ్వాసాలకు, హక్కులకు స్థానం లేనప్పుడు అసలు దేశం అనే మాటలో అర్థమే లేదు.

మేం ఈ దేశంతోపాటుగా సంపూర్ణంగా నిలబడి ఉన్నాం. భగత్‌సింగ్‌, బాబాసాహెబ్‌ కన్న కలల కోసం నిలబడి ఉన్నాం. అందరికీ సమాన హక్కులుండాలన్న అవగాహనతో నిలబడ్డాం. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్‌ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్‌ విషయంలో జరిగినట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అని కోరే వాళ్లం మేం. ప్రపంచ మానవత వర్ధిల్లాలి. భారత మానవత వర్ధిల్లాలి అని మేమంటాం. మానవత్వానికి వ్యతిరేకంగా నిలబడిందెవరో మేం గుర్తించాం. మనువాదం, కులవాదం.. బ్రాహ్మణ వాదంతో కుమ్మక్కయిన పెట్టుబడిదారీ విధానం - ఇవే మానవత్వానికి శత్రువులు. వీటి ముఖాలను బట్టబయలు చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన స్వాతంత్య్రం దేశంలో నెలకొల్పాలి. ఆ స్వాతంత్ర్యం రాజ్యాంగం ద్వారానే వస్తుంది. పార్లమెంటు ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యం ద్వారా వస్తుంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన మధ్య ఎన్ని విభేదాలున్నా, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, రాజ్యాంగం కోసం, దేశ సమగ్రత కోసం మనందరం ఐక్యంగా నిలబడదాం. సంఘీయులే మన దేశాన్ని చీలదీసే శక్తులు... ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులు.

ఇక చివరి ప్రశ్న. కసాబ్‌ ఎవరు? అఫ్జల్‌ గురు ఎవరు? శరీరాలపై బాంబులు కట్టుకొని హత్యలు చేయడానికి సిద్ధపడుతున్న ఆ పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నను విశ్వ విద్యాలయాల్లో చర్చించకపోతే అవి ఉండీ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. హింసను కూడా నిర్వచించుకుందాం. హింస అంటే ఏమిటి తుపాకీ తీసుకొని ఒకరిని చంపడమే హింస కాదు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే అది కూడా హింసే అవుతుంది. ఇది వ్యవస్థీకృత హింస. న్యాయం అంటే ఏమిటి? దీనిని నిర్ణయించేదెవరు? బ్రాహ్మణవాద వ్యవస్థలో దళితులకు మందిరంలోకి ప్రవేశం లేదు. ఆనాడు అదే న్యాయం. బ్రిటిష్‌ కాలంలో కుక్కలకు, భారతీయులకు రెస్టారెంట్లలోకి ప్రవేశం లేదనేవారు. అప్పటికి అదే న్యాయం.

కానీ ఈ న్యాయాన్ని అప్పుడూ సవాలు చేశారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెప్పే న్యాయాన్ని మేం సవాల్‌ చేస్తున్నాం. మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనుషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం. ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హౌదాను కల్పించినప్పుడే, ఆ రోజునే మేం ఇది న్యాయమని ఒప్పుకుంటాం. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఏ రకమైన హింసనూ, ఏ ఉగ్రవాదినీ, ఏ ఉగ్రవాద సంఘటననూ, ఎలాంటి దేశ వ్యతిరేక చర్యనూ ఏ రకంగానూ సమర్థించదని నేను స్పష్టం చేస్తున్నాను. కొంతమంది... గుర్తు తెలియని వ్యక్తులు 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేశారు. దానిని జేఎన్‌యూ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తోంది....

తెలుగు సేత జి.వి.కె. ప్రసాద్‌

https://www.youtube.comwatchv=21qExVVuhhk

ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కన్హయ ప్రసంగ పాఠం లింకులు ఇక్కడ చూడండి.
Posted On Tue 16 Feb 000009.278402 2016

http://www.prajasakti.com/EditorialPage/1758266
http://epaper.prajasakti.com/c/8628400 (For Epaper article)


11 comments:

నీహారిక said...

80 శాతం మంది పేద ప్రజలున్నారని ఒప్పుకుంటున్నారు కదా ? 80 శాతం మందీ కలిస్తే 20 శాతం మంది మీద యుద్ధం చేయడమో సమస్యా ? లోపం వారిలో ఉంచుకుని ఎవరినో బెదిరించడం దేనికి ? ప్రపంచ పేదల్లారా ఏకం కండి !

Anonymous said...

1. బ్రాహ్మణవాద వ్యవస్థలో దళితులకు మందిరంలోకి ప్రవేశం లేదు

దళితులను ఒక ఐకాన్ లా చేసి,రాజకీయాలకు వాడుకొంటామని ఎవరైనా భావిస్తే ప్రజలు తిరస్కరిస్తారు. మీరు ఎన్ని రోజులు దళిత కార్డ్ వాడుతారు. మిగతావర్గాల వారు ప్రజలు కాదా? వాళ్లలో పేదరికం లేదా? అణచివేత లేదా?

2. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం

ఒప్పుకోకపోతే పోరాడుతారా? పోరాడమనండి ఎవరు వద్దన్నారు. ఇంతకు ముందు ఎంతమంది పోరాడలేదు. కాన్షి రాం, మాయవతి,మంద కృష్న మాదిగ, పోరాడలేదా? ఈ పోరాట వీరుల సంగతి ప్రజలు తెలుసులే. వీళ్ల నందరిని దేశ ప్రజలు తిప్పికొట్టారు.

3. మనుషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం.

రిటొరిక్ నాన్సెన్స్ ఇది.

4. ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హౌదాను కల్పించినప్పుడే, ఆ రోజునే మేం ఇది న్యాయమని ఒప్పుకుంటాం.

సమాన హౌదాను కల్పించినప్పుడే ఎలా కల్పించాలో? దళిత వాదం తీసుకొంటే అందులో అగ్రవర్నాల వారికి ఉన్న స్పేస్ ఎమిటి?

అగ్రవర్నాల వారు దళితులకు అన్యాయం జరిగిందనే ఒక కారణం తో వారి సమస్యలను సానుభూతితో చూస్తూ వచ్చారు. దానిని అలుసు గా తీసుకొని రెచ్చిపోతే అది సమస్యను జఠిలం చేస్తుందే గాని, మేలు ఉండదు. అది గమనిచకుండా గోల చేస్తే, ప్రజలు చెవ్వులో పువ్వులు,పంగనామాలు పెట్టుకోలేదు. ఇటువంటి రాజకీయాలకు బుద్ది చెప్పుతారు. ఈనుంచి అగ్రవర్ణాల వారు తిరగబడతారు.

Kishore said...

అయితే, శ్రీమాన్ కసబ్ గారు పేదలను ఉద్దరించడానికే కృషి చేసారంటారు!!!

Anonymous said...

ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హౌదాను కల్పించినప్పుడే


సమాన హోదా ఎవరితో ఎవరికి సమాన హోద? ఆర్ధికంగానా? సామాజికంగానా? సమాన హౌదాను ఎవరు కల్పించాలి? ఎలా కల్పించాలి? ప్రభుత్వమైతే ఇప్పటికే అందరి పౌరులకుసమాన హోదాను రాజ్యాంగం ద్వారా కల్పించిం లేదా?

Anonymous said...

నేనీ జేఎన్‌యూ గడ్డ మీది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలను సవాల్‌ చేస్తున్నాను. రండి, మాతో వాదించండి!


రాజశేఖర్ రాజు గారు, ఆ రాసినవాడు పిచ్చలో ఉన్నాడు. బిజెపి కి కమ్యునిస్ట్ లు ఇద్దరు సమౌజ్జీవులైనట్ల్లు చాలేంజ్ చేస్తున్నాడు. వర్తమానం లో కమ్మీలు బలహీనులు, బిజెపి ఈకను కూడా పీకలేరు. పేపర్ పులులు లను చానా మందిని చూశాం లేవయ్యా. మీకు పదవులు లేవు, పని లేదు,తీరిక ఎక్కువ మీతో చర్చల బాతాఖాని పెట్టుకోవాటానికి కాంగ్రెస్ వాళ్లను చూసుకోండి.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
thinker said...

80 శాతం అన్నపుడే మ్యాటర్ అర్థం అయ్యింది, వినడానికి జనాలు దొరకాలే గాని నా సామి రంగా
క్లుప్తంగా: మళ్ళీ జవజీవాలు కూడతీసుకుంటున్న హరికథలు హరిదాసులు.

Jai Gottimukkala said...

"సెడిషన్ అనే ఆంగ్లపదానికి రాజద్రోహం సరైన అనువాదం"

IPC section 124A:

Sedition: Whoever, by words, either spoken or written, or by signs, or by visible representation, or otherwise, brings or attempts to bring into hatred or contempt, or excites or attempts to excite disaffection towards, the Government estab¬lished by law in India, shall be punished with im¬prisonment for life, to which fine may be added, or with impris¬onment which may extend to three years, to which fine may be added, or with fine

Explanation 1: The expression “disaffection” includes disloyalty and all feelings of enmity

Explanation 2: Comments expressing disapprobation of the meas¬ures of the Government with a view to obtain their alteration by lawful means, without exciting or attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section

Explanation 3: Comments expressing disapprobation of the admin¬istrative or other action of the Government without exciting or attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section.

Anonymous said...

ఇంగ్గ్లిష్ మీడియాలో భర్ఖా దత్,సాగరిక, రాణ అయుబ్ పాకిస్తాన్ అనుకూల లాబిదే హవా! ఈసారి ఎందుకో వీళ్లకి తాళం వేయకుండా అర్ణబ్ గోశ్వామి ఎదురు తిరిగాడు. రెడ్ హండెడ్ గా దొరికిపోయారు. పూర్తి స్థాయి లో యక్స్ పోజ్ అయిపోయిన నకిలి కణికులు ఎమి చేస్తారో వాళ్లు అదే చేస్తున్నారు. ఇండియా ఇమ్మేజ్, ప్రధానిని పేరు మీద ఎంత బురద పోయటమో అంత పోయడం! ఐడేంటిటి ని కప్పి పుచ్చుకోవటానికి లిబెరల్ ముసుగు, సెక్యులర్ మత్రం జపించటం తీవ్రస్థాయి లో మొదలుపెట్టారు.

https://prasadpost.blogspot.in/ said...

Thank you R Raju garu! By the way, ఇది 'నవ తెలంగాణ' పత్రికలో కూడా అదే రోజు అచ్చయ్యింది...

GVK Prasad

kanthisena said...

ధన్యవాదాలూ జీవీకే ప్రసాద్ గారూ,
మూల భావానికి తగిన ఉధృతితోనే మీరు కన్హయ్య ఉపన్యాసాన్ని తెలుగు చేశారు. చదవడానికి కూడా చాలా బాగుందది. నవతెలంగాణలో కూడా వచ్చిందా.. మరీ సంతోషం.

Post a Comment