Pages

Wednesday, November 2, 2016

ప్రేమికులు

ఏఓబీ ఎన్‍‌కౌంటర్లో నేలకొరిగిన మావోయిస్టులకు అక్షరార్పణ వంటి  ఈ చిన్ని కవిత రాసిందెవరో తెలీదు కాని నిన్న మా ఇన్‌చార్జ్ వేణు గారు వాట్స్ యాప్‌ద్వారా పంపారు. ఆయనకు కూడా కవి పేరు తెలీకుండా ఈ కవితను ఎవరో షేర్ చేశారట.

'అన్నం అపురూపమైన చోట... ఆకలిని ప్రేమిస్తారు' అంటూ పద్యపాదం మొదలవగానే కావ్య స్ఫూర్తిని అందిస్తూన్న ఈ కవిత 'స్వేచ్ఛ కోసం నిర్బంధాలను, బతుక్కోసం చావునూ ప్రేమిస్తారు' అంటూ ముగింపులో కూడా మనిషిని నిలువునా కదిలిస్తోంది. 

ఈ కవితలో ఒక్క అక్షరం కూడా నాది కాదు. అక్కడక్కడా అచ్చుతప్పులను సరిదిద్దడం తప్ప.. ఈ కవిత ఈ బ్లాగుకు శోభనిస్తుందన్న ఉద్దేశంతోనే కవి పేరు తెలియకున్నా ఇక్కడ పోస్టు చేస్తున్నాను.

నక్సలైట్ నేతలు స్వార్థపరులు అని దశాబ్దాలుగా రాజ్యయంత్రాంగం చేస్తున్న దుష్ప్రచారానికి ఏవోబీ పచ్చటి అడవుల్లో కన్ను మూసిన ఆర్కే కుమారుడు మున్నా నిలువెత్తు వ్యతిరేక సాక్ష్యంగా నిలుస్తున్నాడు. కన్న తండ్రిని ఉన్నాడో లేడో తెలీని అదృశ్యంలోకి నెట్టి.. కన్న కొడుకును ఏవోబీ రక్తప్లావిత ఆచరణకు అర్పించి దోచుకుంటున్న 'పరమ స్వార్థ' ప్రజాఉద్యమం కదా అది మరి. నిద్ర లేచింది మొదలుకుని ఆస్తుల పెంపుదలే పరమావధిగా మారిపోయిన జీవితాలకు, వాటిని ఆవరించిన దృక్పథాలకు ప్రాణ త్యాగమంటే నిజమైన అర్థం తెలీక పోవచ్చు. 

ఆస్తికోసమందామా
ఊరిడిసి వొచ్చారు
కీర్తికోసమందామా
పేరిడిసి వొచ్చారు
భద్రత కోసమందామా
బతుకంతా నిత్యాగ్నిగుండమే

అంటూ నక్సలైట్లు ఆస్తుల కోసం, కీర్తి కోసం, భద్రత కోసం జీవితాలను వదిలిపెట్టి రాలేదని చెబుతూనే.. కత్తి అంచుమీద వెల్లివిరిసే ఆ త్యాగాలు.. దుఃఖపు చారలబట్టుకు పీడితుని చేరుకోవడానికి, పీడనమీద యుద్ధం ప్రకటించడానికి మాత్రమే తప్ప సొంతం కోసం, స్వార్థం కోసం కాదంటున్న ఈ చిన్ని కవితను వాద వివాద రహితంగానే చదవగలరు.

వాళ్ళు ప్రేమికులు

అన్నం అపురూపమైనచోట
ఆకలిని ప్రేమిస్తారు
జీవితం ప్రయాణమైనచోట
అలసటను ప్రేమిస్తారు
యుద్ధం అనివార్యమైనచోట
గాయాల్ని ప్రేమిస్తారు

వాళ్ళు ప్రేమికులు.
   
ప్రేమ,.
ప్రేమించడం వాళ్ళ నైజం

తల్లి బిడ్డను ప్రేమించినట్టు
పువ్వు పరిమళాన్నిచ్చినట్టు
సూర్యుడు వెచ్చదనాన్నిచ్చినట్టు
ప్రేమించడం వాళ్ళ నైజం
        
ఏ ఊరొ తెలువదు
ఏ తల్లి బిడ్డలొ తెలువదు
ఏటివాలుకు ఎదురీదె చేపలాగ
దుఃఖపు చారలబట్టుకు
పీడితుని చేరుకుంటారు
పీడనమీద యుద్ధం ప్రకటిస్తారు
           
ఆస్తికోసమందామా
ఊరిడిసి వొచ్చారు
కీర్తికోసమందామా
పేరిడిసివొచ్చారు
భద్రత కోసమందామా
బతుకంతా నిత్యాగ్నిగుండమే

ఎట్లా వెలగట్టేది
కత్తి అంచుమీద
వెల్లివిరిసే త్యాగాల్ని,
ఎట్లా వెలగట్టేది
ఒకవిశ్వాసం అంచున
పిక్కటిల్లే వసంతమేఘగర్జనల్ని
              
వొస్తూనె ఉంటారు
భయానక కుట్రలకింద
అశేష బలసంపత్తికింద
శవాలు కుప్పలయినా
శరీరాలు ఛిద్రమయినా
శిఖరాల్ కూలిపోయినా
అలసిపోని అలల్లాగ
బషాయిటుడులాగ
వొస్తూనె ఉంటారు

వాళ్ళు
స్వేచ్ఛకోసం
నిర్బంధాలను ప్రేమిస్తారు
బతుక్కోసం
చావును ప్రేమిస్తారు

వాళ్ళు ప్రేమికులు..





ఈ కవిత ఆద్యంతం చదివాక ఎందుకో గానీ, 35 ఏళ్ల క్రితం నేను చదివిన మహాశ్వేతాదేవి రాసిన 'ఒక తల్లి' నవలలోని ఆ మాతృమూర్తి, ఆ కన్నకొడుకూ మరోసారి  గుర్తుకొస్తున్నారు...

(పేస్ బుక్ లోనో, లేక మరే సోషల్ మీడియాలోనో వచ్చిన  ఈ కవిత కర్త ఎవరో ఎవరికైనా తెలిస్తే ఈ పోస్టుకు వ్యాఖ్య ద్వారా తెలుపగలరు.)

మన కాలపు త్యాగ రంజిత ఉద్యమానికి నిలువెత్తు కవిత్వాన్ని అద్దిన ఈ అజ్ఞాత కవిమిత్రుడికి కృతజ్ఞతలతో...

(గమనిక: ప్రేమికులు అనే పేరిట వచ్చిన ఈ కవిత రచయిత విరసం సభ్యులు ఉదయమిత్ర. విరసం కార్యదర్శి పి. వరలక్ష్మి గారు ఈ విషయం నిర్ధారించారు. సమాచారం పంపిన విరసం సీనియర్ సభ్యులు సిఎస్ఆర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.)


0 comments:

Post a Comment