Pages

Tuesday, January 24, 2017

మీడియా నేర్వదగిన పాఠం


దేశాధ్యక్షుడు ప్రదర్శిస్తున్న శత్రువైఖరి అమెరికా మీడియాను ఒక్కటిగా చేసింది. ఎంత కండబలాన్ని ప్రదర్శించినా, శ్వేతసౌథం నుంచి ప్రెస్ బృందాన్ని సాగనంపినా ఈ యుద్ధంలో ట్రంప్ విజయం పొందలేడని తేల్చి చెప్పింది. జర్నలిస్టులు ఎవరు, వారెందుకు, ఎవరికోసం ఉంటున్నారు అనే మౌలిక సమస్యల పట్ల పునరాలోచించుకునే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పింది అక్కడి మీడియా. మరి.. కాస్త ఒంగమంటే సాష్టాంగపడిపోతున్న మన మీడియా పరిస్థితి ఏమిటి? 

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెండు యుద్ధాలను ఎదుర్కొంటున్నారు. ఒకటి. ట్రంప్‌‌పై విరుచుకుపడుతున్న మహిళా నిరసన ప్రదర్శనలు. రెండు. మీడియాపై ట్రంప్ స్వయంగా ప్రకటించిన యుద్ధం. ఇప్పుడు ఈ రెండు ఘటనలే కొత్త అధ్యక్షుడి భవిష్యత్తును నిర్దేశించే సంకేతాలను ఇస్తున్నాయి. అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మహిళలు ట్రంప్ విధానాలపై, అతడి పురుషాహంకారపు అసభ్య ప్రకటనలపై వీధుల్లోకి వచ్చేశారు. మరోవైపు అమెరికా మీడియా మొత్తంపై కత్తిగట్టినట్లుగా ట్రంప్ నేరుగా మీడియా వ్యతిరేక యుద్ధానికి పిలుపునివ్వడం అమెరికా సమాజం ఎన్నడూ చూసి ఉండని ఘటన. దేశాధ్యక్షుడికి, అమెరికా మీడియాకు మధ్య సంబంధం ఇప్పుడు అత్యంత హీన స్థాయికి చేరుకుంది. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా ట్రంప్ మీడియాను ఎత్తిపొడవడం, ఒక దశలో మీడియా కంటే సైనిక బలగాలు ఎంతో ఉత్తమమైనవని పొగడటం. అధ్యక్షుడిగా తొలిరోజునుంచే బహిరంగ వేదికలపై మీడియాను అవహేళన చేస్తూ మాట్లాడటం. వీటన్నింటిని చూస్తే ఎన్నికల ప్రచార దశలో తాను ప్రవేశపెట్టిన విభజన, ద్వేషపూరిత విధానాలనుంచి ట్రంప్ ఏమాత్రం తప్పుకోలేదని స్పష్టమౌతోంది.

మరోవైపున అమెరికా మీడియా మటుకు అధ్యక్షుడి హుంకారాలకు లొంగేది లేదని (భారతీయ మీడియా లాగా కాకుండా) స్పష్టం చేస్తూ ట్రంప్‌కు పెద్ద ఉత్తరం రాసింది. మీడియా నోరు నొక్కాలని ఎంతగా ప్రయత్నించినా, ట్రంప్ ఈ యుద్ధంలో విజయం పొందలేడని యుఎస్ మీడియా ఈ ఉత్తరంలో తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడి వార్తలను కవర్ చేయడానికి వైట్ హౌస్‌లో ఉండే ప్రెస్ బృందాన్ని అక్కడి నుంచి సాగనంపటంపై ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నారని  వస్తున్న వార్తల నేపథ్యంలో మీడియా దేశాధ్యక్షుడికి నేరుగా ఉత్తరం రాసింది. అధ్యక్షుడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం ద్వారా ట్రంప్ గెలుపొందలేడని, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యూరోక్రాట్లతో సహా ప్రభుత్వాంగాలన్నింట్లో విలేకరులను చొప్పించి సమాచారం రాబడతామని తేల్చి చెప్పింది. వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయం నుంచి మీడియాను నియంత్రించాలని ట్రంప్ భావించవచ్చు కానీ, అధ్యక్షుడి విధానాల అమలు తీరుతెన్నులను కవర్ చేయడంలో అంతిమంగా మాదే పై చేయి అవుతుందని మీడియా తేల్చి చెప్పింది.

అమెరికన్ మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా తన నోరు నొక్కివేత నుంచి విముక్తి కావడానికి సిద్ధపడకపోవడం విషాదం. వాస్తవానికి మన మీడియా ప్రభుత్వాన్ని ప్రశంసించడం, మద్దతివ్వడం ద్వారా మూతిని ఇంకా గట్టిగా బిగించుకుంటోంది. ప్రభుత్వ విధానాల సారాన్ని పరిశీలించి.. ప్రశ్నించడానికి బదులుగా భారత్‌లోని పేదల్లోకెల్లా నిరుపేదలపై ఆ విధానాలు కలిగిస్తున్న ప్రభావాల గురించి రిపోర్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వ పాలసీయే అంతిమ సత్యంలాగా ప్రచారం చేస్తూ దేశ మీడియా తనకు తానుగా అధికార వ్యవస్థలో భాగమైపోతోంది. పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా కాస్త గీత దాటితే చాలు వారిని పక్షపాతులని ముద్రవేస్తూ, శపిస్తూ, దూషిస్తూ విలేకరులపై మరుగుజ్జులు దాడి చేస్తున్న సమయంలోనూ మన మీడియా మౌనముద్ర దాల్చడమే పరమ విషాదకరమైన విషయం. భారతీయ మీడియాలో నెలకొన్న ఈ దుస్థితికి భిన్నంగా అమెరికన్ మీడియా నుంచి మనం గ్రహించవలసిన పాఠాలు ఏమయినా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆ లేఖ సారాంశాన్ని పరిశీలించాల్సిందే.

డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్

మీరు ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గర పడుతున్న సమయంలో మీ పాలనా యంత్రాంగానికి, అమెరికన్ ప్రెస్ బృందానికి మధ్య సంబంధాన్ని మేమెలా చూస్తున్నామో స్పష్టం చేయడానికి ఈ ఉత్తరం సహాయపడుతుందని మేం భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా మీ ప్రెస్ కార్యదర్శి శ్వేతసౌధం నుంచి వార్తా మీడియా ఆఫీసులను ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మీ విశేషాలను కవర్ చేయడంపై మీరు ఆద్యంతం నిషేధించిన వైఖరికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే. విలేకరులను వ్యక్తులుగా బెదరించడానికి, మీరు ట్విట్టర్‌ని వాడుకుంటున్నారు. మీ మద్దతుదారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మీడియాపై పరువునష్టం దాఖలు చేస్తానని మీరే స్వయంగా అనేకసార్లు హెచ్చరించారు. ఒకేరకమైన వార్తలను వండిపెడుతూ, నిత్యం ప్రెస్ కాన్ఫరెన్సులను నిర్వహిస్తూనే మీరు ప్రెస్‌ను పక్కనబెట్టారు. అంగవైకల్యం ఉంది కాబట్టే నాకు వ్యతిరేకంగా రాశావంటూ ఒక విలేకరిని మీరు హేళన చేశారు. 

బహుశా మీకు ఎంపిక చేసుకునే హక్కు ఉండవచ్చు. పత్రికా స్వేచ్ఛను మన రాజ్యాంగం రక్షిస్తున్నప్పటికీ, ఆ స్వేచ్ఛను అధ్యక్షుడు ఎలా గౌరవించాలనే విషయాన్ని రాజ్యాంగం ఆదేశించలేదు. అయితే.. ప్రెస్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కులున్నాయి. మా ప్రసారాలను, వార్తా‌ కాలమ్‌లను ప్రభావితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలన్నది మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు. కాబట్టి వచ్చే నాలుగేళ్లలో మానుంచి మీరు ఏం ఆశించాలి అనే అంశంపై మీరు క్షుణ్ణంగా ఆలోచించుకోండి.

మీ పాలనను పరిశీలించే అవకాశం విలేకరులకు ఇవ్వాలా లేదా అని మీరు నిర్ణయించుకోవచ్చు. ఆ చాయిస్ మీదే.. కానీ సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పొందడంలో మాకు విశేషమైన అనుభవం ఉంది.  ఇక్కడ విలేకరులకు ప్రవేశం ఉండదు అని చెబితే అది మాకు ప్రధానమైన విషయం కాదు. కాని అది మేం ఇష్టపడి ఎదుర్కొనే సవాలు వంటిది.

ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాం. వార్తల విషయంలో ప్రాధమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. మీ అధికారులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడటానికి, మేం అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. అది మా ఎంపిక, మా నిర్ణయం మాత్రమే. కాని నిబంధనలకు అంగీకరించని విలేకరులను తన్ని పంపిస్తానని మీరు భావిస్తుంటే మాత్రం అది జరగని పని.

మమ్మల్ని మీరు బయటకు పంపినప్పటికీ మీ అభిప్రాయాలను సేకరించడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సత్యాన్ని పదే పదే వక్రీకరిస్తున్న, లొంగదీసుకుంటున్న వ్యక్తులకు మా ప్రసారాలను, వార్తా కాలమ్‌లను కట్టబెడతామని దీనర్థంకాదు.

ఏ విషయంలో అయినా సరే ఒక వస్తుగత వాస్తవం ఉందని మా విశ్వాసం. దాన్నే మేం ఎత్తిపడతాం. మీరూ, మీ తైనాతీలు నిర్దిష్టంగా ఒక తప్పు విషయాన్ని చెబుతున్నప్పుడు, ట్వీట్ చేస్తున్నప్పుడు మేం వాటిని ప్రచురిస్తాం. కానీ వాటితోపాటు మేం వాస్తవాలను కూడా చెబుతాం.

రాజకీయ రంగంలో మీడియాపై అవిశ్వాసాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన ఘనత మీదేనని గుర్తిస్తున్నాం. కానీ దాన్ని మేమొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాం. మా పట్ల ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందుతాం. మా తప్పుల్ని గుర్తించడం ద్వారా, మాకు మేము నిర్దేశించుకున్న అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడటం ద్వారా నిర్దిష్టమైన, నిర్భయంతో కూడిన రిపోర్టింగ్ ద్వారా మేం ఇందుకు ప్రయత్నిస్తాం.

ఒక్కమాట. ఇక నుంచి మీడియాలో ఉన్న అందరం కలిసి పనిచేయబోతున్నాం. మీరు మమ్మల్ని విభజించడానికి ప్రయత్నించారు. మా విలేకరుల్లోని అత్యంత స్పర్థాత్మక (పోటీ) తత్వాన్ని మీరు కుటుంబ కలహాలకోసం వాడుకున్నారు. ఆ రోజులు గతించాయి. మీ వార్తలను కవర్ చేయడంలో ఉన్న సవాలును ఎదుర్కొనడానికి వీలైన చోటల్లా మేం పరస్పరం సహకరించుకుంటాం.

ఇకపై మీరు ఇష్టపడని అంశాలను ప్రస్తావించిన రిపోర్టర్‌ నోరు మూయించడానికి మీరు ప్రయత్నించినప్పుడు మా మీడియా మొత్తంతో కూడిన ఐక్య సంఘటననే మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. వార్తల్లో నీతి లేదా అభిరుచి, లేదా న్యాయబద్ధమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు ఇప్పటికీ విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించాల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు.

చివరిగా.. మేం దీర్ఘకాలం సాగే ఈ ఆటను ఆడబోతున్నాం. మీరు మీ పనిలో మహా అయితే మరో 8 ఏళ్లు కొనసాగవచ్చు. కాని మేం మాత్రం అమెరికన్ రిపబ్లిక్ స్థాపన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మహత్తర ప్రజాస్వామ్యంలో మా పాత్రను పదేపదే స్థిరపర్చుకుంటూ వస్తున్నాం, దృఢపర్చుకుంటున్నాం కూడా. మేం ఎవరం, ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించుకునేలా మీరు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. అందుకు మీకు మేం కృతజ్ఞులమై ఉంటాం.

ఇక మీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆస్వాదించండి

వైట్ హౌస్ ప్రెస్ కోర్

                                                   ****************



ఈ  సంపూర్ణ వ్యాసం సంక్షిప్త పాఠం నిన్నటి దినం సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో (24-01-2017)
"ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం" పేరిట అచ్చయింది.

ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం

సాక్షి సౌజన్యంతో..
------------------------------


ఒక సంతోష క్షణం:
నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అమెరికా వైట్ హౌస్ ప్రెస్ కోర్ (వైట్‌హౌస్‌లో అధ్యక్షుల దైనందిన వ్యవహారాల సమాచారాన్ని సేకరించే కీలకమైన మీడియా బృందం) రాసి ప్రచురించిన ఇంగ్లిష్ వ్యాసాన్ని అనువదించి స్పేస్ సరిపోకపోవడంతో కుదించి సాక్షిలో ప్రచురించడమైనది. సాక్షిలో ఊహించని పై స్థాయి వారి నుంచి ఈ వ్యాసం బాగుందని చిరుప్రశంస రావడం, మా సాక్షి వాట్సప్ ఫ్యామిలీ గ్రూప్‌లో పత్రికలో వచ్చిన సంక్షిప్త పాఠాన్ని చాలా మంది షేర్ చేయడం, మీడియా వారందరూ దీన్ని చదవాలని సిఫార్సు చేయడం.. రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో కాస్తంత సంతోషాన్ని కలిగించింది.

ఈ వ్యాసం కూడా అన్నింటిలాగే విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు, చర్చకు పాత్రమైనదే అనడంలో సందేహమే లేదు.  దీని సారాంశంతో ఏకీభవించే వారికంటే వ్యతిరేకించే వారే  ఎక్కువగా ఉండవచ్చు కూడా.

కానీ.. "ప్రెస్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కులున్నాయి. మా ప్రసారాలను, వార్తా‌ కాలమ్‌లను ప్రభావితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలన్నది మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు"..  "వార్తల్లో నీతి లేదా అభిరుచి, లేదా న్యాయబద్ధమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు ఇప్పటికీ విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించాల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు" అంటూ అమెరికన్ మీడియా తమ నూతన అధ్యక్షుడికి రాసిన ఉత్తరం సమస్త మీడియా ప్రపంచానికీ అగ్ని సదృశమైన స్ఫూర్తిని అందిస్తోంది.

అందుకే సాక్షి వాట్సప్ ప్యామిలీ గ్రూప్‌లో ఈ వ్యాసంపై స్పందించిన ఒక మిత్రులు ఈ రచన తీవ్రతను, ప్రాధాన్యతను, అవసరాన్ని సరిగ్గానే అంచనా వేశారు.

"ట్రంప్"రేచర్ పెంచిన మీడియా 
ఇదీ మీడియా పవరంటే.. 
ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యం.. హాట్స్ ఆఫ్ టు వైట్ హౌస్ ప్రెస్ కోర్..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మీడియా పట్ల ద్వేషపూరిత విభజన వైఖరి అవలంబిస్తున్న తరుణంలో అక్కడి మీడియా స్పందన సహజంగా ఆసక్తి రేకెత్తించేదే. అధ్యక్షుడి దురుసు వైఖరికి దీటుగా అత్యంత ఘాటుగా అక్కడి మీడియా నాయకత్వం ట్రంప్ కి రాసిన ఓ ఉత్తరం నాకు భలే ముచ్చటేసింది.  

ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వైట్‌హౌస్‌ ప్రెస్‌కోర్‌ నేరుగా ట్రంప్ కి రాసిన ఉత్తరంలో ప్రతి వాక్యం ఒక తూటా. అధ్యక్షుడిని ఇలా గట్టిగా హెచ్చరించే దమ్ము అక్కడి మీడియాకి ఉండడం గొప్ప విషయం. మన దేశ మీడియాతో పోలిస్తే ఇది మరింత సుస్పష్టం. మన మీడియా నాయకత్వం ఒక ఎమ్మెల్యేని హెచ్చరించాలంటేనే వణికిపోతుంది. ఎందుకంటే అన్నీ లొసుగులు.

అన్నారా మిత్రులు. వారికి ధన్యవాదాలు చెబుతూ.. ఈ వ్యాసాన్ని పాజిటివ్ గానూ నెగటివ్ గానూ కూడా చదవాలని కోరుకుంటున్నాను. 

చివరిగా... 

ఆలోచలను రేకెత్తించగలిగిన చక్కటి వ్యాసాన్ని అనువదించగల అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా ఇన్‌చార్జ్ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు

0 comments:

Post a Comment