Pages

Saturday, January 7, 2017

పెద్ద నోట్ల రద్దు వెనుక దాగిన భండారం బట్టబయలైందా?


దేశభక్తి పేరుతో పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెలికితీత ముసుగులో 60 రోజులుగా భారత ప్రభుత్వం, దాని పెద్దన్న నరేంద్రమోదీ ఆడుతున్న దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. దేశంలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు, అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న ‘ఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది,

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మోదీ ప్రభుత్వ వాగాడంబరంపై సెటైర్లు వేసినట్లు నటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రాజన్ కూడా ఈ కుట్రలో సంవత్సరం పైగా పాల్గొని నాటకమాడినట్లు విదేశీ మీడియా బయటపెట్టడం సంచలనం గొల్పిస్తోంది. 125 కోట్లమంది ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టిన ఈ ఘాతుక చర్యను దేశభక్తి ముసుగులో నగ్నంగా సమర్థించిన కిరాతకులు...  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న బాధలను ఎత్తి చూపితే అలాంటివారిపై దేశద్రోహులంటూ ఆరోపించి మరీ వెంటాడిన దేశభక్తులు వారి తైనాతీ పార్టీలు నిజంగా దేశభక్తులు కారని, వీరంతా దేశభక్తుల పేరుతో సాగుతున్న దేశభుక్తులని సాక్షాత్తూ విదేశీ మీడియా కథనం ద్వారా బట్టబయలైంది.

డిజిటల్ ఎకానమీ పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు.. "భారత ప్రజలకు మేలు చేసేందుకు కాదు. వారికి తెలియకుండానే వారితో చెలగాటమాడాలి. కరెన్సీ నోట్ల రద్దుతో క్షతగాత్రులైన ప్రజలు భారత ప్రభుత్వాన్ని మాత్రం నిందించకూడదు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. ఆ విధంగానే ఆయన ప్రకటన సాగింది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు.

అలా 125 కోట్ల భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అమెరికా మార్చేసింది. వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్డీయే సర్కారు కోట్లాది మంది ప్రజలను ‘‘బకరా’’లను చేసింది. ఫలితంగా దేశంలో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదు లావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి."

గత 14 ఏళ్లుగా దేశభాషల్లో వెబ్ సైట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న వెబ్‌దునియా.కామ్ తెలుగు వెబ్ సైట్ పెద్దనోట్ల రద్దు వెనుక నడచిన దేశద్రోహపూరిత నాటకానికి అక్షరరూపమిచ్చింది. దేశభక్తుల దేశద్రోహాన్ని ఇంత బాహాటంగా బయటపెట్టిన కథనం ఈ మధ్యకాలంలో చూడలేదు. విదేశీ ఆర్థిక సంస్థల, సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాలకోసమే పెద్ద నోట్ల రద్దు తతంగాన్ని ఎన్టీఏ ప్రభుత్వం ప్రారంభించిందంటూ గతంలోనే అనేక వ్యాసాలు చదివినప్పటికీ దాని వెనుక సంవత్సర కాలంగా సాగిన ప్రయత్నాలను ఇంత వివరంగా ఆధార సహితంగా ఏ కథనమూ ఇంతవరకూ బయటపెట్టలేదు.



ఒక విషయం మాత్రం నిజం. దేశభక్తులుగా గొంతు చించుకుంటున్న వారు, దేశభక్తిని నినాద ప్రాయం చేసి గబ్బుపట్టిస్తున్న వారు తాము నమ్ముతున్న గంగలో నూరుసార్లు మునకలేసినా సరే.. పెద్ద నోట్ల రద్దు పేరిట వారు చేసిన పాపాలు మాసిపోవన్నది నిజం.

దేశభక్తుల పార్టీ ఈ దేశానికి చేసిన అసలైన ద్రోహం గురించి తెలుసుకోవాలంచే తెలుగు.వెబ్‌దునియా.కామ్ (telugu.webdunia.com) లో ఇవ్వాళ వచ్చిన ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. చదివి తరించండి.

కుహనా దేశభక్తి నశించాలి. దేశభక్తుల ముసుగులోని నకిలీ దేశభక్తులు, దేశభుక్తులు నశించాలి. అమెరికా సామ్రాజ్యవాదుల పాదాల ముందు దేశాన్ని సరికొత్తగా తాకట్టు  పెట్టడానికి సాహసించిన ఎన్డీయే ప్రభుత్వ దుర్మార్గం నశించాలి. మన యోగి భోగి ప్రధాని దొంగ నాటకం నశించాలి.

రాజన్ నుంచి మోదీ దాకా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాగించిన ఈ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా యావద్దేశం ఒక్కటిగా నిలవాలి.

వెబ్ దునియా వెబ్ సైట్‌లో వచ్చిన ఈ పెద్ద నోట్ల రద్దు భండారంపై కథనం లింకును కింద చూడండి. మీ మిత్రులందరకీ షేర్ చేయండి.

125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?
http://telugu.webdunia.com/article/current-affairs/washington-is-behind-india-s-brutal-demonetization-project-117010700036_1.html


తాజా సమాచారం.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముసుగులో దేశ ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల హక్కు భుక్తం చేసే భారీ కుట్ర అనూహ్య ఘటన కాదని ఒకటన్నర సంవత్సరం పైగా ఇటు భారత ప్రభుత్వమూ, అమెరికా ప్రభుత్వమూ, ద్రవ్య పెట్టుబడుదారులూ కలిసి అత్యంత గోప్యంగా, అతి రహస్యంగా, అతి మార్మికంగా సాగించిన క్రూర పథకంలో భాగంగానే ఇది జరిగిందని నిరూపించే అద్భుత వ్యాసాలు ఇంగ్లీషులో లభించాయి. సమయం ఉంటే వీటిని పూర్తిగా అనువదించి ఇక్కడే పోస్ట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అంతవరకు ఆ రెండు కీలక వ్యాసాలను కింది లింకుల్లో చూడగలరు.

A Well-Kept Open Secret Washington Is Behind India’s Brutal Demonetization Project

http://www.globalresearch.ca/a-well-kept-open-secret-washington-is-behind-indias-brutal-demonetization-project/5566167

పై ఇంగ్లీష్ వ్యాసం సంక్షిప్త అనువాదం ఇవ్వాళే తెలుగు ప్రింట్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ప్రచురించారు.

అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..?
http://www.andhrajyothy.com/artical?SID=354497

వీటితో పాటు కేంద్ర బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకే నగదు రద్దు పథకాలు అమలు చేయాలని సామ్రాజ్యవాదుల ముద్దుల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ 2015 ఆగస్టులో పిలుపిచ్చిందంటూ కింది వ్యాసం పేర్కొంటోంది. నగదు రహిత వ్యవస్థల గురించి ఊదరగొడుతున్న నేతలు, వారి తైనాతీలు, భజనపరుల కుట్రల గురించి ఇంకా ఎవరికైనా సందేహం మిగిలి ఉంటే ఈ కింది వ్యాసం వాటిని తీీర్చవచ్చు.

Financial Times Calls For Abolishing Cash. “To Give More Power to Central Banks”

http://www.globalresearch.ca/financial-times-calls-for-abolishing-cash-to-give-more-power-to-central-banks/5472522?utm_campaign=magnet&utm_source=article_page&utm_medium=related_articles


10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే
మోదీ గారి పాలనలో ఇండియా వెలిగిపోతుంటే తగులబడుతోంటారమేటి అంటూ మోదీ భక్తులకు ఆగ్రహమూ, సందేహమూ కలిపి రావచ్చు. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన నిన్న మోదీ పాలన గురించి ఒక గొప్ప కామెంట్ చేసింది. 10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే అనేసింది. ఆ ప్రకటన సారాంశం ఇక్కడ చూడండి.

"10 వేల ఏళ్లలోనే అత్యంత ఘోరమైన పాలన మోదీ సర్కారుదే. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని రూపుమాపుతుందని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉంన్నారు. ఈ నిర్ణయంతో చివరకు మహిళలను కూడా అష్టకష్టాల పాలు చేశారు. పాత పెద్దనోట్ల మార్పిడికి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఓ తల్లి అర్ధనగ్నంగా మారటం ప్రభుత్వ ప్రాయోజిత నిర్భయ ఘటన."

(ఇది ఆంధ్రజ్యోతి జనవరి 7వ తేదీనాటి 2వ పేజీలో వచ్చిన వార్తా రాజం. అధ్వానపు పరిపాలనపై ఈ చిన్ని వ్యాఖ్య చూశాక ఇక మాటల్లేవు....



8 comments:

Zilebi said...


What a pity

Anonymous said...

ఎవరి మీద జిలేబి?

Anonymous said...

ఇది ఊహినంచిన విషయమే! డబ్బు డిజిటల్ రూపంలో ఉంటే దానిమీద ఒక కన్నేసి, సంట్రోల్లో పెట్టడం సులువవుతుంది. మోడీ భజన బృందంకూడా మోడీ అన్న ప్రతిదానికీ, తందానా తానతందనానా అంటూ గెంతులేశారు. మన దేశోధ్ధారక బ్లాగుల్లో నోట్లలో చిప్పుల్లేకపోతేనేమి, రేడియోధార్మిక పొటాషియం ఉందని చెప్పి, వాళ్ళవాళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. దీనికీ, నల్లడబ్బుకీ సమాధానమేమిటి అంటే సరైన సమాధానాలు ప్రభుత్వమూ, వారి భజన బృందమూ చెప్పలేకపోయింది. దాటవేతలు, మాటమార్పిళ్ళూ, బొంకడాలూ ఇదీ వరుస. ఎవరైనా ఆధారాలడిగితే వాణ్ణి దేశద్రోహి అన్నారు.

ఇక్కడ గ్లోబల్ రీసెర్చికూడా ఆధారాలు చూపించడంలేదు గమనించారో లేదో! "కాగితాల మీద కనబడకుండా జాగ్రత్తపడ్డారు" అన్న ఒక్క మాటతో, ఆధారాలు చూపించాల్సిన బాధ్యతనుండి వారు తప్పించుకున్నారు. నాకెందుకో గ్లోబల్ రీసెర్చి వారి మాటలుకూడా అంత సీరియస్‌గా తీసుకోదగ్గవి కాదేమో అనిపిస్తోంది. బహుశా సరైన ఆధారాలు దొరికేవరకు వారు ఆగుండాల్సిందేమో!

Anonymous said...

దేశ ద్రోహులను దేశద్రోహులనక దేశోద్దారకులంటారా?

kanthisena said...

దేశంలోని మీరనుకుంటున్న దేశద్రోహుల విషయాన్ని పక్కనపెట్టండి. కానీ సామ్రాాజ్యవాదులకు దేశాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్న దేశభుక్తుల గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. దేశ భక్తులమంటూ టముకు వాయిస్రున్నవారి దేశోధ్దారక చర్యలు ఇక్కడ చంకనాకిపోతున్నాయి మరి.

kanthisena said...

"డబ్బు డిజిటల్ రూపంలో ఉంటే దానిమీద ఒక కన్నేసి, సంట్రోల్లో పెట్టడం సులువవుతుంది."

అజ్ఞాత పేర్కొన్న ఈ విషయాన్ని కాస్త మార్చి చెబితే బాగుంటుందేమో.. డిజిటల్ రూపంలో డబ్బుంటే దానిమీద ఒక కన్నేసి, కంట్లోల్లో పెట్డడం మాటేమిటో గానీ, బ్యాంకుల వద్దకు చేరిన లక్షలాది కోట్లను ఇకపై గంప గుత్తగా ఏ అంబానీకో, అదానీకోో మరే పెట్టుబడిదారీ రాకాసులకో ఇంకా సులభంగా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ఇంకా సిగ్గూ శరమూ లేకుంటే లండన్‌కు బొట్టు పెట్టి మరీ ఎన్టీయే ప్రభుత్వం పంపించిన ఆ మాల్యాగారికి మళ్లీ మనమే ఆహ్వానం పంపి మరో పది వేల కోట్లు అప్పనంగా అందించవచ్చు కూడా. ఇవ్వడానికి వీళ్లూ, తీసుకోవడానికి వాళ్లూ రెడీగా ఉన్నారు కదా. రైతులు మాత్రం తీర్చుకున్న రుణాలు చెల్లించాల్సిందేనట. అలా కుదరకపోతే ఆత్మహత్యలు చేసుకునే దాకా వెంటాడి వెంటాడి వేధించడంలో మనమే నెంబర్ వన్ కదా. దేశమంటే మట్టీ, భారత మాత విగ్రహాలూ మాత్రమే అని భ్రమిస్తున్న పెద్దమనుషులకు ప్రజల గురించిన ఆలోచనలు ఎక్కడుంటాయి.ఇటీవలే బ్యాంకుల మొండిబకాయిలను రద్దు చేశారు. దానికి రైటాప్ అని ముద్దు పేరు పెట్టారు. దీనిపై కాస్త టీవీల్లో లొల్లి మొదలవగానే అబ్బే అది రైటాఫ్ కాదు.. అలా పక్కన పెట్టామంతే అని మన పెద్ద మనిషి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చేశారు. జీవితంలో ఇక తిరిగిరాని మొండిబకాయిల పట్ల ఎంత నమ్మకమో..

Anonymous said...

You are spreading lies Raju without understanding anything.

kanthisena said...

అజ్ఞాత గారూ,
నాకు అర్థమైన విషయాలు, నేను తెలుసుకుంటున్న విషయాలు, ప్రతిరోజూ నా చుట్టూ ఉన్న సమాజం నుంచి నా దృష్టికి వస్తున్న విషయాలు వీటినుంచే నేను సమాచారం తీసుకుంటున్నాను. నేనేదో ఎన్డీయే మీదో, మోదీ పాలనమీదో, పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర వ్యతిరేకత ప్రాతిపదికనో ఇలా రాస్తున్నానని అనుకుంటే నేనేమీ చేయలేను. 1991 నుంచి నేటి దాకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చనిపోయిన వారిని భుజాలమీద మోసుకుని ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితిని ఏ పాలకులూ తప్పించలేకపోయారు. రైతు ఆత్మహత్య చేసుకోని రోజు లేకుండా పాలిస్తామనే హామీని ఎవరూ పాటించలేకపోయారు. జరిగిన అభివృద్ధి అంతా కార్లు, విమానాలు, విమానాశ్రయాలు, ఫ్లై ఓవర్లూ, షాపింగ్ మాళ్లు, ఐటీ సోకులూ తప్పితే సామాన్య జనం అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు. నేను ఎక్కడ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నానో చెబితే తప్పకుండా వాటిని పరిశీలిస్తాను. నా ఆలోచనల్లో నా రాతల్లో పొరపాట్లు ఉంటే దిద్దుకోవడానికి నేనెల్లప్పుడూ సిద్ధమే. అంతే కానీ నేను ఏదీ అర్థం చేసుకోలేదని చెప్పి నా ఆర్టికల్స్ల్ లో ఉన్న కాసిన్ని నిజాలను కూడా తోసిపుచ్చడం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదనే అనుకుంటున్నాను. మీతో నిజంగా అర్థవంతమైన చర్చ చేయాలంటే కూడా అందనంత 'అజ్ఞాతం'లో ఉన్నారు మీరు. ఎలా?

Post a Comment