Pages

Friday, January 27, 2017

కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!



తెలుగు జాతి పిల్లలు మునుపటిలా తెలుగు మాధ్యమంలో చదవాలా? లేక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ వేగంతో తీసుకువస్తున్న ఆంగ్లం మాధ్యమంలో చదవాలా అనే అంశంపై గత కొంతకాలంగా తెలుగు దినపత్రికల్లో, ప్రజాసాహితి వంటి మాస పత్రికల్లో వస్తున్న వ్యాస పరంపరలో తాజా రచన "కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!". ఆంగ్లంలో చదవకపోతే పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేరు అంటూ సాగుతున్న పరమ భయంకర వితండ వాదాన్ని తిప్పి కొడుతూ, మాతృ భాషా మాధ్యమంలో చదవడం కంటే మించిన గొప్ప సౌలభ్యం, అవకాశం ఏ భాషా సమాజానికీ ఉండదని ప్రతిపాదిస్తున్న నిరుపమాన కథనం ఇది.

బతుకు తెరువు కోసం ఏ దేశానికి వెళితే ఆ దేశ భాషను మూడు నెలల్లో నేర్చుకుని స్థానికులతో అదే భాషలో కమ్యూనికేట్ చేయగలుగుతున్న ఆ దళిత ఎలక్ట్రీషియన్ మాతంగి కోటేశ్వరరావు (11 భాషలు నేర్చిన ప్రవీణుడు)కు నీరాజనం అర్పించాలి మనందరం. అలాగే కేవలం నాల్గవ తరగతి మాత్రమే చదువుకుని ఆఫ్రికాలోని అనేక దేశాలకు వెళ్లి కృత్రిమ కాళ్ళను తయారు చేయడంపై వర్క్ షాప్‌లను ఆంగ్లంలో నిర్వహిస్తున్న ఆ దళిత యువకుడికీ నమస్కరించాలి మనం.

ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి ‘అదేమన్నా బ్రహ్మ విద్యా అండి, అవసరం అయితే ఏ భాష అయినా కొద్ది రోజుల్లోనే తేలికగా నేర్చుకోవచ్చు’ అని సమాధానమిచ్చాడితడు. అతడి అనుభవం ప్రకారం ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి కేవలం 3 నెలల సమయం సరిపోతుంటే చిన్నప్పటి నుంచే సైన్స్, సోషల్, లెక్కలు ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం ఏమిటి? అని ప్రతిపాదిస్తున్న ఈ వ్యాసం డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారిది.

telugumaata@googlegroups.com గ్రూపు నుంచి బొందలి శ్రీనివాస్ గారు పంపిన ఈ వ్యాసాన్ని అక్షరం కూడా మార్చకుండా యధాతథంగా ఇక్కడ మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.

ఆంగ్ల మానస పుత్రులు... వారి మానస మానస మానస సంతానానికి ఇది కాస్తయినా కనువిప్పు కలిగిస్తుందనే ఆకాంక్షతోనే డాక్టర్‌ దాసరి రామకృష్ణ ప్రసాదు గారి రచనను ఇక్కడ అందిస్తున్నాను.

భిన్నాభిప్రాయాలకేం... చాలా ఉంటాయి. కానీ చదవడానికి అవేమన్నా అభ్యంతరపెడతాయా..

చదవండి.
                               

                                                *****************





కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!

పసిప్రాయం నుంచీ సొంత భాషలో పాఠాలు చెప్పకుండా పరాయి భాషలో చెప్పడం పిల్లల సృజనాత్మకతను దెబ్బతీయడమే కాక, దేశ స్వావలంబనకు అతి పెద్ద నష్టం కూడా. పరాయీకరణ చెందిన యువతరంతో మన దేశాన్ని నిర్మించడం అత్యంత కష్టం. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పరాయి భాషలో చదువు చెప్పడం లేదు.

"‘తెంస్కృత’ మీడియం తీసేద్దురూ!" అనే శీర్షికన జనవరి 25న హెచ్చార్కె రాసిన వ్యాసానికి ఇది నా స్పందన. మూడు, నాలుగు సంవత్సరాలు ఇంటి భాషలో పదజాలాన్నీ, వాక్య నిర్మాణాన్ని నేర్చుకొని చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలిగిన పసి వారు ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికే పాఠశాలకు పంపబడతారు. ఆడుతూ, పాడుతూ అలవోకగా లెక్కలు, సైన్స్, సోషల్ శాస్త్రాలు నేర్చుకోవాల్సిన వాళ్ళకు తెలియని ఆ సబ్జెక్టులను బొత్తిగా తెలియని ఇంగ్లీష్ భాషలో నేర్చుకోవలసిన పరిస్థితి అత్యంత బాధాకరం.

పిల్లల సొంత భాషలో మరిన్ని విషయాలు చెప్తే త్వరగా నేర్చుకోగలరు గానీ, అర్థంకాని ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వాళ్ళు పడే కష్టం ఎంత దురదృష్టం! బట్టీ పట్టి అప్పచెప్పటమూ, రాయడం ద్వారా మార్కులు తెచ్చుకుని తలిదండ్రులనూ, ఉపాధ్యాయులనూ సంతోషపెట్టవలసి వస్తుంది. బాల్యాన్నీ, బాలల సృజనాత్మకతనూ ఇలా చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు ఎక్కడిది? ‘‘భాషా పునాదులు పూర్తిగా ఏర్పడటానికి మొదటి 7 సంవత్సరాలు పడుతుంది. ఈ మొదటి భాష పునాదిపై ఎన్ని భాషలయినా సులభంగా నేర్చుకోవచ్చు’’ అని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా! ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల మానేసేవారి సంఖ్య (Drop outs) పెరుగుతున్న విషయం నిరూపించబడినది. పల్లెటూళ్ళలో ఉండేవారికి ఇది విదితమే! ఇంతకు ముందు సరిపడా ఆర్థిక స్థాయి లేక మానేసేవాళ్ళు; ఇప్పుడు పరాయిభాషా మాధ్యమం కూడా కారణంగా తోడయ్యింది.

ఇంగ్లీష్ మాత్రమే కూడు పెట్టదు. మన చుట్టూ ఉన్న అనేక ఉద్యోగాలలో చూస్తే ఇంగ్లీష్ వలన మాత్రమే సంపాదిస్తూ బ్రతికేవారు అతి తక్కువమంది. ఏదో ఒక పని నైపుణ్యమే వారికి కూడు పెడ్తోంది. ఇంగ్లీషులో వ్యవహరించగలగడం, కంప్యూటర్‌తో పనిచేయగలగడం కొన్ని ఉద్యోగాలలో కేవలం అదనపు అర్హతలు. కావలసిన వారు ఇంగ్లీషును నేర్చుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ పసిప్రాయం నుంచీ సొంత భాషలో పాఠాలు చెప్పకుండా పరాయి భాషలో చెప్పడం పిల్లల సృజనాత్మకతను దెబ్బతీయడమే కాక, దేశ స్వావలంబనకు అతి పెద్ద నష్టం కూడా. పరాయీకరణ చెందిన యువతరంతో మన దేశాన్ని నిర్మించడం అత్యంత కష్ట సాధ్యం. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పరాయి భాషలో చదువు చెప్పడం లేదు. పరాయి భాషలో చదువు చెప్పిన దేశాలు కేవలం సేవారంగంలో తప్ప ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందనే లేదు.

కృష్ణా జిల్లా బొబ్బర్లంక గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించిన మాతంగి కోటేశ్వరరావు 11 భాషలు మాట్లాడగలడు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన అతనొక ఎలక్ట్రీషియన్. తన కాంట్రాక్టరు ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశం వెళ్లి అక్కడి భాషను 3 నెలల్లోనే నేర్చుకునేవాడు. అవసరం అతనికి అన్ని భాషలూ నేర్పింది. పనిలో నైపుణ్యంతో మాత్రమే అతనికా ఉద్యోగం లభించింది.

రామన్ మెగసెసే అవార్డు విజేత డాక్టర్‌ రజనీ కాంత్ అరోలి వద్ద కేవలం నాల్గవ తరగతి మాత్రమే చదువుకున్న దళిత యువకుడు. ఆఫ్రికాలోని అనేక దేశాలకు వెళ్లి కృత్రిమ కాళ్ళను తయారు చేయడంపై వర్క్ షాప్స్ను ఆంగ్లంలో నిర్వహించేవాడు. ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి ‘అదేమన్నా బ్రహ్మ విద్యా అండి, అవసరం అయితే ఏ భాష అయినా కొద్ది రోజుల్లోనే తేలికగా నేర్చుకోవచ్చు’ అని సమాధానమిచ్చాడు. ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి కేవలం 3 నెలల సమయం సరిపోతుంటే చిన్నప్పటి నుండే సైన్స్, సోషల్, లెక్కలు ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం ఏమిటి?

పరాయి భాషను నేర్పే పద్ధతులలోనే ఏ కొత్త భాషనైనా నేర్పాలి గదా! సైన్స్, సోషల్, లెక్కలు సబ్జెక్టుల ద్వారా కొత్తభాషను నేర్పడం అనే ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే అది ఇంగితజ్ఞానం (కామన్ సెన్స్)కు కూడా అశాస్త్రీయమని అర్థమవుతుంది. అందుకే అతి చిన్న దేశమైన కొరియాలో కూడా ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకు వారి సొంత భాషలోనే బోధిస్తారు. మరి మన పిల్లలేం పాపం చేసుకున్నారు?

ఇది శాస్త్రీయం అని తెలిసినపుడు ప్రభుత్వాలను వత్తిడి చేసి సొంత భాషలోనే పాఠశాల విద్య ఉండేటట్లు చేయాలి కానీ, తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు కనుక రాష్ట్రమంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళే ఉండాలని నిర్ణయించడం వివేకమేనా? తెలియక నిప్పును పట్టుకునే పసివాడిని వదలి ఊరుకుంటామా? వెంటనే నిప్పుకు దూరంగా తీసుకువెళ్తామా?



గత వారంలో మా బంధువు కోపెన్ హాగాన్ (డెన్మార్క్ రాజధాని) నుంచి వచ్చాడు. అక్కడి విద్య గురించి చెబుతూ ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకూ బోధన అంతా డేనిష్ (వాళ్ళ భాష)లోనే ఉంటుందనీ, కేవలం విదేశస్తుల కోసమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉంటాయనీ చెప్పాడు. యూరప్ అంతా అలానే ఉంటుంది. ఇంగ్లీష్ మాతృభాష కాని ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా (ఉదాహరణకి– ఇంగ్లాండ్ మినహా మిగిలిన యూరప్ దేశాలు, జపాన్, చైనా, కొరియా) విద్య మొత్తం వారి సొంత భాషలోనే ఉంటుంది. వ్యాపారావసరాలకు కానీ, మరే ఇతర అవరసరాలకైనా గానీ వేరే దేశాలకు వెళ్ళవలసిన వారు మాత్రమే ఇంగ్లీషూ, వేరే దేశ భాషలూ నేర్చుకుంటారు.

అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారు వారి నైపుణ్యంతో మాత్రమే పొట్టపోసుకుంటున్నారు. ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ వారికి అదనపు అర్హత మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి, ఆ తర్వాత వ్యవహరించడానికి 3 నెలల కోర్సు చాలు. ఈ కొద్ది మంది కోసం లక్షలాది బాలల బాల్యాన్ని బలిచేయడం అన్యాయం కాదా? మాతృభాషలో విద్య అనే అంశం కేవలం తెలుగు భాష మీద ప్రేమతో కాదు. మన పిల్లల బాల్యం, మన దేశ స్వావలంబన, సర్వతోముఖ వికాసం ఇక్కడ ముఖ్యమైన విషయాలు.

ధనికులు, అగ్ర కులస్తులుగా పిలవబడే వారి పిల్లలంతా ఆంగ్ల మాధ్యమంలో చదవడం వలన లబ్ధి పొందడం ఒక మిథ్య. అలాగే బడుగుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య నేర్వకపోవడం వలన నష్టపోవడం మరొక భ్రమ. ఏ మీడియంలోనైనా రాణించగల బలమైన గిత్తల్లాంటి ఐదారు శాతం పిల్లలకు తప్ప మిగిలిన గ్రామ ప్రాంతాల బడుగు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య వారి పురోభివృద్ధికి పెద్ద అడ్డంకిగా నిలిచి, కీడు చేస్తుందే తప్ప కూడు పెట్టదు.

ఆఖరుగా ప్రముఖ రచయిత ‘‘కాలువ మల్లయ్య’’ గారి మాటలు ఉటంకిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను: ‘‘దళిత బహుజనుల్లో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకొన్నారు, గెలుచుకొంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో గూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే, అసంఖ్యాక బడుగు జనుల పిల్లలు ధనికుల పిల్లల్లాగే తమ మూలాలకు దూరమై, యంత్రాలుగా మారి, అన్ని విధాలా ఓడిపోతారు.’’

డాక్టర్‌ దాసరి రామకృష్ణ ప్రసాదు
27-01-2017  - 01:38:35
 

                                           ***************


అమృతోపమానమైన ఈ వ్యాసాన్ని నా జిమెయిల్ ఐడీకి పంపిన వారు శ్రీనివాస బొందలి గారు
Sreenivas Bondili <telugusreenivasu@gmail.com>

ఈ వ్యాసం తెలుగుమాట గూగుల్ గ్రూప్‌లో భాగంగా వచ్చింది. ఆసక్తి కలిగిన వారందరూ ఈ గ్రూప్‌లో చేరవచ్చు. అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు.
telugumaata@googlegroups.com

------------------------------

తాజా సమాచారం.

ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి సంపాదక పేజీలో వచ్చింది. దాని వెబ్‌సైట్ లింకు కింద చూడగలరు



2 comments:

Anonymous said...

తెలుగుభాష అంతరించింపోయే అవకాశం ఇప్పట్లోలేదు. మనం ఎప్పుడైతే కృష్ణా, గుంటూరు జిల్లావారి తెలుగే సిసలైన తెలుగంటూ నిక్కినీల్గామో అప్పుడే మిగిలిన వారికి తెలుగు పరాయి భాషైకూర్చుంది (తెలంగాణోద్యమం నుంచి మనం పాఠాలు నేర్చుకొందుముగాక). మనం ఇలా ఆలోచించడం మొదలుపెడితే ఆరెండుజిల్లాల తెలుగుకన్నా ఇంగ్లీషుకే ఎక్కువ usability value ఉంది. తెలుగు గురించి గొంతు చించుకొనే బ్రాహ్మణుల్లో ఎక్కువమంది తమ వారసులను తెలుగు పొడచూడని ఇంగ్లీషుకాన్వెంట్లలో చదివించుకుంటున్నారు.

kothapalli Ravibabu said...

nobody imposed or felt proud of Guntur, krishna dialect as great. As a result of Krishna Aincut by Arthur Cotton, some parts of these districts became rich and people were well educated. Some spent their wealth in cinema field and some became writers, actors, poets and what not. Actually the Telugu that is now being used in newspapers and cinemas is not exactly the dialect of Guntur or Krishna districts. It is developed in the course of time like that. All the educated started using it. Even those who criticized it in recent Telangana movement wrote books and essays in the same 'standard' Telugu. Even NAMASTHE Telangana newspaper which criticized the 'standard' Telugu is using the same language except some verbs.

Post a Comment