Pages

Monday, November 7, 2016

నిజంగానే.. ఇప్పుడు జరగవల్సింది ఏమిటి?


ఏఓబీ ఎన్‌కౌంటర్ ప్రజాయుద్ధంపై చేసిన గాయం మానుతున్నట్లుంది. ఊహించని పెను నష్టం ఉద్యమాన్ని, సానుభూతిపరులను కలవరపెడుతున్న నేపథ్యంలోనే ఆర్కే తదితర నాయకత్వం సురక్షితమన్న వార్త అడవినీ, మైదానాన్ని సాంత్వన పరిచినట్లే ఉంది. ఆర్కే ఏమయ్యాడు, ఇతర నాయకత్వం ఏమయింది అనే చర్చ ముగిసింది. మరోవైపున జరిగిన నష్టం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూనే.. ప్రజాయుద్ధం అంటే ఇదేనా?  ప్రజలు స్పందించని యుద్ధాలు అవసరమా? ఒక్క 'పని స్థలం'లో అయినా ఈ ఏకపక్ష దాడి పట్ల నిరసన వ్యక్తం చేశారా, సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరాన్ని నిర్లక్ష్యం చేసి ఆకస్మిక దాడుల్నీ, అతి కొద్దిమంది నడిపే విప్లవాల్నీ రాజకీయపంధాగా అనుసరిస్తున్నామా? అంటూ రంగనాయకమ్మ వంటి వారి నుంచి హెచ్చరిక రూపంలోని విమర్శల క్రమం మీడియాలో మొదలైంది.  

ఇప్పుడు జరగవల్సింది ఏమిటి?
http://www.andhrajyothy.com/artical?SID=330340

"ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో, మావోయిస్టు పార్టీ మీద, ప్రభుత్వం చేసిన హత్యా కాండ, శ్రామిక వర్గ గ్రహింపు వున్న వారికి గాఢమైన దుఃఖం కలిగిస్తుంది. ‘వర్గ పోరాటం’లో, ప్రజా యుద్ధ పంధా పట్ల మావోయిస్టు పార్టీకి వున్న అవగాహనా, ఆచరణా, ఎంత లోపభూయిష్టమైనవైనా, ఆ పార్టీ, ఆ ప్రాంత ఆదివాసీ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నదనేది నిజం! ... మావోయిస్టు పార్టీలో, కార్యకర్తలు గానీ, నాయకులు గానీ, జీతభత్యాలకో, ఎక్స్‌-గ్రేషియాలకో, ప్రమోషన్లకో, చేరిన వారు కారు! ఆదివాసీ ప్రయోజనాలే వారి ఉద్యమ లక్ష్యం!"  "జరిగిన ఆపద ఇంతదీ, అంతదీ కాదు ఘోరమైనది! అటువంటి ఘోరం జరిగితే, శ్రామిక ప్రజలలో ఎంత కదలిక కనపడింది? ఎక్కడైనా ఒక్క కార్మిక సంఘం, తన నిరసనని చూపించిందా? ఎక్కడైనా, నిరసనలతో ఒక్క బస్సు ఆగిందా? ఒక్క రైలు ఆగిందా? ఒక్క పని స్థలంలో సమ్మె జరిగిందా?... అంటూ రంగనాయకమ్మ గారు ప్రశ్నలు సంధించారు. 

‘‘ప్రజల ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకుని పోరాడుతున్నామే! ఇల్లూ వాకిలీ, సదుపాయాలూ, ఆరోగ్యాలూ, అన్నీ వదులుకుని, పోలీసు నిర్బంధాలకూ-చిత్రహింసలకూ - చివరికి కాల్పులకు గురవుతున్నామే! ఇన్ని జరుగుతోన్నా ప్రజలు ఎందుకు స్పందించడంలేదు మనది ప్రజా యుద్ధ పంధాయేనా లోపం ఏదైనా జరుగుతోందా’’ అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఆత్మ విమర్శ ఎన్నడైనా జరిగిందా?.. ‘‘పొలాలూ- ఫ్యాక్టరీలూ-గనులూ రవాణా - వంటి పని స్తలాల్లో శ్రామికుల్ని సంఘాల్లో సంఘటితం చేయడానికి మనం ఏం చేశాం’’ అని ఆలోచించారా? సంఘటితం కాని ప్రజలు ఒంటరులుగా ఏం తెలుసుకుంటారు? అని ప్రశ్నించారామె. పైగా నూటయాభై ఏళ్ల క్రితం ఎంగెల్స్ రాసిన ముందుమాటలోంచి ఒక వాక్యాన్ని ఉదహరించారు కూడా. 

‘‘ఆకస్మిక దాడుల కాలమూ, చైతన్యం లేని జనాలను చైతన్యం గల అతి కొద్దిమంది నడిపే విప్లవాల కాలమూ, గతించిన కాలం అయింది. సామాజిక వ్యవస్తను సంపూర్ణంగా పరివర్తన చెందించడం - అనేదే ప్రశ్న అయినప్పుడు, జనాలు తమంతట తాము దానిలో (వర్గ పోరాటంలో) వుండి తీరాలి. ఏది సమస్యో, తాము దేని కోసం పోరాడుతున్నారో, అప్పటికే గ్రహించి వుండి తీరాలి. ఏమి చెయ్యాలీ - అనే దానిని జనాలు అర్థం చేసుకోవాలీ - అంటే, సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం’’ (మార్క్స్‌ రాసిన ‘ఫ్రాన్సులో వర్గ పోరాటాలు’కి ఎంగెల్స్‌ - ముందు మాట) 

అదే సమయంలో మిత్రులు,  ప్రజాసాహితి పత్రిక సంపాదకవర్గ సభ్యులు దివికుమార్ గారు ఆంద్రజ్యోతి ఆదివారం సంచిక (06-11-2016)లో ప్రచురితమైన రంగనాయకమ్మ గారి విమర్శను సపోర్టుగా చేసుకుంటూనే..,. టెర్రరిస్టు చర్యల ద్వారా మనం సాధించేమి ఏమీ ఉండదని 85 ఏళ్ల క్రితం భగత్ సింగ్ చేసిన సూత్రీకరణను గుర్తు చేస్తూ గతంలో 2007లో జనశక్తి పత్రికలో రాసిన వ్యాసాన్ని నాకు పీడీఎఫ్‌ రూపంలో పంపారు. 

ప్రజావ్యతిరేకులైన బ్రిటిష్ అధికారులను కసితో చంపడం, పార్లమెంటు వంటి కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో సంచలనాత్మకంగా బాంబులు వేయడం వంటివి దీర్ఘకాలిక విప్లవానికి హానికరమైనవని భగత్ సింగ్ చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం పట్ల ప్రజలపట్లే కాదు. ఉద్యమ నిర్మాణాల పట్ల, కార్యకర్తల జీవితాల పట్ల కూడా బాధ్యతాయుతంగా మెలిగిన నిష్మల్మష కమ్యూనిస్టు విప్లవకారుడు భగత్ సింగ్ అంటూ ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఉద్యమ కార్యాచరణ తీరుపై నర్మగర్భపు రీతిలో తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారాయన. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే సాయుధ పోరాటం కాకుండా కొన్ని ఎం.ఎల్ పార్టీలు పార్లమెంటరీ పంధాను చేపట్టి దాని ద్వారా పాలకప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల వెసులుబాటులను పొందడమా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. 

అయితే.. ఆకస్మిక దాడులు, అతికొద్దిమంది నడిపే విప్లవాలుగానే ఒక సాయుధపోరాట సంస్థ ఆచరణ కొనసాగుతోందా అనేది ఎంత ఆలస్యంగానైనా మావోయిస్టు పార్టీనుంచే సమాధానం రావాల్సి ఉంది. రంగనాయకమ్మ గారే  కాదు.. దివికుమార్ గారే కాదు..  ఎవరు ఈ ప్రశ్న వేసినా దానిపై ఆవేశం, ఆగ్రహ స్పందనలకు అతీతంగా సైద్ధాంతికపరంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఆ బాధ్యత ఉద్యమానిదే కాదు.. ఉద్యమాన్ని సమర్థిస్తున్న ప్రజాతంత్ర సంస్థల బాధ్యత కూడా. కానీ.. ఎంగెల్స్ పేర్కొన్న "సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం" అన్న ఎరుక లేకుండానే గత యాభై ఏళ్లుగా సాయుధపోరాటం చేస్తున్న ఒక విప్లవ సంస్థ మనగలుగుతోందా? 
అన్నదే ఆలోచించవలసిన, చర్చించవలసిన అంశం. 

దండకారణ్యంలో జనతనరాజ్యం పేరిట సాగుతున్న నూతన పాలన గురించి దేశ విదేశాల మీడియాలో వార్తలు, సంబంధిత సాహిత్యం విస్తృతంగా వస్తున్నా, అందుబాటులో ఉన్నా.. దాని గురించి ఏమాత్రమూ ప్రస్తావించకుండా మావోయిస్టు పార్టీ ఆచరణను కొన్ని వ్యక్తిగత దాడులు, వ్యక్తుల హత్యలకు పరిమితం చేస్తూ మాట్లాడటం.. దానికి భగత్‌సింగ్‌ టెర్రరిజంపై చేసిన వ్యాఖ్యలను ఉల్లేఖించడం కనీసం న్యాయబద్ధమైన చర్చేనా అనేది తేలాల్సి ఉంది. భారత పాలక వర్గాలు కూడా వేయని ఆరోపణను మావోయిస్టు పార్టీపై చేస్తూ దాన్ని టెర్రరిజం పరిధిలోకి కుదించడం సమంజసమేనా అనేది ప్రత్యామ్నాయ ఉద్యమాల మద్దతుదారులు ఆలోచించాలి. సాయుధ పోరాటం అనే పదాన్నే పరమ అభ్యంతరకరమైన భావనగా ముద్రించే ఇలాంటి విమర్శలు సాధించే అంతిమ ప్రయోజనం ఏమిటి అనేది కూడా తేలాల్సి ఉంది. 

ఈ సందర్భంగా.. పీఓడబ్ల్యూ (ప్రగతిశీల మహిళా సంఘం) అధికార మాసపత్రిక 'మాతృక' నవంబర్ సంచిక కవర్ పేజీలో వచ్చిన 'క్షమాపణ' అనే కవిత హృద్యంగానూ, జరిగిన నష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే సానుకూల అవగాహన కల్పించేది గానూ ఉంటూ ఆలోచనల్లో ముంచెత్తింది.

"బిడ్డలు రాలిపోయే కాలం.. అయినా నేనిప్పుడు శోకం గురించి మాట్లాడను.. 
పోరాటపు పాతపాట.. పల్లవులు మారిస్తే సరిపోదు, హృదయాలను మార్చాలి."

అంటూ దిశానిర్దేశం చేస్తున్న ప్రబోధాత్మక కవిత ఇది. కవితలోని కొన్ని ప్రతీకలు, పోలికలు అభ్యంతరకరంగా ఉన్నట్లనిపించినా కొత్త ఆలోచనలను రేపటంలో ఇది తన వంతు ప్రేరణ నిస్తోంది. 

'మాతృక' పత్రిక నవంబర్ సంచిక సాఫ్ట్ కాపీ పంపిన రమాసుందరి గారికి ధన్యవాదాలు.

క్షమాపణ

బిడ్డలు రాలిపోయేకాలం
అయినా 
నేనిప్పుడు శోకం గురించి మాట్లాడను.

ఎందుకంటే
తెరుచుకునే ఉన్న ఆ కనులలో
కలలే తప్ప కన్నీరు లేదు.

అవును, అప్పుడెప్పుడో
జనం కోసం అడవుల్లో
తపస్సులు చేసే వాళ్లు

ఇప్పుడు తుపాకులతో
కాలం చేస్తూ, వాళ్లే.

అమ్మలు కొందరు
ఇక్కడ బిడ్డలను దానం చేస్తే
కొందరు బిడ్డలు వారి అయ్యలను అంకితమిచ్చేశారు.

మరణం మహత్తర దు:ఖం కాదు
ఎప్పటికీ జీవితం కంటే,
ఓ దేహరూప సంతకమై
మిగిలినప్పుడు, ఈ సమాజపు పుటపై.

పాలిచ్చి పెంచిన బిడ్డలు
పాడెపై పోరాడుతున్నప్పుడు కూడా
ఆ తల్లి క్షమిస్తుందీ, ఈ రక్తగర్భని.

మనమే
నిద్ర నటించడం అలవాటై
దానిలోనే మరణిస్తాం
ఓ ఉదాత్త ఉత్తేజాన్ని 
ఆశాపతన కాలాన ఏకాకిని చేసి.
ప్రజల దు:ఖం
ప్రపంచానికెప్పటికీ సుఖం కాదు, వాళ్లకిలాగానే.

తండ్రులారా, తల్లులారా
రాలిపోయిన బిడ్డలారా
బతుకీడుస్తూ, ఏడుస్తూ
కీడులతో పీడించబడే జనంలారా

పోరాటపు పాతపాట
పల్లవులు మారిస్తే సరిపోదు,
హృదయాలను మార్చాలి.

అప్పుడే కదా
అస్తమించిన ఆ సూరీడు
రుధిరపు రొప్పులను తప్పించుకొని
రెపరెపలాడేదో, నవసమాజ పతాకమై.

మాతృకలో వచ్చిన ఈ  కవిత రచయిత భాస్కర్ కె.గారు.

0 comments:

Post a Comment