Pages

Friday, November 18, 2016

తిరుమలలో 'నారాయణ'.. నారాయణ.. నారాయణ!



భారత ప్రజలపైనో, అక్రమార్కులపైనో ఇంకా స్పష్టం కాని సర్జికల్ దాడితో, పెద్ద నోట్ల రద్దుతో దేశం దేశం ఇప్పుడు రోడ్లపైపడి ఊగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రంగా భావించి వదిలిన పెద్ద నోట్ల రద్దు ఒక్క దోపిడీదారును, నల్లధన మాఫియాను రోడ్డెక్కించకపోయినా 120 కోట్ల పైబడిన సగటు భారతీయులు మాత్రం ఇప్పుడు అక్షరాలా బ్యాంకుల పాలబడ్డారు. ప్రజలపై సర్జికల్ దాడి విశ్వవార్త అయిపోయిన ప్రస్తుత నేపథ్యంలో తెలుగు మీడియాలో ఒక వార్త ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చుంది. అదేమిటంటే.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తన భార్యతోపాటు తిరుమల దేవాలయం సందర్శించడమే కాకుండా ఎప్పటిలాగే మీడియాకు దర్శనమిచ్చేశారు. దేవుడిపై ఎప్పుడో నమ్మకం పోయిందంటూనే తాను దేవుడికి వ్యతిరేకం కాదన్న నారాయణ మరోసారి సంచలన వార్తగా మారారు.

కమ్యూనిస్టులు తాము దైవ భావాన్ని నమ్మకున్నా.. తమ ఇళ్లలో ఇంకా సాంప్రదాయ విశ్వాసాలను మరవని వారి అభిప్రాయాలను గౌరవించడం తప్పుకాకున్నా తామే స్వయంగా తిరుమల దేవాలయానికి వెళ్లడమే కాకుండా,  'నువ్వు నిజంగా ఉంటే.. పార్లమెంటులో ఉన్న వందలాదిమంది ఆర్ధిక నేరగాళ్ళను ’గాడిలో పెట్ట’మని ఏడుకొండల వెంకన్నను కోరిన'ట్లు మీడియాకు చెప్పడం కమ్యూనిస్టుల్లో, హేతువాదుల్లో, నాస్తికవాదుల్లో తీవ్ర నిరసనలకు దారి తీస్తోంది.

ఈ నేపథ్యంలో "కుటుంబంలో ముఖ్య సభ్యులైన శ్రామికుల్లోనూ పీఠాధిపతుల్నీ, బాబాల్నీ నారాయణ భార్య వెంకన్నను నమ్మిన దానికన్నా బలంగా నమ్మే వాళ్ళున్నారు. వాళ్ళు కూడా ఆర్థిక నేరస్తుల్ని గాడిలో పెట్టడానికీ, దోపిడీ పీడనలను అంతమొందించడానికీ పలానా బాబా లేదా పీఠాధిపతి పాదధూళే పరిష్కారమని అంటే.. నారాయణ వెళతారనే ఆశిద్దాం. ’మతం మత్తుమందు’ అన్న నోటితోనే 'మతమే అన్నింటికీ మందు’ అని అనేసీ; ’పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అని నినదించిన నోటితోనే ’ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప’ అని నినదించేస్తే .. నారాయణ గారి ద్విపాత్రాభినయం పరిపూర్ణమవుతుంది సుమీ!" అంటున్నారు యు. సూర్యచంద్రరావు గారు.

నిన్న సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సంపాదక పేజీ (18-11-2016) లో వచ్చిన 'ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప..’ అనే పేరుతో వచ్చిన తీవ్ర అభిశంసన వ్యాసంతో పాటు "మార్క్సిజాన్ని, దేవుణ్ణి ఏకకాలంలో విశ్వసించే వీలులేదా?" అనే పేరుతో సీనియర్ రచయిత, సీరియస్ అధ్యయనకారులు రావు కృష్ణారావుగారు ఒక మిత్రుడి ప్రశ్నకు సమాధానంగా రాసిన ప్రామాణిక రచనను కూడా నా బ్లాగులో పొందుపరుస్తున్నాను. లాటిన్ అమెరికన్ దేశాల్లో మతాధిపతుల మద్దతును కూడా కూడగట్టి కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేసినమాట నిజమే. కానీ ఒక వ్యక్తి దైవాన్ని విశ్వసిస్తే మార్క్సిజానికి అతనితో పేచీలేదు. ప్రజాజీవితంలోకి మతం ప్రవేశించడాన్ని, వ్యవస్థీకృత మతాన్ని మార్క్సిజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని చెబుతూ కష్ణారావు గారు తన రచనలో ఒక తాత్విక, సైద్ధాంతిక మార్గదర్శనం చేసారు.

"మతానికి విరుద్దంగా చేసే విమర్శకు పునాది ఏమిటంటే, మానవుడే మతాన్ని నిర్మిస్తాడుగాని మతం మానవుణ్ణి కాదు. మతం అంటే ఇంకా తననుతాను తెలుసుకోలేకపోయిన లేదా అప్పటికే తిరిగి కోల్పోయిన మనిషి స్వీయ చైతన్యం, అత్మగౌరవం......... మానవుడే మానవ ప్రపంచం. అతడే రాజ్యం. అతడే సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం తలక్రిందుల ప్రపంచం కనుక, తలక్రిందుల ప్రపంచ చైతన్యమైనటువంటి మతాన్ని ఉత్పత్తి చేశాయి.

మతవేదన నిజమైన వేదనకు వ్యక్తీకరణేగాక నిజవేదనకు వ్యతిరేకంగా నిరసన కూడా! మతం అణగద్రొక్కబడిన జీవి నిట్టూర్పు. నిరుత్సాహ పూరిత పరిస్థితుల్లో అది ఒక స్పూర్తి అయినట్లే హృదయంలేని ప్రపంచానికి అది హృదయం. అది ప్రజలకు నల్లమందు......."

అని  కారల్ మార్క్స్ చెప్పిన అభిప్రాయాలను ఉటంకిస్తూ రావు కృష్ణారావు గారు చేసిన రచనను మార్కిస్టుల కంటే మార్క్సిస్టు వ్యతిరేకులు కూడా చదవటం అవసరం. మతం పట్ల మార్క్సిజం ఏం చెబుతోంది అని తెలుసుకోవడానికి ఇది ఒక ప్రామాణిక పత్రంగా చెప్పవచ్చు.

(ఈ కింది రెండు రచనలను బ్లాగ్ పాఠకులకు అందివ్వమని కోరడమే కాకుండా రావు కృష్ణారావు గారి రచనను కూడా తన గ్రూపు నుంచి తీసి అందించిన అమరయ్య గారికి (సాక్షి ఉద్యోగి, సీపీఐ అభిమాని) ధన్యవాదాలు. ఆలోచనాత్మకమైన రచనలను అందించిన ఈ ఇద్దరు రచయితలకు అభినందనలు)

                                             ****************

'ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప..’ 
'బూర్జువా ప్రజాస్వామ్యం’లో పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను నిరంకుశంగా అమలు చేస్తూనే.. అదంతా ప్రజా సంక్షేమానికేనని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి ద్విపాత్రాభినయంలో వారికి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తారకమంత్రంగా చెప్పుకుంటూ సురక్షితంగా కాలక్షేపం చేసే వామపక్ష నేతలు గట్టి పోటీదారులేనని చాలా సందర్భాల్లో రుజువైంది. తక్కిన సందర్భాల్లో మాట విడిచిపెట్టినా ఎన్నికలప్పుడు వారు తమ ద్విపాత్రాభినయానికి ’గతితార్కిక చారిత్రకభౌతికవాద’ సిద్ధాంతపు  ముసుగును కప్పుకుంటుంటారు. ఓ ఎన్నికలప్పుడు ’ప్రపంచ బ్యాంకుకు పెద్ద పాలేరు’గా కనిపించిన బూర్జువా నేతే తర్వాతి ఎన్నికల్లో జట్టు కట్టదగ్గ జనప్రియుడిగా కనిపిస్తాడు.

తన  ప్రధాన బలాల్లో హేతువాదం ఒకటైన మార్క్సిజం ’లౌకిక’ సమస్యలకు వైయక్తిక విశ్వాసాలతో కూడిన పరిష్కారాన్ని అణుమాత్రం అంగీకరించదు. ’మతం మత్తుమందు’ అన్న మార్క్స్‌ దేవుడిని నమ్మలేదు, కానీ దేవుడిని నమ్మే కోట్లాది మందిని ప్రేమించాడు. అయితే వారి సమస్యలూ, సంక్షోభాల పరిష్కారానికి దేవుడితో ముడిపెట్టబోతే మాత్రం తప్పక దుడ్డుకర్ర పుచ్చుకుని తరిమి ఉండేవాడు. ప్రతి అడుగూ మార్క్సిజం వెలుగులో వేస్తామనే కమ్యూనిస్టు నాయకుల్లోనూ మార్క్స్‌ దుడ్డు కరక్రు గట్టి పని చెప్పేవాళ్లున్నారనడానికి  తాజా ఉదాహరణ సీపీఐ నేత కె.నారాయణ. ఆయన నిన్న భార్యతో కలిసి తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు.

దేవుడిపై నమ్మకం పోయిందంటూనే దేవుడికి (దేవుడిని నమ్మే వాళ్లకి కాదు సుమీ!) వ్యతిరేకం కాదన్నాడు. తాను మాటల ఈటెలు దూసే బూర్జువా నాయకులకన్నా ద్విపాత్రాభినయంలో ’ఒళ్ళు జలదరించే’ స్థాయిలో మెప్పించాడు. పార్లమెంటులో ఉన్న వందలాదిమంది ఆర్ధిక నేరగాళ్ళను ’గాడిలో పెట్ట’మని (శిక్షించమని కాదు సుమీ!) ఆయన వెంకన్నను  కోరాడు. పార్లమెంటు సహా దేశంలో ఉన్న ఆర్ధిక నేరస్థుల్లో ఎక్కువమంది నుంచి భారీ మొత్తాల్లో ముడుపులు అందుకునేది వెంకన్నేనని –పాపం.. తాను ఆ మధ్య తినకుండా వదిలిన కోళ్ల సాక్షిగా ఆయనకు తెలీదనుకోవాలి కాబోలు! సహధర్మచారిణి కోరిక మేరకు వెంకన్న గుడికి రావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పాడు.

కమ్యూనిస్టులది చిన్న కుటుంబం కాదు.. వారి స్వప్నమే వసుధైక కుటుంబం. ఆ కుటుంబంలో ముఖ్య సభ్యులైన శ్రామికుల్లోనూ పీఠాధిపతుల్నీ, బాబాల్నీ నారాయణ భార్య వెంకన్నను నమ్మిన దానికన్నా బలంగా నమ్మే వాళ్ళున్నారు. వాళ్ళు కూడా ఆర్థిక నేరస్తుల్ని గాడిలో పెట్టడానికీ, దోపిడీ పీడనలను అంతమొందించడానికీ పలానా బాబా లేదా పీఠాధిపతి పాదధూళే పరిష్కారమని అంటే.. నారాయణ వెళతారనే ఆశిద్దాం. ’మతం మత్తుమందు’ అన్న నోటితోనే 'మతమే అన్నింటికీ మందు’ అని అనేసీ; ’పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అని నినదించిన నోటితోనే ’ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప’ అని నినదించేస్తే .. నారాయణ గారి ద్విపాత్రాభినయం పరిపూర్ణమవుతుంది సుమీ!
–యు. సూర్యచంద్ర రావు,
మొబైల్ 96766 35017

                                    *********************

మార్క్సిజాన్ని, దేవుణ్ణి ఏకకాలంలో విశ్వసించే వీలులేదా?
యువమిత్రుడు కళ్యాణ్ అడిగిన ప్రశ్న ఇది. నాకు చాతనైనంత మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. మార్క్సిజం కేవలం ఒక రాజకీయ సిద్దాంతం కాదు. అది ఈ ప్రపంచాన్ని, అందులో మన జీవితాన్ని అర్ధంచేసుకునే ఒక సాధనం. కేవలం అది ఒక రాజకీయ సిద్దాంతమైవుంటే సోవియట్ యూనియన్ పతనం, చైనా పెట్టుబడిదారీ విధానాలకు మళ్ళడం జరిగిన వెంటనే అది అంతరించిపోయి ఉండేది. ప్రస్తుతం అమెరికా, యూరపుల్లో పైశ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు. మార్క్సు సాదాసీదా మేధావి కాడు. అందుకే 2000 సంవత్సరంలో BBC నిర్వహించిన పోల్ సర్వేలో మార్క్సు సహస్రాబ్ది మేధావిగా ఎన్నికయ్యాడు. ఆయన్ను ఎన్నుకున్నవారు కమ్యూనిస్టులు కారు.

చరిత్ర తొలినాళ్ళనుండీ నాస్తికత్వం వ్యాప్తిలో ఉంది. మధ్యయుగాల్లో మతవ్యవస్థలు బలపడి నాస్తికులను, వారి రచనలను భౌతికంగా నాశనం చేశారు. ప్రాచీనకాలంలోను, రినైజాన్స్ యుగంలోనూ, నాస్తిక, హేతువాదాలదే పైచేయి. అయితే నాస్తిక తత్వవేత్తలు, హేతువాదులు చెప్పలేకపోయినదాన్ని మార్క్సు చెప్పాడు. చాలా మంది మత, దైవ విశ్వాసాలకు కారణం భయం, అజ్ఞానం అన్నారు. ఏ తత్వవేత్త చూపనంత సానుభూతిని మార్క్స్ విశ్వాసులపట్ల చూపాడు. వారి మతవిశ్వాసాలకు వారినే బాధ్యుల్ని చేయకుండా సామాజిక కారణాలను వివరించగలిగాడాయన. దుర్భరజీవిత పరిస్థితుల నుండి ఊరటకోసం ప్రజలు ఈ విశ్వాసాలను కల్పించుకుంటారని, నిజజీవితంలో ఈ దుర్మార్గాన్ని, దైన్యాన్ని తొలగిస్తే విశ్వాసాలు తొలగి పోతాయని ఆయన అభిప్రాయం. మార్క్సు మతం గురించి చెప్పింది చాలా తక్కువ. అయితే అది చాలా విలువైనది. ఆయన చెప్పిందాంట్లోంచి కొన్ని వాక్యాలను ఉటంకిస్తాను.

".......... మతానికి విరుద్దంగా చేసే విమర్శకు పునాది ఏమిటంటే, మానవుడే మతాన్ని నిర్మిస్తాడుగాని మతం మానవుణ్ణి కాదు. మతం అంటే ఇంకా తననుతాను తెలుసుకోలేకపోయిన లేదా అప్పటికే తిరిగి కోల్పోయిన మనిషి స్వీయ చైతన్యం, అత్మగౌరవం.... మానవుడే మానవ ప్రపంచం. అతడే రాజ్యం. అతడే సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం తలక్రిందుల ప్రపంచం కనుక, తలక్రిందుల ప్రపంచ చైతన్యమైనటువంటి మతాన్ని ఉత్పత్తి చేశాయి.

మతం ఈ ప్రపంచ సాధారణ సిద్దాంతం. దాని విజ్ఞాన సర్వస్వ సంగ్రహం, దాని జనరంజక తర్కం. దాని ఆధ్యాత్మిక ఆత్మగౌరవానికి షరతు. దాని ఉత్సుకత. దాని నైతిక సమర్ధన, దాని పవిత్ర పూరకం, ఓదార్పుకి, విముక్తికి దానికున్న సార్వత్రిక మూలం. మతం మానవ సారం యోక్క మనఃకల్పిత వాస్తవీకరణ. ఎందుకంటే నిజానికి మానవసారమంటూ ఏమీ లేదు. అందుచేత మతానికి వ్యతిరేకంగా చేసే పోరాటం, మతాన్ని ఆధ్యాత్మిక సుగంధంగా కలిగిన ప్రపంచానికి వ్యతిరేకంగా చేసే పరోక్ష పోరాటమే!

మతవేదన నిజమైన వేదనకు వ్యక్తీకరణేగాక నిజవేదనకు వ్యతిరేకంగా నిరసన కూడా! మతం అణగద్రొక్కబడిన జీవి నిట్టూర్పు. నిరుత్సాహ పూరిత పరిస్థితుల్లో అది ఒక స్పూర్తి అయినట్లే హృదయంలేని ప్రపంచానికి అది హృదయం. అది ప్రజలకు నల్లమందు......."

1950 ప్రాంతం వరకు ప్రపంచవ్యాప్తంగా నల్లమందు(opium)ను పెయిన్ కిల్లర్ గా వాడేవారు. అది చాలా ప్రభావశీలంగా పనిచేసేది. నాకు తెలిసి 1980 వరకు opium derivativesని డాక్టర్లు prescribe  చేసేవారు. వాటి దుష్ఫలితాలవల్ల కాలక్రమేణా వాటి వాడకాన్ని నిషేధించారు.

మనుషులు(మనందరం కూడా) ఊహాలోకాల్లో విహరిస్తూ మనం ఏమికావాలనుకున్నామో దాన్ని అక్కడే తీర్చుకుంటాం. దీన్ని day dreaming అంటారు. ఇది చాలా హాయినిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు వాస్తవ జీవితం మనల్ని తట్టిలేపుతుంది. పగటి కలలు శృతిమించితే వాస్తవ జీవితం నుండీ పారిపోయి అన్నివిధాల విఫలమవుతారు. ఆధునిక మానవుని పరిస్థితిని వివరిస్తూ జీన్ పాల్ సార్త్ ఇలా చెబుతాడు.

‘కటికచీకటిలో నాలుగు రోడ్ల కూడలిలో నిలిచి ఎటు వెళ్ళాలో తెలియక ఎవరికీ వినపడని పిచ్చి కేకలు వేసే వాడు’ అంటాడు. ఇలాంటి దుర్భర పరిస్థితి నుండి కాస్త ఊరట కోసం భ్రమలను ఆశ్రయిస్తాం.వాడగా, వాడగా నల్లమందు మోతాదు సరిపోనట్లే ఈ భ్రమలు కూడా! మార్క్స్ చెప్పినదాని ప్రకారం దీన్నుండి బయట పడటానికి భ్రమలవసరమయ్యే పరిస్తితులపై పోరాడాలి. మనం పోరాటం ప్రారంభించిన వెంటనే పరిస్థితులు మారిపోకపోయినా మనకు భ్రమల అవసరం తీరిపోతుంది.

మార్క్సుకి నాస్తికత్వం, మత విమర్శ లేదా రాజకీయం ఇవన్నీ ప్రధమ ప్రాధాన్యత లేదా అంతిమ లక్ష్యం కావు. ఆయన ఏకైక ధ్యేయం మానవ శ్రేయస్సు, స్వేచ్చ, విముక్తి. మానవుడే ఆయన సిద్దాంతానికి కేంద్రబిందువు. అటువంటి మానవాభ్యుదయాన్ని ఎలా సాధించాలనే ఆలోచనల్లోనే మిగిలినవన్నీ వస్తాయి. మార్క్సు మతాన్ని నల్లమందుతో పోల్చాడు. అది శారీరక, మానసిక బాధలన్నిటిని ఉపశమింపజేసి తాత్కాలికంగా హాయినిస్తుంది. అయితే దీర్ఘ కాలం ఇవి వాడితే మనిషిలో క్రియాశీలత, చురుకుదనం లోపించి మందబుద్దిగా చేస్తుంది.

మార్క్సిజానికి అధిష్టాన దేవతైన మానవుని విముక్తికి, అభ్యుదయానికి అడ్డుతగిలే దేన్నైనా మార్క్సిజం విమర్శిస్తుంది. మార్క్స్ తన యవ్వనకాలంలో ప్రొమీథియస్ అనే గ్రీకుపురాణ పాత్రను తన ఆదర్శంగా చెప్పుకున్నాడు. ఈ ప్రొమీధియస్ ఒక టైటాన్(ద్వితీయశ్రేణి దేవత). మనుషులు చలికి పడుతున్న బాధలను చూసి, చలించి స్వర్గంనుండీ నిప్పుని దొంగిలించి మనుషులకిస్తాడు. దేవుడు అతనికి కఠిన శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకు లొంగకుండా అతను 'I hate the pack of Gods' అని ప్రకటిస్తాడు. మార్క్స్ కూడా మానవాళి శ్రేయస్సుకోసం ఎన్ని బాధలైనా భరించడానికి సిద్దమయ్యాడు.

ఒక వ్యక్తి దైవాన్ని విశ్వసిస్తే మార్క్సిజానికి అతనితో పేచీలేదు. ప్రజాజీవితంలోకి మతం ప్రవేశించడాన్ని, వ్యవస్థీకృత మతాన్ని మార్క్సిజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రపంచ చరిత్రని పరిశీలిస్తే వ్యవస్థీకృతమైన మతం లేదా మత వ్యవస్థ నిర్వహించిన దుర్మార్గమైన పాత్ర అర్ధమవుతుంది. దేవుడి పేరుతో, మతం పేరుతో కోట్లాదిమందిని చంపారు. ఇంకా చంపుతున్నారు. అందుకే బెట్రాండ్ రస్సెల్, "వ్యవస్థీకృతమైన మతం మానవాళికి శాపం" అన్నాడు. రస్సెల్ మార్క్సిస్టు కాడు.

కొద్దిగా మార్క్సిజాన్ని చదువుకున్న నేను అందులో వంటబట్టింది రవ్వంతైనా నాలో చాలా మార్పు వచ్చింది. ప్రపంచాన్నేగాక, అందులో నాజీవితాన్ని, నన్ను నేను ఎంతో కొంత తెలుసుకో గలిగాను. అన్నిటినీ మించి నాకు  తెలియకుండానే ఆత్మగౌరవం ఏర్పడింది. ఈ ఆత్మగౌరవంతో బానిస భావాలను ధిక్కరించసాగాను. నన్ను కించపరిచే భావజాలాన్ని, వ్యవస్థలను కసిగా ద్వేషించసాగాను. 'నేను కూడా మనిషినే,మనిషిగా నేనేవ్వరికీ తీసిపోను’ అని చైతన్యవంతంగా ఫీల్ అవ్వసాగాను. నేను హిందువుగా శూద్రకులంలో పుట్టాను. నాలుగు కులాలను నేనే సృష్టించాను అని చెప్పే గీతను, శూద్రులు తమకంటే అధికులైన మూడుకులాలకు ఫలాపేక్షలేకుండా సేవచేయాలనే మనుధర్మ శాస్త్రాన్ని అంగీకరించకపోగా ద్వేషిస్తాను. పోనీ మతం మారదామంటే మానవులందరూ పుట్టుకతోనే పాపాత్ములు అని చెప్పే క్రైస్తవాన్నిగాని, "దేవా, నీ ముందు నేను ఏమీకాను" అంటూ గుండుగీయించుకుని, రోజుకి ఐదుసార్లు మోకరిల్లి నమాజు చేయవలసిన ఇస్లాంని గాని స్వీకరించలేను.

చిన్నతనంలో తల్లితండ్రుల ఆసరాతో పెరిగాను. ఊహతెలిసాకా ఈ సామాజిక కీకారణ్యంలో దేవుని ఆసరాగా చేసుకుని నడుద్దామనుకున్నాను. కానీ నేను ఎక్కడికీ వెళ్ళడంలేదని, వెలుగనే భ్రమలో చీకట్లో అక్కడే కొట్టుకుంటున్నానని అర్ధమయ్యింది. అందుచేత దేవుని ఆలంబన వదిలేసి ఇపుడు మనుషులనే ఆలంబనగా చేసుకున్నాను. చీకటిని జయించే మార్గాలకోసం వెతుకుతున్నాను. ఇదీ నాకు మార్క్సిజం నేర్పినది.

"తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వర్ణించారు. అసలు విషయం ఏమిటంటే మనం దాన్ని మార్చాలి" అనేది మార్క్స్ చెప్పిన సుప్రసిద్ద సూక్తి. మరో సందర్భంలో "పరిస్థితులు మనుషుల్ని రూపొందిస్తుంటే ఆ పరిస్థితుల్ని మనుషులే మార్చాలి" అని చెప్పాడు. మనిషి క్రియాశీల జోక్యంతో సమాజాన్ని మార్చాలని, ఆ ప్రయత్నంలో మనిషి మారతాడని మార్క్సిజం చెబుతుంది. సరిగా ఇక్కడే దైవ విశ్వాసానికి, మార్క్సిజానికి పేచీ వస్తుంది. తన జీవితాన్ని బాగుచేసే బాధ్యత దేవునిపై ఉంచుతాడు విశ్వాసి. మనిషి సమాజంలో విడదీయరాని భాగమని, ఆ సమాజ బాగుతోనే అతని బాగు సాధ్యమని మార్క్సిజం భావిస్తుంది. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి పాలిస్తున్నాడని విశ్వాసుల నమ్మకం. ప్రజలే చరిత్ర నిర్మాతలని మార్క్సు చెప్పాడు. మానవాళి శ్రేయస్సుకోసం మనం ప్రయత్నించాలా లేక దైవాన్ని ప్రార్ధించాలా అనేది ఇక్కడ సమస్య. దేవుణ్ణి మనిషే సృష్టించుకున్నాడు, కాబట్టి ఈ ప్రపంచాన్ని కూడా మనిషే బాగుచేసుకోవాలనేది మార్క్సిజం వాదన.

మానవ ప్రయత్నాన్ని ఏ మేరకు నిరోధిస్తుందో ఆ మేరకు దైవవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తుంది మార్క్సిజం.

సమాజాన్ని దేశాన్ని మార్చి ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించేలా కృషి చేయడానికి ఆవిర్భవించింది కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ జాతీయ నాయకులే తమ బాగుకోసం దైవాన్ని ఆశ్రయిస్తే ఇక పార్టీ చేసే కృషి ఏముంటుంది? వారు తమ బాధ్యతలనుండి తప్పుకొని ఏం చేసుకున్నా అభ్యంతరముండదు. కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజమే తమ సిద్ధాంతమని చెప్పుకుంటాయి. అందుచేత మార్క్సిజాన్ని నమ్మేవారంతా అటువంటి చర్యలను విమర్శిస్తారు.
–రావు కృష్ణారావు.

                                        *****************

"ప్రస్తుతం అమెరికా, యూరపుల్లో పైశ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు."

రావు కృష్ణారావు గారు అమెరికా, యూరపుల్లో పై శ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు అని ఒక విషయం తన రచనలో వెల్లడించారు. దానికి చిన్న చేర్పు... పై శ్రేణి మేధావులే కాదు.. కింది శ్రేణి భవిష్యత్ మేధావులు సైతం మార్క్స్ ని తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారని ఇటీవలే హైదరాబాద్ నగర ఇంటెలిజెన్స్ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన ఒక రిపోర్టులో వెల్లడించినట్లు తెలియవస్తోంది. దళిత, అస్తిత్వ ఉద్యమాల కేంద్రంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 2,500 మంది విద్యార్థులు ఉంటే వారిలో కనీసం 750 మంది వివిధ వర్గాల విద్యార్థులు మార్క్స్ రచనలను తీవ్రంగా అద్యయనం చేస్తున్నారని సాక్షాత్తూ  ఇంటెలిజెన్స్ శాఖ నివేదించడం సంచలనాత్మకం. కాగా ఇది మార్క్సిజం పునరుజ్జీవమవుతున్నదనటానికి తిరుగులేని సంకేతంగానే చూడవచ్చా...?

32 ఏళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీలో తెలుగు విభాగం ప్రొఫెసర్ మద్దూరి సుబ్బారెడ్డి గారు క్లాసుచెబుతూ పదే పదే ఒక విషయం చెప్పేవారు. 'మార్క్సిజాన్ని వ్యతిరేకించండి కానీ ముందుగా అదేెం చెబుతోందో చదవండి' అనేది ఆయన సూక్తి. పైగా మార్క్సిజాన్ని వ్యతిరేకించేవారు కూడా ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయకుంటే వారి వారి అవగాహనల్లో ఏర్పడేది పాక్షికత్వమే అని ఆయన సోదాహరణపూర్వకంగా చెప్పేవారు. సీపీఐ నేత కె. నారాయణ గారి లాగే పరమ సాంప్రదాయిక కుటుంబంలో పెరిగి.. విశ్వవిద్యాలయ చదువు వరకు రాగలిగిన నేను... 1984లో అప్పుడప్పుడే ఎస్వీయూ లైబ్రరీలో సృజన, ఈపీడబ్ల్యూ వంటి పత్రికల ద్వారా, విశాలాంధ్ర బుక్ షాప్ సందర్శన ద్వారా సమాజాన్ని కొత్తగా చదువుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ సుబ్బారెడ్డి గారి సూచనలు నాలో అధ్యయన కాంక్షను మరింత పెంచాయే కాని తగ్గించలేదు. జాతీయోద్యమ కవిత్వం మీద ఆయన పీహెచ్‌డీ చేశారు. యూనివర్సిటీ రాజకీయాల్లో ముఖ్యంగా కుల రాజకీయాల్లో ఆయన పాత్ర ఒక మేరకు ఉంటున్నా ఒక విధమైన ఉదారవాద ఆలోచనలు ఆయన క్లాసుద్వారా, బోధనల ద్వారా నాలాంటి వారిమీదా ప్రభావం వేశాయనుకుంటాను.

'మార్క్సిజాన్ని వ్యతిరేకించండి కానీ ముందుగా అదేెం చెబుతోందో చదవండి'

ఈ ఒక్కమాటతో ఆయన నాకు గౌరవనీయ వ్యక్తి అయిపోయారు. ఇప్పుడు యూరప్ మేధావులు, మన వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రేపటి మేధావులు కూడా మార్క్సిజాన్ని అధ్యయనాంశంగా ఎంచుకోవడం  గమనార్హం.

'యూరప్‌ని కమ్యూనిజం భూతం ఆవహించింది' అనేది మార్క్స్ ఎంగెల్స్ సుప్రసిద్ధ రచన 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో తొలి వాక్యం. కానీ....

మార్క్స్ 'భూతం' ప్రపంచాన్ని ఇంకా పట్టి ఊగిస్తూనే ఉన్నట్లుంది మరి..


5 comments:

Anonymous said...

Marxism- a failure story

Anonymous said...

Apparently... theism is not a failure :-)

Zilebi said...




దేవుడే పెద్ద మార్క్సిస్టు, లెనినిస్టు, కమ్యూనిష్టు !

అతన్ని నమ్మక పోవడ మేమిటండి చోద్యం గాక పోతేను !




జిలేబి

Anonymous said...

The last resort of a rouge is only politics. The last resort of a communist is...

Anonymous said...

Not sure about the last resort but the saying goes like "Piety is often the first resort of a scoundrel" which could loosely be translated to "భక్తి ధూర్త లక్షణం"

Post a Comment