Pages

Saturday, November 12, 2016

వ్యవస్థీకృత హింసతో ప్రజాస్వామ్యం సాధ్యమేనా?

"ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించుకోవడమే లక్ష్యమైన స్థితిలో కేవలం తమ సొంత తృప్తి కోసం కాక పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య పొంతన లేకపోవడం కూడా సమస్యనే. స్వాతంత్ర్యానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని స్థితి భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచిపోతున్నాయి అనో.. చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక  మూల సాయుధ వామపక్ష రహస్యోద్యమం.. అది ఎంత అశక్తమైనదీ, పెద్దగా సానుకూల ఫలితాలు సాధించలేనిదీ అయినా సరే... ఒకమేర పీడితులకు, వ్యవస్థాపరమైన అన్యాయాన్ని సహించని వారికీ అది ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా కనిపించడాన్ని మాత్రం అసంబద్ధం అనలేము"

అంటున్నారు హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లోని రాజనీతి శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ వాగీశన్ గారు. ప్రజాస్వామ్యం ప్రబోధించే స్వేచ్ఛా సమానత్వాల మధ్య ఒక క్రియాత్మకమైన సమతూకాన్ని మన సామాజిక వ్యవస్థ, దాని పాలకవర్గాలు నెలకొల్పడంలో విఫలమైన ప్రతి చోటా ఆ వైఫల్యపు తీవ్రత, అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నది వీరి అభిప్రాయం.

సాయుధ పోరాటాలు హింసకు (వారి పరిభాషలో ప్రతిహింస) ప్రాధాన్యమిస్తున్నాయి కాబట్టి వీటిని క్రూరంగా అణిచివేయడమే పరిష్కారమని మన దేశ మధ్యతరగతి ప్రజానీకంలో అతి పెద్ద సెక్షన్ బలంగా అభిప్రాయపడుతున్న నేటి కాలంలో "హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మనచుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించక పోవడం, పక్క వాడిని కులం పేరనో మతం పేరనో  చిన్న చూపు చూడటం, అడ్డమైన గడ్డితిని సంపాదనపరులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని.. నా చిన్ని పొట్టకు శ్రీ రామ రక్ష అనుకుంటూ.. ఎవడికి ఏం అయితేనేమి నేను బాగుంటే చాలుననే స్వార్థపూరిత చింతనే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటువంటి వాతావరణంలో నియమబద్ద ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదని గుర్తించడం ప్రస్తుతం అత్యవసరం. నిత్య జీవితంలో అన్యాయాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరంతరం సాగడం అవసరం" అని అంటున్నారు ప్రొఫెసర్ వాగీశన్ గారు.

మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్లలో చంపితే తప్పు అయితే, కోవర్టులనే పేరుతో సామాన్యులను, ప్రతీకార దృష్టితో పోలీసులను మావోయిస్టులు చంపటం తప్పు కాదా.. పౌరహక్కులనేవి మావోయిస్టులకేనా, సామన్యులకూ, పోలీసులకూ వర్తించవా? అంటూ ఉద్యమ వ్యతిరేకులే కాకుండా పౌర సమాజంలోని కొన్ని సెక్షన్ల ప్రజలు కూడా తీవ్రంగానే ప్రశ్నలు సంధిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో.. ప్రజాస్వామ్య వైఫల్యమే సమస్త ఉద్యమాల పుట్టుకకు, కొనసాగింపుకు మూలం అని ఈయన చెబుతున్నారు. ఆ పోరాటాల, ఉద్యమాల శక్తి, వాటికి దొరికే మద్దతు సంశయాత్మకమే అయినా.. వాటి సామర్థ్యాలు, వాటి విజయావకాశాలు కూడా సందేహాస్పదమే అయినప్పటికీ ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని వాగీశన్ అంటున్నారు. 

సాయుధ పోరాటాలకు గతంలో ఉన్న మద్దతు ఇప్పుడు తగ్గినట్లు కనిపించడానికి కారణాలను చెబుతూనే.. ఏది అభివృద్ధి  అనే చర్చ, దేశంలోని  ప్రతిఒక్కరికీ, గౌరవప్రదమైన బతుకుదెరువు ఏమిటి  అన్న చర్చ ప్రజాస్వామ్యానికి అత్యవసరం. కానీ వ్యవస్థీకృత హింస ఈ చర్చలను సాగనివ్వదంటున్నారు.. రాజ్యమూ, సమాజమూ, మార్కెట్టూ అనే మూడు వ్యవస్థలు అనేక రూపాల్లో శక్తిమంతుల ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహాలతో సాగుతున్నప్పుడు ఆ వ్యూహాలు నగరంలో, గ్రామంలో, అడవిలో వివిధ పద్ధతుల్లో అమలు అవుతున్నప్పుడు మనం ఏమిచేయాలి అన్న ప్రశ్నను నిరంతరం  వేసుకోవడం, సమాధానాలను, సమష్టి చింతన ఆచరణలో వెతుక్కోవడం తప్ప నియమ బద్ధ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే మార్గం మరోటి లేదు అంటున్న ప్రొఫెసర్ వాగీశన్ గారు "వ్యవస్థీకృత హింస - నియమబద్ధ ప్రజాస్వామ్యం - సాధ్యాసాధ్యాలు" అనే పేరిట రాసిన వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవగలరు.

మావోయిస్టులకు, మావోయిస్టు వ్యతిరేకులకు, ఎదురుకాల్పుల సమర్థకులకు, వాటి వ్యతిరేకులకు, సాధారణ ప్రజాస్వామిక వాదులకు అందరికీ ఇది ఒక అధ్యయనాంశంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయంతోటే ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ ప్రచురించడమైనది.

                               *****************

వ్యవస్థీకృత హింస - నియమబద్ధ ప్రజాస్వామ్యం - సాధ్యాసాధ్యాలు
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పోలీసు కాల్పుల వల్ల ముప్పై మంది మావోయిస్టులు  చనిపోయారన్న విషయం త్వరలోనే వార్తా పత్రికలలో కనిపించదు. అయితే సాయుధ వామపక్ష ప్రతిఘటన ఉద్యమం అనే రాజకీయ పోరాటం మాత్రం మన  ప్రజాస్వామ్యం పైన ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవలిసిన అవసరాన్ని, అదే నిజమైన ప్రజాస్వామిక విముక్తి  మార్గంగా నమ్మిన వారు కోల్పోయే ప్రాణాల ద్వారా గుర్తుచేస్తూ ఉంటుంది. ఏ యుద్ధంలోనైనా  మొదట హత్యకు గురియ్యేది సత్యమే అనేది అసత్యం  ఏమీ కాదు. మనం ప్రజాస్వామ్యంగా పిలుచు కుంటున్న, మనం వోట్ల రూపంలోనూ,  ఇతరత్రా కూడా, భయం వల్లనో, విశ్వాసం వల్లనో, అవసరాల వల్లనో, విధేయత చూపుతున్న ఈ పాలనా వ్యవస్థ  నియమబద్దతను పాటించి  ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు  సమాధానం  చెప్పే అవకాశం  తక్కువ.

ఈ సందర్భంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మాట్లాడటం అవసరం. ప్రజాస్వామ్యం  అన్న మాటకు ప్రజాదరణ  ఇరవయ్యో శతాబ్దం నుండి పెరిగింది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల మూక పాలన కాదనీ ప్రజలు తమ అనుభావాల  వెలుతురులో  చర్చించుకొని రూపొందించుకున్న నియమాల అనుసారం సాగే పాలన అనే అర్థంలో అది ప్రస్తుతం కొనసాగుతున్నది. అందుకే వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చే లిబరల్  కాపిటలిస్ట్ సమాజాలు కానీ,  సమానత్వానికి ప్రాధాన్యతను ఇచ్చే  ఒక మేర  సోషలిస్ట్ విలువలను నెలకొల్పే సమాజాలు గానీ తమ పాలనా రూపాలను ప్రజాస్వామిక  రూపాలు అనే పేర్కొంటున్నాయి.

మొత్తంగా ఏదో ఒక రూపంలో ఆయా స్థల కాల సందర్భాల్లో స్వేచ్ఛా సమానత్వాల మధ్య ఒక క్రియాత్మక  సమతూకం ( డైనమిక్  ఈక్విలిబ్రియం) నెలకొల్పడం అనే కత్తి మీద సామే  ప్రజాస్వామ్యం. అయితే తమను తాము ప్రజాస్వామికం అని ప్రకటించుకున్న రాజ్యాలు తమ పని తీరుల వల్ల సదరు రాజ్య వ్యవస్థనూ. అంటే దాని కోసం పనిచేస్తూ ఉండే ప్రభుత్వ వ్యవస్థనూ, అక్కడి ఆర్థిక వ్యవస్థనూ (అంటే మార్కెట్లను), సామాజిక వ్యవస్థనూ -  పైన పేర్కొన్న స్వేచ్ఛా సమానత్వాల సమతులనాన్ని పట్టించుకునేటట్టు చూడవలిసి ఉంటుంది. ఈ పని చెయ్యడంలో విఫలమైన ప్రతిచోటా ఆ వైఫల్యపు తీవ్రత అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు ఉంటాయి.

మన దేశంలో కూడా నిరాయుధ, సాయుధ పద్దతుల్లో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీరులో ప్రజల పట్ల మన ప్రభుత్వం వ్యవహార శైలి మీద, ఈశాన్య భారత దేశంలో మన సైన్యం జులుం పట్ల, ఆదివాసీ ప్రాంతాలల్లో వనరుల కోసం జరుగుతున్న విధ్వంసం పట్ల, గ్రామం నగరం అనే తేడాలేకుండా కొనసాగుతున్న అమానవీయమైన అవినీతి మీద ప్రతిఘటన సాగుతూనే ఉన్నది. ఆ పోరాటాల శక్తి, వాటికి దొరికే మద్దతు సంశయాత్మకమే. వాటి సామర్థ్యాలు, వాటి విజయావకాశాలు కూడా సందేహాస్పదమే అయినా పోరాటాలు సాగుతూనే ఉంటాయి.

ఇటువంటి పోరాటాల వరుసలో, వ్యవస్థ  సమూల మార్పు కోసం సాగే పోరాటంగా తమను తాము  రూపొందించుకున్న మావోయిస్టు సాయధ విప్లవ పోరాటం  గత నలభై  సంవత్సరాల పైబడి  ఉనికిలో ఉన్నది.  “దోపిడీ  వర్గాల చేతులలో ఉండే అధికారం ఎప్పటికీ ప్రజాస్వామికంగా  రూపొందదు. అందువల్ల  పీడిత వర్గాలు దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా ఈ వ్యవస్థను కూల దోసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ద్వారానే  విమోచన పొందుతారు” అనే విశ్వాసంతో వీరు పోరాడుతున్నారు. ఈ  సాయుధ పోరాటపు గమనం,  వారి విశ్వాసమూ, ప్రశ్నలకు అతీతమైనవి కావు. ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాలలో వనరుల మీద దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పట్టు బిగిస్తున్నాయి. ఆదివాసులు మునుపటికంటే ఎక్కువగా జీవన్మరణ పోరాటంలోకి నెట్టబడినారు. అందుకే సాయుధ పోరుకు మద్దతు అధికంగా ఉన్నది. అంటే అక్కడ మాత్రమె సమస్యకూ పోరాటానికి మధ్య బలమైన సంబంధం కనిపిస్తున్నది. మైదాన ప్రాంతాలలో ఒకనాడు ఈ ఉద్యమానికి (కనీసం తెలుగు ప్రాంతాలలో) ఉన్న మద్దతు ఇప్పుడు కనిపించడం లేదు. దాని అర్థం మైదాన ప్రాంతంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సమస్యలు  ఏమీ లేవని అర్థం కాదు.

మన దేశంలో ఆర్ధిక సరళీకరణ మొదలైనప్పటినుండి అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఒక మేర దారుణమైన పోలీసు చర్యల ద్వారా, ఇంకొక మేర ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపే పీడిత కుల వర్గ శ్రేణులు రాజ్యంతో ఒక మేర సామరస్యం ద్వారా (ఎంగేజ్‌మెంట్)  ద్వారా తమ  సమస్యలు తీరుతాయి అనీ, నిరంతర సంఘర్షణ ( కాన్ఫ్రంటేషన్) పెద్దగా ఫలించదు అని భావించడం వల్ల పోరాటానికి మద్దతు తగ్గింది. దీనితో పాటు రాజ్య యంత్రానికున్న వివిధ తీర్ల నిఘా (సర్వైలెన్స్) సామర్థ్యం పెరగడం ద్వారా కూడా సాయుధ రహస్య ఉద్యమానికి మద్దతు కొంత తగ్గింది. ఎంగేజ్ మెంట్ మార్గం ద్వారా పీడిత కుల వర్గ  శ్రేణుల జీవితాల్లో ఎటువంటి సానుకూల మార్పు వచ్చింది అనే అంశంపై ఇంకా శాస్త్రీయ సామాజిక ఆర్ధిక విశ్లేషణ చెయ్యవలిసి ఉన్నది.

ముఖ్యంగా  సాయుధ  రహస్యోద్యమం  ద్వారా  మాత్రమే  సానుకూల మార్పు సాధ్యం అని భావించే వారు కొంత  నిష్పాక్షికంగా అధ్యయనం చేయవలిసి ఉన్నది. ఈ స్థితిలో కొన్ని పరిణామాలు మాత్రం నిశ్చయంగా జరిగినాయి. ఒకటి పోలీసుల శక్తి  విపరీతంగా పెరిగింది (అంటే వారి  విచారణా, నేర నిరోధ సామర్థ్యం చట్ట బద్ధ వ్యవహారం పెరిగిందని అర్థం కాదు) సామాన్యుల నిత్య జీవన వ్యవహారాల్లో దీని ప్రభావం చాలా ఉన్నది.  రాజ్యంతో ఎంగేజ్‌మెంట్ మార్గంలో పయనించిన, పయనిస్తున్న వారిలో పెద్ద భాగం తమ వ్యక్తిగత శక్తిని  పెంచుకునే నూతన పైరవీకారు సెక్షన్‌గా రూపొందినారు. మరోవైపున వ్యవస్థీకృత హింస రూపాలు వాటి పని తీరు విస్తరిస్తూ ఉన్నాయి.

వ్యవస్థీకృత హింస - అప్రజాస్వామ్యం  క్రూరమైన కవలలు
వలసపాలన అనంతర సమాజాల్లో పాలనా వ్యవస్థల్లో,  ప్రభుత్వ యంత్రాగం పనిలో, వాణిజ్య  వస్తు సేవల వినిమయ క్షేత్రమైన మార్కెట్టు, సాంస్కృతిక నిర్మాణ నియంత్రణ క్షేత్రమైన  సమాజం మూడూ చాలా పకడ్బందీగా హింసను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ మూడు నిర్మాణాల మీద  పాత వలస రాజ్యాల పెత్తనం వివిధ రూపాల్లో సాగుతూ ఉంటున్నది. అవి  ప్రపంచ  ఆధిపత్యాన్ని నెరిపే పనిలో నిరంతరం ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్తీకృత హింసగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో అమలు అవుతూ ఉంటుంది. దేశీయ ప్రాంతీయ సందర్భంలో  ఈ వ్యవస్థీకృత హింస ద్వారా మేలు పొందే శక్తుల మధ్య మైత్రి ఉంటుంది. సంపద కేంద్రీకరణ, కొత్త కొత్త పద్దతుల్లో పెత్తందారీ సామాజిక, సాంస్కృతిక  సంబంధాలను  నిలపడం, వీటికి అవసరమైన రాజకీయ ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించడం అనేవి వ్యవస్థీకృత హింసకుఉండే లక్ష్యాలూ సాధనాలు. ఏది అభివృద్ధి  అనే చర్చ, దేశంలోని  ప్రతిఒక్కరికీ, గౌరవప్రదమైన బతుకుదెరువు ఏమిటి  అన్న చర్చ ప్రజాస్వామ్యానికి అత్యవసరం. కానీ వ్యవస్థీకృత హింస ఈ చర్చలను సాగనివ్వదు.

నియమబద్ధ ప్రజాస్వామ్యం అంటే అనేక రీతుల్లో ఆధిపత్యాన్ని తిరస్కరించడం.  స్వేచ్చా సమానతలతో కూడిన పరస్పర సహకార సంబంధాలను పెంపు చేసి కాపాడుకోవడం అని అర్థం. వ్యవస్థీకృత హింస కంటికి కనిపించే తీరులోనూ, కనిపించని  తీరులోనూ మన నిత్య జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే  ఈ హింసకు వ్యతిరేకమైన ఆలోచన కార్యాచరణలో ఉండటం అనేది సామాన్యమైన విషయం  కాదు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ హింసమీద కేవలం సాయుధ రహస్య ఉద్యమం ద్వారా విజయం సాధించడం సులభం కాదు. అది కేవలం అప్పుడప్పుడు చేసే పెద్ద చప్పుడుగా మిగిలిపోయే అప్రాధాన్య స్థితిలోకి  జారుకుంటుంది.

మన నిత్య జీవితంలో మనలను నిరంతరం పీడిస్తున్న సమస్యల పట్ల  మనం వ్యక్తులుగానూ బృందాలుగానూ స్పందించే  స్వభావాన్ని నిరంతరం పెంచుకోవడమే మన ముందున్న మార్గం. మాటలు కోటలు దాటించడం మాని, మనం ప్రతినిత్యం  హింసను ఎదుర్కొనే చర్చ- చర్య అనే జీవన విధానంలోకి  మారడం అవసరం. చాలా  దారుణంగా మనుషులను  పీడించే అంశాలను ఎట్టి పరిస్థితిలో మనం సాధారణంగా ఆమోదించే విలువగా (నార్మల్ వాల్యూ) మారకుండా ప్రయత్నం చేయవలిసి ఉంటుంది.  రాజ్యమూ, సమాజమూ, మార్కెట్టూ అనే మూడు వ్యవస్థలు అనేక రూపాల్లో శక్తిమంతుల ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహాలతో సాగుతున్నప్పుడు ఆ వ్యూహాలు నగరంలో, గ్రామంలో అడవిలో వివిధ పద్ధతుల్లో అమలు అవుతున్నప్పుడు మనం ఏమిచేయాలి అన్న ప్రశ్నను నిరంతరం  వేసుకోవడం, సమాధానాలను, సమష్టి చింతన ఆచరణలో వెతుక్కోవడం తప్ప నియమ బద్ధ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే మార్గం మరోటి లేదు.

ఏది ఏమైనా ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించు కోవడమే వ్యక్తిత్వ వికాసమైన స్థితిలో, అది విశాల జనామోదం పొందుతున్న కాలంలో కేవలం తమ  స్వంత తృప్తి  కోసం కాకుండా, పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని  పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య  లేని పొంతన ఒక సమస్యనే. స్వాతంత్ర్యానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని అప్రజాస్వామిక స్థితి నేడు భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచి పోతున్నాయి అనో..  చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక  మూల సాయుధ వామపక్ష రహస్యోద్యమం అది ఎంత  ఆశక్తమైనదీ, పెద్దగా సానుకూల   ఫలితాలు సాధించ లేనిదీ అయినా ఒక మేర పీడిత  సముదాయాలలోని వారికీ, వ్యవస్థాపరంగా జరుగుతున్న అన్యాయాన్ని సహించని వారికీ ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా  కనిపించడాన్ని మాత్రం అసంబద్దం అనలేము. 

వ్యవస్థీకృత హింసను మనం వ్యక్తుల  స్థాయిలో, కుటుంబాల స్థాయిలో,  కులాల లేదా ఇతర సాంస్కృతిక సముదాయాల స్థాయిలో  గుర్తించి తీరాలి. అట్లనే వాటికి బయట ఉన్న(వాటితో బలంగా సంబంధం గల)  సామాజిక-సాంస్కృతిక, ఆర్ధిక, రాజ్య సంబంధ నిర్మాణాల పనితీరులో నిరంతరం గుర్తించడం, ఎదుర్కోవడం చెయ్యవలిసి ఉంటుంది. ఎందుకంటే  ఆ హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మనచుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించక పోవడం, పక్క వాడిని కులం పేరనో మతం పేరనో  చిన్న చూపు చూడటం, అడ్డమైన గడ్డితిని సంపాదన పరులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని నా చిన్ని పొట్టకు శ్రీ రామ రక్ష అనుకోని  ఎవడికి అయితేనేమి నేను బాగుంటే చాలుననే  చింతననే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటువంటి వాతావరణంలో నియమబద్ద ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదని గుర్తించడం ప్రస్తుతం అత్యవసరం. నిత్య జీవితంలో అన్యాయాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరంతరం సాగడం అవసరం.

వ్యవస్తీకృత హింసనూ, దానిని పెంపొందించే అప్రజాస్వామిక వ్యవస్థను మనం ప్రాణ హాని లేని, లేక తక్కువ ప్ర్రాణ హాని ఉండే ప్రయత్నాల ద్వారా లేదా ప్రజాస్వామికంగా మార్చుకోగలమా  అన్న కీలకమైన, తప్పించుకోలేని ప్రశ్న.. ఇటువంటి మరణాలు సంభవించిన ప్రతిసారీ ముందుకొస్తుంది. ఈ  ప్రశ్నను ఎదుర్కొని దానికి సమాధానం వెదికే పయనమే సమాజంలో ప్రజాస్వామిక జీవితాన్ని నిలిపే పోరాటమనీ, దాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోవడం అవసరమని మనం గుర్తించాలనీ ఈ రకమైన మరణాలు మనలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాయని గ్రహించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం.

3-11-2016
హెచ్ .వాగీశన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ , నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్.
ఈమెయిల్: vajimukha@gmail.com


ఆలోచనాత్మకమైన ఈ వ్యాసం సంక్షిప్తపాఠం కింది లింకులో చూడవచ్చు

ఆ కాల్పులు వ్యవస్థకే సవాళ్లు..!
http://www.sakshi.com/news/vedika/aob-encounter-challengings-for-our-system-421428?from=inside-latest-news

సాక్షి సౌజన్యంతో...

2 comments:

Pramod said...
This comment has been removed by the author.
kanthisena said...

ప్రమోద్ పంపిన వ్యాఖ్యను బ్లాగ్ ఆథర్ తొలగించినట్లు ఇక్కడ చూపుతోంది. నేనయితే ఆ వ్యాఖ్య ఏంటో కూడా చూడలేదు. తొలగించటం అసలే చేయలేదు. గతంలో కూడా నీహారిక గారు నా గత టపాల్లో పెట్టిన వ్యాఖ్యలు ఇలాగే తొలగించినట్లు వచ్చింది. ఇదెలా జరుగుతోందో అర్థం కాలేదు. ప్రమోద్ గారూ వీలయితే మీ వ్యాఖ్యను మళ్లీ పోస్ట్ చేయగలరు

Post a Comment