Pages

Sunday, November 27, 2016

ప్రజలపై యుద్ధ ప్రకటన పెద్ద నోట్ల రద్దు


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు దేశీయ కరెన్సీపై భారతీయులు శతాబ్దాలుగా పెట్టుకుంటూ వచ్చిన విశ్వాసాన్ని పటాపంచలు చేసిపారేసిందా? నోట్లమార్పిడి అనే పెద్దపులిపై మోదీ స్వారీ చేస్తున్నారా? తాననుకున్నది చేయడం తప్ప ఏ ఒక్క విలువనూ, రాజ్యాంగ సంప్రదాయాలను పాటించని మోదీ.. పెద్ద నోట్ల రద్దుద్వారా భారత ప్రజలపై యుద్ధప్రకటనను చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అవుననే సమాధానమిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది యావత్ప్రపంచంలో శాంతికాలంలో కనీవినీ ఎరిగి ఉండని ఘటన అనీ, ఏ నియంతా సొంత ప్రజలను ఈ విధంగా సవాలు చేసిన చరిత్ర ఇంతవరకూ లేదని (పిచ్చి తుగ్లక్ అనే మధ్యయుగ చక్రవర్తి దీనికి మినహాయింపుగా చెప్పవచ్చేమో) పుల్లారావుగారంటున్నారు. సగటు మనిషి భారతీయ రూపాయిపై ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడనీ. వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్న రూపాయిని. మోదీ చిత్తుకాగితంలా మార్చేశారనీ,  మోదీ కానీ మరెవరైనా సరే తమ డబ్బును ఉన్నఫళాన విలువలేనిదిగా మార్చివేస్తారని జనంకు తెలిసివచ్చిందనీ, ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించగలదని అర్థమైందనీ, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రూపాయి పరువు దిగజారిపోయిందనీ ఈయన స్పష్టం చేస్తున్నారు.

1812లో నాటి రష్యాపై అనాలోచిత యుద్ధం ప్రకటించి ఘోరంగా దెబ్బతిన్న నెపోలియన్ చక్రవర్తి కానీ, సోవియట్ యూనియన్‌పై శాంతి సంధి చేసుకుని కూడా 1941లో ఆ దేశంపై ఆకస్మిక దురాక్రమణ దాడి ప్రారంభించి, రెండో ప్రపంచ యుద్ధంలో అనూహ్య ఓటమికి గురైన అడాల్ఫ్ హిట్లర్ కానీ.. ఎందుకు తమను తాము ధ్వంసం చేసుకుని, సర్వస్వం కోల్పోయారన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారని ఈయన అంటున్నారు. తెలివైన, శక్తిమంతులైన మనుషులు తమకు తాముగా తప్ప తమ శత్రువులద్వారా ఎన్నడూ ఓటమికి గురికారని పై రెండు ఘటనల బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చునని కూడా ముక్తాయిస్తున్నారు.

గత రెండేళ్లుగా రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు సాక్షిలో వ్యాసాలు రాస్తున్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనతో మోదీ పాలనను పోలుస్తూ చాలా వ్యాసాలలో మోదీ నిర్ణయాలను ఆయన సమర్థిస్తూ వచ్చారు. కానీ 130 కోట్లమంది భారతీయులను ఒక్కసారిగా రోడ్లపైకిలాగి బ్యాంకులముందు సాగిలపడేటట్లు చేసిన పెద్దనోట్లరద్దు విషయంలో మోదీ ప్రభుత్వం, బీజేపీ నేతల అహంభావ వైఖరిని, తలపొగరు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక విమర్శతో ఆయన పాఠకుల ముందుకొచ్చారు. నవంబర్ 26న సాక్షి పత్రికలో వచ్చిన ఆయన వ్యాసం 'నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ' పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవచ్చు.

                           *****************

నవంబర్‌ 9, 2016... భారతీయపౌరులు ఒక్కసారిగా తమ వద్ద ఎలాంటి డబ్బూలేదని, డబ్బుకోసం బ్యాంకులకు వెళ్లలేమని గ్రహించిన రోజు. తమ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక చర్య వంద కోట్లమందికి పైగా ప్రజలను శక్తిహీనులుగా, దుర్బలురుగా దిగజార్చిన రోజు. యావత్ప్రపంచంలో శాంతికాలంలో కనీవినీ ఎరిగి ఉండని ఘటన ఇది. ఏ నియంతా  ప్రజలను ఈ విధంగా సవాలు చేసిన చరిత్ర ఇంతవరకూ లేదు 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ప్రజలు సాధారణ జీవన కార్యకలాపాలను కొనసాగించారు. 2016 నవంబర్‌ 8న రూ. 1000, రూ, 500 నోట్లను రద్దు చేసినట్లుగా ప్రధాని నరేంద్రమోదీ నాటకీయంగా ప్రకటించారు. ఇది నల్లధనాన్ని అడ్డుకుంటుందని, దొంగనోట్లను తొలగిస్తుందని, పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఉగ్రవాదులకు నిధుల వెల్లువను నిలిపివేస్తుందని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇవి చాలా గొప్ప లక్ష్యాలు. వెనువెంటనే రాజకీయ పార్టీలు చాలావరకు మోదీ చర్యను సమర్థించారు. ప్రజలు తమను ఎక్కడ అవినీతిపరులుగా భావిస్తారేమో అనే భయంతో ఏ రాజకీయ నేతా నోట్ల మార్పిడి అనేది చెడ్డది అని చెప్పడానికి సిద్ధపడలేదు. దాదాపు 130 కోట్లమంది ప్రజలు నివసిస్తున్న దేశంలో 86 శాతం కరెన్సీ నోట్లను ఉన్నఫళాన ఉపసంహరించినటువంటి నాటకీయ మార్పును భారత్‌ మునుపెన్నడూ చూడలేదు.

పెద్ద నోట్ల రద్దు చర్య గొప్ప విజయం కలిగిస్తుందని మోదీ బలంగా విశ్వసించారు కనుకే ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని ఈ ప్రకటన చేయడానికి అస్సలు అనుమతించలేదు. మొత్తం పేరు తనకే దగ్గాలని మోదీ కోరుకున్నారు.

ఫ్రాన్స్‌ చరిత్రలోనే అతి శక్తిమంతుడైన చక్రవర్తిగా పేరొందిన నెపోలియన్‌ 1812లో ఉన్నట్లుండి రష్యాపై ఆగ్రహించాడు. ఇంగ్లండ్‌కు సంబంధించిన సమస్యల్లో రష్యా తనతో కలిసి రావడం లేదన్న ఆగ్రహంతో నెపోలియన్‌ 1812 జూన్‌లో రష్యాపై యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో నెపోలియన్‌ ఓడిపోవడమే కాకుండా ఫ్రాన్స్‌ నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ ఓటమి సంభవించి 200 ఏళ్ల అనంతరం కూడా ఫ్రాన్స్‌తో ఎలాంటి భౌగోళిక సరిహద్దులూ లేని రష్యాతో అనాలోచిత యుద్ధం ద్వారా నెపోలియన్‌ అంతటి తెలివైన వ్యక్తి తన్ను తాను ఎందుకు ధ్వంసం చేసుకున్నాడని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

అలాగే బ్రిటన్‌ను, యూరప్‌ను దాదాపుగా ఓడిస్తున్నట్లు కనిపించిన హిట్లర్‌ అప్పటికే తాను శాంతి ఒప్పందం కుదుర్చుకున్న రష్యాపై దాడి చేయాలని ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు. రష్యాపై దాడి ద్వారా హిట్లర్‌ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాడు. రష్యాపై దాడి చేసి హిట్లర్‌ ఎందుకు సర్వస్వం కోల్పోయాడన్నది నాటినుంచి నేటివరకూ ఎవరికీ అంతుబట్టడం లేదు.

తెలివైన, శక్తిమంతులైన మనుషులు తమకు తాముగా తప్ప తమ శత్రువులద్వారా ఎన్నడూ ఓటమికి గురికారని పై రెండు ఘటనల బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చు. మోదీ తన్ను తాను ధ్వంసం చేసుకుంటున్నారా అని ఇప్పుడిప్పుడే నిర్ణయించడం కష్టం. దానికి 2019 వరకు చాలా సమయమే ఉంది. కానీ మోదీ సృష్టించిన ఈ పెద్దనోట్ల రద్దు మోదీకే తీవ్ర ఇక్కట్లను సృష్టించిపెట్టింది. మోదీ తనకుతానుగా దీన్ని కొనితెచ్చుకున్నారు. ఏ రాజకీయనేతా మోదీకి సమస్యలన్ని సృష్టించలేదు. మోదీ పులిమీదికి ఎగిరి దుమికారు కానీ దాన్ని స్వారీ చేయలేకున్నారు. తాను స్వారీ చేయాలి లేదా పులి తననే కబళిస్తుంది.

పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న నిజాలేమిటో సాధారణ పరిశీలన ద్వారా చూద్దాం.

1. గత 200 ఏళ్లలో ఏ ప్రముఖ దేశమూ ప్రస్తుతం భారత్‌లోలాగా నోట్ల మార్పిడిని లేదా పెద్ద నోట్ల రద్దును చేసి ఉండలేదు. అమెరికా, బ్రిటన్‌ లేదా మరే ఇతర అభివృద్ధి చెందిన దేశం కూడా ఇలాంటి చర్యను చేయలేదు. యుద్ధకాలంలో నోట్ల మార్పిడి కొంత మేర జరిగి ఉండవచ్చు కాని శాంతి కాలంలో ఎన్నడూ జరగలేదు. అంటే ఇతర దేశాలకు, వారి ఘనమైన ఆర్థిక వేత్తలకు బుర్ర లేనట్లా? ఈరోజు ప్రపంచంలో అత్యంత అధికంగా నకిలీ నోట్లు ఉన్న ద్రవ్యం డాలర్‌. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్‌.. ఎక్కడైనా ఉగ్రవాదులు అమెరికా డాలర్లతోనే వ్యవహిస్తుంటారు. దక్షణ అమెరికా మాదకద్రవ్య మాఫియాలు మొత్తంగా వందలకోట్ల డాలర్లను కలిగి ఉంటున్నారు. డాలర్‌ను రద్దు చేయడం ద్వారా అమెరికా వారిని దెబ్బతీయవచ్చు. కాని అది ప్రమాదకరమే కాని పరిష్కారం కాదు కాబట్టి అమెరికా అందుకు పూనుకోలేదు. డాలర్‌పై విశ్వాసం అత్యున్నత జాతీయ ప్రయోజనం కలిగినట్టిదని అమెరికాకు తెలుసు.

2. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న ఇలాంటి నోట్ల మార్పిడిని చరిత్రలో ఏ ఆర్థికవేత్తా సూచించలేదు. మీ బట్టలను మార్పు చేస్తే మీ వ్యాధి తొలగిపోతుందని చెప్పడంలాంటిదే నోట్ల మార్పిడి,. మీ శరీరంలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉండబట్టే మీరు రోగగ్రస్తులవుతుంటారు తప్పితే బట్టలు మార్చినందుకు కాదు. నోట్ల మార్పిడి వ్యాధికి ఏ రకంగానూ చికిత్స కాదు. ఇంతకుముందు నల్లధనాన్ని రూ.1,000ల్లో దాచేవారు. ఇప్పుడు రూ.2,000లలో దాచి ఉంచుతారు.వ్యాధికి  చికిత్స చేయండి . అంతే కాని, మీ బట్టలను మార్చవద్దు.

3. పెద్ద నోట్ల రద్దు ద్వారా పాకిస్తాన్‌ ఇకపై భారత్‌కు నకిలీ నోట్లు పంపలేదని మోదీ చెప్పారు. భారత్‌ కొత్త నోట్లను జారీ చేసినంత మాత్రాన, నకిలీ నోట్లను తయారు చేయకుండా పాకిస్తాన్‌ను అడ్డుకోలేం. అణుబాంబులు చేయగలిగిన పాక్‌ ఎలాంటి నకిలీ నోట్లనయినా చేయగలదు. కాబట్టి నకిలీ నోట్లు రాకుండా ఆపలేము.

4. పాకిస్తాన్‌నుంచి నకిలీ నోట్లను పొందుతున్న భారత్‌లోని ఉగ్రవాదుల ఆటకట్టయిందని మోదీ అన్నారు. ఇది కూడా తప్పే. భారత్‌లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయడానికి మన శత్రువులు భారీ మొత్తంలో ఖర్చుపెట్టడం లేదు. చిన్న మొత్తాలను వారు ఎప్పటికీ పంపుతూనే ఉంటారు, పాకిస్తాన్‌ చర్యలను నోట్ల మార్పిడి ఏరకంగానూ ఆపలేదు. యుద్ధాన్ని నోట్లమార్పిడి అరికట్టలేదు.

5. పెద్ద నోట్ల రద్దు ద్వారా సంపన్న భారతీయులే నష్టపోయి, పేదలు లాభపడతారని మోదీ వ్యాఖ్య. కాని భారతీయ జనాభాలో 40 శాతం మంది మధ్యతరగతి ప్రజలేనని మోదీ మర్చిపోయినట్లుంది. మధ్యతరగతి ప్రజలు చాలావరకు నగదు రూపంలోనే డబ్బును భద్రపర్చుకుంటారు. ఇప్పుడు వీరి బాధ తక్కువగా లేదు. వీరుకూడా మోదీని ఎన్నటికీ క్షమించరు. పన్నుపరిధికి అవతల ఉన్న మధ్యతరగతి ప్రజల డబ్బును పన్ను క్షమాభిక్ష పథకంలోకి తీసుకురాకుండా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించి 130 కోట్ల మందిని ఇక్కట్లకు గురి చేసింది. సంపన్నులు కూడా తమ వద్ద నల్లధనాన్ని తమ పరుపుల కిందో, తోటల కిందో దాయరు. దాన్ని వడ్డీలు, సినిమాలు, రియల్‌ ఎస్టేట్, విదేశీ ద్రవ్యం, భూమి కొనుగోలు వంటివాటిపై మదుపుచేస్తారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం హుష్‌కాకీ అయిపోతుందని భావించేవారు ఆర్థికసూత్రాలను విస్మరిస్తున్నట్లే లెక్క.

6. సంపన్నులు ఇకపై నిద్రపోరని మోదీ అంటున్నారు. కానీ ఐఏఎస్‌ అధికారి, రాజకీయనేత, సినీ నటుడు లేక అవినీతిపరులు ఎవ్వరూ బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడిన పాపాన పోలేదు.ఈ అంశంపై మోదీ చేస్తున్న రాజకీయ ప్రకటనలు తనకు, బీజేపీకి తీవ్ర నష్టం కలిగించనున్నాయి. ప్రజల బాధల పట్ల నమ్రతను ప్రదర్శించడానికి బదులు, అహంకారపు ప్రకటనలు చేయడం నష్టదాయకమని బీజేపీ వ్యాఖ్యాతలు గుర్తించాలి. 1975లో ఎమర్జెన్సీ విధించాక ఇందిరాగాంధీ, ఆమె మంత్రివర్గ సహచరులు అది దేశానికి మంచిదన్నారు, ఎమర్జెన్సీని వ్యతిరేకించే ఎవరయినా సరే దేశద్రోహులే అనేశారు. తీరా ఎన్నికల సమయంలో ఏం జరిగిందే అందరికీ తెలుసు.

7. కార్మికులు, రైతులు, దినసరి కూలీలు, రిక్షాలాగేవాళ్లు, టాక్సీ, ఆటో డ్రైవర్లు, హోటల్‌ కార్మికులు, వితంతువులు, మధ్యతరగతి ప్రజలు, బ్యాంకులకు వెలుపల కొద్ది మేరకు డబ్బు దాచుకునేవారు ఈ నోట్ల మార్పిడితో తీవ్రంగా దెబ్బతింటున్నారు. తమ పిల్లలకు కూడా ఇవ్వకుండా చాలామంది వృద్ధులు నగదును తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారు సైతం మోదీ తమను బాధపెడుతూ, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని భావిస్తున్నారు.

8. బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో డిపాజిట్లు సమకూరాయి కాబట్టి వాటిని అవి మదుపు చేస్తాయని మోదీ భావన. ప్రపంచంలోనే అత్యధిక మదుపుల రేటు గల దేశం భారత్‌. భారతీయులు తమకోసం పొదుపు చేసుకుంటారు. బ్యాంకులు కనుక భారీ డిపాజిట్లను పొందితే, వాటిని బడా వ్యాపారులకు ఇస్తాయి. బ్యాంకులు లక్షల కోట్ల మొండిబకాయిలను కలిగి ఉన్నట్లు అందరికీ తెలుసు. ఈ భారీ డిపాజిట్లు విజయ్‌మాల్యా వంటి సంపన్నుల జేబుల్లోకే వెళతాయని మోదీ గుర్తుంచుకోవాలి.

పెద్దనోట్ల రద్దు ఫలితాలు
పెద్దనోట్ల రద్దు విషయంలో మోదీ వైఖరి సరైందేనా లేక ఆ చర్యతో యావద్దేశానికే విపత్తు సృష్టించారా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. కాని ఈ నోట్ల రద్దు వల్ల జరగనున్న సత్వర పరిణామాలు ఏవి?

1. సగటు మనిషి భారతీయ రూపాయిపై ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడు. రూపాయి వందల ఏళ్లుగా ఉనికిలో ఉంది. మోదీ దాన్ని చిత్తుకాగితంలా మార్చేశారు. అమెరికన్‌ డాలర్‌ కంటే ముందు కాలం నుంచే రూపాయి ఉనికిలో ఉంది. మోదీ కానీ మరెవరైనా సరే తమ డబ్బును విలువలేనిదిగా మార్చివేస్తారని జనంకు తెలిసివచ్చింది. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించగలదని అర్థమైంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రూపాయి పరువు దిగజారిపోయింది.

2. నవంబర్‌ 9, 2016 నుంచి దేశంలోని ప్రతి వర్గ ప్రజల బాధలు వర్ణనాతీతం. కన్నీళ్లు, ప్రాధేయపడటం, అభ్యర్థించడం ఏవీ సహాయం చేయటం లేదు. డబ్బు పొందడానికి కోట్లాది భారతీయుల రోజూ క్యూలలో నిలుచుంటున్నారు. ప్రతి రోజూ వీరి పరిస్థితి నరకమే. బ్యాంకులలో ఉన్న వారి సొంత డబ్బును ప్రభుత్వం సున్నా చేసిపారేసింది.

3. ఇక రైతులు, గ్రామీణ ప్రజల బాధలు చెప్పనలవి కాదు. నగరాల్లోని ప్రజలు బ్యాంకులలో డబ్బులు ఉంచుకుంటారు. గ్రామాల్లో నగదు రూపంలోనే డబ్బులు దాచుకుంటారు. భారతీయులు తమ డబ్బులను కూడా బ్యాంకులలోంచి తీసుకోలేకపోతున్నారంటే ప్రజాస్వామ్యం లేనట్లే లెక్క. చరిత్రలో ఏ రాజూ, ఏ నియంతా ఇలాంటి చర్యకు పాల్పడలేదు.

4. డబ్బు, పని లేకుండా కోట్లమంది బాధపడుతున్నారు. డబ్బు లేదు కాబట్టి ఉద్యోగం, ఉపాధి లేదు. కోట్లాదిమంది పనికి దూరమయ్యారు. కూలీలు వృథాగా కూర్చున్నారు. కష్టించే ప్రతి వ్యక్తి ఇప్పుడు పనిలేని బిక్షగాడైపోయాడు. నడినెత్తిమీద అణుబాంబు పేలి జీవితం అంతమైనట్లుగా ఉంది. ఇక బయటి ప్రపంచానికి తెలియకుండా ఉన్న ప్రజల బాధలు చెప్పనవసరం లేదు. కాని 130 కోట్లమంది ప్రజల్లో ప్రతి ఒక్కరూ మోదీ చర్యద్వారా దెబ్బతిన్నారు.

మోదీ ఎందుకిలా చేశారు?
మోదీ హయాం సగం పూర్తయింది. ఏదో ఒక పెద్ద చర్య చేపట్టాలన్నది మోదీ వాంఛ. తాను వాగ్దానం చేసినట్లుగా విదేశాల నుంచి నల్లధనం తీసుకురాలేకపోయాడని విమర్శలు ఉన్నాయి. కానీ తాను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడని నిరూపించుకోవాలని మోదీ భావించినట్లుంది. బలమైన నేతలనే ప్రజలు ఆరాధిస్తారని మోదీ భ్రమిస్తున్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్‌ దాడుల తర్వాత మోదీ ఇమేజ్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంత స్థాయికి ఎదిగిపోయింది.

అంతకుమించి కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు మోదీ చుట్టూ పదవీవిరమణ చేసిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. అత్యత బలహీనుడైన ఊర్జిత్‌ పటేల్‌ను మోదీ కోరి ఆర్బీఐ గవర్నరుగా ఎంచుకున్నారు. ఇక ఆర్థిక శాఖలోని ఐఏఎస్‌లు ఏ ప్రధానమంత్రికైనా సరే జీహుజూర్‌ అనేవాళ్లే. మోదీ మంత్రివర్గంలోనే ఏ మంత్రి కానీ, ఎంపీ కాని మోదీ చేస్తున్నది తప్పు అని చెప్పే స్థితిలో లేరు. నోట్ల మార్పిడి నిర్ణయం విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీనే సంప్రదించలేదన్నది తెలిసిందే.. నేత చుట్టూ చెంచాలు, భజనపరులు ఉన్నప్పుడు రాజనీతి, రాజకీయం ఆత్మహత్య చేసుకోక తప్పదు. ప్రజలు శిక్షకు గురవటం తప్పదు.

ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నోట్ల మార్పిడి అనేది విజయం సాధించిందంటే, మోదీ మరింత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తారు. మనకు అణుబాంబులున్నాయి. కాని వాటిని ఎన్నడూ ఉపయోగించలేం. నోట్ల మార్పిడి ఒక ఆర్థిక అణుబాంబు. నోట్లమార్పిడి విఫలమైతే, (విఫలవుతుందనే అనుకుంటున్నా) భవిష్యత్తులో మోదీకి కష్టాలు తప్పవు. కాని ఆయన దేశానికి ఇప్పటికే ఏదో రకంగా హాని కలిగించేశారు.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు.
ఈమెయిల్ః drppullarao@yahoo.co.in

నవంబర్ 26న సాక్షి సంపాదక పేజీలో వచ్చిన పెంటపాటి పుల్లారావు గారి సంక్షిప్త పాఠాన్ని కింది లింకులో చూడవచ్చు.

నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ
http://www.sakshi.com/news/vedika/demonetization-is-modi-riding-on-tiger-426157


0 comments:

Post a Comment