Saturday, December 4, 2010

పాలు ఒలికిపోయినప్పుడు…

“ఒలికిన పాలు”… ఇది వైద్యరంగంలో అద్భుత ఆవిష్కరణలు చేసిన ఓ గొప్ప పరిశోధక శాస్త్రవేత్త కథ. ఓసారి ఓ పత్రికా విలేఖరి ఈ శాస్త్రవేత్తను ఇంటర్వ్యూ చేశాడు. సగటు వ్యక్తి కంటే మీరు ఎంతో సృజనాత్మకతను కలిగి ఉండటం గురించి మీరేమనుకుంటున్నారు అని ప్రశ్న వేశాడు. ఇతరులనుంచి అతడిని ఏది వేరు చేసింది?

ఆ శాస్త్రవేత్త స్పందించాడు. తన అభిప్రాయం చెప్పాలంటే.. రెండేళ్ల వయసప్పుడు అమ్మతో పాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కలిగిన ఓ అనుభవం తన జీవితాన్నే మార్చివేసింది. ఓ రోజు, ఫ్రిజ్‌లోంచి పాల సీసాను తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టు తప్పి సీసా నేలపై పడిపోయింది. సీసాలోని పాలన్నీ వంటగదిలో ఒలికిపోయి చూడటానికి పాల సముద్రాన్ని తలపించాయట.

చప్పుడు విని తల్లి వంటగదిలోకి వచ్చి జరిగింది చూసింది. ఆ పిల్లాడిపై విరుచుకుపడడం, ఉపన్యాసం దంచడం లేదా అతడిని దండించడం చేయకుండా ఇలా చెప్పిందట. “రాబర్ట్ వంటగదిని ఎంత కలగాపులగం చేశావో గదా..! ఇంత పెద్ద పాలగుంటను నేను ఎన్నడూ చూడలేదు. ఏమైతేనేం. నష్టం ఎలాగూ జరిగిపోయింది. వంటగది శుభ్రం చేసే ముందు ఈ పాలగుంటలో కూర్చుని కాస్సేపు అడుకోవా మరి!”

నిజంగానే ఆ పిల్లాడు పాలగుంటలో ఆడుకున్నాడు. కాస్సేపయ్యాక తల్లి పిలిచింది. “రాబర్ట్ విను. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఇలాంటి గందరగోళం సృష్టించినా, తర్వాత నువ్వే దాన్ని శుభ్రం చేసి ప్రతిదాన్ని ఓ క్రమంలో ఉంచాలి. తెలిసింది కదా. మరి నువ్వు ఇప్పుడు వంటగదిని ఎలా శుభ్రం చేస్తావు చెప్పు. ఇల్లు శుభ్రం చేయడానికి మనం ఓ స్పాంజ్, తువ్వాలు, లేదా, కాంటర్ వాడతాము. మరి నువ్వు దేన్ని ఎంచుకుంటావు చెప్పు?” ఆ పిల్లవాడు స్పాంజ్‌ను ఎంచుకున్నాడు. తర్వాత తల్లీ, బిడ్డా ఇద్దరూ కలిసి ఒలికిన పాలను తుడిచి వంటగదిని శుభ్రపర్చారు.

తర్వాత తల్లి అతడితో చెప్పింది. “రాబర్ట్ మనం రెండు చిన్న చేతులతో పెద్ద పాల సీసాను సమర్ధవంతంగా ఎలా పట్టుకోవాలి అనే విషయంపై ఇవాళ ఓ విఫల ప్రయోగాన్ని చేశాం. ఇప్పుడు పెరట్లోకి పోయి ఆ పాలసీసా నిండా నీరు నింపుదాం. సీసా కింద పడకుండా పట్టుకొనే పద్దతిని నువ్వు కనిపెట్టవచ్చు మరి.” సీసా పైభాగంలో మూత వద్ద రెండుచేతులతో గట్టిగా పట్టుకుంటే, సీసా కింద పడిపోకుండా చేయవచ్చని ఆ పిల్లాడు త్వరలోనే కనిపెట్టేశాడు. ఎంత అద్భుతమైన పాఠమిది!

ఆ క్షణమే తన జీవితాన్ని వెలిగించిందని, తప్పులు చేయడానికి భయపడనవసరం లేదని తనకు అప్పుడే తెలిసిందని శాస్త్రవేత్త ఆ విలేఖరితో చెప్పాడు. నిజానికి, తప్పులనేవి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎదురయ్యే చక్కటి అవకాశాలని అప్పుడే తనకు బోధపడింది. ప్రపంచంలో అన్ని శాస్త్ర పరిశోధనా ప్రయోగాలూ ఈ కోవకు చెందినవే గదా! ప్రయోగం పనిచేయకపోయినా సరే దాన్నుంచి మనం కొన్ని విలువైన అంశాలు నేర్చుకుంటాము.

ఇంతటితో కథ ముగిసింది….

సవాళ్లను ఎదుర్కోవడం నేర్పని ప్రపంచంలో… తప్పులను సానుకూల కోణంలో చూసి పరిష్కారాలు సూచించలేని ప్రవంచంలో… తప్పు చేసినప్పుడు మనిషిపై విరుచుకుపడమే తప్ప. సమస్యను వివరించి, మరోసారి తప్పు చేయని వాతావరణం కల్పించని ప్రపంచంలో… తప్పు అనేది ఏదైనా కొత్తవిషయాన్ని మరింత బాగా నేర్చుకోవడానికి మనిషికి లభించే చక్కటి అవకాశంగా గుర్తించని ప్రపంచంలో… తప్పుకు దండనే పరిష్కారమని మన కుటుంబాలు, పాఠశాలలు, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, కార్పొరేట్లు, ఇప్పటికీ భావిస్తున్న ప్రపంచంలో ఈ కథ చెప్పే సారం బహుశా మనకెవరికీ అర్థం కాకపోవచ్చు.

తప్పును కప్పి పుచ్చుకుంటే తప్ప పెద్దల దండననుంచి, దూషణ భూషణలనుంచి తప్పించుకోలేమనే అభిప్రాయాన్ని ఉగ్గుపాల నుంచే పిల్లల మనస్సులపై రుద్దుతున్న ప్రపంచం.. తప్పును స్వీకరించే, అంగీకరించే, రేపటి ఒప్పుకు మార్గంగా తీసుకునే సాహసాన్ని, చైతన్యాన్ని మన పిల్లలకు, మనకూ నేటికీ నేర్పలేదు.

ఇంట్లో తల్లిదండ్రులను, బడిలో అయ్యవారిని, అమ్మవారిని చూస్తేనే ఉచ్చపోసుకుంటున్న సంస్కృతిలో పెరుగుతున్నాం. అందుకే దేనిపట్లా మనకు గొంతు పెగలదు. తప్పు, ఒప్పు రెండింటిపై మాట్లాడడానికి కూడా మనకు నోట మాటరాదు. ఇంట్లో, బళ్లో, గుడిలో, కార్యాలయాల్లో భయం ముందు పుట్టి తర్వాతే మన వ్యవహారాలు మొదలవుతాయి.

పదిమంది కూడిన చోట లేచి నిలబడి ధైర్యంగా మన అభిప్రాయం చెప్పే సాహసం కూడా మనలో చాలా మందికి ఉండదు. నిజాయితీగా ఎవరికి వారు తమలోకి తొంగి చూసుకుంటే గాని ఈ విషయం బయటపడదు మరి. మనం ఇంట్లో మాట్లాడలేం. బళ్లో మాట్లాడలేం. ఇంటా, బయట కూడా మాట్లాడలేం.
భయం అనేది దండించడం ద్వారా, గోడకుర్చీ ఎక్కించడం ద్వారా, దూలానికి వేలాడదీసి కోదండమేయించడం ద్వారా, చితకబాదడం ద్వారా మాత్రమే రాదు. చిన్నతనంలో మన జీవితాలను, ఆశలను, ఆకాంక్షలను, మన చదువులను, భవితవ్యాలను నిర్దేశించగల స్థానాల్లో ఉన్నవారు ఉగ్రరూపులై ఒక్క ఉరుము ఉరిమి చూస్తే చాలు.. అక్కడినుంచి ఉన్నఫళాన మాయమై కిలోమీటర్ అవతలికి పారిపోతే మంచిదనిపిస్తుంది ఎవరికయినా. మిత్రులారా దాదాపుగా మనందరి బాల్యమూ ఇలాగే సాగింది కదూ..

…ఇది చెయ్యవద్దు. అది చెయ్యవద్దు. అక్కడికి పోవద్దు, వాళ్లతో స్నేహం చేయవద్దు, ఆ కోర్సు గురించి ఆలోచించనే వద్దు, స్కూలు బుక్కులు తప్ప ఇతర పుస్తకాల జోలికి పోవద్దు. మార్కులు తప్ప మరే ప్రపంచంతోటి మనకు సంబంధం వద్దు.. కళ్ల ముందు ఏం జరుగుతున్నా చూడవద్దు. నువ్వూ.. నీ బతుకూ.. ఇది తప్ప జగం మిధ్య. సర్వం మిధ్య… ఇలాంటి నేపథ్యంలో పెరుగుతున్న బాల్యం నిజంగానే ఖండిత ఆలోచనల బాల్యమే.

బాల్యంనుంచే మనిషిని నిలువునా కుంగదీస్తున్న ఈ ఖండిత భావాల పెంపకాన్ని “బొమ్మరిల్లు” సినిమా ఈ మధ్య ఎంత చక్కగా చూపించింది మనకు. పిల్లల ఆలోచనలకు, అభిప్రాయాలకు కాసింత చోటిస్తే కుటుంబం, ఈ ప్రపంచం కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో “ఆకాశమంత” సినిమా ఎంత చక్కగా చూపించిందో ఈమధ్య. ఈ రెండు సినిమాలు కూడా ఓ ‘వర్గ’ జీవితాన్నే చూపించాయనుకోండి. అది వేరే విషయం.

దాదాపు పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం ఒకప్పటి సోవియట్ యూనియన్, చైనా దేశాల్లో నూతన సమాజ నిర్మాణం పేరిట జరిగిన ప్రయత్నంలో అప్పటి పిల్లల్లో కొత్త విలువలను ఎలా నేర్పించేవారో చెప్పిన కథలు కొన్ని చదివిన గుర్తు. ఆ దేశాల్లో నవ సమాజం పేరిట జరిగిన అన్యాయాలు, అరాచకాల ప్రస్తావనకు ఇది సందర్భం కాదు.

సాంస్కృతిక విప్లవ కాలంలో చైనాలో జరిగిన ఓ సంఘటనను అప్పట్లో చదివిన గుర్తు. చైనా సందర్శనలో ఉన్న కొంతమంది విదేశీ పర్యాటకులు ఓ స్కూల్లో ఓ అరుదైన సంఘటన చూశారు. స్కూలు ఆవరణలో నడుస్తూ ఉన్నట్లుండి ఓ పిల్లవాడు పడిపోతే పక్కనున్న ఎవరూ అతడిని లేపటానికి పరుగెత్తరు. లేవడానికి అతడు తన ప్రయత్నం చేసింతర్వాత వారు అతడికి చేయూత నిస్తారు.

పిల్లవాడు పడితే వెంటనే లేపరే అని ఆ పర్యాటకులలో ఒకరు ఆ స్కూలు పెద్దను అడిగితే.. పడిపోయిన పిల్లవాడు తిరిగి స్వప్రయత్నంతో లేవడానికి ప్రయత్నించాలని, తర్వాతే అదనపు సహాయం గురించి ఆలోచించాలని స్కూలు పెద్ద చెబుతాడు. నడకలో సమతూకం కోల్పోయి పిల్లాడు పడిపోతే తిరిగి అతడే సరిదిద్దుకుని లేపడాన్ని నేర్పిన ఆ కొత్త చదువు ఎంత గొప్పది!

కిందపడ్డ ఆ పిల్లవాడిని చూసి తోటి పిల్లలు నవ్వలేదు. కళ్లెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అని పెద్దలు అతడిని తిట్టలేదు. జీవితంలో జరిగే ఓ సహజాతిసహజ చర్యగా మాత్రమే వారు ఆ ఘటనను చూసారు. అందుకే సోషలిస్టు సమాజాలు అని పిలవబడిన వాటి ఆచరణలో తప్పులెన్ని జరిగినా జీవితంలో కొత్త విలువలను పెంపొందించడానికి వారు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. తప్పులెన్నడానికి వీల్లేనిది.

పిల్లలూ, పెద్దలూ, నీతి బోధకులూ ఇలా ఎవరూ కూడా మన పరిసరాల్లో సహజంగా ఉండరు. సహజంగా పెరగరు, సహజంగా బతకరు. అందుకే ఇలాంటి వారందరికీ అవసరమైన కథ ఈ “ఒలికిన పాలు”. చిన్నతనంలో సహజంగా జరిగిన ఓ పొరపాటును లేదా తప్పును… పిల్లవాడు స్వీకరించేలా చేసి, దాన్నుంచి బయటపడే మార్గాన్ని ఆ కన్న తల్లి ఎంత చక్కగా చూపించింది కదా ఈ కథలో.

అందుకే ఇది నీతి కథ కాదు. జాతి కథ. మానవజాతి కథ. మీకు తెలిసిన ప్రతి వారికీ ఈ కథను పంపి చదివించండి. ముఖ్యంగా తల్లి దండ్రులకు, టీచర్లకు… అందరి కంటే వారికే ఇది అవసరం…

“The Spilt Milk” అనే పేరు కలిగిన ఈ ఇంగ్లీష్ కథను మా మిత్రుడు, కుటుంబ సభ్యుడు వేణు ఆన్‌లైన్‌లో పంపాడు. దీని మూలం తెలీదు. ఏ సైట్‌లోంచి తీశాడో తెలీదు. తననే అడగాలంటే ఊరెళ్లాడు (గూగుల్ సెర్చ్‌లో ఈ కథ పేరు కొట్టి ప్రయత్నిస్తే… తను తాగుతున్న పాలను కాలువలో పారవేసిందనే కోపంతో ఓ పద్నాలుగేళ్ల బాలిక తన సవతి తల్లిని పొడిచి చంపిందన్న వార్త ఈ పేరుతో కనబడింది. భయమేసి వెంటనే సెర్చ్ నుంచి బయటపడ్డాను. ఇదొక గృహసమస్య… ఇంగ్లీషులో చెప్పాలంటే ‘డొమెస్టిక్ ఇష్యూ’.)

‘ది స్ప్లిట్ మిల్క్’ కథ రచయిత ఎవరో తెలీదు. కానీ తెలిస్తే మాత్రం ఆ రచయిత లేదా రచయిత్రికి పాదాభివందనం చేయాలనిపిస్తోంది. ఈ కథ చదివిన వెంటనే మా బాల్యంలో సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో లేదా బడిలో మాకు ఎదురైన ప్రతికూల అనుభవాలు గుర్తొచ్చాయి. ఖండిత బాల్య జ్ఞాపకాలు కదా మరి…

మన కుటుంబాలపై, మన పాఠశాలలపై వేలెత్తి చూపించడం కాదిది. పెంపకం, విద్య, జీవన విలువల బోధన కొంచెం భిన్నంగా సాగి ఉంటే మన బాల్యం మరింత ఆనందదాయకంగా సాగి ఉండేది కదా అన్న బాధ. అంతే….

ఓ చిన్న సంఘటన గుర్తు వస్తోంది. మా అవ్వ -అమ్మమ్మ- అంటే మాకు చాలా ఇష్టం. కాని నేను మరీ పిల్లాడిగా ఉన్నప్పుడు ఏదో గెరివి పని చేశానని చెప్పి వంటిట్లో గుంజకు కట్టేసి గంటసేపు అలాగే ఉంచి దండించింది. మా చుట్టుపక్కల ఇళ్లలోని బంధువుల పిల్లలంతా ఆస్థితిలో నన్ను చూశారు.

ఆరోజు నాకు జరిగిన అవమానాన్ని, ఆరోజు నేను పడిన బాధ, వేదనలను ఈ నాటికీ అంటే 45 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోలేకున్నాను. ఇప్పటికీ ఊరుకు వెళితే 90 ఏళ్లు నిండిన మా అవ్వను ఏడిపిస్తుంటాను. ‘అవ్వా నన్ను గుంజకు కట్టేసినావు గదే..’ అంటూ. ‘ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నావట్రా’ అంటూ నవ్వుతుందామె బోసినోటితో..

అందరి బాల్యమూ చందమామ కథల్లాగా ఆహ్లాదంగా, ఆనందంగా సాగిపోయి ఉంటే ఎంత బాగుండు…

థాంక్యూ వేణూ.. మంచి కథ పంపినందుకు.. ఇలాగే పంపిస్తూ ఉంటావు కదూ..
రాజు.

December 7th, 2009న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

Edit | Comments (2)

2 Responses to “పాలు ఒలికిపోయినప్పుడు…”

1. V.SAI DAS on March 13, 2010 9:54 AM Edit This
It is very useful in life

2. chandamama on March 15, 2010 9:09 AM Edit This
ఆలస్యంగా కధనం చదివి నప్పటికీ ఒకే ఒక ముక్కలో ఇంత పెద్ద కథనం సారాన్ని తేల్చి చెప్పారు. ధన్యవాదాలు సాయి దాస్ గారూ…

2 comments:

సతీష్ said...

అందరి బాల్యమూ చందమామ కథల్లాగా ఆహ్లాదంగా, ఆనందంగా సాగిపోయి ఉంటే ఎంత బాగుండు…
very inspirational.
thanks for sharing. please share the thanks with Mr. Venu.

నెలవంక said...

సతీష్ గారూ,
తప్పకుండానండీ,
మీకు మరీ మరీ ధన్యవాదాలు.

Post a Comment