Pages

Wednesday, December 8, 2010

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి

గుణాఢ్యుని బేతాళ కథలు
వేణుగారూ! గుణాఢ్యుని బేతాళ కథలు పరిచయంపై మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అసలు ఈ పుస్తకం చివర్లో బేతాళుడు విక్రమాదిత్యుడికి ప్రసన్నమై దొంగ బిక్షువు పన్నాగాలను వివరించి అతడిని తుదముట్టించడంలో సహకరించిన తర్వాతి ఘట్టం చదివినప్పుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకు. మనోహరాలైన యీ యిరవై నాలుగు ప్రశ్న కథలూ, వీటితోపాటు యీ చిట్ట చివరి ఇరవై ఐదవ కథా లోక ప్రసిద్ధాలై ప్రకాశించాలి అని నా కోరికఅని త్రివిక్రమ సేన మహారాజు అడిగితే అలాగే అని వరమిచ్చిన బేతాళుడు ఇలా అంటాడు.

అలాగే అవుతుందిముందు చెప్పిన ఇరవై నాలుగూ, ఈ చివరి కథా కలిపి బేతాళ పంచవింశతి అన్న పేరుతో విశ్వ విఖ్యాతమై, పూజనీయమై, మంగళకరమవుతాయి. ఇందులో ఏ కొద్ది భాగాన్నయినా ఎవరు ఆదరంగా చదివినా, విన్నా వాళ్లు పాప విముక్తులవుతారు. బేతాళ పంచవింశతి ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేరు

రెండు వేల సంవత్సరాల క్రితం గుణాఢ్యుడు బేతాళ పంచవింశతి కథలకు ఇలా ముగింపునిచ్చాడు అనే విషయం తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది నాకు. పాప విముక్తులు కావడం, యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేకపోవడంవంటి వర్ణనలు గుణాఢ్యుడి కాలంనుంచి నేటి దాకా భారతీయ భావనా ప్రపంచంలో కొనసాగుతుండటం మనం హరికథలు, నాటక ప్రదర్శనల సమయంలో చూస్తూనే ఉన్నాం.

అయితే పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించి, తమదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాల్సిన అంశాలు ఒరిజనల్ బేతాళ కథల్లో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఈ పుస్తకంలోని మూడో కథ చివర్లో స్త్రీలు సహజంగా క్రూర హృదయులు, కుత్సితులుఅని చిత్రరధుడనే గంధర్వుడు వ్యాఖ్యానిస్తాడు. పాప స్వభావులు, దురాచారపరులు అయిన పురుషులు ఎప్పుడో, ఎక్కడో ఒకప్పుడు ఉండవచ్చును. తరచూ స్త్రీలలో ఎప్పుడూ అలాంటివారే ఎక్కువఅని త్రివిక్రమ మహారాజు చేత గుణాడ్యుడు చెప్పిస్తాడు.

స్త్రీపురుషుల స్వభావాన్ని ఇంతగా సాధారణీకరించి -జనరలైజ్- చెప్పిన ఈ వ్యాఖ్యానాన్ని ఆనాటి పితృస్వామిక సమాజపు నేపధ్యంలోనే అర్థం చేసుకోవాలి. రెండువేల సంవత్సరాల తర్వాత కూడా స్త్రీల గురించి పురుషులలో చాలా మందికి ఈ భావాలే ఉండటం మనం చూస్తున్నాం కదా. స్త్రీపురుషుల మధ్య వ్యవస్థాగతంగా ఏర్పడిన వైరుధ్యానికి ఇవి ప్రతిరూపాలే కదా..

ఇక్కడే చందమామ సవరించి, రూపొందించిన బేతాళ కథల గొప్పతనం మనకు అర్థమవుతుంది. గుణాఢ్యుడి కథల్లో ఇలాంటి పితృస్వామిక సమాజ మానవ స్వభావానికి సంబంధించిన తప్పు వ్యాఖ్యానాలు ఎన్నో ఉండవచ్చు. కాని వాటిని మనం తప్పుపట్టలేం. అవి ఆనాటి సమాజానికి సంబంధించిన సాధారణ మానవ భావనలు.

ఈ పితృస్వామిక వర్గీకరణల అసహజత్వాన్ని విమర్శనాత్మకంగా, విచక్షణతో వేరుపర్చి స్త్రీపురుషులు సమానులు అనే నేటి సమానత్వ భావనాధారను చందమామ బేతాళ కథలు గత 55 ఏళ్లుగా ఎంత చక్కగా పిల్లల్లో, పెద్దల్లో ప్రసారం చేస్తూ వచ్చాయో మనందరికీ తెలుసు. చందమామలో తొలి బేతాళ కథను చూసినా ఈ 2009 అక్టోబర్ చందమామ సంచికలోని బేతాళకథను చూసినా సరే, బేతాళ కథల విషయంలో చందమామ చూపిస్తూ వచ్చిన విచక్షణ, హేతుబద్ధత మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

చందమామ బేతాళ కథలు ప్రదర్శిస్తూ వస్తున్న ఈ విచక్షణా దృక్పధానికి, నూతన భావ సంస్కారానికి ఇద్దరు మహనీయులు కారణం. వారు చక్రపాణి, కుటుంబరావు గార్లు. ప్రత్యేకించి 1930ల చివరికే మార్క్సీయ భావధారను తనలో నిక్షిప్తం చేసుకున్న కుటుంబరావు గారుసిద్ధాంత రాద్దాంతాలు, పదాడంబరాల జోలికి పోకుండా తాను నమ్మిన హేతుపూర్వక ఆలోచనా సరళిని బేతాళ కథలకు జోడించి వాటిని ఆధునిక మానవ సంస్కారానికి ప్రతీకలుగా చేసి ప్రాణప్రతిష్ట పోశారు.

దానికి చక్రపాణిగారి ఆమోదముద్ర ఉండటంతో మూడు దశాబ్దాలపాటు కుటుంబరావుగారి ప్రజాస్వామిక ఆలోచనా ధార బేతాళ కథలలో నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. మార్క్సిజానికి సంబంధించిన పదజాలం వాడకుండానే కుటుంబరావుగారు తన ఇతర అన్ని రచనల్లోనూ ఆధునిక మానవ సంస్కారాన్ని ఎలా ప్రతిఫలిస్తూ వచ్చారో చందమామ కథలు కూడా దానికి మినహాయింపు కాదు.

బూర్జువా, భూస్వామ్యం, అర్ధవలస, అర్ధభూస్వామ్య వంటి ఒక పట్టాన కొరుకుడు పడని పదాలతో మన దేశపు సామాన్య ప్రజలను భయపెట్టడానికి బదులుగా భూమ్మీద తనకే సాధ్యమైన తేలిక పదాలతో, సరళ వచనంతో ఆయన చందమామ కథలకు రూపురేఖలు దిద్దారు. మధ్యయుగాల జానపద సంస్కృతికి ఆధునిక మానవ సంస్కారాన్ని జోడించి కుటుంబరావుగారు దేశ దేశాల కథలను మలచడంలో చూపించిన నైపుణ్యం చందమామకు భారతీయ కథాసాహిత్యంలో, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది.

చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి. వీరి సహాయ సహకారాలు లేకుండా చందమామ కోట్లాది పాఠకులను అలరిస్తూ రావడం జరగని పని కూడా.

బాల సుబ్రహ్మణ్యం గారి సహాయ సంపాదకత్వంలో వస్తున్న చందమామ ఈనాటికీ ప్రాథమికంగా అదే ఒరవడిలో కొనసాగుతుండటం యాదృచ్చికం కాదు. (సహాయ సంపాదకత్వం అనేది టెక్నికల్ ఫ్యాక్ట్ మాత్రమే.. నిజానికి చందమామ ప్రింట్ విభాగం మంచిచెడ్డలన్నింటికీ గత కొంతకాలంగా ఆయనే బాధ్యులు. విశ్వంగారు చందమామలో ఉన్న రోజుల్లో కూడా అంటే గత మూడు దశాబ్దాలుగా కూడా చందమామ కథల ఎడిటింగ్‌లో, ఇతర చాకిరీలో ప్రధాన భారం బాలుగారిదే అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం)

కథలకు కొసమెరుపు ఇవ్వడంలో, చివరి క్షణంలో కూడా పలానా కథలో మార్పు చేస్తే బాగుంటుందేమో అంటూ విశ్వంగారు మూడు దశాబ్దాల క్రితంనుండి ఇటీవలి వరకూ చందమామకు నెరుపుతూ వచ్చిన సంపాదకత్వ బాధ్యతలు కూడా తక్కువేం కాదు. మరి చందమామ ఆవరణలో పుట్టిపెరిగిన విశ్వంగారు నలబై, యాబై ఏళ్ల పాటు దానిలోని ప్రతి శాఖలో జరుగుతున్న పనిని ఆకళింపు చేసుకున్న అనుభవాన్ని పుణికి పుచ్చుకున్నారాయె.
 
ఇది కుటుంబరావు గారి శత జయంతి సంవత్సరం. ఈ అక్టోబర్ 28న ఆయన నూరవ పుట్టిన రోజుకు సంబంధించిన జ్ఞాపకాలను తల్చుకుంటున్నప్పుడు తెలుగు పాఠకులు, రచయితలు, సాహిత్యాభిమానులు, చందమామ ప్రియులు మర్చిపోకూడని అంశం చందమామ బేతాళ కథలు.

శతాబ్దాలు గడిచినా గుబాళింపు తగ్గని గుణాఢ్యుడి బేతాళ మూలకథల మూసలోనే గత 55 ఏళ్లుగా ఎన్నో కొత్త, ఆధునిక భావప్రేరిత కథలను సృష్టించి చందమామతన పిల్ల పాఠకుల, పెద్ద పాఠకుల మనసులను ఏళ్ల తరబడి రంజింప చేసింది. ఈ నాటికీ చేస్తూనే ఉంది. ఈరోజుకీ చందమామ కార్యాలయానికి వస్తున్న పాఠకులు లేఖలు బేతాళ కథల పటుత్వాన్ని, గొప్పదనాన్ని ప్రశంసించకుండా ఉండటం లేదంటే మనం ఆశ్చర్యపడనవసరం లేదు.

ఒక విషయం మాత్రం నిఖార్సుగా చెప్పవచ్చు. మానవ సంస్కారానికి, మానవ సద్బుద్ధికి పట్టం కట్టే కథలకు తెలుగులో కుటుంబరావు గారే ఆద్యులు కాకపోవచ్చు కాని, ఈ కోణంలో ఆయన ప్రవేశపెట్టిన ఒరవడి మాత్రం చందమామ కథలపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఎంతగా అంటే చందమామ కథల స్వభావాన్ని ఎవరూ మార్చలేనంతగా.

మరో వంద సంవత్సరాలు చందమామ కొనసాగిన పక్షంలో కూడా, చందమామ కథల స్వభావం మారబోదని ఇన్ని ఒత్తిళ్లు, ఆటుపోట్ల మధ్య కూడా మనం సగర్వంగా చెప్పవచ్చు. చందమామ రూపం ఎన్ని కొత్త లేదా అసంబద్ధ (?) ధోరణులలో కొట్టుకుపోయినా సరే దాని కథల స్వభావం మాత్రం మారదు గాక మారదు. తరాలు మారుతున్నా, చదివే పాఠకుల ప్రాధాన్యతలు మారుతున్నా చందమామ మనగలుగుతోందంటే దశాబ్దాలుగా చెక్కుచెదరని దాని కథల ఘనతర పునాదే కారణం.

ఈ రూపంలోనే మనం చక్రపాణి, కుటుంబరావుల దార్శనికతను, చందమామ కథల్లోని ఆధునిక సమాజపు నూతన భావధారను మన హృదయాల్లో నింపుకుందాం. అదే వారికీ, చందమామ స్వర్ణయుగంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నిజమైన నివాళి కూడా.

మూలంలోని కథలు అని మాత్రమే కాదు.. పీకాక్ క్లాసిక్స్ వారి ఆ ఆకర్షణీయమైన గోదుమ వర్ణపు నిసర్గ ముద్రణా సౌందర్యాన్ని, మరణ శయ్యపై ఉండి కూడా ఆధునిక అనువాద మాంత్రికుడు సహవాసి గారు సృజించిన చిట్టచివరి రమణీయ అనుసృజనను ఆస్వాదించడానికయినా గుణాఢ్యుని బేతాళ కథలుపుస్తకం తప్పక చదవండి. కొని చదవండి. అవి 2 వేల ఏళ్ల క్రితం గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలనే విషయం గుర్తుపెట్టుకుని మరీ చదవండి.
వేణుగారి స్పందన, వ్యాఖ్య ప్రభావంతో రూపొందిన ఈ కథనానికి తొలి భాగాన్ని కింది లింకులో చూడగలరు.
http://blaagu.com/chandamamalu/2009/10/30/%e0%b0%97%e0%b1%81%e0%b0%a3%e0%b0%be%e0%b0%a2%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%87%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/
RTS Perm Link
2 Responses to “బేతాళ కథలు కుటుంబరావు గారి ఒరవడి
  1. SIVARAMAPRASAD KAPPAGANTU on November 1, 2009 10:09 PM Edit This
అతి + అంత అత్యంత (ఇదే సంధో నాకు తైయదుకాని) అద్భుతంగా విశ్లేషించి బేతాళ కథలోని గొప్పతనాన్ని, కొడవటిగంటి వారు ఆ కథలకు మెరుగు దిద్ది చందమామలో పిల్లలకు అందించిన తీరు అందరికీ తెలియచేశారు. కొడవటిగంటి వారి శతజయంటి సందర్భంగా అంతగా ఎవరికీ తెలియని కుటుంబరావుగారి ఈ సాహితీ ప్రక్రియ మీ ద్వారా తెలియటం ముదావహం.
 
మీరు వ్రాసినట్టుగా కుటుంబరావుగారు సిద్ధాంత రాద్దాంతాలు, పదాడంబరాల జోలికి పోకుండా తాను నమ్మిన హేతుపూర్వక ఆలోచనా సరళిని బేతాళ కథలకు జోడించి వాటిని ఆధునిక మానవ సంస్కారానికి ప్రతీకలుగా చేసి ప్రాణప్రతిష్ట పోశారు”. 

కుటుంబరావుగారి వ్రాసిన ఏ పదంలోనైనా సరే ఆయన తానేదో బోధిస్తున్న పోకడలను ఎప్పుడూ చెయ్యలేదు. తన రచనల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం కూడ ఎప్పుడూ తలపెట్టలేదు. పిడివాదం లేదు ఆయన రచనలలో. వారి రచనలు చదువరిని అలోచింపచేసేవి. అదే కుటుంబరావుగారి రచనలు చిరంజీవులుగా నిలచిపోవటానికి మూల కారణం.

మార్క్సిజం చట్రంలో ఇరుక్కుని రచనలు చేసి ఉంటే అవి ఎప్పుడో అటకెక్కేవి. కారణం సామాజిక స్పృహ హేతుబధ్ధంగా అలోచించటం ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.

మహారచయిత కుటుంబరావుగారి శతజయంతి సందర్భంగా ఒక మంచి కోణం చూపించారు రాజుగారూ. అభినందనలు.

కుటుంబరావుగారి మీద మీ ముఖ్య వ్యాసం కోసం చందమామ ఆన్ లైను లో ఎదురు చూస్తూ…..
  1. వేణు on November 2, 2009 1:50 AM Edit This
రాజు గారూ! అడగాలే కానీ, బేతాళ కథల ప్రత్యేకత గురించి చక్కటి విశేషాలు ఎన్ని అయినా
మీరు అలవోకగా రాసేట్టున్నారు. ఈ కథలకు కుటుంబరావు గారు సమకూర్చిన ఒరవడి గురించి బాగా వివరించారు. మీకు ప్రత్యేక అభినందనలు!

0 comments:

Post a Comment