లియో టాల్‌స్టాయ్ శతవర్ధంతి
“ప్రపంచమంతా, భూఖండమంతా ఆయనకేసి చూస్తోంది. ప్రతి చోట నుంచీ, చైనా నుంచీ, ఇండియానుంచీ, అమెరికా నుంచీ జీవనాడులు ఆయన్ను పెనవేసుకుని ఉన్నాయి. ఆయన ఆత్మ శాశ్వతంగా అందరికీ చెందుతుంది”
“ఈ మానవుడు ఇక్కడ జీవించినంత కాలం నేను ఈ లోకంలో అనాధని కాను.”
“ఈ మానవుడు దేవుడిలా ఉన్నాడు.”
ఒక విశ్వ శ్రేణి రచయిత -మాగ్సీం గోర్కీ- తన సమకాలీనుడైన మరొక విశ్వ శ్రేణి రచయితను -లియో టాల్‌స్టాయ్- ఉద్దేశించి చేసిన గొప్ప వ్యాఖ్యలివి. ఇప్పటికి వందేళ్ల క్రితం -20-11-1910- కన్ను మూసిన లియో టాల్‌స్టాయ్, ఈ ప్రపంచం చదవటం అనే అలవాటును మర్చిపోనంత కాలం గుర్తుంచుకోవలసిన మహనీయ సాహితీవేత్త. రష్యన్ ఉచ్ఛారణలో ఈయన పేరు లేవ్ నికొలాయెవిచ్ తోల్‌స్తోయ్. తెలుగు వాళ్లకు మాత్రం లియో టాల్‌స్టాయ్ అని పిలవడమే అలవాటయింది.
ప్రపంచం నలుమూలల నుంచీ ఆస్తికులు, నాస్తికులు, సాంప్రదాయికవాదులు, ధార్మికులు, విప్లవకారులు… నానా రకాల మనుషులూ ఆయన్ని గత వందే్ళ్లుగా గుర్తుపెట్టుకుంటూనే వస్తున్నారు. భిన్న సిద్ధాంతాలు, భిన్న ఆచరణలు, భిన్న విశ్వాసాలు కలిగిన వాళ్లు ఈ ప్రపంచంలో ఏ సాహిత్య కారుడినయినా తలమీది పెట్టుకుని వందేళ్లుగా ఆయన రచనలను ప్రపంచంలోని అన్ని భాషలలోనూ కళ్లకద్దుకుని చదువుతున్నారంటే ఆ అపురూప గౌరవం టాల్‌స్టాయ్‌కే దక్కుతుంది.
ఎందుకీ మానవ రూపంలోని మహర్షి పట్ల ప్రపంచానికి ఇంత ఆసక్తి? నీతినీ, న్యాయాన్నీ, చరిత్రనూ, సమాజాన్నీ, సాహిత్య సౌందర్యాల్నీ, తాత్విక శాస్త్ర వికాసాన్ని తాను పొందటమే కాకుండా ఈ అన్ని అంశాలనూ తన రచనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని ప్రసరించగలిగిన మేటి సాహితీకారుడీయన. అందుకే “ఆయన చనిపోతాడంటేనే భయమేస్తోంద”ని మరొక రష్యన్ విఖ్యాత కథకుడు చెహోవ్ అప్పట్లోనే అన్నాడు.
‘యుద్ధము – శాంతి’, ‘అన్నా కెరేనినా’, ‘నవజీవనం’, ‘కొసక్కులు’ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అనేకానేక నవలల కర్త ఆయన. ఆధునిక జీవన చిత్రణకు అద్భుత పరికరమైన నవలలను, దేశదేశాల భాషల్లోకి అనువదించబడిన మరెన్నో కథలను రాసినాడు తోల్‌స్తోయ్. సమాజంపై సాహిత్యం, కళల ప్రభావాన్ని వివరించే ‘కళ అంటే ఏమిటి’ అనే గ్రంధాన్ని కూడా రాశారు.
ప్రపంచంలో దాదాపు ప్రతి భాషలోకీ అనువాదమైన, ఇప్పటికీ కథా ప్రేమికులు చదువుకుంటూ వస్తున్న ‘మనిషికెంత నేల కావాలి?’, ‘విందు తర్వాత,’ -ఇవి రెండూ తెలుగులోనూ వచ్చాయి- ‘పాదర్ సెర్జియస్,’ ‘యజమాని, అనుచరుడు’ వంటి అజరామర కథలను ఆయన కలం వెలువరించింది. ఇకపోతే ‘నీలోనే దేవుని రాజ్యం ఉన్నది,’ ‘ఒప్పుదల’, ‘నా నమ్మకాలు’, ‘ప్రేమ సిద్ధాంతము, హింసా సిద్దాంతము’ -The law of Love and the law of Violence- వంటి భావస్ఫోరక వ్యాసాలు ఎన్నో రాశాడు.
తోల్‌స్తోయ్ సాహిత్య ప్రభావానికి క్రూర నిరంకుశ రష్యన్ జైళ్లలో కొన్ని సంస్కరణలు జరిగాయి. జీవితం చివరివరకూ తన్ను తాను ఆదర్శ మతధార్మికుడిగానే నిలిచి ఉన్న టాల్‌స్టాయ్, మరోవైపున స్వయంగా దోపిడీదారులుగా మారిపోయిన మతాధిపతులనూ, ధనికుల దోపిడీకి వత్తాసుగా మతాన్ని నిలిపిన మతాధికారులనూ తీవ్రంగా నిరసించాడు. తన రచనల ద్వారా రష్యన్ ప్రాచీన చర్చిమీద పోరాటాన్ని ఎక్కుపెట్టడమే కాకుండా, క్రైస్తవంలోని మూఢాచారాలమీదా, స్వార్థపర మతాచార్యుల మీదా తిరుగుబాటు చేస్తూ రచనలు కొనసాగించాడు. కానీ వ్యక్తిగత మత విశ్వాసాలను మాత్రం ఆయన వ్యతిరేకించలేదు.
‘అరాచకవాద’ క్రైస్తవం ఆయన రచనలపై అమిత ప్రభావాన్ని కలుగ జేసింది. అధికార చర్చి భావాలనూ, అర్థం పర్థం లేని నిబంధనలనూ, రాచరికాన్నీ, రాజ్యాధిపత్యాన్నీ, వ్యక్తిగత ఆస్తినీ వ్యతిరేకించేదే ఈ ‘అరాచకవాదం’. ఈ అరాచక వాదం ప్రభావంతోటే, లెనిన్ సోదరుడు రష్యన్ చక్రవర్తి జార్ నికోలస్‌పై హత్యాప్రయత్నానికి పాల్పడి ఉరికంబమెక్కిన విషయం తెలిసిందే.
ఈ అరాచకవాద ఆదర్శాలతోటే తోల్‌స్తోయ్ తన జమీందారీ పద్ధతులకు భిన్నంగా తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. ఆనాటికి ఈయనకు వారసత్వంగా సంక్రమించిన సంపద తల్చుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. మాస్కోకు 150 కి.మీ. దూరంలోని తులా రాష్ట్రంలోని మారుమూల కుగ్రామంలో ఆయనకు వచ్చిన పిత్రార్జిత సంపద ఎంతో తెలుసా? 15000 ఎకరాల భూమి మాత్రమే. పదిహేనువేల ఎకరాల రష్యన్ ప్రభు వర్గీయుడు ‘మనిషికెంత నేల కావాలి’ అనే కథ రాసి, చనిపోయాక ఆరడుగులు చాలు అనే ముగింపు నివ్వడమే ఒక చారిత్రక అభాస కాగా, ఆ అభాసకు ఆయన నడివయస్సులో తలెత్తుకున్న అరాచకవాద ఆదర్శాలే కారణం.
అరాచకవాదం పునాదిగా ఆయనలో పెరిగిన ఆదర్శాలు ఆయన జీవిత పునాదిని తలకిందులు చేశాయి. పొగతాగడం, మద్యసేవనం, మాంసాహారం వంటి అలవాట్లను వదిలేశాడు. ఈ 15 వేల ఎకరాల కుర్ర జమీందారు తన ఆదర్శాల సాక్షిగా సామాన్య రైతు దుస్తులు ధరిస్తూ, సాధ్యమైనంత వరకు తన శ్రమమీదే ఆధారపడి జీవించసాగాడు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. తన చెప్పుల్ని తానే కుట్టుకునేవాడు. ఇంద్రియ నిగ్రహానికి కూడా పూనుకున్నాడు.
క్లుప్తంగా జీవితం…
18, 19 శతాబ్జాలలోని రష్యా కులీన కుటుంబాలలో లియో టాల్‌స్టాయ్ వంశీకులదీ ఒకటి. 18వ శతాబ్దిలో ఈయన ముత్తాతను పీటర్ ది గ్రేట్ కౌంట్ బిరుదుతో సత్కరించాడు. ఆ విధంగా ఈ వంశీకులకు జార్ చక్రవర్తి దర్బారుతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. తులా రాష్ట్రంలో 1828లో టాల్‌స్టాయ్ జన్మించాడు. తండ్రి పదిహేను వేల ఎకరాల భూస్వామి. బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించినప్పటికీ టాల్‌స్టాయ్ సుఖభోగాలకేమీ లోటు రాలేదు. ప్రయివేట్ ట్యూటర్ల వద్ద విద్యాభ్యాసం, తర్వాత కజాన్, పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయాల్లో చదివినా చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో ఎక్కడా డిగ్రీ రాలేదు.
యవ్వనం తొలిరోజుల్లోనే హై సొసైటీలో ప్రవేశించిన టాల్‌స్టాయ్ అందగాడు కానప్పటికీ ఫ్యాషన్ దుస్తులపై మోజు. కోపిష్టి, అందరితో పోట్లాటలు. ధనవంతులకు కాలక్షేపంగా ఉండే తాగుడు, జూదం, స్త్రీ లాలసత్వం, ఎప్పటి కప్పుడు జేబులు ఖాళీ అయ్యేవి. కాని డబ్బులకు మాత్రం కొదవలేదు.
ఇరవయ్యో మూడో ఏట అన్న ప్రోత్సాహంతో సైన్యంలో చేరిక, తోటి సైన్యాధికారులతో వ్యసనాలు. విశృంఖల జీవితం ద్వారా సిఫిలిస్ సుఖవ్యాధి కానుకగా లభించింది. అయితే ‘ఈ విలాసాలు నా వ్యక్తిగత బలహీనత కాదని, మావంటి ధనికులకిదొక స్టేటస్ సింబల్ కూడా’ అని ఓ సందర్భంలో డైరీలో రాసుకున్నాడు కూడా.
మానుకోలేని అలవాట్ల పట్ల నెమ్మదిగా పశ్చాత్తాపం, ఆత్మవిమర్శ పెరిగింది. 1854లో క్రిమియన్ యుద్ధం జరిగేటప్పటికి సైన్యంలో లెప్టినెంట్ పదవికి ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ జీవితం మోహం ఎత్తడంతో రిటైర్మెంట్ తీసుకుని యూరప్‌లో పర్యటించాడు. అప్పటిదాకా రాసిన స్కెచెస్, కోసక్కులు అనే కథా సంకలనం ప్రచురించాడు.
ఉద్యోగ విరమణ తర్వాత యాస్నాయా పొల్వనా -తన కుగ్రామం- కు తిరిగొచ్చాడు. అప్పటికే 34 ఏళ్లు. విచ్చలవిడితనం పట్ల విసుగెత్తిపోయాడు. పెళ్లి చేసుకుని స్థిరపడాలనే కోరిక ప్రబలం కావటంతో డాక్టర్ బెర్స్ అనే ప్రముఖ వైద్యుడి కుమార్తె 18 ఏళ్ల సోన్యాని పెళ్లాడాడు. ఆమె పొదుపరి. చాలా కాలం సుఖజీవనం. మొత్తం 13 మంది పిల్లలు. ఎస్టేట్ మరో వెయ్యెకరాలు పెరిగింది.
యవ్వనంలో టాల్‌స్టాయ్ నిరీశ్వరవాది. యుద్ధము-శాంతి నవల తర్వాత మార్పు ప్రారంభమైంది. మత విశ్వాసాలు పెరగలేదు కాని ఈ సర్వసృష్టికీ మూలకారణమే దేవుడు అనుకున్నాడు. జీసస్‌ని పూజ చేయడం కాదు. అలాగా బతకాలి, ఈ లోకంలో చెడు ఉన్నది కాని దానికి చెయ్యి అడ్డుపెట్టనవసరం లేదు, అన్నాడు. జరిగేదేదో జరగనీ.
ఈ విశ్వాసాల పరిణామంగా జీవిత పద్ధతి కూడా మారింది. వ్యక్తి సమస్యలన్నింటికీ పరిష్కారం శారీరక శ్రమలో ఉందని భావించాడు. తన ఎస్టేట్ యాస్నాయా పోల్వానాలో కట్టెలు కొట్టడం, పొలం దున్నటం వంటి పనులన్నీ చేశాడు. నీవంటి గొప్ప రచయిత ఇలా తనకు సంబంధించని విషయాల్లో తలదూర్చి కాలయాపన చేయాలా, అంటూ నిరసన తెలిపింది భార్య.
ఈ లోకంలో దోపిడీకి, అసమానతలకు మూలం స్వంత ఆస్తి అన్నది తదుపరి దశ. టాల్‌స్టాయ్ వంటి వ్యక్తులు విశ్వాసానికి ఆచరణకూ తేడా చూడరు. కాని భార్య అడ్డుపడింది. “ఉన్నదంతా దానం చేస్తే పదముగ్గురు పిల్లలతో తనెక్కడికి పోవాలి? వాళ్ల చదువులు, పోషణ ఎవరు చే్స్తారు?” ఆమె పోరు పడలేక ఆస్తిని భార్యా, పిల్లల పేర రాశాడు.
అంతకంతకూ రచయితగా, తాత్వికుడిగా టాల్‌స్టాయ్ ప్రభావం రష్యన్ సమాజంమీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో, శాంతి కాముకుల్లో, సంస్కర్తల్లో కూడా పెరిగింది. ఆయన బోధనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా కాలనీలు, కమ్యూన్‌లు, ఆశ్రమాలు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో గాంధీ కూడా టాల్‌స్టాయ్ ఆశ్రమం స్థాపించి ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.
అయితే జీసస్‌లాగా, సాటి మనిషిని ప్రేమించమని చెప్పిన మనిషి, తన భార్యా పిల్లల్ని విస్మరించాడు. భూస్వామ్య కులీన వర్గాలలోని డాంబికం, హోదాలకోసం పాట్లు, కృత్రిమ జీవితం తన స్వంత జీవితం నుంచి కూడా ఆయనను అవతలికి నెట్టాయి. దానికి తోడు ఆస్తి వ్యవహారాలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఆదాయానికి గండిపడడం కుటుంబ జీవితంలో మరిన్ని ఘర్షణలకు తావిచ్చింది.
దీంతో 1881కి ముందు ఆయన రాసిన రచనల హక్కులను తన పేరున రాయించుకున్న భార్య సోన్యా స్వంతంగా ప్రచురణ ప్రారంభించి ఆదాయం సంపాదించడం, తన పుస్తకాలు ధనసంపాదనకు మార్గం కావడం టాల్‌స్టాయ్‌కి కోపం తెప్పించింది. దీంతో 1881 తర్వాత తను రాసిన పుస్తకాలపై ఎవరికీ కాపీరైట్ లేదని ప్రకటించేశాడు. ఇది చాలదన్నట్లుగా గతంలో భార్య పేర రాసిన హక్కుల్ని వాపసు తీసుకున్నాడు. ఇంటి పోరు పరాకాష్టకు చేరింది. రెండో కూతురి ప్రేమసంబంధం విచ్ఛిన్నమయిన ఘటన భార్యాభర్తల మధ్య మరింత అఖాతం సృష్టించింది.
తన 82వ ఏట 1910లో జీవితం మీద విరక్తి కలిగిన టాల్‌స్టాయ్ ఇంటినుంచి బయలు దేరి కుంభవర్షంలో రైలుప్రయాణం చేశాడు. భార్యకు తన జాడ తెలియకూడదని చెప్పకుండా బయలుదేరి షమార్డి స్టేషన్‌లో విశ్రాంతి కోసం దిగినప్పుడు జలుబు జ్వరం పట్టుకుంది. ఈ వృద్ధ ప్రయాణీకుడెవరో అప్పటికే తెలిసిపోయింది. అస్టాపోవో స్టేషన్‌లో రైలు ఆపిన కొద్ది గంటల్లోనే టాల్‌స్టాయ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తా ప్రసారాలు, వందలాది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఆ కుగ్రామంలోని రైలు కంపార్ట్‌మెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకుని వార్తలు పంపారు.
ఆ చివరి క్షణాల్లో ప్రభుత్వాధినేతలు, ప్రధానమంత్రులు టాల్‌స్టాయ్ గురించి వాకబు చేసారు. నవంబర్ 20 ఆదివారం ఉదయం ఆరింటికి టాల్‌స్టాయ్ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం చేశారు. నోబెల్ ప్రైజ్ అందుకోలేనంత మహోన్నతుడు; జీసస్‌లాగా జీవించాలని, పూజించవద్దని ప్రపంచాన్ని అభ్యర్థించిన సాధుశీలి; హింస, అహింస ఆచరణలపై ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసిన మహా రచనలు చేసిన రుషితుల్యుడు తన జీవన యాత్ర ముగించారు.
అన్నిటికంటే ముఖ్యంగా రష్యన్ సాహిత్యాకాశంలో ధృవతారగా మిలమిలలాడుతున్న టాల్‌స్టోయ్ బోధనల సారాంశాన్ని నాటి రష్యా విప్లవ ప్రజానీకం, మేధో ప్రపంచం పరిత్యజించింది. కాగా, చెడు ఉంటే పట్టించుకోకు, అలా వదిలేయి జరిగేది జరుగుతుంది అని బోధించే ఆయన ఆరాజకీయ, అప్రతిఘటనా సూత్రాలు గాంధీ గారి చేతిలో అహింసా పోరాటంగా మారి నిరాయుధ ప్రతిఘటనతో భారత రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. దాని మంచి చెడ్డలను మరోసారి బేరీజు వేసుకుందాం.
ఆధునిక మహిళల పొలికేక అన్నా కరేనినా..
‘ఆడది మగవాడికంటే భౌతికంగా ఎక్కువ నిజాయితీతో ఉంటుంది.. ఆమె అబద్దం ఆడినప్పుడు తనే నమ్మదు..’ అని ఒక సందర్భంలో గోర్కీ వద్ద ప్రస్తావించిన టాల్‌స్టాయ్, ఆధునిక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహోన్నత నవల ‘అన్నా కరేనినా’ రచనతో ఆనాటి సాహిత్య ప్రపంచంలో పెను సంచలనం కలిగించాడు.
వివాహేతర సంబంధాల విషయంలో స్ర్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం నగ్నంగా శతాబ్దాలుగా చెలామణీ అవుతున్న భయంకర సత్యం ఈ నవల ఆవిర్భావంతో పెను కుదుపుకు గురైంది. ద్వంద్వ విలువలు రాజ్యమేలుతున్న వ్యవస్థలో భర్తలపై ఎంత అసహ్యం పుట్టినా, ఆర్థిక భారంతో పిల్లల్ని ఒంటరిగా పెంచలేక, సమాజంలో రక్షణ లేక భార్యలు తమ అసహ్యాల్ని దిగమింగుకుని ఎలాగో కాపురాలు చేస్తూ వస్తున్న ప్రపంచవ్యాప్త సామాజిక దౌష్ట్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ టాల్‌స్టాయ్ దాదాపు 150 ఏళ్ల క్రితమే అన్నా కరేనినా నవలలో చిత్రించాడు.
స్త్రీలకు జరుగుతూ వస్తున్న అన్యాయాలను అన్యాయాలుగా చూడ్డానికే పూర్వకాలం నుంచీ ఈ సమాజం నిరాకరించింది. కనీసం ఇప్పుడంటే ఈ విషయాన్ని చర్చిస్తూ ఎంతో సాహిత్యం వస్తోంది కాని వందేళ్ల క్రితం అలాంటి ప్రయత్నమే ఊహించడానికి వీల్లేనట్లుగా ఉండేదంటే, ప్రపంచంలోని యావత్తు నాగరిక సమాజాలన్నింటిలోనూ స్త్రీల స్థితి ఎంత దుర్దశలో ఉన్నదీ గ్రహించవచ్చు. కానీ 150 ఏళ్ల కిందటే స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ప్రపంచ సాహిత్యంలోనే మొదటి సారిగా ఒక సాహసోపేత ప్రయత్నం జరిగిందంటే అదెంత విప్లవాత్మకమైన ఆలోచనో మనం ఊహించవచ్చు.
సమాజంలో తనకు కనిపించిన ప్రతి దురన్యాయాన్నీ గమనించి ప్రశ్నించినట్లుగానే, ఈ విషయంలోనూ ప్రశ్నిస్తూ, ఎత్తిచూపుతూ ఒక గొప్ప కళాత్మకవైభవంతో, అపరూప శిల్ప విన్నాణంతో ఓ బృహన్నవలారాజాన్ని టాల్‌స్టాయ్ రచించగానే ఆయన ఇతర రచనలకు లాగానే ఈ నవల కూడా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఒక సంపన్న రష్యన్ కులీన కుటుంబంలో అన్నా వివాహేతర సంబంధం, దానివల్ల కలిగిన పరిణామాల చుట్టూ తిరిగే ఈ నవల 19వ శతాబ్దంలో రష్యాలోని సాంఘిక పరిస్థితులు, రాజకీయాలు, మానవ, కుటుంబ సంబంధాల చర్చించే విస్తృత వేదికగా నిలిచింది. వివాహిత అయిన అన్నా వివాహేతర ప్రేమలోకి వెళ్లి, విఫల ప్రేమికురాలై రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం అన్యాయ సమాజం ముందు ఓ మహిళ ఎలుగెత్తి చాటిన పొలికేక.
ప్రపంచంలో, వివాహేతర సంబంధం అనేది పురుషులకు ఒక ఘనవిజయంగానూ, విస్మరించదగిన చిన్న దోషంగానూ, స్త్రీలకు మాత్రం క్షమించరాని ఘోర అపరాధపు విలువగా కొనసాగినంత కాలం, అన్నా 150 ఏళ్ల క్రితం పెట్టిన ఆ పొలికేక సమాజానికి మంట పెడుతూనే ఉంటుంది.
టాల్‌స్టాయ్ సత్యాహింసల గురించి, రష్యన్ విప్లవం, భారత స్వాతంత్ర్య సంగ్రామంపై ఆయన ప్రభావం గురించి మరో కథనంలో తల్చుకుందాం.
(సరిగ్గా వందేళ్ల క్రితం ఈ రోజునే 20-11-1910 కన్నుమూసిన టాల్‌స్టాయ్ శత వర్ధంతి సందర్భంగా ప్రజాసాహితి నవంబర్ సంచికను ప్రత్యేక సంచికగా తీసుకువచ్చింది. శైలి మినహాయిస్తే ఈ కథనం మొత్తానికి ఈ ప్రత్యేక సంచికే వనరు అయింది. టాల్‌స్టాయ్‌ని ఆన్‌లైన్ పాఠకులకు మరోసారి గుర్తు చేయాలనే ప్రయత్నంలో సహకరించిన ప్రజాసాహితి ప్రత్యేక కథనాలకు కృతజ్ఞతలు.
కొసమెరుపు. ఈ రోజు మీరు ఖాళీగా ఉంటే, మీవద్ద ఇప్పటికే టాల్‌స్టాయ్ రచనలు ఉండిఉంటే వాటిలో ఏదో ఒక భాగం చదవండి. అసలే టైం లేదనుకుంటే కనీసం ఆయన రాసిన ‘మనిషికి ఎంత నేల కావాలి?’ ‘విందు తర్వాత’ అనే అద్భుతమైన కథలనయినా చదవండి. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు టాల్‌స్టాయ్ కథలను 'విందుతర్వాత' అనే పేరుతోనే అనుకుంటాను… చిన్న పుస్తకంగా వేశారు. లేదా చిన్న పిల్లలకోసం ఆయన రాసిన గొప్ప కథలనయినా మీ పిల్లలకు చదివి వినిపించండి.
మానవరూపంలో అవతరించిన ఈ దేవుడిని ఇలాగే తల్చుకుందాం. ఇలాగే నివాళి పలుకుదాం.
November 20th, 2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.
టాల్‌స్టాయ్ | Edit | Comments (3)
3. Responses to “లియో టాల్‌స్టాయ్ శతవర్ధంతి”
1. దాసరి వెంకటరమణ on November 22, 2010 4:15 PM Edit This
లియో టాల్‌స్టాయ్ గురించిన మీ కథనం అద్భుతంగా వుంది. ప్రజాసాహితి నవంబర్ సంచిక నేను చదివాను. మీ కథనం ఆ సంచికలోని టాల్‌స్టాయ్ గురించిన వివరాలకు సంక్షిప్తీకరణ అని చెప్పవచ్చు.
టాల్‌స్టాయ్... ఈ ప్రపంచం చదవటం అనే అలవాటును మర్చిపోనంత కాలం గుర్తుంచుకోవలసిన మహనీయ సాహితీవేత్త. నీతినీ, న్యాయాన్నీ, చరిత్రనూ, సమాజాన్నీ, సాహిత్య సౌందర్యాల్నీ, తాత్విక శాస్త్ర వికాసాన్ని తాను పొందటమే కాకుండా ఈ అన్ని అంశాలనూ తన రచనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని ప్రసరించగలిగిన మేటి సాహితీకారుడీయన.
అక్షరాల నిజం.
జీసస్‌లాగా జీవించాలని, పూజించవద్దని ప్రపంచాన్ని అభ్యర్థించిన సాధుశీలి;
టాల్‌స్టాయ్ సాహిత్య ప్రభావానికి క్రూర నిరంకుశ రష్యన్ జైళ్లలో కొన్ని సంస్కరణలు జరిగాయి.
చాలా గొప్ప విషయం.
చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో ఎక్కడా డిగ్రీ రాలేదు.
నిజమే మహాను భావులంతా అలాగే వుంటారేమో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మూడో తరగతిలోనే లెక్కల మాస్టరుకు భయపడి చదువు మానేసి పారిపోయారు. ఇప్పుడు ఇన్ని వేల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు.
'అస్టాపోవో స్టేషన్‌లో రైలు ఆపిన కొద్ది గంటల్లోనే టాల్‌స్టాయ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తా ప్రసారాలు, వందలాది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఆ కుగ్రామంలోని రైలు కంపార్ట్‌మెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకుని వార్తలు పంపారు.'
ఆ కాలంలో కూడా జర్నలిస్టుల పరిస్థితి అలాగే వుందన్న మాట.
‘ఆడది మగవాడికంటే భౌతికంగా ఎక్కువ నిజాయితీతో ఉంటుంది.. ఆమె అబద్దం ఆడినప్పుడు తనే నమ్మదు.. ప్రపంచంలో, వివాహేతర సంబంధం అనేది పురుషులకు ఒక ఘనవిజయంగానూ, విస్మరించదగిన చిన్న దోషంగానూ, స్త్రీలకు మాత్రం క్షమించరాని ఘోర అపరాధపు విలువగా కొనసాగినంత కాలం, అన్నా 150 ఏళ్ల క్రితం పెట్టిన ఆ పొలికేక సమాజానికి మంట పెడుతూనే ఉంటుంది.'
ఇది చాల ఉత్కృష్టమైన భావం.
ఆయన చిన్న పిల్లల సంభాషణల్లో (యుద్ధం, మతం, పన్నులు ) వంద సంబత్సరాల క్రితమే అంతటి పరిణతి వుందంటే నమ్మలేం. చలం గారి దొంగలున్నారు జాగ్రత్త, పెళ్లి ముస్తాబు, పుట్టిన పండుగ, వినాయక చవితి, డబ్బు, మొదలైన రచనలలోనూ, నరసింహావతారం లో ప్రహ్లాదుని సంభాషణల్లో, ఈ తరహ పిల్లల తెలివి తేటలు ప్రష్పుట మౌతవి.
‘మనిషికెంత నేల కావాలి?’, ఈ కథ తెలుగులో చాలా మంది అనువాదం చేసి వుండ వచ్చు. కాని ఈ కథ కేంద్ర బిందువును తీసుకొని అనేక మంది అనేక విధాలుగా కథలను మలచారు. అలాంటి కథ ఒకటి నేను చదివాను. నాకు గుర్తు వున్నంత వరకు చెబుతాను. బహుశ చందమామ లోనే అనుకుంటాను.
ఒక చోట సముద్రంలో రత్నాలు దొరుకుతుంటవి ఒక ధనవంతుడు కూలీలను పెట్టి వెతికిస్తుంటాడు. వాళ్లకు ఏమి దొరికితే దానిని ధనవంతుడికి ఇవ్వాలి. వాళ్ళ కూలి రోజుకు ఇరవై వరహాలు. రత్నాలు దొరికిన దొరుకకున్నా కూలి ఇవ్వాల్సిందే. ఇలా వుండగా ఒకడికి ఒక అమూల్యమైన రత్నం దొరుకుతుంది. దాని వేల ఎవరూ కట్టలేరు. దానిని ఇరవై వరహలకు ధనవంతుడికి ఇవ్వడం ఇష్టంలేక అతడిని మోసం చేసి రాజు గారికి చూపిస్తే. రాజుగారు తన ధనాగారం నుండి. ఒక రోజు అతడు మోయగాలిగినంత ధనం తీసుకు పొమ్మంటాడు. కానీ ఒక షరతు సూర్యాస్తమయం తర్వాత ధనాగారం లో కనబడితే వురి తీస్తానంటాడు. వాడు మధ్యాహ్నం వరకు ఎడ్ల బండ్లు కిరాయికి మాట్లాడుకోవడం, గోనే సంచులు తాయారు చేసుకోవడం మొదలైనవి చేసాడు. తర్వాత ధనాగారం వచ్చి ఒక్కో సంచి నింపడం మొదలుపెట్టాడు. చాల సంచులు నింపాడు. అలా నింపుతూనే వున్నాడు. సాయంత్ర మైంది. నింపు తూనే వున్నాడు. చీకటి పడబోతుంది. భటులు హెచ్చరిస్తూనే వున్నారు. ఇక సూర్యాస్తమయానికి ఇక కొద్ది ఘడియల వ్యవధి మిగిలి వుంది. ఒక సంచి మోయ లేక మోయలేక గుంజుకు రాసాగాడు. చాల కష్టమైంది. భటులు ధనాగారం తలుపులు మూయ సాగారు. ఇక లాభం లేదు. ఒక్క క్షణంలో బయటికి వెళ్లక పొతే ప్రాణానికే ప్రమాదం. అక్కడ ఒక సంచిలో వున్నా వరహాలను రెండు పిడికిళ్ళ నిండా తీసుకొని ఒక్క దుముకున ధనాగారం బయట పడ్డాడు. భటులు తలుపులు మూసేసారు. రెండు పిడికిళ్ళ వరహాలు లెక్క పెడితే సరిగ్గా ఇరవై వరహాలు వున్నై.
మీరు పరిచయం చేసిన తీరు బావుంది అభినందనలు
2. చందమామ on November 22, 2010 5:05 PM Edit This
శ్రీ వెంకట రమణ గారికి
నమస్కారం.
మొదట్లోనే చెప్పాను ఈ పెద్ద కథనంలో శైలీ పరమైన మార్పులు, అక్కడక్కడా వ్యాఖ్యానాలే నావి తప్పితే మొత్తం విషయం ప్రజాసాహితి నుంచి తీసుకున్నదే ఆధారం. గత గురువారం రాత్రి ప్రజాసాహితి ఆ సాంతంగా చదివాను. అంతలోనే 20వ తేదీనే టాల్‌స్టాయ్ శత వర్థంతి అని గుర్తుకొచ్చింది. ఉన్న విషయాన్నే ఆన్‌లైన్ పాఠకులకు వివరంగా పరిచయం చేద్దామనే తలంపుతో శుక్రవారం ఆఫీసులోనే కసరత్తు చేసి శనివారం మధ్యాహ్నానికి సిద్ధం చేయగలిగాను. అయితే చాలా సమయం తీసుకుంది సాపు చేయడానికి. చందమామకు సంబంధించినది కానప్పటికీ మీరు ఇంత ఓపికగా ఈ కథనం ఆసాంతం చదివి విలువైన వ్యాఖ్య పెట్టారు. ఒక్క సారిగా సేద దీరినట్లుగా ఉంది.
ఒక చేదు వార్త ఏమటంటే నిన్నా మొన్నా పత్రికలలో చదివాను. రష్యాలో టాల్‌స్టాయ్ శత వర్థంతి అనే అంశాన్ని ఇటు ప్రభుత్వమూ, అటు ప్రజానీకమూ కూడా ఏమాత్రమూ పట్టించుకోలేదట. నాకు బాధ కన్నా ఒకటనిపించింది. రష్యా ఎంతగా మారిపోయింది. ఎంతగా భ్రష్టుపట్టిపోయింది అంటే ఇంకా బాగుంటుందేమో.. ప్రపంచం మొత్తానికి ప్రస్తుతం కాల్ గర్ల్స్‌ని సరఫరా చేస్తున్న ఆ ‘గొప్ప’ దేశానికి ఇంత ‘చిన్న’ వ్యక్తి ఎలా కనిపిస్తాడు లెండి ఇప్పుడు.
ఏమయినా ఇంత మంచి కామెంట్‌ని ఇంత రాత్రి పూట ఓపిగ్గా పోస్ట్ చేశారు.
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
3. kalpanarentala on November 22, 2010 11:16 PM Edit This
సరైన సమయానికి మీరు రాసిన వ్యాసం, దాసరి గారు ఎంతో శ్రద్ధగా పెట్టిన కామెంట్ రెండూ బావున్నాయి. ప్రజాసాహితి నేను చూడలేదు కాబట్టి చెప్పలేను కానీ మీరు ముఖ్యమైన పాయింట్లు కవర్ చేశారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన లైఫ్ గురించి సందేహాలున్నాయి. కొంత తీరిక చిక్కగానే వీలైతే నేను వ్యాసం రాసినప్పుడు ఉదహరిస్తాను. ఇక అనాకేరినీనా గురించి…మాత్రం అక్షరలక్షల్లాంటి మాటలు చెప్పారు. దాని మీద కూడా నా ప్రత్యేక వ్యాసం వీలైనంత తొందర్లో రాస్తాను. అన్నింటిని మర్చిపోతున్న తరంగా బతికేస్తున్నప్పుడు ఇలాంటి వ్యాసాలుమన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. అలా గుర్తు చేసినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు.
కల్పనారెంటాల
0 comments:
Post a Comment