Pages

Saturday, December 4, 2010

మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు

రాష్ట్రావతరణ దినోత్సవానికి సరిగ్గా వారం రోజుల క్రితం ఈ వాక్యం రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ దుమ్ము దులిపింది. “ఐ నెవర్ స్పీక్ తెలుగు” మీడియా మితిమీరిన అతిశయోక్తికి తోడుగా ఈ సత్యాన్ని ఇప్పుడే తాము కనిపెట్టినట్లుగా ప్రతి టీవీ యాంకరన్నా. యాంకరమ్మా ఆ మైదుకూరు స్కూల్‌తో ఆటాడుకున్నారు. ఇంగ్లీషు మాట విరుపులు లేనిదే ఒక పదం సరిగా పలకలేని ఈ గురువింద గింజల సంగతి అలా పక్కన పెడితే.. మా అనుభవంలో ఉన్న సంగతులు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను.

ఓ రకంగా మా తరం వాళ్లం అదృష్టవంతులమే (?) అని చెప్పాలి. ఇది 1970ల నాటి మాట. ఆరోజుల్లో అందరు పల్లె పిల్లల మాదిరే మేమూ తెలుగు బళ్లోలోనే చదువుకున్నాము. 6 నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోనే చదువుకున్నాము. తెలుగులో చదువుకున్నందుకు మేమే రోజూ సిగ్గుపడలేదు.

మా బంధువుల పిల్లలు హైదరాబాదు, ఢిల్లీలలో చదువుకుంటూ వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వచ్చినప్పుడు వారితో సంభాషణలు జరిపేటప్పుడు వారి ఆంగ్ల ఉచ్చారణ, నాగరికపు భాష మాలో కాస్త ఆసక్తి కలిగించినప్పటికీ లోక వ్యవహారాలు, సామాన్య జ్ఞానానికి సంబంధించి వారికంటే మాకే కాస్త ఎక్కువ జ్ఞానం ఉన్నట్లు రుజువు చేసుకుని సంతోషపడ్డామే తప్ప ఆంగ్లం చదువుకోలేదే, మాట్లాడలేదే అని ఏనాడూ కుంగిపోలేదు.

పైగా మేము చదువులో, పత్రికలు, పుస్తకాలు చదవడంలో, మహాకావ్యాలను, గొప్ప పుస్తకాలను జీర్ణింప చేసుకోవడంలో ఏనాడూ వెనుకబడి లేము. ఆ రోజు చదివిన తెలుగు పద్యాలు, పుస్తకాలు, పురాణాలు మాకు ఈరోజుకీ ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తున్నాయి తప్ప ఎందుకు తెలుగు చదివామా అని బాధపడిన రోజు మా జీవిత జ్ఞాపకాల్లో లేదు.

అంతెందుకు.. పిల్లలను ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమని చెప్పే దరిద్రపు పాఠశాలలను, ఇంట్లో తెలుగు మాని, పిల్లలతో ఇంగ్లీషులోనే మాట్లాడే దరిద్రపు కుటుంబాలను, దరిద్రపు తల్లిదండ్రులను మా రోజుల్లో మేం ఎన్నడూ చూడలేదు. (ఎవరికయినా బాధ కలిగిస్తే క్షమించాలి)
మరి ఈ ముదనష్టపు సంస్కృతి ఎక్కడినుంచి వచ్చిందో కాని తెలుగు నేలపై తెలుగు మాట్లాడిన పాపానికి పసిపిల్లల మెడలో పలుపుతాడులాగా ఐ నెవర్ స్పీక్ తెలుగు ‘సిగ్గు బిళ్లలు’ తగిలించే వరకు మనం ఎదిగిపోయాం ఇవ్వాళ.

ఎవరేమైనా అననీ… మా బాల్యానికి మేం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేం తెలుగులోనే చదివాం, తెలుగు బళ్లలోనే చదివాం, తెలుగు మాట్లాడే పెరిగాం. మా తల్లిదండ్రులను మేం అమ్మా, నాన్నా, అయ్యా, నాయనా, అప్పా అనే పిలిచి పెద్దవారిమయ్యాం. ఇందుకు మేం ఏనాటికీ సిగ్గుపడం.
మాతృభాషను కొద్దో గొప్పో సరిగా నేర్చుకున్నందుకు దాని బలంతో ఇతర భాషలను కూడా అంతో ఇంతో నేర్చుకున్నాం. పదవ తరగతితోటే ఇంగ్లీషు, లెక్కలు, హిందీ పీడ వదులుతుందని సంతోషపడ్డ క్షణాలను దాటుకుని మాతృభాషపై పట్టు ఉన్న పునాది మీద నిలబడి ఇతర భాషల్లో కూడా అనువాదాలు చేయగల స్థితికి క్రమంగా చేరుకున్నాం.

అన్నిటికంటే మించి మా బాల్యం ‘చందమామ’ సాక్షిగా పుట్టింది, పెరిగింది. జీవితాంతం తెలుగులోనే రాయడానికి, మాట్లాడడానికి ఈ ఒక్క జ్ఞాపకం చాలు మాకు. మా నాన్న మాకు ఊహతెలియని వయస్సులో చందమామ తెచ్చి ఇచ్చి దీనివల్ల జ్ఞానం వస్తుంది చదవండిరా అన్నాడు.
జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆనాటి నుంచి మేం తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం మర్చిపోలేదు. అమ్మను అమ్మా అని, నాన్నను నాన్నా అని పిలవడం మర్చిపోలేదు. ఈ ఘోరమైన నేరాలకు గాను మా తరం ప్రపంచం నిండా మునిగిపోయిందీ లేదు.

సాఫ్ట్‌వేర్, ఐటీ, బహుళజాతి సంస్థలు, వాటిలో ఉపాధి అవకాశాలు ఇవి తప్ప మరొకటి కనబడకుండా పోయిన, వినబడకుండా పోయిన ఈ నాటి ప్రపంచంలో తెలుగుకే ఇంకా అంటిపెట్టుకని ఉన్నందుకు మేం కోల్పోయిందేమీ లేదు.

భాషమీద ప్రేమా, మమకారం, మనదీ అనిపించుకున్న పునాదిపై విశ్వాసం ఉన్నంతవరకూ ఈ ‘నెవర్ స్పీక్ తెలుగు’ వికృత వైపరీత్యాలు మనల్నేమీ చేయలేవని మా ప్రగాఢ విశ్వాసం.

మేం ఇలాగే బతికాం.. ఇలాగే బతుకుతాము కూడా…

November 1st, 2009న చందమామ బ్లాగులో ప్రచురించబడింది

ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: అమ్మ, ఆంగ్లోన్మాదం, చందమామ, తెలుగు, నాన్న, భాష, మైదుకూరు | Edit | Comments (6)

6 Responses to “మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు”

1. రవి on November 1, 2009 11:21 PM Edit This
నా మనసులోకి తొంగి చూసి రాసినట్టుంది ఈ టపా. ఈ టపాలో ప్రతి అక్షరం నేను కూడా డిటో డిటో …

2. వేణు on November 2, 2009 1:45 AM Edit This
నాలాంటి వారి గొంతులను ఏకం చేసి, పలికినట్టు చాలా బాగా రాశారు. మాతృభాష సరిగా రాకుండానే పరభాషలో పట్టు పెరగాలనే అత్యాశల మధ్య బతుకుతున్నాం. ‘మేం ఇలాగే బతికాం.. ఇలాగే బతుకుతాము కూడా…’ అంటూ టపా చివర సూటిగా, నిర్ద్వంద్వంగా చేసిన ప్రకటన ఎంతో గొప్పగా ఉంది!

3. subhadra on November 2, 2009 2:45 AM Edit This
చప్పట్లు…చాలా చాలా బాగా చెప్పారు..మీ పోస్ట్ చదివి నేను కుడా నా బాల్యానికి దన్యవాదాలు చెప్పుకు౦టున్నాను.

4. సిరిసిరిమువ్వ on November 2, 2009 4:03 AM Edit This
మా అందరి మాటా మీ నోట ఎంత బాగా చెప్పారు! చప్పట్లు.

5. chandamama on November 2, 2009 4:22 AM Edit This
రవి, వేణు,సుభద్ర, సిరిసిరిమువ్వ గార్లకు,
ఈ స్పందన చాలు.. తెలుగుపై మమకారం ఇంకా నిలుపుకోవడానికి మీ ఈ స్పందనలు చాలు. ఇంగ్లీషు రానందుకు, మాట్లాడలేనందుకు, ఇంగ్లీషు ఉద్యోగాలు చేయలేనందుకు సిగ్గుపడని వారు, తల దించుకోని వారు లోకంలో ఇంకా ఉన్నారు.. ఈ ధైర్యంతోటే, ఈ విశ్వాసంతోటే మనం తెలుగును ప్రేమిద్దాం. ముందు తెలుగు నేర్చుకుందాం. తర్వాత ప్రపంచం మీదికి పోదాం..
మీ అందరికీ నా నెనర్లు..

6. రవి on November 2, 2009 6:17 AM Edit This
ఇంకా విచిత్రాలు గమనించాలండి.
మనం (ఈ కాలపు కాస్మోపాలిటన్ ఉద్యోగులు) ఈ ఉద్యోగాలు చెయ్యటానికి కారణం, మనకు కాస్తో, కూస్తో ఉన్న విశ్లేషణా సామర్థ్యం – దానికి ఆలంబన మనకు (తెలుగువాళ్ళకు) ఉన్న గణిత సామర్థ్యం. అది ఎలా అబ్బిందంటే, మాతృభాషలో బోధన వల్ల. అదొక్కటే కాదు, ఈ ఉద్యోగాలు చేస్తూ, పూర్తీగా డబ్బు చుట్టూ తిరిగే ఈ నగరాలలో, కాస్తో కూస్తో సెంటిమెంటల్ గా, హృదయవాదులుగా ఉండగలుగుతున్నామంటే, దానికి కారణమూ మాతృభాషే.
ఈ విలువలన్నీ చవకగా ఎంచి, ఏరిపారేసే వాళ్ళు ఉన్నారు.
చూద్దాం. సత్యమే జయిస్తుంది.

1 comments:

Zemkarlos said...

This is a wonderful content. I will bookmark this site and visit again. It is very informative. Thanks for sharing. Luxury Condos in Miami Beach

Post a Comment