Pages

Tuesday, December 7, 2010

'చందమామ బ్లాగు' నుంచి 'నెలవంక' దాకా...

గత సంవత్సరం -2009- జూలైలో సదసత్సంశయంతోనే మొదలు పెట్టిన నా బ్లాగు -చందమామ చరిత్ర-ను -blaagu.com/chandamamalu - తెలుగు బ్లాగ్ లోకం, ప్రత్యేకించి 'చందమామ' అభిమానులు, పాఠకులు త్వరలోనే తమ స్వంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా చందమామ పఠనంలో, దాని జ్ఞాపకాలలో ఓలలాడుతూ వస్తున్న పాఠకులు, కన్న ఊరిని , దేశాన్ని వదిలి జీవితం కోసం ప్రపంచం నలుమూలలకూ పయనించి వెళ్లిన చందమామ అభిమానులు ఈ బ్లాగును అసాధారణ రీతిలో ఆదరించారు.

ఆన్‌లైన్ పాఠకులు, చందమామ అభిమానులు, బ్లాగర్ల ప్రోత్సాహం వల్లే 15 నెలల కాలంలో 180 కథనాలు చందమామ చరిత్ర బ్లాగులో ప్రచురించడమైంది. ఈ 180 కథనాల్లో దాదాపు 120 కథనాలు పూర్తిగా చందమామ చరిత్రకు సంబంధించినవి. చందమామ సంస్థాపకులు నాగిరెడ్డి-చక్రపాణి గార్ల పత్రికా విధానంలో భాగంగా మరుగున పడిపోయిన చందమామ పత్రిక విశేషాలను, అందులో పనిచేసిన అపురూప వ్యక్తులు, మాన్య సంపాదకులు, రచయితలు, అద్వితీయ చిత్రకారులు, దశాబ్దాలుగా సేవలందించిన సిబ్బంది, తదితర చందమామ చరిత్రకు సంబంధించిన విశేషాలను గత సంవత్సరం పైగా చందమామ చరిత్ర బ్లాగులో క్రమం తప్పకుండా ప్రచురించడం జరిగింది.

చందమామలో పనిచేస్తూ ఉన్న క్రమంలో ఆ బ్లాగు ద్వారానే ఎంతోమంది చందమామ రచయితలు, కథకులు, పూర్వ సంపాదకులు, చందమామను దశాబ్దాలుగా గుండెలకద్దుకుని పదిలపర్చుకుంటున్న పాఠకులు, వీరాభిమానులు మళ్లీ చందమామతో సంబంధాల్లోకి వచ్చారు. నాకంటే ముందుగా గత నాలుగు సంవత్సరాలుగా ఇంటర్నెట్‌లో చందమామను ప్రస్తావిస్తూ మంచి మంచి కథనాలు ప్రచురిస్తూ వచ్చిన ప్రముఖ బ్లాగర్లు, 'చంపి'లు, -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రేమికులు - 'వీరచంపి'లు ఎందరో మరెందరో చందమామ చరిత్ర బ్లాగుకు ప్రేరణగా నిలుస్తూ చందమామ పత్రిక చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం అందిస్తూ వచ్చారు.

సర్వశ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్, త్రివిక్రమ్, సిహెచ్ వేణు, నాగమురళి, బ్లాగాగ్ని, కె. శివరాం ప్రసాద్, సుజాత గార్లు చందమామ చరిత్ర బ్లాగు రూపొందించడానికి ముందు ఆన్‌లైన్‌లో చందమామ గురించి ప్రపంచానికి తెలియజేసిన ప్రముఖ బ్లాగర్లు. తర్వాత, చందమామ సీరియల్స్ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై వసుంధర గారు కౌముది వెబ్‌సైట్‌లో ప్రచురించిన సుబ్రహ్మణ్య సృష్టి వ్యాసం, దాసరి గారిని 2008లో, 2009లో రెండుసార్లు స్వయంగా కలిసి ఇంటర్వ్యూ ప్రచురించి చందమామ పాఠకులకు పెన్నిధిని ప్రసాదించిన వేణుగారి వ్యాసాలు ‘చందమామ’ రచయితను కలిసినవేళ...., ‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు! ... ముఖ్యంగా ఈ మూడు కథనాలు చూశాకే చందమామ చరిత్రను లోపలినుంచి వెలికి తీయాలనే కోరిక బలపడింది.

తర్వాత చరిత్ర మీకందరికీ తెలిసిందే. చందమామ చరిత్ర బ్లాగు చందమామ ఆన్‌లైన్ అభిమానులందరికీ ఒక ప్రపంచ వ్యాప్త వేదికగా నిలిచింది. దాదాపు 45 మంది చందమామ అభిమానులు ఇప్పటివరకూ తమ చందమామ జ్ఞాపకాలు పంపారు. వీటిని చందమామ వెబ్‌సైట్లో, చందమామచరిత్ర బ్లాగులో ప్రచురించడం జరిగింది. వ్యక్తిగతంగా నేను చిన్నస్థాయిలో మొదలు పెట్టిన చందమామ చరిత్ర బ్లాగు త్వరలోనే పాఠకుల విపరీత ఆదరణతో చందమామ అధికారిక బ్లాగుగా రూపాంతరం చెందింది. ఇలా వ్యక్తిగతంగా మొదలు పెట్టిన బ్లాగు సంస్థకు చెందిన బ్లాగుగా మారడం బహుశా అరుదైన విషయమే అనుకుంటాను. నా జీవిత పర్యంతం దాచుకోవలసిన మధుర జ్ఞాపకాల్లో ఇదీ ఒకటిగా ఉంటుంది.

బ్లాగ్ మొదలు పెట్టాక శివరాంప్రసాద్ గారు అందించిన ప్రోత్సాహం, ప్రేరణ గురించి ప్రస్తావించకపోతే కృతజ్ఞత అనే పదానికి బహుశా అర్థం ఉండదనుకుంటాను.

2011 ఫిబ్రవరినుంచి ప్రింట్ చందమామ పత్రికలో కూడా నా జ్ఞాపకాలు పేరిట చందమామ అభిమానుల జ్ఞాపకాలను వారి ఫోటోతో సహా ఒక పేజీలో పరిచయం చేయడం జరుగుతోంది. మొదటగా, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారి చందమామ జ్ఞాపకాలు ప్రింట్ చందమామలో ప్రచురితం కానున్నాయి.

అలాగే గత నాలుగు నెలలుగా ప్యాకెట్ సైజులోకి కుంచించుకుపోయి పాఠకుల శాపనార్థాలకు గురవుతున్న చందమామ 2011 జనవరినుంచి మళ్లీ పాత చందమామ సైజులో రాబోతోంది. పాఠకుల ఒత్తిళ్లు, తగ్గిన అమ్మకాలు ఏవైనా కావచ్చు.. చందమామ మళ్లీ చందమామలాగే ఉండబోతోంది. భూమి గుండ్రంగా ఉంటుందనేది ఎంత గొప్ప సత్యమో ఇలాంటప్పుడే బోధపడుతూంటుంది కదా! ఇటీవల కొన్ని నెలలుగా చందమామలో పేజీ నిండుగా బొమ్మలు అచ్చవుతూ పాఠకుల ఆదరణను విశేషంగా చూరగొంటున్న విషయం కూడా చందమామ అభిమానులకు, పాఠకులకు తెలిసిందే.

చివరగా.. గత సంవత్సరన్నర కాలంగా అంటే 2009 జూలై నుంచి 2010 నవంబర్ వరకు ఉద్యోగ జీవితం మినహాయించగా, నా శక్తియుక్తులన్నింటినీ చందమామచరిత్ర బ్లాగు -blaagu.com/chandamamalu- మీదే కేంద్రీకరించాను. ఒక విషయం మాత్రం ఇక్కడ నొక్కి చెప్పాలి. చందమామలో మరుగునపడిన వారి అరుదైన జీవిత వివరాలను, అరుదైన చరిత్రను బయటి ప్రపంచానికి అందించడానికి 60 ఏళ్ల తర్వాత దేవుడే రాజశేఖరరాజును చందమామకు పంపించాడంటూ కన్నీళ్లు పెట్టుకునే చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారి ప్రేరణ లేకుంటే ఇంత తక్కువ కాలంలో చందమామ గురించిన విశేషాలను ఇంత విస్తృత స్థాయిలో బయట పెట్టగలిగేవాడిని కాదు.

పరమ భక్తి భావంతో ఆయన అలా అన్నప్పుడల్లా నేను సిగ్గుతో తల వాల్చేస్తాననుకోండి అది వేరేవిషయం. మానవసంకల్ప బలానికి ప్రాధాన్యమిచ్చే కథలు ప్రచురించే చందమామలో 60 ఏళ్లుగా తాను గీస్తూ వస్తున్న ప్రతి బొమ్మనూ దైవసంకల్పంగా చెప్పుకునే మాన్యులు శంకర్ గారు. ఆయన గురించి తెలుగులో వచ్చిన కథనాలను ఒకటీ రెండు ఇంగ్లీషులోకి అనువదింపజేసి (శివరాం ప్రసాద్ గారు) బ్లాగర్ల కామెంట్లతో సహా ప్రింటు తీసి ఆయనకు అందిస్తే ఎంత ఆరాధనగా చూసేవారో.

అయితే సమయాభావం వల్ల చందమామ విశేషాలనే కాకుండా రోజువారీ ఘటనలపై నా స్పందనలను, ఇతర సాహిత్య, సినీ, సాంస్కతిక విషయాలను కూడా చందమామ బ్లాగులోనే ప్రచురిస్తూ రావడం జరిగింది. చందమామలో చందమామకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటే బాగుంటుందనేది మొదటినుంచీ పైవారి అభిప్రాయం.

బయటకు చెప్పలేని అనేక కారణాల వల్ల చందమామ ప్రస్తుత యాజమాన్యం చాలా విషయాల్లో మోతాదుకు మించిన జాగ్రత్తలతో ఉంటోంది. లీగల్ పరంగా కూడా కొన్ని సంస్థకు ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయని భీతి. ఉదాహరణకు 'చందమామ సంస్థాపకులు నాగిరెడ్డిగారిపై డీవీడి,' 'తెలుగు సినిమా విశ్వరూపం మాయాబజార్' వంటి కధనాలు వాటికి జోడించిన ఫోటోలు కాపీరైట్ సమస్యగా మారుతుందేమోనని పైవారి అభిప్రాయం.

వీరివైపు నుంచి ఇవి న్యాయకారణాలే కాబట్టి అలా ప్రస్తుత చందమామకు సంబంధం లేని ఇతర కథనాలను బ్లాగునుంచి తొలగించి మరొక బ్లాగులో ప్రచురించవలసిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ నవంబర్ మూడోవారంలో చందమామ చరిత్ర బ్లాగులోంచి 70 కథనాలను తొలిగించి వేరు చేసి ఉంచాను.

ఈ మధ్యే వ్యక్తిగతంగా నెలవంక పేరుతో ఒక బ్లాగును కూడా కొత్తగా రూపొందించుకున్నాను.
kanthisena.blogspot.com

ఈ కాంతిసేన, నెలవంక ఎవరో చందమామ పాఠకులకు, చంపిలకు ఇప్పటికే అర్థమయిందనుకుంటాను.

చందమామ చరిత్ర బ్లాగులోంచి తొలగించిన దాదాపు 70 కథనాలను ఇందులో క్రమంగా ప్రచురించిన తర్వాత దీన్ని పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో నడపాలని నా ఆకాంక్ష. తర్వాతే దీన్ని కూడలి, జల్లెడ, హరం, తెలుగుబ్లాగు వంటి ఆన్‌లైన్ కూడళ్లలో జతచేయాలని అనుకుంటున్నాను.

దీంట్లో చందమామ విశేషాలతో పాటు నా వ్యక్తిగత స్పందనలకు సంబంధించిన కథనాలు కూడా వివిధ కేటగిరీల రూపంలో ఉంటాయి. అలా నాకు మరికొంత స్వేచ్చ కూడా లభించే అవకాశం ఉందనుకుంటున్నాను. వృత్తికి, ప్రవృత్తికి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ నాకూ ఒక స్వంత బ్లాగు ఉందని చెప్పుకోవడానికి ఇది పనికివస్తుంది అని ఓ చిన్న ఆశ.

నన్ను 'చందమామ రాజు'ను చేసి అపూర్వగౌరవం కల్పించిన చందమామ చరిత్ర బ్లాగుకు మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తారని, వ్యక్తిగత ప్రాతిపదికన ఇప్పుడు మొదలెడుతున్న స్వంత బ్లాగును కూడా ఆన్‌లైన్ పాఠకులు, చందమామ అభిమానులు, 'చంపి'లు ఆదరిస్తారని, ఆదరించాలని మనసారా కోరుకుంటూ....
మీ
చందమామ రాజు.
kanthisena.blogspot.com
krajasekhara@gmail.com

0 comments:

Post a Comment