Pages

Saturday, December 4, 2010

చందమామ లెజెండ్ నాగిరెడ్డి గారిపై డీవీడీ

విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పించిన “లైఫ్ స్కెచ్ ఆఫ్ ఎ లెజెండ్ శ్రీ బి నాగిరెడ్డి” అనే డీవీడీ డాక్యుమెంటరీ ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత మళ్లీ దొరక బుచ్చుకున్నాను. విజయా ఆసుపత్రిలో నాగిరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఒక ప్రత్యేక మందిరంలో ఆవిష్కరించి దానికి ఒక మ్యూజియం స్థాయిని కల్పించాలని ఆయన బంధువులు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ అరుదైన డీవీడీ డాక్యుమెంటరీ రూపొందింది.

నాగిరెడ్డి గారి జీవిత విశేషాలను, చందమామ, విజయా స్టూడియో, విజయా హాస్పిటల్ ఆవిర్భావ నేపధ్యాలను మీడియా మిత్రులకు అందజేయాలనే తలంపుతో విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎండీ రాంబాబు గారు ఈ డీవీడీని 2007లో చెన్నయ్ మీడియా మిత్రులకు ఇచ్చినట్లు వినికిడి. ఇవి తప్ప ఈ డీవీడీలను ఎవరికీ అందుబాటులోకి తీసుకురాలేదు.

2007లో ఈ డీవీడీని నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులకోసం, ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం మాత్రమే రూపొందించినప్పుడు మా జర్నలిస్టు మిత్రుడు, విశ్వనాధ్ -ప్రస్తుతం హెచ్‌‍ఎమ్‌టీవీ రాయలసీమ కో ఆర్డినేటర్- ప్రెస్ మీట్‌ ద్వారా దాన్ని సంపాదించాడు. తెలుగువారే కాకుండా యావద్భారతమూ మర్చిపోలేని చందమామ, విజయా హాస్పిటల్, విజయా స్టూడియోస్‌ని స్థాపించిన నాగిరెడ్డి గారిని ఓ రెండున్నర గంటల పాటు తల్చుకుంటూ ఎందరో ప్రముఖుల స్మరణలతో ఈ డీవీడీ రూపొందింది.

మా మిత్రుడు, సహచరుడు విశ్వనాధ్ 2007లో ఈ డీవీడీ గురించి చెప్పినప్పుడు, భంగపడి, బతిమాలి, బామాలి ఎలాగో ఒకలాగు ఈ డీవీడీని సంపాదించాను. ఒరిజనల్ కాపీని తిరిగి ఇచ్చేయాలని తను చెప్పడంతో వెంటనే దాన్ని మూడు కాపీలు తీయించి రెండు నాకు, ఒకటి తనకు ఇచ్చి భద్రపర్చాను. అప్పటికి నేను చందమామలో ఇంకా చేరలేదు. ఇంట్లోనే ఉంటుందిలే అనే భరోసాతో దాని గురించి పట్టించుకోలేదు.

కానీ గత సంవత్సరం అపరూప చిత్రాల సేకర్త, అరుదైన డాక్యుమెంటరీల సంకలన కర్త శ్రీ బి.విజయవర్ధన్ గారితో -బెంగళూరు- పరిచయమై నా వద్ద నాగిరెడ్డి గారిపై తీసిన డీవీడీ ఉందని చెబితే తప్పక తనకూ ఓ కాపీ కావాలని చెప్పారు. అప్పటికే ఆయన చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిపై వీడీయో ఇంటర్‌వ్యూను తీసి చందమామకోసం ఒక కాపీ పంపారు.

చందమామ సంస్థాపకుడిపై డీవీడీని ఆయనకూ తీసి ఇవ్వాలని అనుకుంటే ఇంట్లో గతంలో దాచిన రెండు కాపీలూ దొరకలేదు. గుట్టలు గుట్టలుగా పుస్తకాలు, డీవీడీలు ఎక్కడ చూసినా పేరుకుపోవడంతో ఈ అపరూప డీవీడీ ఎక్కడో తప్పిపోయింది. ఇలా కాదని తిరుపతిలో ఉంటున్న మా మిత్రుడు విశ్వనాధ్ వద్ద కూడా ఒక కాపీ ఇచ్చి ఉంచాను కాబట్టి అక్కడ ప్రయత్నించి ఇన్నాళ్లకు దాన్ని ఎలాగోలాగు పట్టేశాను.

విజయవర్దన్ గారూ!
అమ్మకానికి ఏమాత్రం అందుబాటులో లేని ఈ అరుదైన డీవీడీని మీరు కోరిన విధంగా తీసి కాపీ చేసి ఉంచాను. మీ చిరునామా మళ్లీ నాకు ఓసారి మెయిల్ చేస్తే ఈ వారమే మీకు దీన్ని పంపిస్తాను. మీకు ఇచ్చిన మాటను తీర్చే ప్రయత్నంలో పోయిందనుకున్న ఈ అరుదైన డీవీడీ మళ్లీ చేజిక్కినందుకు సంతోషంగా ఉంది.

ఇసుక మీద ఓనమాలు – టీచర్ రామరాజు
“ఇసుక మీద ఓనమాలు రాయడంతో నా విద్య ప్రారంభమయింది” అంటూ నాగిరెడ్డి గారి మాటలతో మొదలవుతుంది ఈ డీవీడీ. “నేనీ నాడు ఈ స్థితికి చేరానంటే మా తాతగారు, నాకు చదువు నేర్పిన టీచర్ రామరాజు గారు కారణం. మా టీచర్ అప్పట్లో నా వీపు మోగించి ఉండవచ్చు కాని నాకు పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి రామాయణం, భారతం, భాగవతాలను వర్డ్ టు వర్డ్ కంఠతా వచ్చేలా చెప్పించారు. మీరు వేరే రకంగా అనుకోకపోతే, మా తెలుగు టీచర్ బయట వెళ్లేటప్పుడు ‘ఒరేయ్ క్లాసును కాస్త చూసుకోరా’ అని చెప్పేవారు. అంటే తనతో సమానంగా నేను తెలుగు నేర్చుకున్నానని ఆయన గ్రహించేశారు. కాని ఇంగ్లీష్ అస్సలు రాకపోవడంతో పెద్దలు నాకు ట్యూషన్ ఏర్పర్చారు.”

చందమామ సంస్థాపకులు నాగిరెడ్డిగారు, కడపజిల్లా సింహాద్రిపురం మండలంలో పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. రైతు జీవితం తెల్లవారు నాలుగన్నరకు మజ్జిగన్నం తిని పొలానికి వెళ్లడంతో మొదలవుతుంది. పనివాళ్లు రాకముందే బండి కట్టుకుని పొలం వద్దకు పోయి రడీగా ఉండాలిరా అనే పెద్దల మాటను తుచ తప్పకుండా పాటించారాయన. పొలంలోకి ముందుగా పనివాళ్లు కాక ఇంటి మనిషి పోవాలి అనేది రైతు జీవన సంస్కృతి. ‘ఆనాటి నుంచి ఈనాటి వరకు తెల్లారి ఆ నాలుగన్నర గంట అయిందంటే తర్వాత నేను నిద్రపోవడం ఎరుగను’ అన్నారీయన.

స్వాతంత్ర్య పోరాటం – ఉల్లిపాయల వ్యాపారం
1940లలో ఉధృతంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో చిన్నవయస్సులోనే నాగిరెడ్డి గారు పాల్గొని దెబ్బలు తినటంతో ఆయన తండ్రి వీడు చెడిపోతున్నాడేమో అనే భయంతో మద్రాసులో తాను నడుపుతున్న ఉల్లిపాయల వ్యాపారంలో నాగిరెడ్డిగారిని పెట్టారు. అలా వ్యాపారంకోసం ఆయన బర్మా రంగూన్ ప్రయాణాలు చేస్తూండేవారు. రెండో ప్రవంచయుద్ధ కాలంలో బాంబులు కురిసి వ్యాపారం కుప్పకూలడంతో ఆయన వ్యాపారంలో సర్వం కోల్పోయారు.

ఉల్లిపాయల వ్యాపారంలో దెబ్బతిని సర్వం కోల్పోగానే అంతవరకూ బర్మా, రంగూన్ లకు ప్రయాణిస్తూ వ్యాపారం చేస్తున్న నాగిరెడ్డి గారు భార్య శేషమ్మ గారితో కలిసి కడపజిల్లా రాజంపేటకు దగ్గరగా ఉన్న ఒక కుగ్రామం ఓరంపాడు -నెల్లూరు-లో ఓ పూరిపాకలో మూడేళ్లపాటు అత్యంత కనాకష్టమైన జీవితం గడిపారు.

1940ల మొదట్లో జరిగిన ఈ ఘటనలో ఆయన ఈ ఊర్లో ఉన్నప్పుడు వైద్య సౌకర్యం లేని ప్రజలకు మందులు ఇవ్వడంతో పాటు, పిల్లలను సాయంత్రం పూట చేరదీసి ఇష్టమైన కధలను రక్తికట్టేలా చెప్పేవారు. వారికి ఎలాంటి కథలు నచ్చుతాయో వారి హావభావాలు పసిగట్టడంద్వారా తెలుసుకుని సరైన కథలను ఎంపిక చేసుకుని చెప్పేవారు.

నాగిరెడ్డి – చక్రపాణి – చందమామ
1943లో మళ్లీ మిత్రుడి సహాయంతో మద్రాసుకు వచ్చిన నాగిరెడ్డిగారు అయిదు వేల రూపాయలతో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అదే సుప్రసిద్ధమైన బి.ఎన్.కె ప్రింటింగ్ ప్రెస్. ఆ రోజుల్లో బి.ఎన్.కె ప్రెస్ అంటే ఒక చరిత్ర.. ఆసియా ఖండంలోనే అంత పెద్ద ప్రిటింగ్ ప్రెస్ లేదనే స్థాయికి అది అచిరకాలం లోనే ఎదిగింది. చందమామ ప్రింటింగ్ అవసరాలు ప్రెస్ పరిమాణాన్ని బాగా పెంచివేశాయి.

“రోజూ రాత్రి పూట పడుకునే ముందు మా అవ్వగారు ఏదో ఒక కథ చెబితే కాని నిద్రపోయేవాడిని కాను. మనకు ముఖ్యంగా ఇతిహాసాలలో భారతం, భాగవతం, రామాయణం చాలా ముఖ్యమైనవి. దేవుని దయవల్ల రామరాజు టీచర్ నాకు ఈ పుస్తకాలను చక్కగా బోధ చేయడం వల్ల, ఆ పుస్తకాలలోని కథలను పిల్లలకు అర్థమయ్యేలా తిరిగి వారికోసం రిలీజ్ చేయాలని అనిపించేది. చక్రపాణి గారు మద్రాసుకు తన పత్రిక ప్రిటింగ్ కోసం వచ్చి కలిసినప్పుడు ఈ విషయం చెబితే ఆయన కూడా ఈ ఆలోచనను ఒప్పుకోవడం. పిల్లలకోసం కథల పత్రికను పెట్టాలని చక్రపాణిగారు సలహా చెప్పారు. ఇద్దరి ఆలోచనలు అలా కలవడంతో చందమామ పత్రికను 1947లో పెట్టడం జరిగింది. చందమామ పత్రిక అలా చరిత్రలో నిలిచిపోయిందంటే చక్రపాణి గారే కారణం.”

మన జీవితవిధానం, హైందవ సంప్రదాయం మన తర్వాతి తరాలకు ఎక్కడ దూరమవుతుందని నాగిరెడ్డిగారి తండ్రి భయపడేవారు. ఆయన భయమే తదనంతరం చందమామ ఆవిర్భావానికి కారణమైంది. స్వామి రామతీర్థ చెప్పిన కథలు, జీవిత ఉదాహరణలు నాగిరెడ్డిగారికి ఎంతో ఇష్టం. చందమామ స్థాపనకు ముందు కథలపై ఆయన అభిమానానికి రామతీర్థ కూడా ప్రేరణగా నిలిచారు.

(సినీ నటి జమున గారు 1947 తొలి చందమామను తెనాలిలోని బంధువులు తీసి పంపితే చదివారు. అప్పటినుంచి ఈనాటివరకు అంటే 2007 వరకు అన్ని చందమామలు కొని చదివి భద్రపరుస్తూ వస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఈ అపరూపమైన ఆస్తిని ఎవరికీ ఇవ్వలేదట. అన్ని చందమామలూ అలా భద్రపరుస్తూనే ఉన్నారట. నమ్ముతారో లేదో నాకు తెలియదని ఈనాటికీ చందమామను తాను చదువుతూనే ఉన్నానని ఆమె నాగిరెడ్డిగారిపై డీవీడీ డాక్యుమెంటరీలో చెప్పారు.)

విజయా ఆసుపత్రి నేపథ్యం
“1942లో మా నాన్న డయాబెటిక్ పేషెంట్. మద్రాసులో ఒక ఆసుపత్రిలో చేర్పిస్తే నరకం. జంతువుల్లాగా ట్రీట్ చేసేవాళ్లు, రోగుల వెన్నంటి వచ్చే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. డిశ్చార్చ్ అయి ఇంటికి తీసుకువచ్చాక అయిదు నెలలు ఆలోచించాను. రోగులకే కాకుండా రోగులను వెన్నంటి వచ్చే సహాయకులకు, బంధువులకు సౌకర్యం కల్పించే ఆసుపత్రి ఉంటే ఎంత బాగుంటుందని పదే పదే ఆలోచించాను. ఆ ఆలోచనే విజయా హాస్పిటల్‌కు మార్గ నిర్దేశం చేసింది. ప్రపంచంలోని అతి గొప్ప కంటి ఆసుపత్రులలో ఒకటైన శంకర్ నేత్రాలయ హాస్పిటల్ విజయా హాస్పిటల్ స్పూర్తితోటే పుట్టింది.”
‘పేషెంట్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ తరపున వచ్చిన వారికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోగులతో పాటు వారి బంధువులూ వస్తారు. వారు వస్తారు. అది వారి తత్వం. వారికి మనం సౌకర్యాలు కల్పించాలి.’ ఇదీ నాగిరెడ్డి విజన్. విజయా హాస్పిటల్ ప్రాంగణం రోగులతో పాటు వచ్చిన బంధువులకు కల్పతరువు లాంటిది. ఏ ఆసుపత్రి ప్రాంగణంలోనూ ఇలాంటి సౌకర్యాలు చూడం మనం. రోగుల వెన్నంటి వచ్చిన వారిని ఇతర హాస్పిటల్స్‌లో చీదరించుకుంటారు, బయటకు పంపేస్తారు.

కాని విజయా హాస్పిటల్ చరిత్రలో ఇలాంటి అనుభవం ఎవరూ చూడలేదు. హాస్పిటల్ కారిడార్లు కాని, భవంతుల ముందు అరుగులు కాని విశాలంగా ఉంటాయి. రోగి బయటకు వచ్చినా కాసేపు కూర్చుని సేద తీరడానికి ఇవి ఉపయోగపడతాయు. విజయా హాస్పిటల్ ఎంత సౌకర్యం కల్పించిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.

నాగిరెడ్డి గారు ఉన్నంతవరకు రాయలసీమ నుంచి ఎవరైనా రోగులు ఆసుపత్రికి వచ్చారంటే ఆప్తబందువు చెంతకు వచ్చినట్లే పీలయ్యేవారు. ముఖ్యంగా కడప జిల్లా రైతులు, మధ్యతరగతి ప్రజలు విజయా ఆసుపత్రికి చికిత్స కోసం వస్తే వారు నాగిరెడ్డిగారి స్వంత మనుషుల కిందే లెక్క. ఆయన డాక్టర్ కాదు. కాని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆయన విజయా ఆసుపత్రిలో పట్టి పట్టి నడుస్తూ డాక్టర్లను, సిబ్బందిని, రోగులను పలుకరించేవారు.

ఎవరయినా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతుంటే వారికి జాగ్రత్తలు చెబుతూ, వారి కారు తలుపులను తాను మూసి సంతృప్తిగా పంపించేవారు. తన ఇంటికి, తన ఆసుపత్రికి వచ్చిన వారు తన స్వంత మనుషులకిందే లెక్క., చివరివరకూ ఆయన అలాగే చూసుకున్నారు. ఈ రోజు ఆసుపత్రి ఎలా ఉందో తెలియదు కాని, ఈ మహనీయ మూర్తిమత్వం సాయంత్రం పూట ఆసుపత్రిలో నిదానంగా నడుస్తుంటే అతి ఎత్తైన ఆసుపత్రి భవంతులు, వాటి గోడలు కూడా ఆయన ముందు చిన్నపోయేవి.

“మీ స్వంత బంధువులకు ఎలా దగ్గిరుండి చికిత్స చేయిస్తారో, అలాగే రోగులందరికీ మీరు సేవలను అందజేయాలి” అని ఆయన ఆసుపత్రిలో చేరిన వైద్యులకు, సిబ్బందికి పదే పదే చెప్పేవారు. ‘పేదవారికి, మధ్యతరగతి వారికీ సహాయం చేయాలని విజయా ఆసుపత్రి కట్టానయ్యా. దాన్ని మీరు నిలబెట్టాలి’ అంటూ ఆసుపత్రిలో కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ చెప్పేవారాయన.

ప్రారంభంలో కేవలం 60 పడకలతో ప్రారంబించిన విజయా ఈరోజు 650 పడకలు, వందమంది వైద్యులు, 1600 మంది సిబ్బందితో నడుస్తోంది, సంవత్సరానికి లక్షా 25వేల మంది ఇన్ పేషెంట్లు, 6 లక్షల మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రి గడప తొక్కుతుంటారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచే కాకుండా, అస్సాం, బీహార్, బెంగాల్, అండమాన్ దీవులనుంచి కూడా ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు.

“అందుకే మరో 200 సంవత్సరాలు గడిచినా విజయా, అపోలో ఆసుపత్రులలో డాక్టర్లు మారతారు కాని ఆసుపత్రులు నిలుస్తాయి. అంతటి చక్కటి పునాదితో వీటిని కట్టాము” అంటూ అప్పోలో హాస్పిటల్స్ సంస్థాపకులు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా నాగిరెడ్డిగారిని తల్చుకున్నారు.
“మీరు రెండు నెలలు మీ సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ఉంటే ఆ సంస్థ బాగున్నట్లు లెక్క.. ఇన్‌స్టిట్యూట్ ఈజ్ లైక్ ఎ మదర్, తల్లి బాగుంటే పిల్లలను చక్కగా కాపాడుతుంది” అనే నాగిరెడ్డి గారి కలల సాకారం విజయా ఆసుపత్రి. ఈ మహనీయుడి మూర్తిమత్వాన్ని స్మరించుకోడానికైనా విజయా ఆసుపత్రిలో ఆయన జీవితాంతమూ తిరుగుతూ వచ్చిన ప్రాంగణాలను మనం చూడాల్సిందే.

తీర్చిదిద్దినట్లుగా, నీట్‌గా ఉన్న విజయా ఆసుపత్రి అందచందాలు, చందమామ ప్రింట్ అయ్యే క్రమం చూడాలంటే ఈ డీవీడీని తప్పక చూడాలి.
ఎప్పుడూ రెండో స్థానాన్ని ఆయన అంగీకరించరు. “పని ఎత్తుకుంటే అందరికంటే మనమే మొదట్లో ఉండాలి” ఇది ఆయన ఫిలాసఫీ.

విజయా వారి వెన్నెల
ప్రపంచంలో కల్మషం లేనిది, కల్తీ లేనిది, వివక్ష లేనిది ఉందంటే ఆ ఘనత వెన్నెలకు కూడా దక్కుతుంది. వెన్నెల మంచికీ, చల్లదనానికి, సహాయ గుణానికీ గుర్తు. విజయా వారి సినిమాలు వెన్నెల కుప్పలు.

నాగిరెడ్డి గారు తాము తీసే ప్రతి సినిమాను ప్రేమించారు, బిడ్డలాగా అక్కున చేర్చుకున్నారు. ఇంటిల్లిపాదీ వచ్చి చూసి, సంతోషించాలి, ఇలా జరగాలంటే చెడు అస్సలు చెప్పకూడదు, చూపకూడదు. తెరపై మూడు గంటలపాటు మంచే కనపడాలి. మంచికే విజయం దక్కాలి. విజయా వారి సినిమాలు చేసి చూపించింది దీన్నే మరి.

అసలు విజయా పిక్చర్స్ నేపధ్యమే ఒక విషాద ఘటనతో ప్రారంభమైంది.

1940ల నాటికి అనంతపురంలో మాలా నారాయణ స్వామి అనే ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. లక్షలు గడించారు. తాడిపత్రి, గుత్తి పట్టణాల్లో నూనెమిల్లులు, తాడిపత్రి అనంతపురంలలో కో-ఆపరేటివ్‌ మిల్క్‌ సొసైటీ, తాడిపత్రిలో మార్కెట్‌ యార్డు స్టోర్స్‌, రాయలసీమలో పలుచోట్ల ఖాదీ గ్రామోద్యోగ సంస్థలు అనంతపురంలో కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ స్థాపించారు. కలకత్తా నుండి బర్మాకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసేవారు. ఇన్ని సంస్థల యజమానిగా అతనిని ‘రాయలసీమ’ బిర్లా అనేవారు. కస్తూరిబా స్మారక నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎందరో బీద విద్యార్థు లకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి, ఉచిత వసతి, భోజనవసతి కల్పించిన దాత ఆయన. నారాయణస్వామి ఆర్థిక సహాయంతో జీవితంలో ఎన్నో గొప్ప పదవులందుకొన్న వారిలో ముఖ్యులు దామోదరం సంజీవయ్య గారొకరు.

మద్రాసులో ఉల్లిపాయల వ్యాపారం చేసే బి.నాగిరెడ్డి, బి.ఎన్‌. రెడ్డి గార్లతో నారాయణస్వామి మైత్రిని పెంచుకొన్నారు. వారితో కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించారు. ‘అప్పట్లో, ఆసియాలోకెల్లా అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచిన వాహినీ స్టూడియో (మద్రాసు) మూలపురుషుడు మూలా నారాయణ స్వామి’. నారాయణ స్వామి ఛైర్మన్‌గా, బి.ఎన్‌.రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వాహినీ ఫిల్మ్‌ సంస్థను ప్రారంభించి ‘వందేమాతరం’ చిత్రం నిర్మించారు. సుమంగళి, పోతన, స్వర్గసీమ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారు. 1947లో వాహినీ స్టూడియో ప్రారంభించారు. వ్యాపార దృష్టితోపాటు కళాదృష్టిని మేళవించి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. క్రమంగా కె.వి.రెడ్డి చక్రపాణి గార్లు ఆ సంస్థలో చేరారు.

ఈలోగా నారాయణ స్వామి గారి వ్యాపారాలు ఇన్‌కమ్‌టాక్స్‌ వారి దృష్టిలో పడినాయి. ఆ అధికారిని బదిలీ చేయించడానికి యత్నించారు, కానీ అధికారి కూడా చాలా పట్టుదల, నిజాయితీ కలవాడు. నారాయణ స్వామి వ్యాపారాల్లోని లావాదేవీలను పరిశీలించి దాదాపు 30 లక్షల ట్యాక్స్‌ విధించాడు. నారాయణ స్వామి వ్యాపారాలన్నిటినీ సీజ్‌ చేశాడు.

నారాయణ స్వామికి ‘అప్పులు పుట్టని స్థితిని గమనించిన మిత్రులు అతనికి దూరమయ్యారు. మహాదాత నారాయణ స్వామి మనోవ్యాధితో పాటు క్షయ వ్యాధికి గురై మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతూ 1950 ఆగస్టు 20న కన్నుమూశారు.

తర్వాత నారాయణ స్వామి కుమారుడు రంగయ్య వాహినీ స్టూడియోను నాగిరెడ్డికి అమ్మివేశారు.

ఉన్నట్లుండి 30 లక్షల రూపాయల పన్ను జరిమానా కట్టవలసిందిగా ఆదేశించడంతో ఆయన ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలిపోయిన ఈ సందర్భంలోనే ఆయన నాగిరెడ్డిగారిని సంప్రదించి వాహినీ స్టూడియోస్‌పై కూడా ఐటీ వారి కన్ను పడుతుందేమో అనే భయంతో, వీలైతే స్టూడియోను మీరే లీజుకు తీసుకుని నడపవలసిందిగా సూచించారు. తర్వాత తాను నష్టాలనుంచి బయటపడినప్పుడు స్టూడియో గురించి ఆలోచిద్దామని చెప్పారట.

ఈ విషయం నాగిరెడ్డి గారు చక్రపాణిగారి చెవిన పడేశారు. “ఈ తెల్ల ఏనుగును మనమెలా భరించేది, అయినా మనకు సినిమాలెందుకు” అని మొదట్లో చక్రపాణి గారు కొట్టిపడేశారు. కాని నాగిరెడ్డి గారు వదల్లేదు. ఇప్పటికే నారాయణ స్వామిగారు స్టూడియోపై అయిదు లక్షలు ఖర్చుపెట్టారు కాబట్టి మనం అంత పెట్టుబడి పెట్టాలన్నా సాధ్యం కాదు కాబట్టి లీజుకు తీసుకుంటే ఉన్న నిర్మాణాల్లోనే సినిమా ప్రారంభించవచ్చు గదా అని పట్టు పట్టారు.

ఈ లోపలే ఈ విషయం తెలిసిన ఎల్వీ ప్రసాద్ గారు ఈయనను కలిసి సినిమా తీయడానికి అవకాశం ఇవ్వండని కోరారు. ‘మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సినిమా తీస్తాను’ అని చెప్పారట. దీంతో మనదేం పోయిందిలే అనుకుని వాహినీ స్టూడియోను లీజుకు తీసుకుని 15 వేల రూపాయలతో సినిమా మొదలెట్టేశారు. అదే.. విజయా వారి తొలి సినిమా ‘షావుకారు.’ తర్వాత పూర్ణచంద్రరావు గారు మరో 75 వేల రూపాయల సహాయం చేయడంతో ఇక వీరు వెనుదిరగలేదు.

వాహినీ స్టూడియోతో బి.ఎన్‌.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి.రెడ్డి మున్నగు వారితో సన్నిహితులుగా ఉండిన సినీ రచయిత డి.వి. నరసరాజు గారు, వాహినీ స్టూడియో, నారాయణ స్వామి జీవిత ప్రస్థానాన్ని తమ ‘తెరవెనుక కథలు’ పుస్తకంలో చక్కగా చిత్రించారు.
షావుకారు, పాతాళభైరవి, గుండమ్మకథ, మాయాబజారు, గుణ సుందరి, సిఐడి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గంగ-మంగ, రాజేశ్వరీ విలాస్ కాపీ క్లబ్, బృందావనం, ఇవి విజయావారి వెన్నెల కుప్పల్లో కొన్ని.

నాగిరెడ్డి గారు మొదట టీటీడీ సభ్యుడు, తర్వాత ఛైర్మన్‌ అయ్యారు, “తిరుపతిలో అయిదేళ్లు వర్షం కురవకపోయినా ఒక్కసారి కల్యాణి డామ్ నిండిందంటే అయిదేళ్లు నీళ్లు సరఫరా ఆవుతాయి. అది నా హయాంలోనే జరిగింది.. క్యూ కాంప్లెక్స్ కట్టి వందలాది మంది భక్తులకు సౌకర్యం కల్పించాను. దీంట్లో నేను చేసిందేమీ లేదు. ఇది కేవలం భగవత్ కృప.”

మాట తప్పవద్దు
“మాట తప్పవద్దు అనేది మా కుటుంబం నాకు నేర్పిన విలువ. నేను నష్టపోయినా నన్ను నమ్మి వ్యాపారంలోకి దిగిన వారు నష్టపోకూడదనేది నా తత్వం.” ఇచ్చిన మాట తప్పవద్దు. ఇది ఆయన జీవితాంతం వదలకుండా పాటించిన మాట. అందుకే సత్య హరిశ్చంద్రుడు అంటే ఆయనకు అంత ఇష్టం.
“మ్యాన్ మైనస్ ఈగో ఈజ్ గాడ్
గాడ్ మైనస్ ఈగో ఈజ్ మ్యాన్”
నాగిరెడ్డి గారు వీటిలో తొలి కోవకే చెందుతారు అనేది విజయా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్ గారి అభిప్రాయం.

సర్వశ్రీ అక్కినేని నాగేశ్వరరావు, డివిఎస్ రాజు, రామానాయుడు, కె.విశ్వనాధ్, సింగీతం శ్రీనివాసరావు, రామోజీరావు, జమున, డివీ.నరసరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ, కృష్ణ, విజయనిర్మల, పద్మనాభం, జయంతి, లక్ష్మి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రావి కొండలరావు, రాజేంద్రప్రసాద్, పి.లీల. (మలయాళీ), పసుమర్తి కృష్ణమూర్తి, డాక్టర్ సత్యభామా రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ పి.చిన్నస్వామి, డాక్టర్ ఎం.ఆర్ రెడ్డి, డాక్టర్ సి. రంగారావు, డాక్టర్ ఎన్ ఎస్ రెడ్డి -సినిమా ధియేటర్ ఓనర్ కూడా- డాక్టర్ బాబూ రాజేంద్రన్. డాక్టర్ కె.ఎన్. రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ జయం, డాక్టర్ బి. సతీష్ రెడ్డి, (నాగిరెడ్డి గారి మనవడు), డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి -అప్పోలో హాస్పిటల్స్- డాక్టర్ పి.నంజుండయ్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్ చంద్రమౌళి రెడ్డి ఐఎఎస్, వి.వెంకట్రామిరెడ్డి, బి. వేణుగోపాల రెడ్డి, బి విశ్వనాధ రెడ్డి, శ్రీమతి ఎ.విజయలక్ష్మి, తదితర ప్రముఖులు నాగిరెడ్డి గారి గురించిన తమ జ్ఞాపకాలను ఈ డీవీడీ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

నేటి తరాలు మర్చిపోయిన, చూడలేకపోయిన నాటి అమృత గాయని పి.లీల గారిని లైవ్‌లో చూడాలంటే ఈ డీవీడీలోనే సాధ్యం. గుండమ్మ కథ సినిమాలోని పాట లేని 10 నిమిషాల సంగీత ఝరి -ఎల్ విజయలక్ష్మి నృత్యం-లో ఒక బిట్‌ను ఈ డీవీడీలో చూపించారు. ఆ రోజుల్లో ఎల్ విజయ లక్ష్మి మా ఆరాధ్య నృత్య తార అని చెప్పడానికి సందేహించవలసిన పనిలేదు. మూర్తీభవించిన శిల్ప సౌందర్యం ఆమె స్వంతం. ఇప్పడు తన గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు.

నాగిరెడ్డి గారి విజన్.
“ఉన్న మంచినే చెబుతాం. ఉన్నా చెడును మాత్రం చెప్పం…” ఇది నాగిరెడ్డి గారి విజన్. చందమామ, విజయా సినిమాలు, విజయచిత్ర సినీ పత్రిక, ఎప్పుడూ మంచినే చెప్పాయి. ఉన్నా చెడు చెప్పలేదు. మంచిని మాత్రమే చెప్పాలని, చూపాలని, ముద్రించాలని ఒక మహా దార్శనికతను ప్రకటించడం, చివరి క్షణం వరకు దానికి కట్టుబడటం ప్రపంచంలో ఎవరికి సాధ్యం?

రావికొండల రావుగారి సంపాదకత్వంలో విజయచిత్ర సినీ పత్రికను స్థాపించినప్పుడు నాగిరెడ్డి గారి ఆయనకు ఒకే సలహా చెప్పారట. “చూడయ్యా సినిమా పత్రిక ఎలా నడపాలనేది మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఇంటిల్లిపాదీ వచ్చి పత్రికను చూసి, చదివేలాగా తీర్చిదిద్దండి. అందరిచేతా బాగుందనిపించుకోవడమే మన పత్రిక లక్ష్యం కావాలి.”

హిమాలయ పర్వతభారాన్ని ఎంత సులువుగా చెప్పేశారో. విజయచిత్ర ప్రారంభం అయ్యేనాటికీ తెలుగులో సినీ పత్రికలు రకరకాలుగా కంపు కొడుతున్నాయని రావి కొండలరావు గారి ఉవాచ. పత్రిక ఎలా పోతుంది, ఏం వేస్తున్నారు అనే విషయాలు పట్టించుకోని నాగిరెడ్డిగారు ‘ఇంటిల్లిపాదీ చదివేలా తీసుకురండి’ అని మాత్రమే సలహా ఇచ్చారు. అదీ ఒక సినిమా పత్రికమీద ఈ భాధ్యత పెట్టారు.

తదనంతరం విజయచిత్ర సాధించిన అపూర్వ విజయం మనందరికీ తెలిసిందే. కొడవటిగంటి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో గతంలో 1950ల మొదట్లో మూడేళ్ల నడిచిన ‘కినీమా’ సినీ పత్రిక తర్వాత అంతటి ఘన కీర్తి, ప్రజాదరణ ఒక్క విజయచిత్రకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. 53 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్ చందమామ భాండాగారంలో పెట్టి తరతరాలకూ అందిస్తున్నట్లుగా, కినీమా, విజయ చిత్ర, యువ పత్రికలను కూడా ఆర్కైవ్స్‌లో పెట్టి అందించాలని చందమామ పాఠకులు ఈనాటికీ కోరుతున్నారంటే వాటి విలువ ఎవరికయినా బోధపడుతుంది.

నాకోసం ఓ కంటినీరు…
“ఈ ఆస్తి ఈ పిల్లలూ, ఈ ఇళ్లూ ఇవేవీ మిగలవు, వీళ్లెవరూ మనకు మిగలరు అనేది నాకు తెలుసు, ఊరికే వేషధారిగా బతకటం సాధ్యంకాదు. పదిమందికి మంచి చేసి పోవడం ఇదే నాకు తెలిసింది. నా మిత్రులే కాకుండా నా బంధువులే కాకుండా నా అనేవారు కానివారు కూడా నాకోసం ఒక కంటి నీరు వదిలినారంటే… అదే నాకు తృప్తి.”

డీవీడీ ఇంటర్వ్యూలో ఈ మాటలంటున్నప్పుడు ఆయన కళ్లలో నీటిపొర. మూగపోయిన కంఠం..
నిజంగానే… ఆయన 2004లో పోయినప్పుడు అఖిలాంధ్రమూ, తమిళనాడు ప్రజానీకమూ, యావత్ భారత దేశమూ నిజంగానే.. ఆయనకోసం విలపించింది.

చందమామ కథలు, వాటిని చదివే తరతరాల పాఠకులు, విజయా సినిమాలు, వాటిని చూసే తరతరాల ప్రేక్షకులు, విజయా హాస్పిటల్, అక్కడికి వచ్చి చికిత్స చేయించుకునే తరతరాల రోగులు ఉన్నంతవరకు నాగిరెడ్డి గారు చరిత్రలో వెలుగొందుతూనే ఉంటారు.

అరుదైన వ్యక్తులపై డాక్యుమెంటరీలు తీయాలంటే ఇలా తీయాలనేంత చక్కటి నాణ్యతతో ఈ డీవీడీ రూపొందింది. చూస్తున్నంత సేపు ఇది డాక్యుమెంటరీలా కాకుండా విజయా వారి సినిమాలాగే చల్లని అనుభూతి కలిగిస్తుంది. ఇప్పటికే ఎవరైనా ఈ డీవీడీని పొందగలిగి ఉంటే చందమామ అభిమానులకు అందించడానికి ప్రయత్నించగలరు.

ఈ డీవీడీని చందమామ అభిమానులు, విజయా పిక్చర్స్ సినిమాల అభిమానులు కాకపోతే మరెవ్వరు చూడాలి?

‘జ్ఞాపకాల పందిరి’ – ‘ఆనాటి ఆనవాళ్ళు’
తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం కేటాయింపజేసుకున్న ..మహా వ్యక్తి బి.నాగిరెడ్డిపై ‘జ్ఞాపకాల పందిరి’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ పుస్తకం వెలువడింది. బి.నాగిరెడ్డి తనయుడు బి.విశ్వనాధ్‌ రెడ్డి ఈ బృహత్‌ కార్యాన్ని చేపట్టారు. నేటితరం వారికే కాకుండా, భావి తరాలవారికీ ఉపయోగపడేలా నాగిరెడ్డి జ్ఞాపకాలన్నింటినీ గుదిగుచ్చి పుస్తకంగా వెలువరించారు.

దీనితోపాటు ప్రముఖ యువ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ గారు రచించిన ‘ఆనాటి ఆనవాళ్లు’ పుస్తకం కూడా రెండేళ్ల క్రితం విశ్వనాధరెడ్డి గారు ప్రచురించారు. తెలుగు సినిమా మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వజ్రోత్సవాలలో భాగంగా ఈ పుస్తకం ప్రచురించారు. గత 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 75 ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఈ పుస్తకంలో సమీక్షించారు. ఇవి రెండూ చందమామ అభిమానులను అలరించే అద్భుత సమాచార గనులు. చదవకపోతే తప్పక తీసుకోండి.

గత మూడురోజులుగా జలుబు, గొంతునొప్పి, కండ్లకలకతో ఇబ్బందిపడుతున్నాను. ఈ రోజు నాగిరెడ్డి గారిపై డీవీడీని మళ్లీ ఓసారి పూర్తిగా చూస్తూ ఈ కథనం పూర్తి చేసేసరికి మనసంతా ఫ్రీ అయిపోయింది..

November 14th, 2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

RTS Perm Link
test Filed under B.Nagireddy | Edit | Comments (14)

14 Responses to “చందమామ లెజెండ్ నాగిరెడ్డి గారిపై డీవీడీ”

1. SIVARAMAPRASAD KAPPAGANTU on November 14, 2010 12:49 PM Edit This
చాలా మంచి సమాచారం ఇచ్చారు రాజుగారూ. మీరు సేకరించిన డి వి డి ఈసారి భద్రం సుమా. మళ్ళి మళ్ళి అటువంటి అపురూపమైన కళాసంపదను తిరిగి పొందలెము. నాగిరెడ్డిగారు గురించిన చాలా విషయాలు విశేషాలు చక్కగా చెప్పారు. ఆ డి వి డి ని నేను విజయవర్ధన్ గారి వద్దకు వచ్చిన తరువాత నేను చూద్దామని ఆశ.

మీ వ్యాసంలో పంటికిందకు రాయిలా ఒక్క మాట మాత్రం ఉన్నది అది “మడమ తిప్పవద్దు”. ఈ మాటను, ఈ మధ్య కాలంలో చౌకబారు సినిమాలల్లోనూ రాజకీయాల్లోనూ ఏ మాత్రం సందర్భ శుధ్ధి లేని వాడకంతో భ్రష్టు పట్టించటంతో ఈ వ్యాసం చదువుతున్నప్పుడు గుర్తుకు రాకూడని వ్యక్తులు జ్ఞప్తికి వస్తున్నారు. దయచేసి ఆ మాటను మార్చి మరొక సముచితమైన మాటను వాడండి,

2. chandamama on November 14, 2010 1:11 PM Edit This
శివరాం గారూ,
మీరు ఇంటర్నెట్‌కి అందుబాటులో ఉండను అని సమాచారం పంపడంతో ఊళ్లో లేరనుకున్నాను. కాని మొదటగా మీరే ఈ కథనం చూశారు. మీరన్న ఆ పంటికింద రాయిని ఇప్పుడే మూలంలో తొలగించేశాను. మడమ తిప్పవద్దు అన్న పదం అక్కడిదాగా పోతుందని నేను ఊహించలేదు. సకాలంలో మంచి అంశం గుర్తు చేసారు.

మీరు విజయవర్ధన్ గారి వద్దనుంచి తీసుకోవడం ఎందుకు? ఒక కాపీని మీకే నేరుగా పంపిస్తాను. మీకు కాకపోతే మరెవరికి పంపించాలి? అయితే విజయవర్దన్ గారికి మాట ఇచ్చాను కాబట్టి ఆయన పేరు ప్రత్యేకించి పేర్కోన్నానంతే..
థాంక్యూ ఫర్ కాంప్లిమెంట్…

3. Dasari Venkata Ramana on November 14, 2010 1:23 PM Edit This
రాజు గారూ! నాగిరెడ్డి గారిపై మీరు రాసిన కథనం చదువుతూంటే మీరు చెబుతున్న ఆ డీవీడీ చూస్తున్న అనుభూతి కలుగుతున్నది….
…… అలాగని ఆ డీవీడీ నాకు అవసరం లేదు అని నా వుద్దేశ్యం కాదు సుమా! అభినందనలు.

4. chandamama on November 14, 2010 1:38 PM Edit This
వెంకట రమణ గారూ,
ముందుగా నేను కొన్ని డీవీడీలను సిద్ధం చేస్తాను. మీతో సహా చందమామ అభిమానులందరికీ దీన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తాను. దీనిలో ఏ కమర్షియల్ ఎలిమెంట్లూ ఉండవని హామీ ఇస్తున్నా. విజయా ఆసుపత్రి వారు దీన్ని మార్కెట్లో రిలీజీ్ చేసి ఉంటే అపురూప సేకరణగా దీన్ని అందరమూ కొని భద్రపర్చుకోగలిగేవాళ్లం. అలాంటి వీలు లేదు కాబట్టే ఈ ప్రయత్నం.
మీరు ఇటీవలే పంపిన ‘వ్యక్తివికాసం’ కథ ఎంపికయింది. జనవరి నెలలో ఇది ప్రింట్ కావచ్చు. ఫైనల్‌గా పేజ్ లిస్ట్ తయారయ్యాక మీకు తెలుపాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. మంచి కథ పంపినందుకు ధన్యవాదాలు. మంచి కథ అంటే అన్ని అడ్డంకులనూ తప్పించుకుని ఎంపికయ్యే కథ అని నా ఉద్దేశం. మీ నుంచి మరిన్ని “మంచి” కథలు ఆశించవచ్చా?

5. kcube on November 14, 2010 9:04 PM Edit This
రాజుగారూ దానిని నెట్ లో అప్ లోడ్ చేయకూడదా? అంతా చూస్తాం కదా? మెగా అప్ లోడ్ సైట్ లో చేసి ఇక్కడ లింక్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కాలం దాచుకోవడం కంటే పంచుకునే అవకాశం ఎక్కువగా వుంది కదా? మీ ఇష్టం…

6. దామోదరం on November 15, 2010 12:28 AM Edit This
తెలుగు సినీ పరిశ్రమకు వాణిజ్య దృష్టితో కాకుండా ఉత్తమాభిరుచితో సేవలు అందించిన ఓ మహోన్నత వ్యక్తి గురించి ఇంత విఫులంగా వివరించినందుకు ధన్యవాదాలు. భావితరాలకు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలపాలన్న మీ తపన ఎంతైనా గొప్పది. ఇలాంటి అభిరుచిని మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నా….

7. Bhanu Chowdary on November 15, 2010 2:28 AM Edit This
Raju garu, Naku Oka DVD pampincha galaru leda internet lo upload chesinaa link ivvagalaru.

8. వేణు on November 15, 2010 3:13 AM Edit This
రాజు గారూ! చాలా ప్రత్యేకతలున్న డీవీడీ గురించి మా అందరితో పంచుకున్నందుకు మీకు అభినందనలూ, ధన్యవాదాలూ. కాపీరైట్ సమస్య లేకుంటే ఈ డీవీడీని నెట్లో అప్ లోడ్ చేస్తేనే మంచిది! నాగిరెడ్డి గారి జీవన వైవిధ్యం ఎంతో ఆసక్తికరం. చందమామ స్థాపన నేపథ్యం తెలుసుకోవటం సంతోషంగా ఉంది.

బీఎన్ కే ప్రెస్ లో చందమామ రంగుల ముద్రణ ప్రత్యేకత గురించి ఈ డీవీలో విజువల్స్ తో పాటు క్లుప్తంగానైనా ప్రస్తావించివుంటారు . నిజానికి ఆ ప్రెస్ ముద్రణ ‘చందమామ చరిత్ర’లో ప్రముఖమైన అంశం కూడా! ఆ విశేషాలన్నీ వివరంగా మీరే ఓ టపాగా రాయాలి!

9. కమల్ on November 15, 2010 10:25 AM Edit This
తెలుగు చలనచిత్ర ఆణిముత్యం గురించి మంచి వ్యాసం ఇచ్చారు, ధన్యవాదాలు మీకు. మీరు చెప్పిన డి.వి.డి మేము పొందాలంటే బయట దొరుకుతుందా..? లేక ఆ డి.వి.డి ని ఎలా పొందగలమో చెప్పగలరు..! మీ వ్యాసం ఆసాంతం ఆలరించింది.. సినీప్రముఖులందరి గురించి..చెప్పారు కాని అసలైన వ్యక్తిని మరిచిపోయారు..బహుశ కాకతాళియంగా జరిందనుకోవచ్చు..అసలు విజయా సంస్థ అని అనగానే గుర్తోచ్చే మరొక వ్యక్తి ఉన్నారు.

10. rajasekhara Raju on November 16, 2010 6:05 AM Edit This
శ్రీ మట్టెగుంట అప్పారావు గారు, శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులుగారు ఈ కథనంపై తమ అభిప్రాయాలను ఈమెయిల్‌కు పంపారు. అవి వ్యక్తిగతం కావు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను.

నాగిరెడ్డిగారి డీవీడీ చూడలేకపోయినా వివరంగా విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. కొంతకాలం “చందమామ” ఆగిపోయి తిరిగి ప్రచురణ మొదలు పెట్టాక ఆ ప్రతులను నాగిరెడ్డిగారికి ఆయన కుమారుడు శ్రీ విశ్వం చూపించినప్పుడు తృప్తిగా గుండెలకు హత్తుకున్నారట. ఆ సమయంలోఆయనతీవ్ర అనారోగ్యంతో వున్నారు. “చందమామ ను అమితంగా అభిమానించే నేను కొద్ది కాలం నుంచి కొనడం మానివేశాను. అక్టోబరు సంచిక అలనాటి ముఖచిత్రంతో వచ్చిందని తెలిసి కొన్న నేను అవాక్కయ్యాను. రూపే మారిపోయింది.ఓ చిన్న పాకెట్ బుక్ సైజులో వుంది.పైలోకాల్లో వున్న నాగిరెడ్డి చక్రపాణిల ఆత్మ ఎంత క్షోభిస్తుందో అనిపించింది. ఇంటికి రాగానే నా పాత చందమామల బైండ్లను మరో సారి తనివితీరా చూసుకొని ఆనందించా. ప్రస్తుత నిర్వాహకులు కనిసం తెలుగు చందమామ ప్రచురణ నిలిపి వేసి అభిమానుల గుండెకోతను దూరం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మాటలను తీరని వ్యధతో వ్రాస్తున్నందుకు మన్నించండి.
–మట్టెగుంట అప్పారావు

డియర్ రాజశేఖర్ గారు
నాగిరెడ్డి గారి మీద స్పందనలు చూసి మిమ్మలిని మళ్ళీ అభినందిస్తున్నాను నా కామెంటు అక్కడ రాస్తుంటే సేవ్ అవడము లేదు. అందుచేత pdf గా వెంటనే ఇదివరకే పంపించాను చూసే ఉంటారు. దాగని యదార్థ విషయాన్ని మనసున కట్టుకునేలా కనులముందు నిలిపిన మీ అంకిత భావ శైలీ వివరణ ఎ కోణం లోంచి చూసినా అబినందనీయము.
మార్కండేయులు

11. Chandamama on November 16, 2010 6:09 AM Edit This
శ్రీ బి. విజయవర్ధన్ గారు బాపు గారి బొమ్మల సైట్ గురించి సమాచారం పంపారు. అది ప్రస్తుతానికి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
నమస్కారము.

బాపు అభిమానులకు ఒక శుభవార్త. బాపు గారి కోరిక మేరకు నా మిత్రుడు రవి శంకర్ ఒక web site నిర్మించాడు. ఇకపైన బాపు గారి బొమ్మలన్నీ ఈ site ద్వారా కొనుక్కోవచ్చు. బాపు గారి బొమ్మలను బాపు గారి అనుమతి లేకుండా పలువురు అమ్ముతున్నారని, బాపు గారే ఈ web site ద్వారా బొమ్మలను అందుబాట్లోకి తెస్తున్నారు. ఈ web site గురించి బాపు గారి మాటల్లోనే వినవచ్చు (క్రింద జత చేసిన videoలో చూడవచ్చు). ఈ విషయం మీ మిత్రులందరికీ తెలియపరచండి. అనధికారిక అమ్మకాలను నిలువరించటంలో తోడ్పడండి. వీలైతే మీ బ్లాగులో ఈ విషయం ప్రచురించండి. బాపు గారి videos మీ బ్లాగులో పెట్టడానికి వీలుగా embed code క్రింద జత పరిచాను.

Web site గురించి చెబుతున్న బాపు గారు (తెలుగులో).
Web site గురించి చెబుతున్న బాపు గారు (Englishలో)
Thanks & Regards
Vijay (B.Vijay Varthan)

12. K.Rohiniprasad on November 16, 2010 7:25 AM Edit This
చక్రపాణిగారిలాగే నాగిరెడ్డిగారు కూడా మితభాషి. ఆయన మోడెస్టీ చూస్తే ఆశ్చర్యం వేసేది. తన పిల్లల పెళ్ళి రిసెప్షన్లవంటి సందర్భాల్లో సైతం ఆయన ఒదిగి, ఒక పక్కగా నిలబడి బిడియంగా నవ్వుతూ అందరినీ ఆహ్వానించేవారు. ముఖ్యమంత్రులూ, సినిమా స్టార్లూ, సినీ ఇండస్ట్రీలోని అతిముఖ్యులూ హాజరయే ఆ ఫంక్షన్లలో ఆయనే స్టార్ ఎట్రాక్షన్ అయినప్పటికీ ఆయన వైఖరి అలాగే ఉండేది. చదువులూ, డిగ్రీలతో సంబంధంలేని మంచి సంస్కారం ఆయనలో కనబడేది.

13. చందమామ on November 16, 2010 11:12 AM Edit This
రోహిణీ ప్రసాద్ గారూ, నేను ఒత్తిడిలో ఉండి వదిలేసిన చక్కటి అంశాన్ని మీరు ప్రస్తావించి మంచి పనిచేశారు. మితభాషి, నిగర్వి, నమ్రతా స్వభావి, బిడియం, సాధారణ మానవ ప్రపంచంలో ఎవ్వరమూ ఊహించలేని మంచితనం…. ఒక వ్యక్తి ఇన్నివిధాల వ్యక్తిత్వ గుణాలను జీవిత పర్యంతమూ కొనసాగించడం ఇక ఎన్నడూ చూడలేమేమో..

నిజంగానే ఈ డీవీడీలో ఆయన చరమాంకంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా వంగిన భంగిమలోనే ఉన్నారు తప్పితే వీపు నిటారుగా పెట్టలేదు. కాసింత సంపద, కాసింత అధికారం, కాసింత స్థాయి రాగానే ఇక కాళ్ళు భూమ్మీద మోపలేనంత మహా గర్విష్ట ప్రపంచంలో ఉంటున్నాం. ప్రపంచంలో ప్రారంభించబడిన తర్వాత… పాడైపోయిన, విధ్వంసమైపోయిన మహా మహా పరిణామాలన్నీ వ్యక్తుల అహాలతో, అహాల ప్రదర్శనలతోనే, ఇతరులపై ముద్రలు వేసి తొక్కడంతోటే సగం నాశనమైపోయాయని నా నిశ్చితాభిప్రాయం.

సాధికారికంగా ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆయన రైతుబిడ్డగా పుట్టాడు. జీవితంలో అడుగడుగునా రైతు లక్షణాలను ఏమాత్రమూ విడువకుండా, మరవకుండా బతికాడు. ఆయన వదనం ఏ భంగిమలో చూసినా ఆనంద విషాదాల కలయికగానే నాకు కనిపిస్తుంటుంది. సరిగ్గా భారతీయ రైతు వదనం కూడా ఇదే. ఎప్పుడు జీవితంలో ఆనందం వస్తుందో, ఎప్పుడు విషాదం ప్రవేశిస్తుందో తెలియని బతుకు ఈ దేశపు రైతుది. సర్వం కోల్పోయి బికారిగా మిగిలినా, పుంజుకుని కోట్లకు పడగలెత్తినా ఆయన ముఖంలో అదే ఆనందం, అదే విషాదం.

ఈ పిల్లలూ, ఆస్తులూ, సంపదలూ ఏవీ మిగలవు అని చివర్లో అంత ఘంటాపధంగా ఆయన ప్రకటించాడంటే జీవితం పట్ల సగటు రైతుకున్న నిర్వేదమే అందుక్కారణం.

నూటికి 99.9 శాతం ఆయన మనీషి. మిగిలిన 0.1 శాతం మచ్చ ఏ మనిషికైనా ఉంటుంది. దాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించడం భావ్యం కాదు. పరిపూర్ణత ఎక్కడ సాధ్యపడుతుంది?

నాగిరెడ్డిగారిపై విజయా పబ్లికేషన్స్ ప్రచురించిన జీవిత, వృత్తి విశేషాల సమాహారం ‘జ్ఞాపకాల పందిరి’ని మళ్లీ ఈరోజు పరామర్శగా చూశాను. ఈ డీవీడీలో కూడా లేని ఎన్నో విశేషాలు ఈ చిన్ని పుస్తకంలో ఉన్నాయి. చిన్నప్పుడు ఆయన ఇంట్లో, బడిలో, ఊరిలో నేర్చుకున్న మంచి విలువలు ఏ ఒక్కటీ ఆయన జీవితంలో వదిలిపెట్టలేదు. వీలైతే మీరు కూడా తప్పక ఈ పుస్తకం చదవగలరు.
మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

14. చందమామ on November 16, 2010 11:41 AM Edit This
కుబేర్ వర్మ, దామోదరం, భాను, వేణు, కమల్, అప్పారావు, మార్కండేయులు గార్లకు క్షమాపణలు. మొన్న ఆదివారం అనారోగ్యంలో ఉండి కూడా వీరావేశం పూనినట్లుగా అన్ని పనులూ మానుకుని ఈ కథనం పూర్తి చేశాను. సోమవారం మళ్లీ పడిపోయాను. ఇప్పుడు మాత్రమే సమయం దొరికింది. ఆలస్యానికి ఇదే కారణం.

మీరు కోరినట్లుగా డీవీడీ నెట్‌లో అప్‌లోడ్ చేయడం నాకు కుదరకపోవచ్చు. చాలా మొహమాటాలు, మరికొన్ని భయాలు అడ్డువస్తున్నాయి. దానికి తోడు మిత్రుల సదుద్దేశపు హెచ్చరికలు కూడా అనుకోండి. విజయా హాస్పిటల్ యాజమాన్యమే తగిన ధరతో ఈ డీవీడీని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ చందమామ తన చరిత్ర తానే లేకుండా చేసుకున్నట్లే, మరుగున ఉండడం అనే చందమామ సంప్రదాయాన్నే వీరు నాగిరెడ్డిగారి విషయంలోనూ అమలుపరిచారనుకుంటాను. అందుకే కొంత లేటయినా డీవీడీనే కాపీ చేసి పంపుతాను. కాపీ రైట్ హక్కుల విషయంలో ఇదీ కూడా అభ్యంతరకరమే కావచ్చు. కానీ మన చిన్నప్పటినుంచి చందమామకోసం ఎన్ని విధాలుగా కొట్లాడేవాళ్లమో, ఏ రకంగానైనా సరే ఆ పుస్తకాన్ని కొల్గగొట్టేవాళ్లమో, ఆ సాంప్రదాయంలో భాగంగానే చందమామ అభిమానులకు దీన్ని అందివ్వాలని ఉంది.
మీరందరూ డీవీడీ అడుగుతున్నారు కాబట్టి నా పర్సనల్ ఈ మెయిల్‌కి మీ చిరునామాలు పంపగలరు

krajasekhara@gmail.com
కొంత సమయం తర్వాత మీకు వీటిని తప్పక అందించే ప్రయత్నం చేస్తాను.
వేణుగారూ, డీవీడీలో చందమామ విశేషాల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కొన్ని వందల చందమామలు బీఎన్‌కె ప్రెస్‌ అసెంబ్లింగ్ లైన్‌లో ఫైనల్ పిన్నింగ్‌తో తయారై వెళుతున్న అపరూప దృశ్యాన్ని క్షణ కాలం పాటు మాత్రమే చూపించారు. చూసింతర్వాత నిరాశ పడవకండి. నాగిరెడ్డిగారిపై సమకాలీనుల నివాళికే దీంట్లో ప్రాధాన్యత. ఆ పరిమితితోనే చూడడానికి సిద్దంగా ఉండండి.
అంతకు ముందుగా నాగిరెడ్డి గారి వర్దంతి సందర్భంగా ఆరునెలల క్రితం టీవీ ఛానెళ్లలో వచ్చిన ప్రత్యేక ప్రోగ్రాముల వీడియో లింకులను నిన్న నెట్‌లోంచి పట్టుకుని మీకూ అందిస్తున్నాను చూడండి.

b. Nagireddy biography vedio links
1.
http://www.youtube.com/watch?v=e5TRKcAdWkc
2.
http://www.youtube.com/watch?v=IR8ODS2s1W8
3.
http://andhrawatch.com/tv-shows/7130-ntv-b-nagi-reddy-biography-2-videos.html

వీటిలో 3వ లింకు అంతక్వాలిటీతో లేదనిపిస్తోంది. నిన్న మా తమ్ముడికి ఈ లింకులను పంపితే వాటిని నేరుగా డౌన్‌లోడ్ చేశాడు. తొలి రెండింటి క్వాలిటీ చాలా బాగుంది. నాగిరెడ్డిగారి మొత్తం జీవిత స్కెచ్‌పై Ntv తెలుగు ఛానెల్ అందించిన ప్రోగ్రాంని రెండు వీడియో ఫైళ్లుగా ఒక బ్లాగర్ తన బ్లాగులో లింకులను ఇచ్చారు. దాన్నే మావాడు డౌన్‌లోడ్ చేసేశాడు.

వీలయితే మీరందరూ వీటిని చూడగలరు. క్వాలిటీ చాలా బాగున్నాయి. విషయమూ బాగుంది.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

అప్పారావుగారూ, మీ స్పందనలో మీరు వెలువరించిన గుండెకోతను అర్థం చేసుకుంటున్నాము. కాని ఈ విషయంలో నిస్సహాయులం. క్షమించండి.

2 comments:

shaik said...

Chala bagundandi..
Acha maina telugu blog chusi chala anandanga vundi..

రాజశేఖర రాజు said...

Thank you Shaik garu,
Telugu keying andubaatulo leka english lo type chestunnanu. Chala letuga ayina saree ee blog chusinanduku dhanyavadalu.

Raju.

Post a Comment