Pages

Tuesday, December 14, 2010

ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”

ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్భుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.

పిల్లల్లారా, చిన్నారీ, అమ్మాయీ, అని సంబోధిస్తూ, పాలు తాగే పసిపిల్లలకు ఊకోట్టే కథలను చెబుతూ 'చనుబాల' కథల పత్రికగా 1947 జూలై నెలలో తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ అతి త్వరలోనే ఆబాల గోపాల కథల పత్రికగా భారతీయ సాహిత్య ఆకాశంలో తటిల్లున మెరిసింది.

జాతి జీవనంలో సాంస్కృతిక రాయబారిగా నిలిచిపోయిన అరుదైన పత్రిక చందమామ. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. సున్నిత హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.

ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినివిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.

ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు. యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

చందమామ ఎందుకింత చరిత్ర సంపాదించుకుంది! లక్షలాది మంది పిల్లలు పెద్దల మనో ప్రవంచంపై ఇంత మహత్ ప్రభావాన్ని చందమామ దశాబ్దాలుగా ఎలా కలిగిస్తూ వస్తోంది? భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన ఈ గొప్ప చరిత్రకు, ఈ గొప్ప సంస్కృతికి ముగ్గురు మహనీయులు కారణం. వారి వల్లే, వారి దార్శనికత వల్లే చందమామ ఇంతటి ఘనతర చరిత్రను సాధించగలిగింది. వారు నాగిరెడ్డి, చక్రపాణి, కుటుంబరావు గార్లు. తొలి ఇద్దరూ చందమామకు రూపురేఖలు నిర్దేశిస్తే, తనకే సాధ్యమైన అతి సరళమైన రచనా శైలితో ఆబాల గోపాలం చందమామను తమ హృదయాలకు హత్తుకునేలా మార్చిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. తను ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాసేవారు.

అనన్య సామాన్యమైన ఈ త్రిమూర్తుల దార్శనిక కృషి ఫలితంగా, ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ “చందమామ”లో కథలుగా వచ్చాయి. భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బేతాళకథలూ, పంచతంత్రం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, అరేబియన్‌ నైట్స్‌ ఇలా విశిష్టమైనవన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు, ఇంకా ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, షేక్‌స్పియర్‌ అనువాదాలు ఎన్నిటినో పాఠకులు చదవగలిగారు.

ఇవి కాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌,ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ “చందమామ”లో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. “చందమామ” ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి.

భారతీయ పిల్లలను జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో విహరింపజేస్తూ వచ్చిన చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేటట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం లాంటి మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూ వచ్చాయి. మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ.

చందమామ కథలు ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులని చందమామ అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. “విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, కొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు.. నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. పైగా ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..” –మేధ, బెంగళూరు

చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, చందమామ అభిమానులందరికీ పరిపాటిగా ఉండేది. కొత్త చందమామ కోసం బేరాలు. బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేకపోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి. మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్లు తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళు. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్లు. అలా చూసుకుంటూనే, పిల్లలు, పెద్దలు ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్లు.

ఈ మధ్యే చందమామ సీనియర్ చిత్రకారుడు శంకర్ గారిని చందమామ పనిలో భాగంగా పోన్ చేసి మాట్లాడితే చందమామను మొదటినుంచి పిల్లలూ, పెద్దలూ ఎందుకు అంత ఆసక్తిగా, ఆరాటంగా చదివారో అద్బుతంగా వివరించారు. పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ బతికేవారికి కాస్త తీరిక సమయంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్‌లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని శంకర్ గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం చెప్పారు. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చందమామ చక్కటి వినోద సాధనంగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు.

చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా… మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే కష్టాలు పడుతున్న వారి మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని, వారి శ్రమను, కష్టాన్ని కూడా మరిపించడంలో భాగంగా చందమామ కథలు పుట్టాయని శంకర్ గారు తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు.

భయపట్టే దయ్యాలు, రాక్షసులూ కాకుండా మంచి వారికి సాయపడే దయ్యాలు, రాక్షసులు ఇతివృత్తంగా కథలు మార్చి ప్రచురించిన కారణంగా చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించారు. దశాబ్దాలుగా ఇదే తీరు.

చందమామలోని మరో ప్రత్యేకత ఏమిటంటే తేనెలూరే తియ్యటి తెలుగు. తెలుగు భాష నిసర్గ సౌందర్యాన్ని, భాషలోని తియ్యదన్నాన్ని చూడాలంటే కూడా చందమామనే చూడాలి. నాలుగైదు తరాల ప్రజలు, పాఠకుల జ్ఞాపకాల్లో చందమామ భాష నిల్చిపోయింది. భాష విషయంలో చందమామలో తప్పు దొర్లిన ఘటన దాదాపు ఉండేది కాదంటే చందమామ సంపాదకులు భాషకు, శైలికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది.

ఇన్ని సుగుణాల రాశి కాబట్టే చందమామ కొన్ని తరాల పిల్లలకు, పెద్దలకు కొండంత వెలుగు. అందులోనూ పాత చందమామలు అంటే తెలుగు ప్రాంతంలో ఎంత పోటీ ఏర్పడింది అంటే రాష్ట్రంలో ఎక్కడా పాత పుస్తకాల కొట్లలో, రోడ్జు పక్క అంగళ్లలో చందమామ సంచికలు దొరకని పరిస్థితి. పూర్వకాలంలో లంకెబిందెలకోసం వెతుకులాట ప్రారంభించినట్లుగారాష్ట్రంలో చందమామలు, పాత చందమామల కోసం వెతుకులాట మొదలయింది.

‘చంపి’ -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లుగా ముద్రపడిన చందమామ వీరాభిమానులు పోటీలు పడి చందమామలు సేకరించడం, ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ రూపంలో చందమామ పాత సంచికల ఫైళ్లను వెతికి పట్టుకుని సేకరించి తమ వద్ద ఇన్ని సంవత్సరాల చందమామలు ఉన్నాయి అని బ్లాగ్ లోకానికి టముకు వెయ్యడం గత కొంత కాలంగా నిత్య కృత్యంగా మారింది.

అలనాటి, ఈనాటి పాఠకులలో చందమామ కథలపట్ల ఉన్న ఈ వీరారాధనను గుర్తించి చందమామ యాజమాన్యం కూడా 1947 నుంచి 2000 వరకు చందమామ సంచికలను ఆన్‌లైన్‌లో ఉచితంగా చందమామ వెబ్‌సైట్‌లలో ఆర్కైవ్స్ విభాగంలో పొందుపర్చింది. ప్రపంచ వ్యాప్తంగా చందమామ పాఠకులు మొత్తం పది భాషల్లో ఇప్పుడు ఇంటర్నెట్‌లో 53 ఏళ్ల సంచికలను ఉచితంగా చూసి చదువుకోవచ్చు. ఆవిధంగా ప్రపంచంలో ఏ కథల పత్రికా సాధించని అరుదైన ఘనతను చందమామ సాధించింది.

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం.” అంటూ నాలుగైదు తరాలుగా పిల్లలు చందమామతో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ తరాలు మారినా పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

తెలుగులో ప్రత్యామ్నాయ వెబ్‌సైట్‌లలో ఒకటిగా పేరు పొందిన ప్రజాకళ.ఆర్గ్ నుంచి బాలసాహిత్యం శీర్షిక కోసం నెలనెలా చందమామ కథలను పరిచయం చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్నొక గౌరవంగా భావించాను. ఎందుకంటే నేను కూడా బాల్యంలో పల్లెటూర్లో చందమామకోసం పోటీ పడి చదువుతూ పెరిగిన వాడినే. చందమామ పత్రికపై ఉన్న ఈ మమకారం చివరకు 35 ఏళ్ల తర్వాత నాకు కూడా చందమామలో ఓ స్థానం కల్పించింది. కథా సాహిత్యంలో వైభవోజ్వల ఘనతను సాధించుకున్న చందమామ పత్రికను మొదట పరిచయం చేసిన తర్వాత ప్రతినెలా ఒక విశిష్టమైన చందమామ కథను పరిచయం చేద్దామని నా ప్రయత్నం.. ప్రజాకళ పాఠకులు మే నుంచి ప్రతి నెలా చందమామ కథల నేపథ్యాన్ని, వాటి పరిచయాన్ని ఆస్వాదిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు
- కె.రాజశేఖర రాజు

7 అభిప్రాయాలు
# Rohiniprasad 05 ఏప్రిల్ 2010 , 9:32 am
ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి తాను నిర్వహిస్తున్న బాధ్యతల గురించి అభిరుచి ఉండడం తప్పనిసరి కాదు. ఈ విషయంలో రాజశేఖరరాజుగారి ధోరణే వేరు. చందమామ గురించీ, దాని చరిత్రను గురించీ ఆయనకు ఎంతో ఆసక్తీ, అభిమానమూ ఉండడం చాలా మంచి విషయం.
చందమామ నిర్వహణ వ్యవస్థలో ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన తప్పిదాల కారణంగా దాని చరిత్రను వివరించే కొన్ని అమూల్యమైన, అపూర్వమైన ఆధారాలు కనుమరుగైపోయాయి. అప్పటితరంలో ముఖ్యపాత్ర చేపట్టినవారందరూ కాలం చెయ్యడంతో ఆ చరిత్రను తవ్వి తీయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఈ బాధ్యతను చేపట్టిన రాజు ఎంతైనా అభినందనీయుడు.

# bhandaru srinivasrao 08 ఏప్రిల్ 2010 , 3:10 am
రాజు గారికి
చాలరొజులుగా మీ వ్యాసాలు చదివే వీలు దొరకలెదు. prajakala కు ధన్యవాదాలు.
భండారు శ్రీనివాస రావు

# దామోదరం మారెం 09 ఏప్రిల్ 2010 , 12:21 am
తొలుత చందమామ చరిత్ర గురించి ఇంతగా ప్రత్యేక శద్ధ తీసుకుని, భావి తరాలు మరిచిపోకుండా వివరించిన రాజశేఖర రాజు గారికి ధన్యవాదాలు. ఎన్ని సంచికలు వచ్చినా…చందమామ పత్రిక మాత్రం “లివింగ్ లెజెండ్” వంటిదని నిస్సందేహంగా చెప్పొచ్చు. మీ నుంచి మరెన్నో అద్బుతమైన కథనాలు రాగలవని ఆశిస్తున్నాను.

# murali mohan mallareddy 25 ఏప్రిల్ 2010 , 11:42 am
రాజు గారికి అభినందనలు. ఇటీవలే చందమామ కు కొన్ని కథలు పంపించాను. రాజు గారు వాటిని చక్కగా ఆదరించి ఎంతో ప్రొత్సాహాన్ని అందిస్తున్నారు. చందమామ తో ఇదివరకు పాఠకుడిగా ఉన్న అనుబంధం ఇప్పుడు రచయితగా మొదలవుతోంది. మహామహుల రచనలు వచ్చిన చందమామ లో నా కథలు కూడా రాబోతున్నాయన్న తలంపే ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది. రాజు గారి కృషి అభినందనీయం…. మల్లారెడ్డి మురళీ మోహన, అంబాలా, హర్యానా.

# Hymavathy 02 ఆగస్టు 2010 , 12:47 am
చందమామ రాజు గారికి!

వెబ్ లో ఎన్నో సైట్స్లొ లో చందమామ గురించిన విషయాలు, చరిత్ర ప్రచురించడం ముదావహమం.[ఇక్కడవ్రాయడం కష్టం గానే ఉంది. లేఖిని లో వ్రాయడం అలవాటు] ఐతే ఏపత్రికైనా దాని బాగోగులగురించిన ఫీడ్ బ్యాక్ తెల్సుకుంటుంటేనే మంచి చరిత్రను రూపొందించుకుంటుంటుంది.అది చందమామ మాత్రమేచేయగలగడం మరో గొప్పవిషయం. చందమామ పాత పాఠకులనందరినీ ,[ అంటే ఓల్డ్ పాఠకుల సదస్సు రాష్ట్రములవారీగా ఏర్పాటుచేస్తే ఎంతో బావుంటుంది.ఎందుకంటే దాసరి సుబ్రహ్మణ్యం గారిలా జీవంతో ఉన్నపుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోక , ఆతరువాత ఎన్ని వ్యాసాలు, బాధలు, గాధలు చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదేమో!
70 ఏళ్ళ ”చంపి” గారిలాంటి వారెందరో ఇంకా ఉండవచ్చు. కనుక యోచించగలరు.ఇలా చందమామ గురించిన కధల ప్రచురణవలన ప్ర జాకళ కూ పాఠకులు పెరిగిపోతారనడం యదార్ధం

# నారాయణ 16 ఆగస్టు 2010 , 10:39 am
చందమామకున్న చారిత్రక నేపధ్యాన్ని రాజుగారు చాలా చక్కగా చిత్రీకరిస్తున్నారు. నాగిరెడ్డి-చక్రపాణిగార్లు తెలుగు సాహిత్యానికి, పిల్లల పఠనాసక్తిని పెంచటానికి చందమామను స్థాపించి, దాన్ని పెంచి పెద్దచేసి ఇంతటి దాన్ని చేశారు. అయితే ఈ మధ్యకాలంలో చందమామలోని కథల్లోగాని, వాటి ప్రెజెంటేషన్లోగాని నిజంగా పెను మార్పులే చోటు చేసుకున్నాయి. (”..చందమామ కథలు గతంలో ఉన్నంత బాలేవు” అనేది నా వ్యక్తిగత అభిప్రాయం; అయితే దానికిక్కడ తావులేదు). ఈ క్రమంలో రాజుగారు చందమామ ప్రస్తుత యాజమాన్యం గురించి, వారికి చందమామ చరిత్రతో ఉన్న అనుబంధం గురించి, వృత్తి ప్రవృత్తుల రీత్యా వారికి తెలుగు భాష/ పిల్లలతో ఉన్న సంబంధాల గురించీ కూడా వివరిస్తే బాగుంటుంది.

గమనిక:
మనకున్న కొన్ని ప్రత్యామ్నాయ వెబ్‌సైట్లలో ఒకటైన ప్రజాకళ.ఆర్గ్ చందమామ కథల గురించి కథనాలు పంపమని అడిగినప్పుడు పంపిన మొదటి కథనం ఇది. చందమామ కథల ఒరవడి గురించి సూచన ప్రాయంగా తెలుపుతున్న ఈ కథనం అప్పట్లో మంచి స్పందనలను కూడా పొందింది. ఈ కథనం ప్రచురించి ప్రోత్సహించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతాభివందనలు.

ప్రజాకళ.ఆర్గ్‌లో ఈ కథనం మూల లింకును కింద చూడవచ్చు.
http://prajakala.org/mag/2010/04/చందమామ

0 comments:

Post a Comment