Pages

Tuesday, March 1, 2016

రెడీమేడ్ దేశభక్తి

దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీయూలో ఎంఫిల్ పరిశోధన చేస్తున్నప్పుడు మేం హెచ్ బ్లాక్‌లో ఒకే గదిలో ఉండేవాళ్లం. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి ఎంఫిల్ చేస్తుండిన ఎల్ఎన్ (మేం అదే పేరుతో పిలిచేవాళ్లం.. పూర్తి పేరు జి. లక్ష్మీనరసయ్య. ఇంటిపేరు గుంటూరు అనుకుంటాను.) మా రూమ్మేట్.  ఆంగ్ల సాహిత్య విమర్శా ధోరణులను తెలుగు సాహిత్య, సామాజిక పరిస్థితులకు అన్వయించి అద్భుతంగా మాట్లాడేవాడు.

కళ కళ కోసమేనా ప్రజల కోసం కూడానా అనే చర్చ ఆనాడు కూడా విస్తృతంగా జరుగుతున్న రోజుల్లో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన ఒక సెమినార్‌లో అభ్యుదయ సాహిత్యంలో, కవిత్వంలో సామాజిక అంశాలు ఎక్కడున్నాయి అంటూ  వరంగల్ కాకతీయ యూనివర్శిటీ నుంచి వచ్చిన ఒక తెలుగు సాంప్రదాయిక ప్రొఫెసర్  సవాలు చేస్తే, 1940ల చివరలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక పేద రైతు అప్పటికప్పుడు అల్లి పాడుకున్న పాటను సభలోనే అద్వితీయంగా పాడి యావత్ సభ ప్రశంసలందుకున్నాడు ఎల్ ఎన్. అభ్యుదయ కవిత్వం అంటే ఆకలి కేకలు కాదనీ,  జీవనవేదనను అనితర సాధ్యంగా వర్ణించే కవిత్వం, పాట దాని సొంతమని సమర్థించి సభ దృష్టిని ఆకర్షించాడు తను.

ఆ పాట.. "ఏనాటి కానాడు ఎండవానల్లోన చేసి చేసీ ప్రాణమిసిగిపోయేనూ.. కూడుంటే కూరుండదోరన్నా అసలు కుక్కలే నయమురా కూలన్నా" అంటూ పది చరణాలలో సాగుతుంది. పేదరికపు దుస్థితిని, నాటి తెలంగాణ రైతు-కూలీల బాధామయ గాథలను ఆ పాట  చెప్పినంత హృద్యంగా మరే పాటలోనూ ఆనాటికి మేం వినలేదు.

అలాగే శివసాగర్ రాసిన అద్వితీయ పాట "తూర్పుపవనం వీచెనోయ్ తూర్పుదిక్కెరుపెక్కెనోయ్. భరత భూమీ కనులు తెరిచీ వెలుగు రెక్కలు విసిరెనోయ్" ను తను ఆరున్నొక్క రాగంలో పాడుతుంటే మైమరిచిపోయి వినేవాళ్లం.

"చెల్లెలా నా చెల్లెలా.. అడవి తల్లీ కన్నులల్లో వెన్నెలా" అంటూ ఆయన పాడుతుంటే మైమర్చి వినేవాళ్లం.  (విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఏరియాలో కేవలం 15 ఏళ్ల ప్రాయంలో నాటి పీపుల్స్ వార్ పార్టీ దళంలో చేరి చదువు నేర్చుకుంటుండగా పోలీసుల చేత చిక్కి దారుణ అత్యాచారం పాలబడి కన్నుమూసిన ఆదివాసీ చిన్నారి జ్యోతి అమరత్వంపై గుండె కరిగి నీరయ్యే బాణీలో రూపొందిన పాట అది.)

అలాగే "పరిటాలా రాములూ నీకు లాల్ సలాములూ వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం" అంటూ అనంతపురం విరసం నేత, రైతుకూలీ నాయకుడు పరిటాల శ్రీరాములుపై జననాట్యమండలి వారు రాసిన పాటను ఆరున్నొక్క రాగంతో పాడుతుంటే పరిసరాలు ఆవేశంతో ప్రతిధ్వనించిపోయేవి.

(అప్పట్లో ఎల్ ఎన్ గొంతుకు సరిసమాన స్థాయిలో పాడగలిగిన మరో మిత్రుడు కట్టా శేఖర్ రెడ్డి (ఇప్పుడు నమస్తే తెలంగాణ ఎడిటర్). శ్రీశ్రీ రాసిన "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" గీతాన్ని అన్ని సభల్లో, సమావేశాల్లో తను ఒకరకమైన విషాద స్వరంతో  దరువు వేస్తూ పాడుతుంటే వినడం గొప్ప అనుభూతి.)

భావకవిత్వంలో భాగమైన ఎంకి పాటలను కూడా అదే రీతిలో పాడేవాడు ఎల్ఎన్. పరిశోధన ముగిశాక వృత్తి జీవితంలో అడుగుపెడుతున్న దశలో ఆంధ్రజ్యోతి సాహిత్య అనుబంధంలో వారాల తరబడి తను సాహిత్య విమర్శా వ్యాసాలు రాయడం ఒక సంచలన ఘట్టం.

ఇవన్నీ ఒక ఎత్తయితే తను పుట్టి పెరిగిన పరిసరాల్లో దారిద్ర్యం తాండవిస్తున్న జన జీవితం గురించి కళ్ల నీళ్లు తిరిగేలా వర్ణించేవాడు. పొలాలలో వరిపంట కోతలు పూర్తయి రైతు ఇంట చేరాక, పొలంలో కింద పడిన కాసిన్ని వడ్ల గింజల కోసం మోటు పొరకతో వరిదంటుల నుంచి గింజలను తోసి చేటలో వేసి వాటిని ఇంటికి తెచ్చుకుని ఆ పూటకు వండిపెట్టే దళిత అమ్మల పేదరికాన్ని తను వర్ణిస్తుంటే... మా జీవితం అలాంటి స్థితిని అనుభవించనందుకు సంతోషించాలో.. దారిద్య భారత వర్ణనను చూసి బాధపడాలో అర్థమయ్యేది కాదు. మావైపు కూడా రైతుల పొలాల్లోంచి దళిత స్త్రీలు ఇలాగే గింజలు మోటుపొరకతో ఊడ్చి తీసుకుని పోయేవారు కానీ వారనుభవిస్తున్న దారిద్ర్య స్థాయి ఏమిటో మిత్రుడు చెబితే కానీ అర్థం కాలేదు.

నా పరిశోధనా జీవిత కాలంలో తనదైన  స్ఫూర్తిని కలిగించిన ఆ మిత్రుడిని చూసి 28 ఏళ్లయింది. అప్పుడప్పుడూ పత్రికలలో తన రచనలు చూసి ఆనందించండం తప్ప తనను ఇంతవరకూ కలిసిందీ లేదు.  అయితే తను కూడా భావజాలం విషయంలో మారలేదని, విప్లవ సాహిత్యం నుంచి బహుజన దళితోద్యమాల వైపు దిశ మార్చుకున్నా.. ఎవరి గురించి రాయాలో, దేనిగురించి రాయాలో తేల్చుకున్న అలనాటి నిర్ణయం నుంచి తానేమీ మారలేదని.. జేఎన్‌యూ ఘటనలపై స్పందనగా "రెడీమేడ్ దేశభక్తి" గురించి తను ఫిబ్రవరి 29న రాసిన కవిత పట్టి చూపుతోంది.

ప్రస్తుతం "దేశభక్తి"కి, "దేశద్రోహం"కి మధ్య దేశంలో జరుగుతున్న భావజాల యుద్ధ నేపథ్యంలో మిత్రుడు రాసిన 'రెడీమేడ్ దేశభక్తి'  కవిత గురించి మళ్లీ వ్యాఖ్యానాలు ఏవీ అవసరం లేదు. మీరు ఈ కవితను ఆస్వాదించినా,  ఆగ్రహంతో కంపించిపోయినా ఆ క్రెడిట్ మొత్తం నా అలనాటి మిత్రుడు జి. లక్ష్మీనరసయ్యదే.

ఇక చదవండి.

రెడీమేడ్ దేశభక్తి...
ఇక్కడ
టైంటేబుల్ ప్రకారమే చెమటపట్టాలి

గుండె కొట్టుకోవడానికీ 
ఎండ పండటానికీ
అనుమతుల్ని సులభవాయిదాల్లో పొందవచ్చు

కళ్లు నూరటానికీ, పళ్లు కొరకటానికీ
పచ్చ జండాల సౌకర్యం కలదు

దేశాన్ని ప్రేమించడానికి
శిక్షణ తప్పనిసరని గుర్తించగలరు
సిద్ధం చేసిన దేశభక్తిని 
ఉచిత బఫేలో వడ్డించుకోగలరు

స్వప్నాలకు సిలబస్ సప్లై చేయడం
శ్వాసలకు సంప్రదింపులు జరపటం
మా ఎవర్ కాషాయ స్పెషాలిటీ

జాతీయ జెండాని గుండెల్లో మోయకండి
బయటకి లాగి ఉతికి ఇస్త్రీ చేసి మరీ ఎగరేయండి
బోలో స్వతంత్ర భారత్‌కీ జై

ఎందుకయినా మంచిది మీ ఆహారం మీద
ఏలినవారి ముద్ర వేయించుకోండి
మీ విశ్వాసాల మీద
సంస్కృతంలో ఓం అని పచ్చ పొడిపించుకోండి

ఇక మీ ఆకళ్లూ, అవమానాలూ అంతరాత్మల కేకలూ
హిందూ మహాసముద్రంలో కొట్టుకుపోవాల్సిందే

జి. లక్ష్మీనరసయ్య

(నమస్తే తెలంగాణ సోమవారం (29-02-2016) సాహిత్య పేజీ చెలిమెలో అచ్చయిన కవిత ఇది. రగులుతున్న సమస్యపై ఒక దృక్కోణాన్ని ఇంత తాత్విక భూమికతో వివరించిన కవితను ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పత్రిక నిర్వాహకులకు అభినందనలు.)

2 comments:

Anonymous said...

ఎందుకైనా మంచిది పాకిస్తాన్ లో పందిమాంసంకొట్టు పెట్టుకోండి. పాచి వెధవల్లాలా. పక్కీర్ నా కొడుకుల్లాలా (ఇది ఏడో తరగతిలో మా సైన్స్ సారు మమ్మల్ని ముద్దుగా తిట్టే తిట్టు)

hari.S.babu said...

thanks anon,i also got such tung twisters.you reminded me taht:-)

Post a Comment