Pages

Saturday, March 26, 2016

ఇది క్షాత్ర పరీక్ష కాదు భారతమాత పరీక్ష

"భారత మాతాకీ జై’ అన్న నినాదం చేయలేని వాళ్లకు ఆ నినాదం నేర్పాలి. కొత్త తరాలతో భారత్ మాతా కీ జై అనిపించాలి. దేశభక్తిని ప్రబోధించే నినాదాలను నేటి యువతకు నేర్పించాలి. విద్యను జాతీయీకరణ చేయాలి." (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్)

'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్‌ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' ఒక నినాదం చేయనందుకు సభ్యుడిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రధాని చెప్పినప్పుడు.. ఎన్నికైన సభ్యుడు ఒక నినాదం ఇవ్వనన్నందుకు సస్పెండ్ చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది? రాజ్యాంగం కోరని ఒక నినాదం చేయాలని సభ్యుడిని ఒత్తిడి చేశారు. అది భావ ప్రకటనాస్వేచ్ఛ. ఒక నినాదం చేయనంత మాత్రాన అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు. మనం చీకటి యుగంలోకి వెళ్ల్లిపోతున్నాం"  (అసదుద్దీన్ ఒవైసీ). 

"భారత్ మాతాకీ జై అని నినదించని వారికి దేశంలో నివసించే హక్కు లేదు. భారత్ మాతాకీ జై అని నినదించని వారికి దేశంలో నివసించే హక్కు లేదు." (బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గీయ)

"భారత్ మాతాకీ జై అని నినాదం చేయనని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని పాక్‌కు పంపించేయాలి. ఇలాంటి పాములను భారత్ పెంచి పోషించాల్సిన అవసరం లేదు." (మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శివసేన మంత్రి రాందాస్ కదం)

భారతమాతకు జై పలకడానికి అభ్యంతరమున్న ఒవైసీ ఒక దేశద్రోహి. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలి. ఆ పని చేసినవారికి  ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తాను (ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది)

"దేశభక్తి గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. దేశభక్తిని ఎన్నో విధాలుగా వ్యక్తీకరించవచ్చు. హిందుస్థాన్ జిందాబాద్, విప్లవం జిందాబాద్ వంటి నినాదాలు కూడా ఈ క్యాటగిరీ లోనివే. అయితే కేవలం భారత్ మాతాకీ జై అనే నినాదంతోనే దేశభక్తి ఉన్నట్లు వారు అనుకుంటున్నారు. లోగడ హిట్లర్ జర్మనీలో ఫాసిజంను రెచ్చగొట్టడానికి ఇట్లాంటి జాతీయవాదాన్ని వినియోగించుకున్నాడు. దేశభక్తి గురించి జైట్లీ నుంచి తెలుసుకోవల్సిన అవసరం మాకు లేదు. మీరు మా తోని ఉంటారా? లేక ఉగ్రవాదులతో ఉంటారా? తేల్చుకోండి అని మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ఇదివరకు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే జైట్లీ వ్యాఖ్యలున్నాయి. తనకు మద్దతు ఇస్తేనే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది."  (ఏచూరి సీతారాం) 

"ఒక్కసారి కాదు.. ఇదే నినాదం వందసార్లు చేస్తా... రాజ్యాంగం కోరడంలేదు కనుక భారత్ మాతాకీ జై అని నినదించబోనని ఒవైసీ చెప్తున్నాడు. షేర్వాణీ, టోపీ ధరించాలని కూడా రాజ్యాంగం ఆయనను అడగడం లేదు. భారత్ మాతాకీ జై అనడం నా కర్తవ్యమో కాదో నాకు తెలియదు కానీ అది నా హక్కు. ముస్లింలు పాకిస్థాన్ వెళ్లిపోవాలని అతివాదులు చెప్పడం తప్పు. లౌకికవాదం లేకుండా ప్రజాస్వామ్యం లేదు. దేశంలో తిరోగామి శక్తులు పేట్రేగిపోతున్నాయి.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం నుంచి నేర్చుకునేవారు తెలివైనవారు. ఇతరుల అనుభవం నుంచి నేర్చుకునేవారు మరింత తెలివైనవారు. మతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దేశాలను చూడండి.. మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి నాలుకలు తెగ్గోసి, ఉరి తీసే దేశాలను చూడండి. అటువంటి దేశాలు మనకు ఆదర్శమా? లేక మత స్వేచ్ఛ కలిగిన దేశం ఆదర్శంగా ఉండాలా? ఆలోచించుకోవాలి. మోదీ ప్రభుత్వంలో మంచి పనులు చేయగల సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నారని, అదే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, వ్యవస్థ ఉన్నప్పటికీ మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోయాం? మనకు అభివృద్ధి కావాలి. కానీ ఎవరి అభివృద్ధి? ఎవరికి అభివృద్ధి అనేది ఆలోచించాలి. అభివృద్ధి అంటే జీడీపీ కాదు, మానవాభివృద్ధి సూచిక". (జావేద్ అక్తర్)

"భారత్ నుండి ఓవైసీ సోదరులను మీకు ఇచ్చేస్తాం.. భారత్ గురించి గొప్పగా మాట్లాడిన అఫ్రిదీ, మాలిక్ లను మాకు ఇచ్చేయండి"  (సోషల్ మీడియాలో ఛలోక్తులు)

సభ సెంటిమెంట్ కారణంగానే సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది (ఎంఐఎం మహారాష్ట్ర శాఖ నేత, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై అసెంబ్లీలో సస్పెన్షన్ విధించిన స్పీకర్ హరిభావ్ బగ్డే)

ఇది మాత్రం నిజం. మన దేశంలో సెంటిమెంట్ కారణంగానే సస్పెన్షన్ చేస్తారు.

జాతి చైతన్యం ఒత్తిడి మేరకే అప్జల్ గురులను ఉరి తీస్తారు. (ఇది సాక్షాత్తూ అప్జల్ గురుకు ఉరిశిక్ష అమలుపై తుది తీర్పును ప్రకటించిన న్యాయమూర్తి ప్రకటన. ఆ తీర్పుపై తన అసమ్మతి నోట్ పెట్టిన జస్టిస్ గంగూలీ ఆ తీర్పు మౌలిక భావాన్నే వ్యతిరేకిస్తూ తర్వాత అనేకసార్లు బహిరంగంగా మాట్లాడారు).

మెజారిటీ మనోభావాలకు అనుగుణంగానే సమస్త వ్యవహారాలనూ నిర్దేశిస్తారు. వాటిని ఏమాత్రం ఒప్పుకోకపోయినా మైనారిటీలపై దేశద్రోహ ముద్రలు వేసేస్తారు.

"భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారిని జైహింద్ అనేలా ఒత్తిడికి గురిచేశాం. జాతీయవాదంపై భావజాల సవాల్ తొలి రౌండ్‌లో బీజేపీదే విజయం." (అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి). ఇది ఈ మొత్తం గొడవలో అత్యంత తాజా వార్త. 
---------------

మన దేశాన్ని గత నెలరోజులుగా దహిస్తున్న చర్చా సరళి ఇది. మీకు మూడు పూటల తిండి లేకపోయినా ఫర్వాలేదు. తాగడానికి కాసిన్ని మంచినీళ్లకు గతిలేకపోయినా ఫర్వాలేదు. మీకు ఉద్యోగాలు కల్పించలేకపోయినా ఫర్వాలేదు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో భావజాల మంటలు రేగుతున్నా ఫర్వాలేదు. మన గొప్ప దేశాన్ని ఈ నినాదాలు, ప్రతినినాదాల సాక్షిగా ఇలాగే ముందుకు తీసుకుపోతాం. ఇందుకు మీ సహకారం కావాలి అంటూ పాలక పక్షాలు.. ప్రతిపక్షాలు... మిత పక్షాలు, అతి పక్షాలు.. దేశానికి ఇలా దిశా నిర్దేశం చేస్తున్నాయి. వీటన్నింటికీ కొసమెరుపు లాంటి వార్త కింద చూడవచ్చు

ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేయబోయి..
భారత్ మాతాకీ జై అని నినదించబోనని వ్యాఖ్యానించిన ఎంఐఎం నేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేయబోయి కాన్పూర్‌లో ఒక ఏబీవీపీ కార్యకర్త తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. బుధవారం నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో గుమిగూడిన ఏబీవీపీ కార్యకర్తలు ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. దిష్టిబొమ్మకు నిప్పు పెట్టబోయిన కార్యకర్త చొక్కాకు మంటలు అంటుకున్నాయి. తగలబడుతున్న తన చొక్కా విప్పుకొనేందుకు అతడు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు తోటి కార్యకర్తలు మంటలు ఆర్పి, అతడిని దవాఖానకు తరలించారు. స్వల్ప గాయాలైన అతడికి చికిత్స జరుగుతున్నది.

ఏబీవీపీ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకోవడం లేదా దిష్టిబొమ్మను దహనం చేయబోయి తాను మంటల్లో చిక్కుకోవడం బాధాకరమైన విషయమే.. కానీ నెలరోజులుగా  ఈ వివాదాన్ని రేపుతున్న వారు. ప్రత్యేకించి నినాదాల్లో మాత్రమే దేశభక్తిని, అభివృద్ధిని దర్శిస్తున్నవారు మంటల్లో చిక్కుకున్న సందర్భానికి ఇది సింబాలిక్ షాట్ లాగ కనిపిస్తోంది.

కానీ..

"దేశ భక్తికి ప్రతీకగా ఫలానా నినాదం చేయాలని పట్టుపట్టినపుడు చట్టసభలు అందుకు వంతపాడడమా? మెజారిటీ ప్రజలు సున్నితత్వం మొద్దుబారడం దేశానికి ఎంత ప్రమాదమో, తమ హక్కుల కోసం గట్టిగా మాట్లాడేందుకు మైనారిటీ ప్రజలు భయపడే పరిస్థితి రావడం కూడా అంతే ప్రమాదం" అంటూ ఇవ్వాళే (మార్చి 26) ఆంద్రజ్యోతి దినపత్రిక సంపాదకీయ పేజీలో ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనంలోని ముఖ్యమైన పేరాలను కింద యధాతథంగా ఇస్తున్నాను. ఆసక్తి మాత్రమే కాదు.. సమస్యను రెండువైపులా చూడాలనుకుంటున్న వారు కూడా కింది పేరాలను తప్పక చదవండి.

"నిజానికి ఇది పూర్తిగా పనీపాటా లేని వ్యవహారం. ఆరెస్సెస్‌ నాయకుడు ఆ మాట అనక్కరలేదు. అన్నందుకు ఎవరూ ఆశ్చర్యపోనూ అక్కరలేదు. హిందూ జాతీయవాదం, దానితో కలగలసిపోయిన దేశభక్తి రాజకీయాల నుంచే కదా వాళ్లు శక్తి కూడదీసుకునేది! రెండోవైపున, మజ్లిస్‌ నాయకుడు తన గొంతు మీద ఎవరో కత్తి పెట్టినట్టు జవాబు ఇవ్వనక్కరలేదు. కానీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఇండియాలో సర్వకాల సర్వావస్థలలో తమను వెన్నాడి వేధిసున్నారన్న భావనను ముస్లింలలో పెంచి పోషిస్తేనే కదా వారికి బలం చేకూరేది! వ్యవహారం అక్కడితో ఆగితే బాగానే ఉండేది.

కానీ, ‘భారత మాతాకీ జై’ అని నినదించనందుకు మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ సభ్యుడు వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేశారు. తాజాగా అసదుద్దీన్‌ ఒవైసీని అభిశంసిస్తూ మధ్యప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. ఒవైసీపై కొన్ని చోట్ల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన సహజంగానే బీజేపీ కన్నా దుందుడుకు వైఖరి తీసుకుని ఆయన నాలుకకు వెలకడుతోంది. ఇప్పుడిక వివాదం ‘భారత మాతాకీ జై’ అన్న ఒక్క నినాదానికి సంబంధించినది కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉంది. ఎవరైనా సరే తమ దేశభక్తిని తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఫలానా పని చేసిగానీ, ఫలానా మాట అనిగానీ తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసే హక్కు ఎవరికైనా ఎక్కడ నుంచి సంక్రమిస్తుంది? అలాంటి హక్కును తమకు తాము దఖలు పరచుకున్న కొందరు, దేశభక్తికి ప్రతీకగా ఫలానా నినాదం చేయాలనిపట్టుపట్టినపుడు, చట్టసభలు అందుకు వంతపాడడమా? మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్‌ఐఎమ్‌ సభ్యుడి తాత్కాలిక బహిష్కరణ తీర్మానానికి గానీ, మధ్యప్రదేశ్‌ సభలో ఒవైసీ అభిశంసన తీర్మానానికి గానీ వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క గొంతు కూడా లేవకపోవడం గమనార్హం.

మంచి చెడుల మీమాంసపై అర్థవంతమైన చర్చకు అత్యున్నత వేదిక అయిన చట్టసభలో ‘దేశభక్తి’ కారణంగా మూకస్వామ్యం వర్థిల్లినపుడు మనం ఎటు వెళుతున్నట్లు? 19వ శతాబ్ది చివరి రోజులలో మొదలుపెట్టి జాతీయోద్యమంలో వందేమాతరం గీతం ప్రముఖ పాత్ర పోషించింది. ‘వందేమాతరం’ అన్న నినాదం జనాన్ని ఉర్రూతలూగించింది. నిజానికి వలస పాలన కింద ఉన్న భారత దేశంలో ‘మాతృభూమి’ అన్న భావన వేళ్లూనుకోవడం కూడా దీనితోనే మొదలయింది. మళ్లీ ఒకసారి వెనక్కి వెళితే, దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే వందేమాతర ం గీతంపై చాలా చర్చ నడిచింది. దుర్గా మాతను కీర్తించే తర్వాతి చరణాలను వదిలిపెట్టి ఆ ప్రస్థావన లేని మొదటి రెండు చరణాలనే తీసుకున్నప్పటికీ ముస్లింలు ఈ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు. మాతృభూమి భావనను కీర్తించడం కూడా తమ మత నియమాల ప్రకారం ‘షిర్క్‌’ (విగ్రహారాధన నేరం) అని వారు పేర్కొన్నారు.

తాజా వివాదానికి కారణమైన ‘భారత మాత’ కీర్తనను నిరాకరించడంలో ఇమిడివున్న అంశం కూడా ఇదే. తమ మత నియమాలకు వ్యతిరేకం కాబట్టి తాము ‘భారత మాతాకీ జై’ అని నినదించేది లేదని అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. అందుకు ఆయన దేశద్రోహి అయిన పక్షంలో భారత దేశంలో ఇంకా కొన్ని కోట్ల మంది ముస్లింలు కూడా దేశద్రోహులవుతారు. మజ్లిస్‌ నాయకులు వ్ర వచిస్తున్నంత మాత్రాన దీనిని పిడివాద మత నియమాల నిర్వచనం అనుకోనవసరం లేదు. ఈ వాదనకు కట్టుబడుతున్న ముస్లింలు ఎక్కువ మందే ఉన్నారు.

బిజో ఎమాన్యుయేల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో, 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక విశిష్టమైన తీర్పు ఈ విషయంలో పూర్తి స్పష్ట త కల్పిస్తోంది. క్రిస్టియన్‌ మతంలో ‘జాషువా విట్‌నెసెస్‌’ అనే తెగకు చెందిన ముగ్గురు పిల్లలు తాము చదువుతున్న పాఠశాలలో అందరితో పాటు జాతీయ గీతం ‘జనగణమన...’ ఆలపించడానికి నిరాకరించారు. తమ మత విశ్వాసాలకు అది విరుద్ధమని వారు వాదించారు. మొదట వారి వాదనలతో ఏకీభవించిన స్కూలు యాజమాన్యం కేరళ శాసనసభ జోక్యంతో చర్య తీసుకొన్నది; ముగ్గురు విద్యార్థులనూ పాఠశాల నుంచి బహిష్కరించింది. ఆ పిల్లల తండ్రి బిజో ఎమాన్యుయేల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ స్కూలు యాజమాన్యం వైఖరికే మద్దతు లభించింది. ఆ తండ్రి సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. జస్టిస్‌ ఓ. చిన్నపరెడ్డి, జస్టిస్‌ ఎమ్‌.ఎమ్‌. దతలతో కూడిన ధర్మాసనం అప్పీలు విచారించింది. మతపరంగా సరైన అభ్యంతరం ఉన్న పక్షంలో, అందరితోపాటు వారిని కూడా జాతీయ గీతం ఆలపించాల్సిందేనని బలవంతం చేయడం కుదరదని ధర్మాసనం తీర్పు చెప్పింది. అలా బలవంతం చేయడం ఆర్టికల్‌ 19(1) (ఎ) - భావ ప్రకటన స్వేచ్ఛ - ఆర్టికల్‌ 25 (1) - మత స్వేచ్ఛకు విరుద్ధమని బెంచ్‌ స్పష్టం చేసింది. మౌనంగా వుండడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని తీర్పు వెలువరించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి పేర్కొన్నారు. ‘ఎంత అప్రధానమైన మైనారిటీలయినా ఈ దేశపు రాజ్యాంగం కింద తమ గుర్తింపును తాము పొందగలగడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. మన సంప్రదాయం సహనాన్ని నేర్పుతున్నది. మన తాత్వికత సహనాన్ని బోధిస్తున్నది. మన రాజ్యాంగం సహనాన్ని ఆచరణలో పెడుతున్నది. దానిని మనం పలచన చేయకూడదు’ అని జస్టిస్‌ చిన్నపరెడ్డి పేర్కొన్నారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అలా ఉండగా, ‘భారత మాతాకీ జై’అని నినదించనందుకు ఒక రాష్ట్ర చట్టసభ ఒక సభ్యుడిని బహిష్కరిస్తుంది. నినదించను అని అన్నందుకు మరొకరిని ఇంకొక రాష్ట్ర చట్టసభ అభిశంసిస్తుంది. ఈ గందరగోళంలో కాస్త సవ్యమైన గొంతులేకున్నా ఉన్నా గానీ అవి మనకు వినబడవు.

‘భరతమాత’ అన్నది చాలా సున్నితమైన అంశం. దేశద్రోహి అనిపించుకునేందుకు ఎవడూ సిద్ధంగా ఉండడు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఉపయోగించుకుని మరో సున్నితమైన విషయంలో ప్రజల ‘సెన్సిటివిటి’ మొద్దుబారేట్లు చేయడం వారి లక్ష్యం. తమ మతపరమైన విశ్వాసం ముస్లింలకు సున్నితమైన అంశమే కదా మరి! ఇప్పుడు దానిని ‘భారత మాతాకి జై’ నినాదంతో ముడిపెడితే మెజారిటీ మతం ప్రజలు ఎలా స్పందిస్తారు? ఇలా బోడిగుండుకీ, మోకాలికీ ముడిపెట్టినపుడు మెజారిటీ ప్రజల సెన్సిటివిటి మొద్దుబారడం ఒక్కటే కాదు; మైనారిటీ మతం వారి స్పందన కూడా మారే ప్రమాదం ఉంది. మెజారిటీ ప్రజలు సున్నితత్వం మొద్దుబారడం దేశానికి ఎంత ప్రమాదమో, తమ హక్కుల కోసం గట్టిగా మాట్లాడేందుకు మైనారిటీ ప్రజలు భయపడే పరిస్థితి రావడం కూడా అంతే ప్రమాదం."

అంటున్నారీ కథన రచయిత ఆలపాటి సురేశ్‌ కుమార్‌...

ఆంద్రజ్యోతి సంపాదకీయ పేజీలోని ఈ కథనం పూర్తి పాఠాన్ని చూడాలనుకుంటే కింది లింకును చూడండి.

‘భారత మాత’ పరీక్ష! 

http://www.andhrajyothy.com/Artical?SID=221920

0 comments:

Post a Comment