Pages

Wednesday, March 23, 2016

అది దేశద్రోహం కాక మరేమిటి?

జాతీయవాదం, దేశభక్తి, దేశద్రోహం, చట్టబద్ధ హత్యలు వంటి... ప్రస్తుతం దేశాన్ని భావజాలపరంగా రెండుగా చీల్చిన అనేక అంశాల పట్ల మీడియాలో ఒక వెర్షన్ లేదా ఒక పక్షాన్ని సమర్థించే రచనలనే ప్రచురిస్తున్నారని, దేశంమీద ప్రేమతోనే భారత వ్యతిరేక నినాదాలను ఖండిస్తున్న వారి వాదానికి మీడియా స్థానం కల్పించటం లేదని వస్తున్న విమర్శలకు ఇక్కడ ఇస్తున్న కథనం ఒక సమాధానం కావచ్చు.

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశద్రోహానికి పాల్పడుతున్నారని, దేశ సమగ్రతకు భంగకరమైన వారని సహించలేమని, స్వతంత్ర కశ్మీర్, ఇండియా గో బ్యాక్ అనడాన్ని ఎదుర్కొంటామని చెబుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి భాగయ్య గారు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని ఈ పోస్ట్ చివరన ఇచ్చిన లింకులో చూడవచ్చు.

గత నెల రోజులుగా ఇంకా చెప్పాలంటే వేముల రోహిత్ విషాద మరణ ఘటన నుంచి రగులుతున్న పరిణామాలపై ఆరెస్సెస్ నుంచి తొలిసారిగా సమగ్ర వివరణను, అభిప్రాయాలను ఈ కథనం అత్యంత సమగ్రంగా వివరిస్తోంది. ఈ వ్యాసంలోని చాలా అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేదు. కానీ ఈ కథనాన్ని ఆసక్తి ఉన్న అందరూ వీలయితే చదవాలని, చదివి ఎవరికి వారు ఆలోచించుకోవాలని కోరుతున్నాను.

నా దృష్టిలో..

ఈ వ్యాసంలో పరస్పరం ఘర్షించే విరుద్ధాంశాలు చాలానే ఉన్నాయి. 'దేశభక్తి అంటే మాదే అని మేం ఎప్పుడూ అహంకరించలేదు. గుత్తాధిపత్యం ప్రకటించుకోలేదు' అంటూ పరమ ప్రజాస్వామికంగా ప్రకటిస్తూనే కశ్మీర్‌ని భారత్ దురాక్రమించిందని చెప్పే దేశద్రోహ భావాలను ఆరెస్సెస్ సహించదని హెచ్చరించడం ఈ వ్యాసంలోని వైరుధ్యాలకు పరాకాష్ట. సహించకపోవడం అంటే ఏమిటి? దేశద్రోహ నినాదాలు చేయలేదని కోర్టులు సైతం నిర్ధారించిన తర్వాత కూడా జేఎన్‌యు విద్యార్థి నేతలను దేశద్రోహులుగానే ముద్రిస్తున్న సంస్థ ఆచరణను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ నినాదాలతో సంబంధిత విద్యార్థి నేతలకు ఏ విధంగానూ సంబంధం లేదని చివరికి ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఉమర్ ఖాలిద్, అనిర్బన్‌లపై కూడా దేశద్రోహ చట్టం వర్తించదని ఢిల్లీ కోర్టు చెప్పిన తర్వాతయినా తమ వాళ్లు ఎంత అతిగా వ్యవహరించారో ఆరెస్సెస్ నాయకత్వం ఆలోచించగలుగుతుందా?

తమను మించిన దేశభక్తులు లేరనే అహంతో, విద్యాలయాల్లో స్వయం ప్రకటిత నిఘాను అమలు చేస్తూ, ఎవరైనా కాస్త గట్టిగా అరిస్తే చాలు వారందరినీ వేటాడుతూ పోలీసు స్టేషన్లలో, కోర్టుల్లో పంచాయితీల్లోకి నెడుతున్న విద్యార్థి సంఘం ఈ దేశాన్ని ఏం చేయదల్చుకున్నదనేది ఇప్పుడు మౌలిక ప్రశ్న. ఒకవేళ ఈ వైఖరి సరైనదే అనుకుందాం. మీరు దేశద్రోహం అంటున్న ఇలాంటి చర్యలను, ఘటనలను కోర్టుల్లోకి ఈడ్చి రభస సృష్టించడం ద్వారా, విద్యార్థులను చీల్చివేయడం ద్వారా మీరు దేశభక్తిని, దేశ సమగ్రతను పరిరక్షించే విషయంలో గ్యారంటీ ఇవ్వగలరా? ఆ విద్యార్థి సంఘానికి ఇది సాధ్యమేనా? అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో, ఇటు జేఎన్‌యూలో మీ దూకుడు వైఖరి ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యార్థులలో అలజడిని కాదు ఉద్యమ వాతావారణాన్ని మీకు మీరే పెంచి పోషించగలిగారు. అజాదీ నినాదాలు దేశమంతా మార్మోగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో మీరనుకుంటున్న దేశభక్తి స్థాపనకు ఎంత కాలం పడుతుందో చెప్పగలరా?

పైగా... తనతో ఏకీభవించనివారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ కశ్మీర్‌లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో ఎందుకు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నది అంటూ ఇంటర్వ్యూ చేసినవారు అడిగిన ప్రశ్నకు బాగయ్య గారు నేర్పుగా సమాధానం దాటవేశారు. 'ఇది పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యవహారం. వారినే అడగాలి.' అంటూ ఏకవాక్యంతో ఈ ప్రశ్నను దాటేశారు. నిజంగా దేశప్రజలకు దీన్నే నమ్మాలని చెబుతున్నారా? ప్రజలను ఇంత అమాయకంగా అంచనా వేస్తే ఎలా? ఆరెస్సెస్ వ్యతిరేకిస్తే కశ్మీర్లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు కదా. అలాంటి ఆలోచన చేయడానికైనా బీజేపీ సాహసించగలదా? వేర్పాటువాదులతో మీరు జత గట్టవచ్చు. దాంట్లో మీ ప్రయోజనాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రభుత్వంలో మేము లేము అనే టెక్నికల్ అంశాన్ని మాత్రమే ముందుకు తెచ్చి పీడీపీ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటే ఈ దేశ ప్రజలు నమ్మాల్సిందేనా?

"బీజేపీ సహా ఏ సంస్థ సిద్ధాంతంతో అయినా విభేదించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. తప్పులేదు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వరకు వెళ్లడం ఏమిటి దీనికేనా భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు?" అని ఈ కథనం ప్రశ్నిస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ముక్కలు చేస్తా మాటలను ఎవరన్నారు అనే విషయాన్నే ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. మీరు కాదు.. పోలీసులు, కోర్టులు సైతం  దీన్ని తేల్చలేకపోతున్నాయి. కానీ మీ ఆరోపణ మాత్రం మొత్తంగా జేఎన్‌యూ విద్యార్థులపైనే బురద చల్లుతోంది. విద్యార్థులపై రాజద్రోహ కేసులు. జాతీయ చలన చిత్ర సంస్థ ఫిక్కీలో సినిమా రంగంపై అధ్యయనం చేస్తున్న 35 మంది విద్యార్థులపై రాజద్రోహ కేసులు. మీకూ, మీ అనుబంధ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరిస్తే చాలు స్కాలర్ షిప్ కటింగులు, విశ్వవిద్యాలయాలను మూసివేయాలంటూ బరితెగింపు రాతలూ, ఇంకా ముదిరితే రాజద్రోహ కేసులూ.. ఈ దేశంలో అకడమిక్, పరిశోధనా వాతావరణాన్ని మీరేం చేయాలనుకుంటున్నారో చెబితే బాగుంటుంది.

"మనుస్మృతి గురించి మాకు కచ్చితమైన అవగాహన ఉంది. అదేమీ వేదం కాదు. స్మృతి. ఒక కాలానికి సంబంధించినది. దానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. మనుస్మృతిని మేం ఏనాడూ ప్రస్తావించలేదు." చాలా సంతోషం. మనుస్మతికి ఎప్పుడో కాలదోషం పట్టిందనీ, మనుస్మృతిని ఏనాడూ మేం ప్రస్తావించలేదని ఒక ఆరెస్సెస్ ప్రముఖులు ఇంత బాహాటంగా ప్రకటించడం నిజంగా సంతోషించవలసిన విషయమే. కానీ ఇది కేవలం ప్రకటన వరకే పరిమితం కాకుండా నిజంగా మీరు మనుస్మృతి ప్రాతిపదికన ఈ దేశంలో జరుగుతున్న దారుణ వివక్షతలను కుల అంతరాలను పోగొట్టే చర్యలు చేపడితే  ఈ దేశం నిజంగానే బాగుపడుతుంది.
కాని అలాంటి ఒక్కటంటే ఒక్క చర్యను ఆరెస్సెస్ చేపట్టగలిగిందా?

చిన్న ఉదాహరణ. తిరుమల గోవిందుడిని దళితవాడల్లోకి తీసుకుపోయి ఒక రాత్రి మాత్రమే అక్కడ ఉంచి శయనించి మళ్లీ అక్కడినుంచి వచ్చేసే నాటకాన్ని టీటీడీ నాలుగేళ్ల క్రితమే ప్రదర్శించి ఎంత అభాసు కావాలో అంతగానూ అభాసు పాలయ్యింది. చివరకు కాలదోషం పట్టిందని మీరు చెబుతున్న మనుస్మతిని తగులబెడితే.. ఎందుకు తగలబెట్టారంటూ జేఎన్‌యు (ఆరెసెస్ భావజాలం రంగరించుకున్న) అధికారులు నోటీసు పంపితే దీన్నేమని అర్థం చేసుకోవాలి? ఎలా జీర్ణించుకోవాలి? మాటల్లో మార్పు... చేతల్లో మాత్రం వెయ్యేళ్ల వెనకటి ఆలోచనల కూర్పును అట్టిపెట్టుకోవడం. ఈ ద్వంద్వ వైఖరి, కపట వైఖరిని దేశం ముందు ప్రదర్శించడమే దేశభక్తా?

"భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మతంతో ప్రమేయం లేకుండా దేశ ప్రజలంతా ఇచ్చిన నినాదాలు భారత్‌మాతాకీ జై, వందేమాతరం. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం కొందరు ఈ నినాదాన్ని అవమానించడమంటే, స్వరాజ్య సమరంలో మన పెద్దలు చేసిన త్యాగాలను అవమానించడమే."

ఎంత చక్కటి మాట... ఆనాడు దేశప్రజలు స్వచ్చందంగా తమకు తాముగా ఆమోదించి, సొంతం చేసుకుని పలికిన ఈ స్ఫూర్తిదాయక నినాదాలను మీరు ఇవ్వాళ జాతిపై రుద్దుతున్నారు. భారత్‌మాతాకీ జై అనకపోతే జాతీయ వాదమే లేదని, దేశభక్తులే కారని మీరు తీర్పు చెబుతున్నారు. ఇదెంత ప్రమాదకరమైన పరిణామమంటే దేశం నిలువుగా చీలిపోయే ప్రమాదముంది.

గుర్రాన్ని బలవంతంగా నీళ్ల తొట్టివద్దకు తీసుకువెళితే ఏమవుతోందనే సాధారణ సత్యాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. ఈ నిర్బంధ వాతావరణం, ఈ నిర్బంధ దేశభక్తి, నిర్బంధ భారతమాత స్తుతి ఇవి మీరు ఆశిస్తున్న అఖండభారత్‌కు ఏ కొంచెమైనా మేలు చేస్తాయనుకుంటున్నారా? నాదైన కారణాలతో భారతమాతకు జైకొట్టలేను అంటే కూడా సహించలేనివారు.. అలాంటి వారిపై నిర్బంధ భావజాలాన్ని రుద్దాలనుకుంటున్నవారు ఏ అఖండ భారత్‌ను నిర్మించాలనుకుంటున్నారు?

'రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం.' అంటూ బాధను వ్యక్తీకరిస్తున్నవారు.. ఏ కారణం వల్లనయినా కావచ్చు రోహిత్ కన్నతల్లిని ఇప్పటికయినా కలిసి ఓదార్పు, సానుభూతి ప్రకటించే సంస్కార ప్రదర్శన చేయడం లేదు. ఏ సంస్కృతి అడ్డం వస్తోందో మరి. పైగా ఆమె కులం గురించి నీచాతినీచమైన విచారణలు, శల్యపరీక్షలు చేస్తూ, చేయిస్తూ పోవటం.. పార్లమెంటులో కూడా అబద్ధాల స్మృతి ఆమె కులానికి అంత ప్రాధాన్యత నివ్వడం.. ఇది మనుస్మృతికి కాలదోషం పట్టిన సమాజానికి, ఆచరణకు సంకేతమేనా? రోహిత్ తల్లి నిజంగా దళితురాలు కాకపోతే, రోహిత్ నిజంగానే దళితుడు కాకపోతే అతడి ఆకస్మిక ఆత్మహననం సమర్థనీయమే అవుతుందా?

ఆరెస్సెస్ భావాలను రంగరించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు పొదిలి రెండునెలల తర్వాత చెప్పా చెప్పకుండా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన అధికారిక నివాసంపై దాడి జరిగితే యూనివర్సిటీ చరిత్రలో దుర్దినం -బ్లాక్ డే- అంటూ ఓండ్రపెట్టాడు. ఒక మేధోవంతుడైన విద్యార్థి... కేవలం  వీసీగా తన నిర్లక్ష్యం, క్రూరత్వం కారణంగా గుండె పగిలి చావును కొని తెచ్చుకుంటే ఆరోజు అదే యూనివర్సిటీ చరిత్రలో బ్లాక్ డే అయిందనే మాట ఈ మహానుభావుడి నోటివెంట పెగల్లేదు. అతగాడి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్‍‌కు ఉన్నంత విలువ కూడా ఆ యూనివర్శిటీలో విద్యార్థికి లేదు.

మనుషుల ప్రాణాలను నిలువునా హరించే చర్యలు, లెటర్లమీద లెటర్లు, హెచ్చరికల మీద హెచ్చరికలు చేసి రాచి రంపాన పెట్టి మనిషిని నిలువునా హతమార్చిన పెద్దమనుషులు, తారామణులు, చేసిన తప్పు ఎక్కడ మెడకు చుట్టుకుందోనని అబద్దాల మీద అబద్దాలు పలికి బయటపడ్డవారు..

వీరెవ్వరూ దేశద్రోహులు కారు. వీరెవ్వరూ జాతి ద్రోహులు కారు...

ఇదీ ఈ కథనంపై నా భిన్నాభిప్రాయం..

కానీ నా అభిప్రాయం నాది. దీంతో పనిలేకుండా ఆరెస్సెస్ భాగయ్యగారి పూర్తి కథనాన్ని కింది లింకులో చదువగలరు.

అది దేశద్రోహం కాక మరేమిటి?


4 comments:

Anonymous said...

"మనుషుల ప్రాణాలను నిలువునా హరించే చర్యలు, లెటర్లమీద లెటర్లు, హెచ్చరికల మీద హెచ్చరికలు చేసి రాచి రంపాన పెట్టి మనిషిని నిలువునా హతమార్చిన పెద్దమనుషులు, తారామణులు, చేసిన తప్పు ఎక్కడ మెడకు చుట్టుకుందోనని అబద్దాల మీద అబద్దాలు పలికి బయటపడ్డవారు.."

HCU లో జరిగింది యాకుబ్ మెమన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం అనే అంశం పై మొదలైన సమస్య అనేక మలుపులు తీసుకుని తన సహచరులే తనను పట్టించుకోకపోవడంతో, జనాల అవకాశవాదానికి నిరసన తెలుపుతూ రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి అతని సూసైడ్ లేటర్ సాక్షం. అసలు చదువుకోకుండా అనవసరమైన విషయాలలో తల దూర్చే ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి. గురువు దైవంతో సమానం అంటారు. అలంటి గురువు మీద దాడిని సమర్దిస్తున్న మిమ్మల్ని చూసి ఏమనాలో అర్థం కావటం లేదు. కేరళలోని స్మృతికి జరిగిన అవమానం గురించి, మరియు రోహిత్ గురించి, మత మార్పిడి గురించి అయన చెప్పిన అభిప్రాయలు చాల చక్క విస్మరించేసారు అది ప్రస్తావిన్చాలేదే మీ వ్యాసం లో. మీరు మీ ఆర్థం లేని అభిప్రాయలు

Anonymous said...

గుర్రాన్ని బలవంతంగా నీళ్ల తొట్టివద్దకు తీసుకువెళితే ఏమవుతోందనే సాధారణ సత్యాన్ని

నీళ్ళు తాగకపోతే గుర్రం యజమానికి నష్టమేమి లేదు. కొద్దిగా కష్టపడి, మాట వినని గుర్రాన్ని వదిలించుకొంటాడు. దేశం లో ఆ ఒక్క జాతి గుర్రమే కాదు ఉండేది ఎన్నో ఉన్నాయి. ఈ మాట వినని గుర్రం దేశానికి బరువు తప్పితే, దానివలన లాభం లేదు.

ప్రపంచంలో ప్రతిదేశానికి ఇప్పుడు ఈమట వినని గుర్రాల సంగతి అర్థమైంది. ఈ గుర్రాలకు మద్దతు ఇవ్వటానికి ఎవ్వరు రారు. ఒకవేళ ఎవరైనా వస్తే ఆ వచ్చిన వాళ్ళనే ఈ గుర్రాలను తీసుకుపొమ్మని కోరుతాము.

kanthisena said...

"గురువు దైవంతో సమానం అంటారు. అలంటి గురువు మీద దాడిని సమర్దిస్తున్న మిమ్మల్ని చూసి ఏమనాలో అర్థం కావటం లేదు. కేరళలోని స్మృతికి జరిగిన అవమానం గురించి, మరియు రోహిత్ గురించి, మత మార్పిడి గురించి అయన చెప్పిన అభిప్రాయలు చాల చక్క విస్మరించేసారు అది ప్రస్తావిన్చాలేదే మీ వ్యాసం లో.."

అయ్యో. నేను బాగయ్యగారి వ్యాసంలో నేను ఏకీభవించని అంశాలపైనే రాశాను. కేరళలోని స్మృతికి జరిగిన అవమానంపై నాకు భిన్నాభిప్రాయం లేదు కాబట్టే ప్రస్తావించలేదు. మహిళల గౌరవానికి భంగం కలిగించేవారు, తమ సంస్థలో ఉంటే ఒకరకంగా, వేరే సంస్థలోకి వెళితే మరొకరకంగా చూసేవారు ఎవరైనా సరే వారిది తప్పే. వారిది అరుణవర్ణమైనా, కాషాయవర్ణమైనా నీలివర్ణమైనా తీవ్రంగా ఖండించాల్సిందే. దీనిపై భిన్నాభిప్రాయం ఉంటే కద ప్రత్యేకంగా ప్రస్తావించడానికి.

ఇక మతమార్పిిడి గురించి.. మన ఇల్లు సక్రమంగా ఉంటే మరొకరు వచ్చి దూరేందుకు అవకాశముందా చెప్పండి. శతాబ్దాలుగా జరుగతూవచ్చిన లోపాలు ఏవో ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టే హిందూమంతంలోంచి రకరకాల కారణాలతో వెళ్లిపోతున్నారు. మనం సరిగ్గా ఉండం. మీతో కలిసి ఉండలేం.వేరే దారి చూసుకుంటాం అంటే ఒప్పుకోం. దీనిపై గొడవలు అనవసరం. మతమార్పిడి జరుగుతున్న పరిస్థితులు అసలు లేకుంటే మతమార్పిడీయే జరగదు కదా. ప్రలోభాలకు గురిచేస్తేనే ఎవరయినా మతం మారిపోతారా? తోటిమనిషిని మనిషిగా, మనవాడిగా గుర్తించని, గుర్తించలేని కుల, మత గజ్జిని మనలో పెట్టుకుని మరొకరిమీద పడితే ఏం లాభం?

రోహిత్ విషయంలో నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినా నా అభిప్రాయం ఒక్కటే కులవాదం, మనువాదం, మతవాదం,అగ్రవర్ణ అహంకార వాదం, స్మృతీ ఇరానీ వాదం.. అన్నీ కలిసి రోహిత్ ను చంపేశాయన్నదే నా వాదం.

"అసలు చదువుకోకుండా అనవసరమైన విషయాలలో తల దూర్చే ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి."

భలే చెప్పారు. మన బతుకంతా, మన చరిత్రంతా బహిష్కరించే, వెలివేసే, కాలితో తొక్కిపడేసే చరిత్రే కదా.. సంస్కృతే కదా.. ఇంతకు మించిన అభిప్రాయాలు మనకెందుకు వస్తాయిలెండి.

ఇక గురువు. గురువు మీద దాడి. నేను సమర్థించడం.. ఒక పచ్చి హంతకుడిని గురువుగా భావించడం నాకు చేతకాదు. అంత శక్తీ నాకు లేదు. హెచ్ సీయూలో గొడవ జరిగినప్పటినుంచి అబద్దాలు, అబద్దాల మీద అబద్దాలు.. దొడ్డిదారిన రాయబారాలు.. దొంగ బతుకు బతకడం కూడా గురుత్వంలో భాగమేనా? కేంద్రం ఎజెండాలో భాగంగా దొంగదారిలో వచ్చి రాజకీయం చేస్తున్న వారు గురవులు. ఆహా..

kanthisena said...

"ఈ మాట వినని గుర్రం దేశానికి బరువు తప్పితే, దానివలన లాభం లేదు."
మాట వినని గుర్రాన్ని, ఇతర జంతువులను వదిలించుకోవడం మనకు చాలా సులభం. ఎందుకంటే అవి నోరు లేని జంతువులు. మెడ కోసే చివరి క్షణం వరకు కూడా అవి మనల్ని నమ్ముతాయి. వాటికి వేరే మార్గం, గతి కూడా లేదు. కానీ ఇప్పుడు మాట వినిని గుర్రాలు కేవలం గుర్రాలు కాదు కదా. మనుషులు. వాళ్ల బరువును మీరు ఎలా వదలించుకుంటారు చెప్పండి. మహా అయితే రాజద్రోహం కేసు పెడతారు. కొంత కాలం జైల్లోకి తోస్తారు. అంతకుమించి ఇంకేం చేస్తారు.

జైలుకెళ్లిన కన్హయ్య ఒక గొప్పమాట అన్నాడు. మనం చదువుకుంటున్న వాళ్లం కాబట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కానీ ప్రజలకు అవి అర్థం కావు. వారికి మరింత సులువైన ఉదాహరణలతో చెప్పాలి అన్నాడు. శ్రమజీవులతో, చదువులేనివారితో మమేకం కావాలంటే మనమే మారాలని, మన భాషను మార్చుకోవాలన్న గొప్ప సత్యాన్ని కన్హయ్య జైలు జీవితంలో నేర్చుకున్నాడు. తనను జైలుకు పంపిన వారికి కూడా ఈ విషయంలో నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. జనంతో మరింతగా కలిసిపోవడానికి మన భాషను మార్చుకోవాలి. ఎంత గొప్పమాట ఇది. ఇదీ జ్ఞానమంటే..

Post a Comment