Pages

Friday, March 18, 2016

దేశభక్తి అంటే ఇదీ!

‘‘అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తున్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తున్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమర్శించే హక్కు మనకు ఎక్కడున్నది?’’ 

‘‘కొన్ని విషయాలను తలచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరానివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం’’

"మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్రమైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదు?"

"గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశాయి, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేది."

పైన ప్రస్తావించినవన్నీ... ఒక బాబాసాహెబ్ అంబేద్కరో లేక ఒక మహాత్మ జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావు. బ్రిటిష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి, దేశ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్‌సింగ్ రాసిన మాటలివి. మనమెరిగిన భగత్‌సింగ్‌లోని అంతగా వెలుగుచూడని తాత్విక కోణమిది. 1928, జూన్‌లో ‘కీర్తి’ అనే పంజాబీ పత్రికలో ‘అంటరానితనం’పై ఆయన రాసిన వ్యాసంలోని వాక్యాలివి. అంటరానితనం దుష్టస్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందులో ఆయన తూర్పారబట్టారు.

భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టుగా ఉన్న కులాన్ని, దాని వికృత రూపమైన అంటరానితనాన్ని అర్థం చేసుకొని భగత్‌సింగ్ చేసిన విశ్లేషణ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. దేశ రక్షణకు, సమాజ పురోగతికి అంటరాని కులాలు చేసిన సేవను ప్రస్తావిస్తూ... గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశాయని, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేదని ఆయన స్పష్టం చేశారు.

అంటరాని కులాల ప్రజలను ఉద్దేశిస్తూ, ‘‘మీరు నిజమైన కార్మికవర్గం. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీ కాళ్ళ మీద నిలబడి ఈ అసమానతల్ని ప్రతిఘటించండి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూ డదు. మీకు మీరే రక్షకులుగా నిలవండి. సామాజిక ఉద్యమం ద్వారా విప్లవానికి నాంది పలకండి. మీరు, మీరు మాత్రమే ఈ దేశపు మూలస్తంభాలు, మూలాధారాలు. నిద్రపోతున్న సింహాల్లారా, లేవండి విప్లవ పతాకాన్ని ఎగురవేయండి!’’ అంటూ ఆయన గర్జించడాన్ని చదువుతుంటే భగత్‌సింగ్ కళ్ళ ముందే నిలిచినట్టనిపిస్తుంది.

ఆయన రచనల పేరుతో వచ్చిన చాలా పుస్తకాల్లో ఈ వ్యాసానికి చోటు దక్కకపోవడానికి కారణాలు ఎలాంటివో అర్థం చేసుకోగలం. కులం పట్ల భగత్ సింగ్ విస్పష్ట వైఖరిని మరుగుపరిచే ప్రయత్నం జరిగిందనే భావించాలి.

1928 సమయంలో అంబేద్కర్ నాయకత్వంలో అంటరాని కులాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమానికి భగత్‌సింగ్ సంఘీభావాన్ని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించడం ద్వారానే వారి జీవితాలలో మార్పు వస్తుందంటూ ‘‘ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. ప్రతి మనిషి పుట్టుక, వృత్తి ద్వారా గుర్తింపును పొందకుండా, ప్రతి మనిషిని సమానంగా చూసినపుడే అంటరానితనం కుల వివక్ష, మాయమైపోతాయి’’ అంటూ కులసమస్యకు పరిష్కారం చూపాడు.

భగత్‌సింగ్ ఇరవై నాలుగేళ్ల ప్రాయంలోనే అమరుడైనా, ఆయన ఆలోచనలు, ఆచరణ, జీవితం నాటి నుంచి నేటి వరకు యువతరాన్ని విప్లవోన్ముఖులను చేస్తూనే ఉన్నాయి.

అంటరానితనంపై ఆయన ప్రకటించిన అభిప్రాయాలు నాటి పంజాబ్‌లోని అంటరాని సామాజిక వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. అక్కడి అంటరాని కులాలు సాధించిన సామాజికార్థికాభివృద్ధే అందుకు నిదర్శనం. కొందరి  జీవితాలు, ఆలోచనలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

దేశభక్తి, దేశద్రోహం అడ్డుగోడలను కాస్త పక్కనబెట్టి 68 ఏళ్ల క్రితం భగత్ సింగ్ అనే... ఒక నవయువకుడు 22 సంవత్సరాల చిరుప్రాయంలో ప్రకటించిన అగ్నిసదృశ ప్రకటన ఇది. ఒకటి మాత్రం నిజం.. జాతీయ విప్లవకారుల  త్యాగానికి మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భగత్ సింగ్ ఇవ్వాళ మన గడ్డపై ఉండి పై మాటలను పలికి ఉంటే ఖచ్చితంగా రాజద్రోహి, దేశద్రోహి అయి ఉండేవాడు.

"ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరానివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం"

భగత్ సింగ్ చెప్పిన ఈ ఒక్కమాట చాలు. మన ధర్మం, న్యాయం ఎక్కడ చంకనాకిపోయిందో అర్థం చేసుకోవడానికి..

"మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్రమైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదు?"

అయ్యా. ఇదీ మన దేశం. ఇదీ మన జాతి గొప్పదనం. ఇదీ నాలుగుపాదాల మీద నడిచి పాకి దేకి వచ్చిన మన ధర్మం.

మన తరతరాల బూజు ఇలా పేరుకుపోయాక ఇప్పుడు ఏ దేశభక్తిని గురించి పొగుడుకోవాలి మనం?

‘‘నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్ళి చేయాలనుకుంటున్నావు. కానీ కోట్లాది మంది భారతీయుల తల్లి భరతమాత చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం’’

అంటూ కన్న తండ్రికి లేఖ రాసి 14 ఏళ్ల ప్రాయంలో ఇంటినుంచి వెళ్లిపోయిన భగత్ సింగ్ పాతికేళ్లు కూడా నిండకుండానే తన ధర్మాన్ని నిర్వర్తించాడు. దేశభక్తికి అసలు చిరునామాగా, జాతి గుండెల్లో నిలిచిపోయాడు. ఇదీ దేశభక్తి అంటే.

భగత్ సింగ్ ఇవ్వాళ మన మధ్య నిలబడి ఆనాడు తానన్న మాటలని మళ్లీ ప్రకటించి ఉంటే, ఆయన తలకు, నాలుకకు, అంగాంగానికి వెల కట్టి ప్రకటించి ఉండేవాళ్లం. నెంబర్ వన్ జాతి దేశ ద్రోహిగా ముద్రించి తొక్కి పడేసేవాళ్లం ..

పెళ్లి అనే భావనను కూడా మనసులోకి రానివ్వని ఆ మాన్యుడికి కూడా 'కండోమ్' అంటగట్టేవాళ్లం...

ఎందుకంటే... మనం మాగొప్ప దేశభక్తిపరులం కదా మరి!

అందుకే.. మనం ఇంకో వెయ్యేళ్లపాటు ఇలాగే జాతిని, దేశాన్ని ఉద్ధరిస్తూ ఉంటాం.

సాటి మనిషిని అంటుకోవాలంటే భయపడుతూ....

దేశభక్తికి కొత్త కొత్త పాడు నిర్వచనాలు ఇచ్చుకుంటూ...

స్త్రీమూర్తిని ఒక మైలగా, ముట్టుగా, మురికిగా ఆరోపించి వారిని దేవాలయాల్లోకి కూడా రానివ్వకుండా నిషేధాలు విధించుకుంటూ...

మరో వెయ్యి సంవత్సరాలపైగా మనం పవిత్ర బతుకులు, ధర్మబద్ధ జీవితాలు ఇలాగే గడుపుతూ.......నే ఉంటాం.

అవునూ.. చెప్పడం మర్చిపోయాను..

మన అపర దేశభక్తికి సరికొత్త ట్యాగ్ నిన్ననే పుట్టింది.....

అదేమిటంటారా?

భారత్ మాతాకీ జై....
...................

దేశ నిజమైన సమస్యల పట్ల భగత్‌సింగ్ వాణిని వినిపించిన మల్లెపల్లి లక్ష్మయ్యగారి స్పూర్తిదాయక వ్యాసాన్ని కింది లింకులో చూడగలరు.

దేశభక్తికి అసలు చిరునామా

2 comments:

Anonymous said...

భారత్ మాతాకీ జై....

అనటం దేశ భక్తి కాదండి. జె.యన్.యు. నివేదితా మినన్ లా కిస్ ఆఫ్ లవ్ ను సరి కొత్త ప్రొటెస్త్ విధానం అని పొగడటం దేశభక్తి అంటే. ప్రముఖ సామజిక శాస్రవెత్త, బీఫ్ ఫెస్టివల్ ఆవిషకర్తా ఐలయ్య ప్రయోగాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అసెంబ్లి లో చీదరించుకొన్నాడు. మళ్ళి తోక జాడిస్తే దానిని కట్ చేసి, ఆయనకి ఇష్టమైన కమ్మోళ్ల ఆంధ్రాకి ఇసిరేస్తాడు.
చూద్దాం వచ్చే సంవత్సరం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించటానికి ఏ మగాడు ముందుకొస్తాడో! మొండికేస్తే ఉస్మానియా,జె.యన్.యు. లను ఒక ఐదేళ్ల సమయంలో మూసి పారేస్తారు. అతికి ఒక హద్దు ఉండాలి. అమెరికా ఏజెంట్
కంచే ఐలయ్య నాయకత్వం లో నడిస్తే చివరికి దళితులకి మిగిలేది చిప్పే. ఉన్నది కాస్తా ఊడుతుంది.

Anonymous said...

హిందూమతం లో లోపాలనుచెప్పి కూడా ఇంకా అదేమతం లో ఉన్నాడా! హిందువులను బండ బూతులు తిట్టలేదా! పైగా అదే హిందుస్తాన్ కోసం ప్రాణత్యాగం కూడా చేశాడా! అతనేం దేశభక్తుడండీ. అబ్బే!! అదికూడా కాదు బాబు దేశభక్తి అంటే. హిందూ మతం లో కొన్ని లోపాలున్నాయంటున్నారు కాబట్టి మతం మారిపోవడం, విదేశాలనుండి కోట్లకు కోట్లు ఎన్.జి.వో ల పేరితో దొబ్బి తినడం, ఈదేశంలో వుంటూ చైనా కు కొమ్ము కాయడం, నక్సలిజం పేరుతో హిందువులను వధించడం వగైరా.. వగైరా.. వగైరా..

Post a Comment